[శ్రీమతి రోహిణి భైరవజోశ్యులు గారు రచించిన ‘అమ్మ చెప్పింది’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఆ రోజుతో శాంతమ్మగారి దశ దిన కర్మలు ముగిసాయి. వచ్చిన బంధువర్గం ఎవరి వూళ్ళకు వాళ్లు వెళ్ళిపోయారు. చివరగా కొడుకు భార్గవ్, కోడలు ప్రణీత మాత్రం మిగిలారు.
“నాన్నా! మాతోపాటు ఊరికి వచ్చేయి.” అన్నాడు భార్గవ్ తండ్రి కోదండపాణితో.
కోదండపాణికి కొడుకు వెంట వెళ్ళక తప్పింది కాదు. ఆయనకు ఇంటిపని ఏదీ చేతకాదు. భోజనానికి కష్టమవుతుందని, కొడుకు వెంట వెళ్ళమని అందరూ సలహా ఇవ్వడంతో వాళ్ల వెంట బయలుదేరాడు. శాంత లేని ఆ ఇల్లు కళా కాంతులు లేక బోసిగా కనబడుతోంది.
***
కొడుకు, కోడలు కోదండపాణిని బాగానే చూసుకుంటున్నారు. అదొక గేటెడ్ కమ్యూనిటీ.
సాయంత్రాలు పార్కులో కూర్చునేవాడు. కొందరు తనలాంటి పెద్దవాళ్ళు అక్కడ చేరి, లోకాభిరామాయణం మాట్లాడుకునేవారు. అందులో ఇద్దరు ముగ్గురు పరిచయమయ్యారు కోదండపాణికి. వాళ్ళు తమ బాధలు చెప్పుకునేవారు. ఒకతని పేరు మోహనరావు. ఆయన కొడుకు, కోడలు తనను చాలా హీనంగా చూస్తున్నారని చెప్పాడు. బుద్ధిలేక, తన ఆస్తి అంతా కొడుకు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేశాడట. అతని భార్యను, వాళ్ల ఇంట్లో ఒక వంటమనిషిలాగా ట్రీట్ చేస్తున్నారట. ఇప్పుడు చేతిలో డబ్బు లేక, వాళ్ల అవమానాలను భరించాల్సి వస్తోందని చెప్పాడు. ఇంకొకతని పేరు ప్రసాదరావు. ఆయనకు ఒక్కతే కూతురు. భార్య చనిపోయాక, ఆస్తి మొత్తం కూతురికి ఇచ్చేసి, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడట. అతనికి కాస్త పెన్షన్ వస్తుందట. అల్లుడికి, అతని అమ్మానాన్నలకు, ఈయన కూతురి ఇంట్లో ఉండడం ఇష్టం లేదట. రోజూ ఏదోఒక సూటిపోటి మాటలు మాట్లాడుతారట.
ఇదంతా చూసాక అనిపించింది, తానెంతో అదృష్టవంతుడనని.
***
ఆరోజు పార్కు నుంచి ఇంటికి వచ్చి, తలుపు తట్టబోయి, లోపల కొడుకు, కోడలు ఏదో గొడవ పడుతున్నట్టుగా అనిపించి, అక్కడే ఆగిపోయాడు. అందులో తన పేరు వినిపించడంతో మరి ముందుకు కదలక, వాళ్ల మాటలు వినసాగాడు.
“మీ నాన్నగారు ఇక్కడ ఉండడం నాకిష్టంలేదు.” ప్రణీత అంటోంది.
“అదేం? ఇదివరకు వాళ్లెప్పుడు వచ్చినా ఎంతో ఆనందించేదానివి. ఇంకా కొన్నిరోజులు ఉండమని అడిగేదానివి. ఇప్పుడేమయ్యింది?” భార్గవ్ ప్రశ్నార్థకంగా అడిగాడు.
