[జీ.వీ.యస్. ఆచార్యులు గారు రచించిన ‘అలుకలైనా కులుకులైనా..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అక్కడ..
ఏమైందో ఏమో కానీ
కొమ్మ మీద నుండి రివ్వున ఎగిరి
కరెంటు తీగల మీద ఝామంటూ వాలి
ఎదురెదురుగా కూర్చుని కాసేపు కీచులాడుకుంటూ..
మరి కాసేపట్లో
అలుకలన్నీ ఆవలపెట్టి
ఒకరి దరికి మరొకరు
రెక్కలాడించుకుంటూ ముక్కులానించుకుంటూ
కొమ్మపైకి జేరి ముద్దులాడుకునే గువ్వలజంట..
ఇక్కడ..
పనులన్నీ చక్కబెట్టుకుని
గుడిసె ముందు నులక మంచం మీద కూర్చుని
తీరిగ్గా గతాన్ని తవ్వుకుంటూ తగువులాడుకుంటూ
సందె వేళ చూట్టూ సద్దుమణుగుతున్న వేళ
ఒకరినొకరు ఆసరాగా మంచం మోసుకుంటూ
ఒకరి సేవలో మరొకరు సేదతీరే ధ్యాసలో
లోపలికెళ్ళి తలుపేసుకునే వృద్ధ జంట..
అలుకలైనా కులుకులైనా
బలమైన బంధాల మధ్యనే కదా కాపురముండేది
ఓ చిరునవ్వుతో మేడ మెట్లు దిగుతూ నాలో నేను..
