తాము మాతృభాషను కాపాడుకుంటామంటూ, “అమ్మా అధైర్యపడకు” అని తెలుగుతల్లికి చెబుతున్నారు హోసురు కైలాష్‌నాథ్ ఈ కవితలో.
అమ్మా
అధైర్యపడకు!
కన్నబిడ్డలే కాలాంతకులై
కడతేర్చేలాగున్నారని
కలతచెంది శోకించకు
అన్య భాషల మరిగి
అమ్మభాషను మరచి
మన భాషంటే పెదవిరిచేస్తూ
పరభాషలకే పట్టంగడుతూ
అమ్మ భాషకు అయువు తీసే
కఠిన కౌరవమూకకు
కనువిప్పు కలిగే కాలం కనుచూపు మేరలోనే ఉంది.
అమ్మపాల విలువెరిగి
పోతపాల పక్కనెట్టి
అమ్మ భాషనందలమెక్కించిన
మన సజాతి సోదరులదే (తమిళులు, కన్నడీయులు) వివేకము
పంటచేనునొదిలి పరిగేరిన రీతిన
తేనెలొలుకు ‘తెలుగు’ పదములకెడమైన అన్యభాషా ప్రియులెంతటి
వివేకులో నెరిగితిమి
తల్లీ
తల్లడిల్లకు!
నిను మరచిన ఆ అంథ కొడుకుల మన్నించి
ఈ కొడుకులపై కొంత నమ్మకముంచు
నిన్ను కాపాడుకొనుటకే భాషా ప్రియులం.. మేమున్నది.