[శ్రీమతి జయంతి వాసరచెట్ల రచించిన ‘అమ్మ ఇక రాదన్నప్పుడు!’ అనే కవితని అందిస్తున్నాము.]
ఎన్నో బుద్దుల సుద్దులు చెప్పే..
అమ్మతో గడిపిన జ్ఞాపకాలు కూడా
ఇప్పుడు దుఃఖాన్ని మోస్తూ..
మన చుట్టూ తిరుగుతుంటాయి!
ఎప్పటికీ వీడిపోవు!
అమ్మ లేదంటే ప్రపంచం శూన్యమై
చిన్నప్పటి రోజుల్లోకి హఠాత్తుగా వెళ్ళిపోయి
మారాం చేస్తుంటాము!
కాలం వెనక్కి వెళ్ళి అమ్మ దగ్గర ఆగిపోతే
బాగుంటుంది అనిపిస్తుంది!
చెంగు పెట్టుకుని తిరుగుతూ
తాయిలాలు కావాలని
అమ్మ కాళ్ళను చుట్టుకున్నట్లు ఒక భ్రమ!
తలను నూనెతో మర్ధనా చేసి
మునివేళ్ళతో వెంట్రుకలు దువ్వి
నుదుటిపై ముద్దు పెట్టుకుని మురిసిపోయే..
అమ్మ ఇక లేదంటే..
కన్నీళ్ళు యేరులై అమ్మ ముఖం చిత్రిక పడుతుంది!
పక్కింటి వాళ్ళో..
ఎదురింటి వాళ్ళో..
చుట్టాలో అమ్మను పేరుపెట్టి పిలుస్తూ
ఇంట్లోకి వస్తున్నప్పుడు..
అమ్మ లేదని చెప్పలేక కనుగుడ్లు ఎర్రబడి
తలనేలకు వాలి హృదయం కన్నీరైపోతుంది!
పొత్తిళ్ళలో మోసిన అమ్మ ఇప్పుడు
కనిపించకపోయినా..
మన చుట్టూ అదృశ్యంగా ఉంటుంది
అమ్మ జ్ఞాపకాలను మాత్రం
మన జీవితాంతం వరకూ
మనకు బహుమతిగా ఇస్తుంది!
