Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమెరికా గడ్డపై బెంగాల్ ఎన్నికల విజయోత్సవం

[అమెరికా గడ్డపై బెంగాల్ ఎన్నికల విజయోత్సవాల గురించి వివరిస్తున్నారు డా. రాయపెద్ది వివేకానంద్.]

అయిగిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతే
గిరివర వింధ్య-శిరోధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే

శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రం దుష్టశిక్షణ చేసే పరాశక్తి యొక్క వీరత్వాన్ని, కరుణను ఒకేసారి ఆవిష్కరిస్తుంది. ఈ స్తోత్రం మనకి శత్రు జయాన్ని, భయ రాహిత్యాన్ని, మరియు మనోధైర్యాన్ని ఇస్తుందని అంటారు.

లయబద్ధంగా సాగుతున్న మహిషాసుర మర్ధిని స్తోత్రానికి అనుగుణంగా వేదిక మీద జరుగుతున్న నృత్య ప్రదర్శన ప్రతి ఒక్కరిలో ఒక సరికొత్త ఉత్సాహన్ని నింపుతోంది. అందరి దృష్టీ వేదిక మీదనే ఉంది, ప్రతి ఒక్కరి పెదాల చివర లయ బద్ధంగా ఆ స్త్రోత్రం పలుకుతోంది. సభలో ఆశీనులైన ప్రతి ఒక్కరి పాదాలు తమకి తెలియకుండానే నేలని తడుతున్నాయి, చేతి వేళ్ళు తమకి తెలియకుండానే తాళం వేస్తున్నాయి.

అది దేశ భక్తి

అది భావ శక్తి

అది విజయం అందించిన ఆవేశం. బెంగాల్ గడ్డపై విజయకేతనం ఎగిరేది ఎప్పుడా అని కన్నులు కాయలు కాసేలా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మనసులకి పెద్ద పండగే కద మరి ఈ విజయం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ విజయం ఆ సభికులని ఉత్సాహంతో ఉరకలెత్తిస్తోంది.

***

అది అందమైన సాయంత్రం. చిరు చలి గిలిగింతలు పెడుతోంది. దేశానికి వేలాది మైళ్ళ దూరంలో, అనేక సముద్రాలు దాటి అమెరికాలో నివసిస్తూ ఉన్నా వారి హృదయ స్పందన మాతృభూమి కొరకే. వారి ఊహలూ, కలలు, ఆకాంక్షలు భరత మాత చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. భౌతికంగా మాతృదేశం నుంచి దూరంగా ఉన్నా, వారు భారతీయులకంటే కూడా ఎక్కువగా భరత మాతని స్మరిస్తూ ఉంటారు అన్నది ఒక నిష్ఠుర సత్యం. వారి హృదయం భరత మాత పేరునే సదా పలవరిస్తూ ఉంటుంది.

సభా ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన నిలువెత్తు భరత మాత విగ్రహం వారిలో దేశభక్తిని ఉద్వేగభరితంగా వ్యక్తపరచుకునే అవకాశం ఇచ్చింది. ఫోటోలు తీసుకోవడానికి ఆ విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంగరంగా వైభవంగా ఏర్పరిచిన స్వాగత తోరణం అందరినీ ఆకట్టుకుంది.

ఈ కోలాహలం అంతా ఏమిటి అనుకుంటున్నారా?

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (OFBJP) రాలీ చాప్టర్ ఆధ్వర్యంలో బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయాలను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా అతిథులు, భారతీయ మూలాలున్నవారు, బీజేపీ అభిమానులు మరియు కమ్యూనిటీ సభ్యులు హాజరై విజయోత్సాహాన్ని పంచుకున్నారు.

సనాతన సంస్కృతి, సంప్రదాయాలకి పెద్ద పీట వేస్తూ, దీప ప్రజ్వలన, అనంతరం కూరపాటి సహస్ర లక్ష్మి స్త్రోత్రం చేసిన గణేష్ ప్రార్థనతో సభ ప్రారంభం అయింది.

వేద పండితుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం జరిగింది. రుద్రాభిషేకం – కార్యక్రమానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకువచ్చింది. తరువాత అందరూ నిలబడి ఆలపించిన ‘వందే మాతరం’ సభలో దేశభక్తి భావాలను మరింతగా రగిలించింది.

శివాజీ మహరాజ్ మళ్ళీ జన్మ ఎత్తితే ఎలా ఉంటుంది? ఇంతలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్వధర్మ ప్రతిష్టాపనకి శివాజి మహరాజ్ ఎలా కృషి చేస్తాడో సరిగా అలాగే ప్రవర్తిస్తున్నాడు, చరిత్ర సృష్టించుకున్న పురుషుడు శ్రీ నరేంద్ర మోదీ అని పలువురు ఉపన్యాసకులు శ్రీ నరేంద్ర మోదీ గారి గూర్చి అభివర్ణించారు.