“ఇదివరకయితే మీ అమ్మగారు ఉండేవారు. ఆవిడే వంట చేసేవారు. అన్ని పనులూ ఆవిడే చేసేవారు. ఇప్పుడు మీ నాన్నగారు నా ప్రాణం తీస్తున్నారు. ‘అమ్మా మంచినీళ్ళు ఇస్తావా? కాఫీ ఇస్తావా?’ అంటూ ప్రతిచిన్న పనికీ నన్నే అడుగుతారు. ఇంకా కోపం వచ్చే విషయం ఏమిటంటే ఫ్యాన్, లైట్ వేయడానికి కూడా నన్నే పిలుస్తారు. ఎంత పనిలో ఉన్నా వెంటనే రావాలి. కొంచెం ఆలస్యమైనా చాలా కోపం ఈ మనిషికి. నా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళడానికి కూడా లేదు. ఈయనకు కాపలాగా కొంపలోనే పడి ఉండాలి. అయినా అలా సోమరిగా ఉండే బదులు తన పని కూడా చేసుకోకపోతే ఎలా? ఇలాంటి మనిషిని భరించడం నావల్ల కాదు.” ఆవేశంగా అన్నది ప్రణీత.
“అదేమిటి ప్రణీతా! అలా మాట్లాడతావేం? మా నాన్నకు మొదటినుండి పనులు చేసుకోవడం అలవాటు లేదు కదా!” అన్నాడు భార్గవ.
“ఆ.. అవునవును. ఈయన మీ అమ్మగారిని ఎంత రొష్టుపెట్టాడో నాకు తెలియంది కాదు. జ్వరం వచ్చినా ఇంటెడు చాకిరీ చేయాల్సిందే. పాపం ఆవిడను ఒక్కసారైనా పుట్టింటికి పంపాడా? పైగా ఆవిడ వైపు వాళ్లెవరొచ్చినా మహా చిరాకు పడిపోయాడు. ఆ దెబ్బకు మీ ఇంటికి రావడానికే భయపడేవాళ్ళు.” కసిగా అంటోంది ప్రణీత.
ఈ విషయాలన్నీ వింటున్న కోదండపాణి మ్రాన్పడిపోయాడు. ఈ అమ్మాయి దృష్టిలో తనెంత చులకన అయిపోయాడో అర్థమైంది. చప్పుడు చేయకుండా వెనక్కు వెళ్ళి పార్కులో ఒక బెంచి మీద కూలబడిపోయాడు. ఆయనకు ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించినట్టయింది.
గతమంతా ఒక్కసారి గిర్రున తిరిగింది.
‘అవును. భార్య బతికున్నన్ని రోజులూ ఆమెను కాల్చుకు తిన్నాడు. ప్రతి చిన్న పనికీ ఆమెను పిలిచేవాడు. ఆలస్యం చేస్తే భరించలేకపోయాడు. పాపం తనకు పుట్టింటి మీద ఎంత ఆశ ఉండేదో కూడా గమనించేవాడు కాదు. తన ప్రవర్తనకి కారణం.. తన తండ్రి ఇలాగే ప్రవర్తించేవాడు. అందరిమీదా కోపంతో ఇంతెత్తున ఎగురుతుంటే, అందరూ ఆయనంటే ఎంతో భయపడిపోయేవారు. తను కూడా అచ్చు తండ్రిలాగా ప్రవర్తించేవాడు. కానీ శాంత తన జీవితంలోకి అడుగుపెట్టాక, తన జీవితానికొక వెలుగు వచ్చినట్టైంది. కానీ కోపం మాత్రం తగ్గలేదు. శాంత మాత్రం ఎంతో ఓర్పుగా ఉండేది. తనతో ఒక్క పనీ చేయించకుండా అన్ని పనులూ తనే చేసుకునేది. కొడుకు పుట్టాక, అటు వంట పని, ఇటు పిల్లాడి పని ఎలా చేసుకొనేదో తనకు తెలిసేది కాదు.
భార్గవకు కూడా వాళ్ళమ్మ సహనం వచ్చింది.
శాంత పోయాక కూడా అలాగే జరుగుతుందనుకున్నాడు. పాపం ఇన్నిరోజులూ కోడల్ని కష్టపెడుతున్న సంగతి గమనించనే లేదు. నిజంగా తనేనా ఇలా ప్రవర్తించింది! నిజంగా తనకు శాంత అంటే ఇష్టంలేదా? తన మనసు లోతుల్లోకి తొంగిచూస్తే అసలు నిజమేమిటో తెలిసేది.’ చేతుల్లో ముఖాన్ని దాచుకుని కుమిలిపోసాగాడు.
