[డా. శ్రీదేవీ శ్రీకాంత్ గారు రచించిన ‘అమర శ్వాస’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
మనసును సదా అలంకరిస్తున్నాను
నన్ను నేనుగా సంస్కరించుకుంటున్నాను
తీరా చూస్తే..
‘నేను’ అనుకున్న ఈ దేహం రేపు శవమేగా!
కాలి బూడిదై మట్టిలో కలిసే రూపమేగా!
అంతిమ సంస్కారాన మిగిలిన ఎముకలు సైతం..
పుణ్య నదుల్లో కలిసి కనుమరుగయ్యే దృశ్యమేగా!
నేనెవరో తెలియక.. నాకంటూ ఏ గమ్యమూ లేక
నా జీవితంలో ఎన్నో తీరాలు నిశ్శబ్దంగా దాటిపోయాయి!
కానీ, ఈనాడు నాలో కొత్త చైతన్యపు స్పృహ మేల్కొంది..
రేపు నా అంతిమ శ్వాస నిలిచిపోయినా
నా పేరు ప్రతి గుండె శ్వాసలో నిరంతరం మారుమోగాలి!
మరణం ముంగిట నిలవడానికి భయం లేదు కానీ,
రక్తసిక్తమైన చేతులతో చావును ఎదుర్కోవడం ఇష్టం లేదు!
ప్రతి శ్వాసలోనూ మంచితనపు పరిమళాన్ని నింపాలి..
మానవత్వపు అడుగులకు ఆత్మీయ బలమై నిలవాలి!
కరుణరసంతో ఈ సమాజాన్ని నిత్య చైతన్యవంతం చేయాలి!
ప్రపంచంలో ఎన్నో నదులు, సముద్రాలు.. పర్వతాలు,
అడవులు.. అన్నీ నా వైపే చూస్తున్నాయి!
పైకి మేమంతా ఒకేలా కనిపిస్తున్నా..
మాలో ఏదీ నిలకడగా లేదు
నిత్యం మారుతూనే ఉంటాము!
నిజం! కొత్తదనాన్ని కలుపుకుంటూ
మేము నిరంతరం జీవిస్తూనే ఉంటాం..
మేమంతా ఈ సృష్టి రూపానికి సజీవ నిదర్శనాలం!
కానీ ఓ మనిషీ..! నీ అసలైన దర్శనం మాత్రం
నీ మరణం తర్వాతే
ఈ లోకానికి స్పష్టంగా సాక్షాత్కరిస్తుంది!
నీలోని చెడుకు..
నీ దేహము అంతమయ్యే ముందే
జ్ఞానాగ్నితో కొరివి పెట్టు!
నీ మస్తిష్క కణాల శోధనను సిరాగా మలచి
కాగితాలపై అక్షరాలకు ప్రాణం పోస్తూ..
కాలపు పొరల్లో మౌన సత్యాలై నిలబెట్టు!
నిజానికి ఈ మరణ తీరానికి
చేరుతున్నది నువ్వొక్కడివే కాదు..
ఏకాకివిగా మరణిస్తున్నానని దిగులుపడకు..
నీకంటే ముందు ఈ భూమిపై జీవించిన
దేవతలు, మహర్షులు.. రాజవంశాలు, మహా వీరులు..
శాస్త్రవేత్తలు, మహా నటులు, యుగకవులు ఎంద రెందరో!
ఈ మహా కాలగర్భంలో కరిగిపోయి
ఈ అనంతమైన మట్టిలో కలిసిపోయారు!
మనసు ప్రకృతితో మమేకమైతే..
ఆ ప్రకృతి మనకో పరమ సత్యాన్ని బోధిస్తుంది!
‘మరణం అంటే అంతం కాదు..
మళ్లీ ఆ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఒరగడమే!’
ఈ జగత్తులోని సౌందర్యాన్ని
నీ ప్రేమతో మరింత అందంగా మలుచు..
నీ తరవాత కూడా ఆ చైతన్యం
మరింత పటిష్టంగా నిలుస్తుంది
నీవు పంచిన నిశ్చలమైన ప్రేమకు నిత్య సాక్షిగా!
ఆశల బావిని తవ్వి..
అందులో నిరాశల కన్నీళ్లను నింపకు!
ఎందరో దాహార్తుల తపనకు..
అది దక్కాల్సిన అమృత జలం!
మరణం నిన్ను ఆవహించే ముందే..
మనిషిగా మానవత్వపు శిఖరాన్ని అధిరోహించు!