శ్రీ సురేష్ ఆత్రేయ గారు గీతాచార్యుల పలుకులని గుర్తు చేస్తూ

‘పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతాం,

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’

అనే పలుకులని శ్రీ నరేంద్ర మోదీ గారికి అన్వయిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. గత కొన్ని దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్‌లో సనాతన ధర్మంపై జరుగుతున్న అమానవీయ దాడులు, ముష్కరమూకల విశృంఖల పోకడలు, దొడ్డిదారిలో భారత్‌లోకి వచ్చి పడుతున్న విదేశీ మూకలు వీటన్నిటి కారణంగా సనాతన ధర్మాన్ని నమ్ముకున్న సామాన్య పౌరుడి జీవితం గాలిలోదీపంలా మారిపోయింది. ఈ పరిస్థితులలో నరేంద్ర మోదీగారు ధర్మ సంస్థాపనకై దిగి వచ్చిన అవతార పురుషుడా అని ప్రజలు భావించటం సహజం అని సురేష్ ఆత్రేయ గారు తీవ్ర స్వరంతో నొక్కి వక్కాణించారు.

బీజేపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు మరియు తాజా ఎన్నికల విజయాలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియో, స్లైడ్ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పార్టీ విజయగాథలను, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించిన ఈ ప్రదర్శనకు ఘన స్పందన లభించింది.

సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి. సంపిగె కన్నడ అసోసియేషన్ సభ్యులు ప్రదర్శించిన వినూత్న యోగ-నృత్య సమ్మేళనం ప్రేక్షకులను అలరించింది. అలాగే గురుకృప స్కూల్ ఆఫ్ ఇండియన్ డాన్స్ విద్యార్థులు ప్రదర్శించిన ‘మహిషాసుర మర్దిని’ నృత్య రూపకం అమ్మవారి శౌర్యాన్ని, భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ అందరి ప్రశంసలు అందుకుంది.

వాస్తవానికి పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు దారుణంగా తయారై, హిందువులు భయానక పరిస్థితులు ఎదుర్కొనటమే కాక దేశ సమగ్రతకి ప్రజాస్వామ్య శక్తులకు పెను సవాలుగా మారిన దుష్ట శక్తులని సరి అయిన సమయంలో కాపాడటానికి వచ్చిన అవతార పురుషుడిగా శ్రీ నరేంద్ర మోదీగారిని కొనియాడారు.

‘బెంగాల్ ఈ రోజు ఏమి ఆలోచిస్తుందో, దేశం రేపు అదే విధంగా స్పందిస్తుంది’ అనేది జగమెరిగిన సత్యం. ఆ విధంగా చూసుకున్నా ఈ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విజయం ఇక్కడి వారికి కొత్త ఊపిరినిచ్చింది.

అస్సాంలో, పుదుచ్చెరీలలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు విస్మరించదగ్గవి కాకున్నా, యావత్ ప్రపంచపు మీడియా, భారతీయ మీడియా, ప్రతి ఒక్క ఎన్నికల విశ్లేషకులు – ఈ మారు బెంగాల్ ఎన్నికల గూర్చి, భారతీయ జనతా పార్టీ విజయం గూర్చి మాట్లాడుతున్నారు. కారణాలు సుస్పష్టం, ఈ మారు ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా పశ్చిమ బెంగాల్ భారతదేశం నుంచి దూరం అయ్యేది.

ఇది గుర్తెరిగే కేంద్ర ప్రభుత్వం సరి అయిన సమయంలో సరి అయిన పద్ధతిలో స్పందించి ప్రజాస్వామ్య పద్ధతులలో ప్రజలు తమకి కావాలసిన పార్టీని స్వేఛ్ఛగా ఎన్నుకునే లాంటి పరిస్థితులని కల్పించార్రు. హ్రస్వదృష్టి ఉన్నవారికి ఇది అర్థం కాదు.

ఇది బీజేపీ విజయమో, అమిత్‌షా చాణక్యమో, మోదీ గారి సమ్మోహన శైలికి దక్కిన కితాబో కాదు. ఇది ముమ్మాటికీ జాతీయ భావనలు ఉన్న బెంగాల్ ప్రజల మనోభీష్టం. వారు తమ రాష్ట్రాన్ని మాత్రమే కాపాడుకోలేదు, యావత్ భారత జాతికి రక్షణ కల్పించారు.

ఇక నా దేశంలో ప్రజాస్వామ్యం సుభద్రం, సురక్షితం అనే ఆశాభావం ఇక్కడ అమెరికాలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (OFBJP) రాలీ వారికీ కలిగింది.

ప్రసంగిస్తున్న కొల్లి మాధవి గారు

భారతీయ ఆత్మ ఎక్కడ ఉన్నా ఒకేలా స్పందిస్తుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ప్రజాస్వామ్యపు విజయం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి మాధవి కొల్లి గారు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ప్రజాస్వామ్య శక్తి, ప్రజల విశ్వాసం మరియు బీజేపీ నాయకత్వం సాధించిన విజయాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలను ఆమె విశదీకరించారు.

అలాగే పద్మభూషణ్ పురస్కార గ్రహీత శ్రీ స్వదేశ్ ఛటర్జీ గారు మరియు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శంకర్ అడుసుమిల్లి గారు తమ ప్రేరణాత్మక సందేశాలతో సభికులను ఉత్సాహపరిచారు.

ప్రసంగిస్తున్న రాజు కూరపాటి గారు

రాజకీయ విజయోత్సాహాన్ని భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలతో మేళవించిన ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ విజయోత్సవాన్ని విజయవంతం చేసిన స్వచ్ఛంద కార్యకర్తలు, స్పాన్సర్లు, అతిథులు మరియు హాజరైన ప్రతి ఒక్కరికీ ఓఎఫ్‌ బీజేపీ రాలీ తరఫున అధ్యక్షులు రాజు కూరపాటి గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version