“నాన్నా! ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? ఎంత రాత్రయిందో తెలుసా! మీరు ఇంతవరకూ ఇంటికి రాకపోయేసరికి నేను, ప్రణీత చాలా కంగారు పడుతున్నాము.” భుజాలు పట్టి కుదుపుతున్న కొడుకును తల ఎత్తి చూసాడు. పార్కులోని దీపాల వెలుగులో తండ్రి కళ్ళల్లో నీరు మెరుస్తూ కనబడ్డాయి.
“ఏం నాన్నా? ఎందుకా కన్నీళ్లు? నా వల్ల కానీ, ప్రణీత వల్ల కానీ ఏమైనా పొరపాటు జరిగిందా?” తమ మాటలు తండ్రి విన్నాడేమో అని ఒక చిన్న అనుమానం మనసులో మెదులుతూ ఉండగా అనుమానంగా అడిగాడు భార్గవ.
“లేదురా! మీ అమ్మ గుర్తుకు వచ్చింది. తనను ఎంత కష్టపెట్టానో అప్పుడు తెలియలేదు. ఇప్పుడే తెలుసుకున్నాను. కానీ నా చేయి దాటిపోయిందిరా! భార్యను ఒక మనిషిగా చూడాలని తెలియని మూర్ఖుడిని. నా వల్ల మీ అమ్మ ఎంత బాధపడిందో! క్షమించమని అడుగుదామంటే నాకు అందనంత దూరాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? భార్యను గౌరవంగా చూడడానికి నాలోని పురుషాహంకారం అడ్డు వచ్చింది. ఈ నాన్నను చీదరించుకుంటున్నావు కదూ! కోడలన్నదానిలో తప్పేమీ లేదురా! పాపం మా కోసమే ఆ అమ్మాయి ఉద్యోగం కూడా మానుకున్నది. రేపే నన్ను మన ఊరికి పంపించేయి. మీ అమ్మ లేని ఇంట్లో ఉండలేక ఇక్కడికి వచ్చాను. మీకు భారమైపోయాను.” కొడుకు చేతులు పట్టుకుని వేడుకున్నాడు. కళ్ళు ధారాపాతంగా కారిపోతుండగా గొంతు గద్గదమైంది కోదండపాణికి.
“నాన్నా! నీ మనసేమిటో నాకు తెలుసు. నీవెందుకు అలా ప్రవర్తించావో నాకు తెలుసు.”
భార్గవ్ మాటలకు దిగ్గున తల ఎత్తాడు.
“నీకెలా తెలుసా?” దిగ్భ్రాంతిగా అడిగాడు.
“అమ్మ వ్రాసిన ఉత్తరం చెప్పింది.” అన్నాడు కూల్‌గా.
తెల్లబోయి చూస్తున్నాడు కోదండపాణి.
భార్గవ్, జేబులోంచి తల్లి ఉత్తరాన్ని తీసి చూపించాడు.
