Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ.. హాయి

[సూర్యదీప్తి గారు రచించిన ‘అమ్మ – హాయి’ అనే కవితని అందిస్తున్నాము.]

సీ.
కనుగవకే హాయి నిన్ను గాంచినయంత
మాట విన్నను పొందు మనసు హాయి
పరుగులెత్తుచు నిన్ను పట్టుకొనగహాయి
జోలపాటలతోడి జోల హాయి
నిదురలేచిన వేళ నీనవ్వులేహాయి
లక్షణమ్ముగ పోయు, లాల హాయి
గోరు ముద్దలు తిన్న గురుతుండు నే హాయి
మురిపెమ్ము చేసేటి ముద్దు హాయి
తే. గీ.
అమ్మ వో మురిపాలపూ కొమ్మ నీవొ
తల్లి మమతాను రాగాల మల్లి నీవొ
లోకమనగను నేనె నీ లోకమనుచు
పెంచుకొంటివి నన్ను నీ పెరిమ దీర..

తే. గీ.
నీవు లేకున్న కమ్మేను నిర్దయనను
నీదు అనురాగ బంధాలె నిత్య సిరులు
మలినమింతయు లేనట్టి మనసు నీది

అమ్మ.. ననుగన్న నీకన్ననన్యమేది..

తే. గీ.
నింపుకొందును గుండెలో నిన్ను సతము
తల్లి, నీప్రేమ ధారలన్ తడిసిపోదు
దేహమిచ్చిన నీచెంతనహము విడిచి
బతుకు గడుపుటే గాకున్న భాగ్యమేది..

తే. గీ.
నోట గసిరిన తల్లి నే నోర్చుకుందు
మాట పలుకని క్షణమున మనగలేను
ధనపు రాసులు యెన్నున్న కనకమైన
కన్నతల్లితో సరిపోవు మిన్నకావు

Exit mobile version