[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కస్తూరి రాజశేఖర్ గారి ‘అమ్మ దగ్గరికి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“అమ్మ దగ్గరకి వెళ్లనివ్వటం లేదుగా..?!” మొహం గంటు పెట్టుకుని నిష్ఠూరంగా అన్నాడు పురుషోత్తం భార్య శ్యామలతో.
భర్త వంక చురుగ్గా చూసి గయ్యిమంది శ్యామల.
“ఇలా దెప్పిపొడవటం.. ఇప్పటికిది పన్నెండోసారి ఇవ్వాళ. ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతి వారం వెళ్లాల్సిన అవసరం ఏముంది? దగ్గరా; దాపా? హైదరాబాద్ నుంచి తెనాలి.. అక్కడ్నుంచీ కనగాల.. పోనీ ఆవిణ్ణే మన దగ్గరికి రమ్మంటే.. ఊరు విడిచి రానంటుందాయే! అయినా.. అక్కడ మీ అన్న వదినలు ఉన్నారుగా.. బాగానే చూసుకుంటున్నారాయే ! మీకు ఎందుకు బెంగ? ముందు మీ గుండె జబ్బుకు మందు వేసుకుని ఈ కాఫీ తీసుకోండి..” అంటూ కాఫీ గ్లాసు అతని ముందున్న స్టూలు మీద పెట్టింది.
మందు బిళ్ళ వేసుకుని, కాసిన్ని మంచినీళ్లు త్రాగి, కాఫీ గ్లాసు తీసుకుని కుర్చీలో జారగిలబడి కూర్చున్నాడు పురుషోత్తం.
“నిజమే.. కానీ.. సంతానంలో ఆఖరి వాణ్ణని.. పసితనం నుంచీ ‘పండూ’ అంటూ నన్ను గారాబంగా చూసింది మా అమ్మ.. అందుకే..” తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు పైకే అనేసాడు.
“ఆహాఁ.. అంటే.. మీరింకా పసివాణ్ణే అని అనుకుంటున్నారా? రిటైరై ఐదేళ్లయింది.. పిల్లలకు పెళ్ళిళ్ళయి, మనవళ్ళు కూడా.. అందరూ తలో మూలా .. మనిద్దరం ఇక్కడ హైదరాబాద్‌లో.. అయినా మీ అమ్మగారికి ఈ ‘పండు’ అంటే అంత ప్రేమే ఉంటే ఇక్కడికి రావచ్చు కదా.. మహారాణిలా చూసుకుంటాను”
“అదేం కాదు శ్యామూ.. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఊరు.. ఆవిడ వయసు బంధువులందరూ అక్కడే ఉన్నారు. తొంభై ఏళ్ళు దాటింది. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే ఆవిడ కదలదు..”
“అలా అని? మీరు కూడా.. గుండాపరేషన్ జరిగిన మనిషి.. ప్రతి వారం పరిగెత్తుతానంటే అర్థం ఉందా ఏమైనా? సర్సరే.. వాకింగ్‌కి బయలుదేరండి.. వస్తూ వస్తూ మీకిష్టమైన కూరలు నాలుగు పట్రండి.. ఈ లోపు నేను నా పూజ ముగిస్తాను” అంటూ చేతి సంచీ తీసి ఇచ్చింది.
పురుషోత్తం లేచి కొడుకు పంపించిన ట్రాక్ సూట్ వేసుకుని బయటికి నడిచాడు.
***
పార్కులో బెంచీ మీద కూర్చుని యోగా చేస్తున్న తన వయసు వాళ్ళని చూస్తున్నాడు పురుషోత్తం. చూపు అటువైపు ఉన్నదే కానీ, మనసు అమ్మ వైపు మళ్లుతోంది.
‘కుటుంబంలో చివరివాడవటం వల్లనేమో, చాలా సున్నితంగా పెరిగాడు తను. తనకన్నా పైవాడు రామం గొడ్డులా చాకిరి చేస్తున్నా తనను మాత్రం అల్లారుముద్దుగా చూసేవాళ్ళు వాడితో సహా.
తనకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోయేది అమ్మ. అమ్మకు చిన్న జ్వరం వచ్చినా ఆవిడని అంటిపెట్టుకుని ఉండిపోయేవాడు తాను. స్కూలుకి కూడా వెళ్ళేవాడు కాదు. అమ్మ తప్ప తనకు వేరే లోకమే ఉండేది కాదు. నాన్న, అన్నలు, అక్కలు పెద్ద సంసారమే కానీ, తనకు మాత్రం అమ్మ దగ్గర మాత్రమే చనువు. కాలేజీలో చదివే సమయంలో కూడా అమ్మ ఒక్కతే తన స్నేహితురాలు. అప్పుడప్పుడు అమ్మే గారాబంగా అంటూ ఉండేది – “ఇలా అయితే చాలా కష్టపడతావురా పండూ.. నేను పైకి పోతే, నిన్నెవరూ పట్టించుకోరు.. అందరితో కలుస్తూ వుండు..” అని
తానూ అంతే మొండిగా అంటూండేవాడు – “నిన్ను క్రిందకు తీసుకొస్తా.. లేదా నేనే పైకి వచ్చేస్తా నీతో బాటు.. నాకెవరూ అక్కర్లేదు..”
“నీ మొహంలే.. ఇంద.. ఈ సున్నుండ తిని పోయి చదువుకో ఫో..” అంటూ ముద్దుగా కసురుకునేది. పైవాళ్ళు పనిచేస్తూ ఉంటే, తాను చదువుకునేవాడు.. అలా మంచి చదువులు చదివి సిటీలో స్థిరపడ్డాడు.
పెళ్లయ్యింతర్వాత, శ్యామల తనను నిరంతరం కనిపెట్టుకుని ఉంటూ, తన ఆప్యాయత, అనురాగంతో కట్టి పడేసింది. తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేసింది. తన వైపు వాళ్లందరికీ అవసరానికి అన్నీ తానే అయి చేదోడుగా ఉంటూ వచ్చింది. అమ్మ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉంటుంది. అమ్మ కబురు చేస్తే చాలు, తనకంటే ముందే బయల్దేరిపోయేది.
అలాంటిది, తనకు గుండాపరేషన్ జరిగింది మొదలు ఇలా అభ్యంతరాలు చెప్పటం మొదలైంది.
అలా మనసు మరో లోకంలో విహరిస్తున్నపుడే సెల్ ఫోన్ మ్రోగింది.
***
నీరసంగా ఇంట్లోకి అడిగిపెట్టిన పురుషోత్తంను చూసి శ్యామల ఎదురెళ్ళింది.
“ఏమైందండీ.. అలా ఉన్నారు? ఇలా కూర్చోండి” అంటూ కుర్చీలాగి ఫ్యాన్ వేసింది.
లోపలికి వెళ్లి కాచిచల్లార్చిన నీళ్లు గ్లాస్‌తో తెచ్చి ఇచ్చింది.
“ఏమైందండీ..?” అతని వీపు నిమురుతూ లాలనగా అడిగింది శ్యామల.
పురుషోత్తం ఆమె కేసి చూసాడు. అతని కళ్ళలో నీళ్లు.
“అమ్మ దగ్గరికి వెళ్ళాలి.. శ్యామూ..”
“తప్పకుండా వెళ్దాం.. నేనేమీ వద్దనలేదుగా? ఇంత మాత్రానికేనా అంతగా బాధపడుతున్నారు?” వెన్నెల్లా చల్లగా నవ్వింది శ్యామల.
“అది కాదు.. అమ్మ నిన్న రాత్రి బాత్రూంలో జారి పడిందిట. తెనాలి హాస్పటల్లో ఉంచారట. వెన్నెముక క్రింది భాగం విరిగిందిట. నాకెందుకో భయంగా ఉంది శ్యామూ.”