నీ పేరు తరతరాల పాటు నిలిచిపోతుంది..
ప్రజా హృదయాల నాలుకలపై సదా మారుమోగుతుంది!
అందుకే.. మరణాన్ని తలచి
వ్యర్థంగా బాధపడకు
జీవిత సాఫల్యం కోసం సదా సాధన చేయి!
నీ లక్ష్యపు వెలుగు బాటలు..
రాకాశశి దివిటీలై ఎందరికో కనుల పండగ కావాలి!
ఇకపై మరణాన్ని నిందించడం ఆపి..
జీవించి ఉన్న ఈ నాలుగు గడియల ఆయువును
ప్రేమిస్తూ ముందుకు సాగు!
నీ మరణానంతరం కూడా నీ పేరు నిలిచిపోవాలి..
అనంత విశ్వాన వెలిగే నిత్య పున్నమి కాంతిలా!
ఈ విశాలమైన భూమే మరణించినవారి పవిత్ర సమాధి!
నీకు కనిపిస్తున్న ఈ పచ్చని పచ్చిక బయళ్లు
సాంద్ర అడవులు, నిశ్చల పర్వతాలు, అనంత సముద్రాలు-
ఇవన్నీ ఎన్నో తరాల మానవుల
జ్ఞాపకాలను మోస్తున్న సజీవ సాక్ష్యాలు!
కాబట్టి.. మరణం అనేది ఒంటరితనం కాదు
అది విశ్వ కుటుంబపు ఒడిలో మళ్లీ ఒదగడం..
ప్రకృతి సత్యంలో శాశ్వతంగా కలవడం!
డా. శ్రీదేవీ శ్రీకాంత్ స్వస్థలం హైదరాబాద్. వీరి నాన్న గారు రవీంద్రనాథ్. ఇంజనీర్. తల్లి సుశీలాదేవి విద్యావంతురాలు.
డా. శ్రీదేవి శ్రీకాంత్ ప్రస్తుతం ఆఫ్రికాలోని బోట్స్వానా దేశంలో ఉంటున్నారు. రెండు పీహెచ్ డీలు – క్లినికల్ సైకాలజీ, ట్రాన్స్ లేషన్ స్టడీస్ లో, ఎంబీఏ, ఎంఫిల్, ఐదు పీజీలు చేశారు. ప్రస్తుతం క్లినికల్ సైకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 175కిపైగా కథలు, 1750 తెలుగులో గజల్స్ తో పాటుకొన్ని ఆంగ్ల, హిందీ భాషలలో గజల్స్ రాశారు.
రెండు వందలకుపైగా తెలుగు కవితలు, అనేక నానీలు, భక్తి పాటలు, హైకూలు, జాన పద పాటలు రాశారు. ఆంగ్ల కవితలు,ఆంగ్ల పాటలు, సైకాలజీలో నాలుగు పుస్తకాలు (ఆంగ్లంలో) వ్రాశారు .The Solaris Bloom ఆంగ్ల కవితా పుస్తకాన్ని, భారత మాతాకు జై కథల పుస్తకం, తప్త తరణి నాటిక, దరహాస చంద్రికలు గజల్ సంపుటి మొదలైనవెన్నో పేర్కొన తగినవి. విశ్వ విలాపం గేయ కావ్యం తానా వారి పోటీలో విశిష్ట బహుమతిని అందుకొంది. నాలుగు నవలలు వ్రాశారు. ఉత్తమ సమీక్షకురాలుగా ప్రశంసలు అందుకున్నారు. చిత్రలేఖనం, కార్టూన్స్ లో ఎన్నో బహుమతులు అందుకున్నారు.
మరికొన్ని కథల పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. కథలపై లోతైన సమీక్షలు చేస్తుంటారు. సాహిత్యంతోపాటు చిత్ర లేఖనంలోనూ అనేక బహుమతులు, సన్మానాలు అందుకొన్నారు. అనేక సెమినార్స్ లో పత్ర సమర్పణ చేశారు. కార్టూన్స్, rock paint మొదలైన కళలలో ఉన్నారు.
కూచిపూడి, భరతనాట్యం, వీణ వాద్యంలో ప్రావీణ్యం సాధించారు. ఎన్నో బహుమతులు, సన్మానాలు పొందారు.
డా. డి. శ్రీకాంత్ సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సూపరింటెండెంట్. సబ్రాన మానసిక రోగ చికిత్సాలయం. బోట్స్వానా