“భార్గవా! మీరంతా అనుకున్నట్టు మీ నాన్న చెడ్డవాడు కాదురా! ఆయనకు నేనంటే పంచ ప్రాణాలు. వాళ్ళ నాన్నగారికి జడిసి అలా ప్రవర్తించేవారు. ఎప్పుడైనా నాన్న నాతో ప్రేమగా మాట్లాడితే, ‘వీడికి తల్లితండ్రి అల్లం, పెళ్ళామంటే బెల్లము’ అని హేళనగా అనేవాడు. మా పుట్టింటి వాళ్ళతో మంచిగా మాట్లాడితే, ‘ఆలివంకవారు ఆత్మబంధువులు’ అని ఎద్దేవా చేసేవాడు. ‘పిచ్చిదానా! నేను ముందు పోతే ఎలా బ్రతుకుతావే నువ్వు? భార్గవ మంచివాడే కానీ, ఆ వచ్చే అమ్మాయి నిన్ను కష్టపడితే ఎలా?’ అని భయపడేవారు. కానీ ప్రణీత వచ్చాక ఆయనకు చాలా ధైర్యం వచ్చింది. ‘మనకు కూతుర్లు లేని లోటు ప్రణీత ద్వారా తీరింది.’ అని ఎంతో సంతోషపడ్డారు. నన్ను పుట్టింటికి ఎక్కువగా పంపకపోవడానికి కారణమేమిటో తెలుసా? నన్ను విడిచి మీ నాన్న ఒక్క క్షణం కూడా ఉండలేరు. మీ నాన్న ప్రతీ చర్యను మీ తాతయ్య గమనించేవాడు. అందరూ తనను క్రూరుడనుకున్నా ఫరవాలేదు కానీ నన్నెవరైనా ఒక్క మాటంటే సహించేవాడు కాదు. తనూ తండ్రిలాగే ప్రవర్తించేవాడు. అప్పుడే మీ తాతయ్యకు తృప్తిగా ఉండేది. ఆయనంటే మీ నాన్నకు చిన్నప్పటినుండి అంత భయం. నా ప్రేమంతా తనకే దక్కాలనే చిన్న స్వార్థం ఆయనది. అందుకే నన్ను పుట్టింటికి ఎక్కువగా పంపేవాడు కాదు. మా వాళ్ళు వచ్చినప్పుడు, నేను వాళ్లతోనే ఎక్కువగా గడపడం ఆయనకు నచ్చేది కాదు. ఎందుకంటే తనను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తానో అని ఆయన భయం. ఆయనకు చిన్నప్పటి నుండి తల్లితండ్రుల ప్రేమ ఎక్కువగా దక్కేది కాదు. వాళ్లకు కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా బయటికి ప్రదర్శించేవాళ్ళు కాదు. ఆ ప్రేమ నా వల్ల మాత్రమే ఆయన పొందానని నాతో చాలాసార్లు చెప్పారు. ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆయన ప్రవర్తనను అసహ్యించుకోకు. ఒకవేళ నేనే ముందుగా పోతే, మీ నాన్నను జాగ్రత్తగా, ప్రేమగా చూసుకుంటావు కదూ..
ఇట్లు
ప్రేమతో మీ అమ్మ
ఉత్తరం చదివిన కోదండపాణి వెక్కివెక్కి ఏడవసాగాడు.
“నాన్నా! అమ్మ పోయినప్పుడు నీవు పడిన వేదన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది, నీకు అమ్మంటే ఉన్న ప్రేమ. తాతయ్య పోయిన కొత్తలో, మా ఇంటికి రమ్మన్నా ఎక్కువగా వచ్చేవాడివి కాదు. ‘కనీసం ఇప్పుడైనా అమ్మ, నేనూ హాయిగా ఉంటాము’ అనేవాడివి. అమ్మ, నిన్ను ఎంత గారాబంగా చూసుకుందో, నీవు అంతకన్నా ఎక్కువ ప్రేమనే అందించావని అమ్మ ఎప్పుడూ చెప్పేది.
కానీ నీవు ఒక తప్పు చేశావు. ఇప్పటికీ అదే కోపం, విసుగు ప్రదర్శిస్తున్నావు. బహుశా! ఎన్నో ఏళ్లుగా అలా ప్రవర్తించడం వలన అలాగే ఉండడం అలవాటైందేమో! ఈ మాట అన్నందుకు క్షమించు నాన్నా! నాకు నీవేమిటో తెలుసు కాబట్టి నాకు నీ ప్రవర్తన ద్వారా బాధ కలగడం లేదు. కానీ ప్రణీతకు కొత్త కదా! అందుకే తను నిన్ను తప్పుగా అనుకుంటోంది.” అన్నాడు భార్గవ.
మళ్ళీ తనే అన్నాడు, “నాన్నా మీ కోడల్ని క్షమించండి. తను ఏదో పరాకులో అన్న మాటలను పట్టించుకోకండి. ఇప్పుడు తను అన్న మాటలకు చాలా పశ్చాత్తప పడుతోంది. తనను ఎప్పట్లాగా మీ కూతురిగా భావించి క్షమించండి. పదండి ఇంటికి.” తండ్రి భుజం చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకుని నడిపించుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు.