“అయ్యో అవునా..” అని అతని మొహంలో దిగులు చూసి సర్దుకుని, “మీరేం కంగారు పడకండి.. అలా కూర్చోండి. అన్నం కూడా వండేసాను. ఇప్పుడే బట్టలు సర్దేస్తాను. ఒక గంటలో ఏదో ఒకటి ఎంగిలి పడి బయలుదేరుదాం.. అత్తయ్య గారికి ఏం కాదు.. మీరు ఈ లోపు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని రండి.. నేను కూడా ఒకసారి బావగారికి, తోడికోడళ్లకి ఫోన్ చేసి మాట్లాడతాను” అంటూ హడావిడి పెట్టేసి, అతని ఆలోచనలకు అడ్డుకట్ట వేసి లోపలికి నడిచింది.
***
శ్యామల, పురుషోత్తం లను చూడగానే తల్లి శాంతమ్మ గాజు కళ్ళలో చిన్నపాటి మెరుపు.
తోడికోడళ్ళు శ్యామలను పలకరింపుగా చూసి భుజం తట్టి, బయటకు నడిచారు.
పురుషోత్తం తల్లి చేతుల్ని పట్టుకొని గుండెలకద్దుకున్నాడు. లోపల్నుంచీ బాధ ఎగదన్నుతోంది. తల్లి అతని బుగ్గలు నిమిరి మెల్లిగా తట్టింది ఓదార్పుగా! మంచం పైన ఓ మూలగా కూర్చుండిపోయాడు ఏడుపు దిగమింగుకుంటూ!
శ్యామల అత్తగారి పక్కనే కూర్చుని తలని ఆప్యాయంగా నిమిరింది. శాంతమ్మ ప్రేమగా చూసింది.
“ఏంటి అత్తయ్యా! తలకు నూనె పట్టించుకోవడం లేదా? మేమంతా జుట్టూడుతోందని బాధలు పడుతుంటే, మీరు ఉన్న బారెడు జుట్టుకు పోషణ లేకుండా చేస్తున్నారేంటి?” అంటూ పురుషోత్తం వైపు చూసి,”ఏవండీ, మీరెళ్లి అత్తయ్య గారికి ఇష్టమైన చందనాది తైలం తీసుకురండి.. ఇలా చూస్తుంటే నేను పేషెంట్ అయ్యేట్టు ఉన్నాను” అని గలగల మాట్లాడేసరికి శాంతమ్మ మొహంలో వెలుగు వచ్చింది.
పురుషోత్తం కూడా ఉత్సాహంగా లేచి, బయటకు నడిచాడు. వరండాలో అన్న వదినెలతో మాట్లాడి షాపుకి బయలుదేరబోతూ జేబులు తడుముకునే సరికి పర్సు, ఫోను శ్యామల దగ్గర ఉన్న బ్యాగులో ఉన్నట్టు అర్థమైంది. వెనక్కి వచ్చి గదిలోకి అడుగుపెట్టబోయి తన గురించిన మాటలు వినబడటంతో ఆశ్చర్యంగా నిలబడిపోయాడు పురుషోత్తం!
శాంతమ్మ, శ్యామలని కావలించుకుని ఏడిచేస్తోంది. శ్యామల సముదాయిస్తోంది.
“ఊరుకోండి అత్తయ్యా, ఎందుకలా బేలగా అయిపోతున్నారు? నేనున్నానుగా..”
“అదే తల్లీ! నీవున్నావన్న ధైర్యంతోనే నేను ఇంతకాలంగా సంతోషంగా ఉన్నాను. మా పండుగాడు ఎవరితోనూ కలిసే మనిషి కాదు. నేనే వాడి లోకం. ‘నాకు ఏదన్నా అయితే వాడు ఉండలేడు’ అని తెలుసు. అందుకే నీకు విషయం చెప్పి, నన్ను మరిచిపోయేలా చేయమని మాట తీసుకుని పండుగాడిని పెళ్లినాడే నీకు వదిలిపెట్టేశాను.
నీవు కూడా అంతే బాధ్యతగా, అందరూ ఎన్ని మాటలు అంటున్నా, ఆడిపోసుకుంటున్నా నా మాట దక్కించావు. నా పండును కాపాడుకుంటూ వచ్చావ్! ఇంక నాకు ఏమైనా పర్వాలేదు. వాడికి నువ్వు ఉన్నావు. అది చాలు!”
