[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
ప్రకృతి వ్యవస్థలన్నీ వైవిధ్యంతో కూడుకున్నవే. మనుషుల కార్యకలాపాల కారణంగా విడుదలయ్యే కార్బన్‍లో రమారమి మూడవ వంతును సముద్ర వ్యవస్థలు శోషించుకుంటాయి. తద్వారా హరితగృహ వాయువుల విడుదల కారణంగా తలెత్తే దుష్పరిణామాలను కొంతవరకు నిరోధిస్తాయి. అయితే అదే సముద్ర వ్యవస్థలలోని ప్రొకరియోట్స్ (prokaryotes) మానవుల కంటే రెట్టింపు ఉద్గారాలను విడుదల చేస్తాయి. ఇవి సాలీనా 20 బిలియన్ టన్నుల వరకు వరకు ఉంటాయని అంచనాలు చెప్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సముద్రాలలో ఈ ప్రొకరియోట్స్ 30% వరకు ఉంటాయి. సముద్ర వ్యవస్థల సమతౌల్యంలో వీటిది కీలక పాత్ర. వీటిలో ఉండే ఆర్కియా అనబడే ఏకకణ జీవులు – భూమండలం పైని కణ ఆధారిత జీవజాతులలో అతి పురాతనమైనది. ఇవి భూమండలం అంతటా – నీరు, నేల, ధృవప్రాంతాలు, ఉష్ణమండలాలు – అన్నిటా వ్యాపించి ఉంటాయి. భూమిపైని ఆహారపు గొలుసుల్లో వీటిది చాలా కీలకమైన పాత్ర. ఇవి పోషకాహార అవసరాలను తీర్చే దిశగా పనిచేస్తాయి.
ప్రొకరియోట్స్ సముద్ర వ్యవస్థలలో విపరీతమైన వేగంతో వృద్ధి చెందుతాయి. ఆ ప్రక్రియలోనే హెచ్చు స్థాయిలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తాయి. అయితే చిత్రంగా ఈ కార్బన్ అంతా మరో సూక్ష్మజీవుల రాశి ఫైటోప్లాంక్‌టన్‌కు (Phytoplankton) ఫోటోసింథసిస్‍లో ఉపయోగపడి వాటికి శక్తిగా/ఇంధనంగా మారుతుంది. ఐతే ఇటీవలి పరిశోధనలు ఈ ప్రొకరియోట్స్ వాతావరణ మార్పులకు తట్టుకొనేలా తయారయ్యాయని వెల్లడిస్తున్నాయి. వీటికి సమకూరిన ఈ రెజిలెన్స్ కారణంగా సముద్ర వ్యవస్థల సమతౌల్యం రిస్క్‌లో పడే ప్రమాదం ఉందన్న ఆందోళనలూ రేకెత్తుతున్నాయి. సముద్ర వ్యవస్థల పర్యావరణాన్ని ఇవి డామినేట్ చేస్తే, మత్స్య సంపద తగ్గిపోయే అవకాశం ఉంది. కార్బన్‌ను శోషించుకునే స్థాయిలలో మార్పులు రావచ్చు. కావటానికి ఇవి అతి చిన్న సూక్ష్మజీవుల జాతులే కావచ్చు. కానీ వీటి వ్యవస్థ/సమూహంలోని ఏ మార్పులైనా షార్క్‌ల నుంచి వేల్స్ వరకు మొత్తం సముద్ర వ్యవస్థనే ప్రభావితం చేయగల కీలకమైన ఆహారపు గొలుగులో ప్రముఖ పాత్ర వీటిదే.
ప్రపంచంలో సముద్ర వ్యవస్థలలో సింహభాగం రమారమి 70% సూర్యరశ్మి సోకే ఉపరితల వ్యవస్థలు. సూర్యరశ్మి సోకని సముద్రపు అట్టడుగు వ్యవస్థలుగా రూపుదిద్దుకుని ఉంటుంది. ఉపరితల వ్యవస్థలు ఉపగ్రహ అద్యయనాలకు వెసులు గానే ఉంటాయి. కానీ అంతర్గత వ్యవస్థలు ఉపగ్రహ నేత్రాలకు దొరకవు. ఉపరితలంలో సుమారు 50 మీటర్ల లోతు వరకు ఉండే సూక్ష్మజీవుల/రాశుల చర్యలను సైతం ఉపగ్రహాలు పసిగట్టగలవు. కొన్ని వేల జాతుల ఈ జీవరాశులలో వివిధ రకాల పైటోప్లాంక్‌టన్స్‌ది ఉపరితల వ్యవస్థలో కిరణజన్య సంయోగక్రియ/పోటోసింథసిస్‌లో కీలక పాత్ర కాగా సముద్రపు అట్టడుగున ఉండే పలు జాతుల పైటోప్లాంక్‌టన్స్‌ది ఆహారపు గొలుసులో పోషకాహార అవసరాలలో కీలక పాత్ర.
మైక్రోస్కోపులో తప్ప స్థూలదృష్టికి కనిపించని ప్రతి చిన్న జీవరాశులు ఏనిమల్/జూప్లాంక్‌టన్. ఈ జూప్లాంక్‌టన్ సముద్రపు అట్టడుగున ఉండే ఫైటోప్లాంక్‌టన్‌ను తింటుంది. జూప్లాంక్‌టన్‌ను చిన్ని చేపలు ఆహారంగా వేటాడి తింటాయి. చిన్న చేపలను అంతకంటే పెద్ద చేపలు వేటాడతాయి. సముద్ర వ్యవస్థ లోని జీవుల మనుగడ ఆసాంతం ఆ విధంగా ‘చిన చేపను పెద చేపా, పెద చేపను ___’ లా ఆహారపు గొలుసు వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మొత్తం వ్యవస్థలో ఎక్కడ హెచ్చుతగ్గులు వచ్చినా, మెత్తం వ్యవస్థ సమతౌల్యానికీ, తద్వారా మనుగడకే ముప్పు. సముద్ర వ్యవస్థ పర్యావరణ వ్యవస్థలో ఒకటి. ఆ వ్యవస్థ సంతులనంలో తేడాలు పర్యావరణాన్నీ ప్రభావితం చేయగలవు. ఆ కారణంగా సముద్ర వ్యవస్థలను దెబ్బతినకుండా ఏ విధంగా కాపాడుకోవాలో ఒక అవగాహనకు రావడానికై శాస్త్రజ్ఞులు విస్తతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త పరికరాలతో ఈ అద్యయనాలు సాగుతున్నాయి. రోబోల సాయంతో టూ లేయర్ మోడలింగ్ టూల్స్‌తో సముద్రపు అట్టడుగు లోతుల లోనికీ పోయి వివరాలను సేకరిస్తున్నారు. 30 సంవత్సరాల డేటానీ సమీకరించారు. ఈ డేటా ప్రకారం సముద్ర గర్భంలోని ఫైటో బయోమాస్ సైతం స్థాయికి మించి విస్తరిస్తోందని తెలుస్తోంది. ఈ డేటా ఆధారంగా సమస్యల పరిష్కారానికీ మార్గాన్వేషణ మొదలైంది.