“అమ్మాయికి నా మొహం చూపించలేనురా!” చాలా దుఃఖపడుతూ, సిగ్గుపడుతూనే ఇంట్లోకి అడుగు పెట్టాడు.
“మామయ్యగారూ! ఇంత రాత్రి వరకు మీరు రాకపోతే మేమెంత కంగారు పడ్డామో తెలుసా! మీ మనుమరాలు మీకోసం ‘తాతయ్య ఏరీ?’ అంటూ ఏడుస్తోంది. రండి భోంచేద్దాం. ఈరోజు మీకిష్టమైన బెండకాయ వేపుడు చేశాను.” ఆప్యాయంగా అంటున్న కోడలి మొహం చూడలేకపోయాడు.
“తాతయ్యా!” మనమరాలు ప్రజ్ఞ కోదండపాణి దగ్గరకు పరుగున వచ్చి చుట్టుకుపోయి ఏడుస్తోంది.
“తాతయ్యా! మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? వద్దు తాతయ్యా.” అంటున్న ప్రజ్ఞను దగ్గరకు తీసుకుని, “లేదమ్మా! మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. ఈ తాతయ్యను క్షమించు తల్లి.” అన్నాడు రుద్దమైన కంఠంతో.
అందరూ ఆనందంగా భోంచేసారు.
***
ఆరోజు నుంచి ప్రజ్ఞను స్కూల్‌లో దింపి రావడం, సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడం, తరువాత ఆ అమ్మాయితో హోమ్ వర్క్ చేయించడం చేసేవాడు. బజారుకెళ్లి, కూరలు తెచ్చి ఇచ్చేవాడు. కోడలు వద్దన్నా వినకుండా కూరలు తరగడం, అన్ని పనులలో సహాయం చేయడం చేసేవాడు.
***
ఒకరోజు “అమ్మాయ్! నీ పేరిట ఏదో కవర్ వచ్చింది చూడు.” కవర్ ఒకటి ప్రణీత చేతిలో ఉంచాడు.
అది తెరిచి, చదివిన ప్రణీత మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. అంతలోనే నీరసంగా ఆ కవర్‌ను టేబుల్ మీద పడేసింది.
“ఏం కవరమ్మా అది? ఏముంది అందులో?” అడిగాడు కోదండపాణి.
“ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం ఇప్పుడు చేరమని వచ్చింది. ఇప్పుడు నేనా ఉద్యోగం చేయలేను లెండి.” అన్నది నిరుత్సాహంగా.
“ఉద్యోగం వచ్చిందా? ఎంత మంచి వార్త చెప్పావమ్మా! ఉద్యోగం దొరకడం గగనమైన ఈ కాలంలో నీకు దొరికింది. తప్పకుండా చేరు. ఇప్పటి పరిస్థితులలో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే కానీ ఈ ఖర్చులు భరించలేరు. నీవు ఆ ఉద్యోగం ఎందుకు చేయనంటున్నావో కారణం నాకు తెలుసు. నువ్వు ఉద్యోగానికి వెళితే నేను ఇబ్బంది పడతానని భయపడుతున్నావు కదూ! నేను పూర్వపు మామయ్యను కాదమ్మా. నీవు ఉద్యోగానికి వెళితే ఇంటిని, ప్రజ్ఞను నేను చూసుకోగలను. నీకు నామీద నమ్మకం లేకపోతే, నేను మన ఊరు వెళ్ళిపోతాను. అప్పుడు నా బాధ్యత నీకేమీ ఉండదు. ఇక ప్రజ్ఞ విషయమంటావా? తను స్కూల్ నుండి వచ్చేసరికి నీవూ వచ్చేస్తావు. ఇక సమస్యే ఉండదు.” అన్నాడు.
“అయ్యో మామయ్యా! మీరు నాకేం భారం కాదు. ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందే అని బాధ పడుతున్నాను. అంతే.. చిన్నప్పుడే తండ్రికి దూరమైన నాకు మీరు కన్నతండ్రికన్నా ఎక్కువగా ప్రేమనందిస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకోను. మీ కోరిక ప్రకారం నేనా ఉద్యోగంలో చేరతాను.” అన్నది ప్రణీత సంతోషంగా.