“అయ్యో అత్తయ్యా, మీరు అంతగా చెప్పాలా? అది నా బాధ్యత”.
‘దబ్బు’మని శబ్దం వచ్చేసరికి, ఇద్దరూ గుమ్మం వైపు చూశారు. పురుషోత్తం గుండె పట్టుకొని క్రింద కూలబడ్డాడు.
శ్యామల ‘ఏవండీ’ అంటూ పరిగెత్తింది. శాంతమ్మ మెల్లిగా లేచి కూర్చొని ఆందోళనగా చూడసాగింది. అన్నలు, వదినలు కూడా హడావుడిగా డాక్టర్ను పిలిచి, పురుషోత్తంను స్ట్రెచర్ మీద ఎక్కించి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించారు.
***
పురుషోత్తం కళ్ళు తెరచేసరికి ఎదురుగా అక్కలు, అన్నలు, వదినెలు, బావలు, తన పిల్లలు ఉన్నారు. శ్యామల తన కాళ్ల దగ్గర కూర్చుని ఉంది. తను హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నాడు. గుండెలకు తలకి ఏవో వైర్లు తగిలించి ఉన్నాయి. చుట్టూ చూసాడు.
పెద్దన్నయ్య, దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు.
“సారీ రా పండూ! నీవు స్పృహ కోల్పోయి మూడు రోజులైంది. అమ్మ అదే రోజు కాలం చేసింది. నిజం చెప్పొద్దూ.. నీ పరిస్థితి చూసి నాకైతే ‘నువ్వు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావేమో’ అని భయం వేసింది. అందుకే పిల్లల్ని కూడా పిలిపించాను.
నీవా – మూసిన కన్ను తెరవడం లేదు. మీ ఆవిడా – తెరచిన కన్ను మూయలేదు. కంటికి రెప్పలా చూసుకుంటూ నిన్ను కాపాడుకుంది. నువ్వు బ్రతికి బట్టకట్టావు. హమ్మయ్య! ఇప్పుడు నా ప్రాణం కుదుటపడింది. మీరు మాట్లాడుతూ ఉండండి” అంటూ తల నిమిరి బయటకు నడిచాడు.
‘తల్లి లేదు’ అన్న మాట విని పురుషోత్తానికి జీవితం శూన్యంగా అనిపించింది. బయట పెద్దన్నయ్య కుటుంబ సభ్యులతో తల్లికి జరగాల్సిన నిత్య కర్మల గురించి చర్చించటం వినబడుతోంది.
దీర్ఘంగా నిట్టూర్చి ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. చివరగా తల్లి తనను చూసిన చూపు, ఆ కళ్ళలో మెరుపు సజీవంగా కనిపించసాగాయి. శ్యామల వంక చూశాడు. అదే మెరుపు ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది. ఆర్ద్రంగా చేయి చాపాడు. అంతే! ఉప్పెనంత ఉద్వేగంతో అతన్ని చుట్టేసింది.
ఆమె పొదివి పట్టుకుని ఆప్యాయంగా నిమురుతూ, నీరసంగా నవ్వుతూ అన్నాడు – “అమ్మ దగ్గరకి వెళ్ళనివ్వలేదుగా..”
హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ కస్తూరి రాజశేఖర్ వృత్తిరీత్యా -విశ్రాంత యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా (పూర్వ ఆంధ్రా బ్యాంక్) చీఫ్ మేనేజర్. ప్రవృత్తి రీత్యా రచయిత, అనువాదకులు.
ఎం. ఏ. (తెలుగు), ఎం.ఎస్. (పబ్లిక్ రిలేషన్స్), ఎం.ఎస్ సి. (గణితం) విద్యార్హతలు. ప్రస్తుతం ఎం. ఏ. (సైకాలజీ) చేస్తున్నారు.
అనువాదకునిగా – నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూ ఢిల్లీ వారికి అనువాద/ప్రూఫ్ రీడింగ్ సేవలందించారు. జోతిరావు ఫూలే చరిత్ర, భక్త్ ఖాన్ అనువదించారు. ఈనాడు ఆదివారం పత్రికకు ఎన్నో సిండికేట్ ఆర్టికల్స్ అనువాదం చేశారు.
