[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘అమెరికాలో వసంతకాలం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మొన్నటిదాకా మంచులో
కూరుకుపోయిన చెట్లు
‘అయ్యో ఎండిపోయాయి’ అనుకున్నా
సూర్య కిరణాలుసోకి కరిగిపోయిన
మట్టిలో కొత్తచిగుళ్ళువేసి
తలెత్తి తొంగి చూస్తున్నాయి
నెల తిరిగేసరికల్లా చెట్టునిండా పూలే.
‘ఎలా వున్నారు’ అంటూ
వచ్చేపోయేవారిని పలకరించాయి
ఎన్నెన్నిరంగులో చూసారా
మా అందాలు అంటూ
ప్రతి చెట్టు విరగబూసింది
రెండు కళ్ళూ చాలవు
అనిపించేలా ఎప్పుడూ
వాటి చెంతనే ఉండిపోయేలా
చెట్టుకు చిగుర్లు తొడిగిన
సృష్టికర్త ఎవరో
పూలకు రంగులద్దిన
తోటమాలి యెవరో
ఈ అందాలన్నీ
మాకే స్వంతం
అంటూ విరుల చుట్టూ
తిరిగే భ్రమరనాదాలతో
వలసపక్షుల
కిలకిలారావాలతో
కోయిలమ్మ స్వాగత గీతాలతో
ఆమని వచ్చేసింది
మంచుతో ఘనీభవించిన
సరోవరాలు ప్రతిబింబం
చూసుకునే అద్దంలా వున్నాయి
హిమపాతంతో కప్పుకున్న
దుప్పటిని కరిగించి
కొండా కోనా జలపాతాలుగా
వొలకబోస్తున్నాయి
ఎన్నెన్నిఅందాలు
ఎన్నెన్ని వింతలు
తరచి తరచి చూస్తే
బయట పడుతూనే ఉంటాయి
చలి ముసుగులో నాలుగు గోడల
మధ్య బందీలైన జనాలు స్వేచ్ఛగా
బయటకు వస్తున్నారు
సూర్యరశ్మికి శరీరాన్ని
ఆరబోసుకుంటూ
ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు
ఋతువులు మారుతాయి
ఆరోగ్యం ఆనందం
శారీరక శ్రమ విశ్రాంతి
మానవ మనుగడకు
అవసరంగా ప్రకృతి
అందిస్తూనే వుంటుంది
దాన్నివినియోగించుకోడం
మన చేతిలో వుంది.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