పి. దినకర రావు గారి ‘Ramblings’ ఇంగ్లీష్ కవితా సంపుటి తెలుగులోకి అనువాదించారు.
వీరి కథలు ఈనాడు ఆదివారం పత్రిక, విపుల (అనువాద కథలు), చతుర పత్రికలలో ప్రచురితమయ్యాయి. ‘ఓ సారి చూడండి అంతే.. whatsapp ప్రసారభారతి సంచిక’ నిర్వహించిన కథల పోటీలో వీరి కథ ‘ఎక్కడ ఉన్నా.. ఏమైనా..’ బహుమతి పొందింది
వీరి నవల ‘చక్రవ్యూహం’ ఆంధ్రప్రభ దీపావళి నవలల పోటీలో 3వ బహుమతి పొంది 28 వారాల పాటు ధారావాహికగా ప్రచురితమైనంది.
నాటక రచనలు:
– ఆమె త్యాగం (చలం గారి కథకు నాటక రూపం – అజో విభో కందాళం సంస్థ వారి కథా నాటికల పోటీలో ప్రదర్శింపబడింది.)
– నాతిచరామి (న్యూ ఢిల్లీ – శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారు నిర్వహించిన జాతీయ నాటక పోటీలలో 2వ బహుమతి)
– త్వమేవాహం (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలో 8 బహుమహతులు), తిరుపతి మహతి స్టేడియం, మరెన్నో వేదికల పైన ప్రదర్శింపబడింది.
– శతమానం భవతి (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలో జ్ఞాపిక )
– సర్వేజనా సుఖినోభవంతు (హైదరాబాద్ BHEL నాటక పోటీలో ఉత్తమ బాల నటుడు బహుమతి)
– పారిజాతం (డిసెంబర్, 2022 – న్యూ ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్, జనవరి, 2023 – హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ, జనవరి , 2023 – విజయవాడ లలో ప్రదర్శింపబడింది)
– పరంపర (రస రంజని వారి ఆధ్వర్యం లో 26-10-2023న శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్, గుడివాడ వారిచే ప్రదర్శింపబడింది)
– గురుభ్యోనమః
ఇవి కాక, ఈనాడు అదివారం పత్రిక కోసం పుస్తక సమీక్షలు చేశారు. యండమూరి రచనల సమీక్షా వ్యాసానికి బహుమతి పొందారు. 2016 బాంకాన్ సమావేశ పత్రాల ముద్రణలో సహాయ సేవలందించారు. డా. బి. కామేశ్వర రావు వ్రాసిన ‘ఆనంద విజయం’ (బెర్ట్రాండ్ రస్సెల్ ఆంగ్ల రచన – ది కాంకేస్ట్ అఫ్ హ్యాపీనెస్‌కు అనువాదం) కు; సీహెచ్ శ్రీనివాస శాస్త్రి వ్రాసిన ఇంగ్లీష్ రచన – the unanswered questions కు, కొండపల్లి సనత్‌కుమార్ రచించిన ‘శ్రీ సాయి బాబా చరిత్ర’ (ఇంగ్లీష్)కు సంపాదకత్వ బాధ్యలు నిర్వహించారు. ఆంధ్రాబ్యాంక్ house magazine ‘magicart’ సంపాదక మండలి సభ్యులు.
ఎన్నో కవితలు రాశారు. ‘కాల ధర్మం’ ప్రసిద్ధి చెందిన కవిత. ఆల్ ఇండియా రేడియోలో కవితా శ్రవణం. అభినందన పంచరత్నాలు వగైరాలు.
‘పడమటి ఉషస్సు’ అనే లఘుచిత్రానికి కథ, మాటలు అందించి, నటించారు. Kasturi Dreamworks అనేది వీరి యూట్యూబ్ ఛానెల్.
పలు తెలుగు ప్రకటనలకు డబ్బింగ్ చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్ లలో ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈనాడు – ఆదివారం, విపుల, చతుర పత్రికలకు సబ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఫోన్: 9848378034