Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ కడుపు చల్లగా-59

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

సముద్ర వ్యవస్థలు – సమాచార వ్యవస్థ

ఎంత అధ్యయనం చేసినా, ప్రకృతిలో ఇంకా తెలుసుకోవలసింది ఉంటూనే ఉంది. సముద్ర వ్యవస్థలూ అంతే. సముద్ర ఉపరితలం కాంతి, ఆక్సిజన్‍ల సమృద్ధితో వెచ్చగా ఉంటుంది. అయితే సముద్రంలోని జీవజాతుల సమాచార ప్రసారం/మార్పిడి అంతా ధ్వని ఆధారితంగా జరుగుతుంది. కారణం ధ్వని నీటిలో, కాంతి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. అయితే ఆ ధ్వనినీ ఓషన్ కరెంట్స్ ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ కారణంగా నీటి లోతు, సృష్టతపై ఆధారపడి, ధ్వని ప్రయాణించే దిశ, వేగం మారుతూ ఉంటాయి.

అలా మెరైన్ వ్యవస్థ అంతర్గత సమాచార మార్పిడి సముద్రం లోతులలో ఉండే కాంతి ఆధారితంగా వివిధ రకాలుగా కొనసాగుతుంది. వేరు వేరు జాతుల సముద్ర జీవులు వేరు వేరు ధ్వనులతో తమ సమాచారాన్ని వెలువరిస్తాయి. ఆ సమాచారం కూడా వేరు వేరు అవసరాల నిమిత్తం వివిధ రకాలుగానే ఉంటుంది. ఉదా: తమకు ఎదురుకాబోతున్న ప్రమాదాలను గుర్తించిన జీవులు హెచ్చరికల నిమిత్తం తమ సహ ప్రాణులకు పంపే సంకేతాలు ఒక రకంగా ఉంటే, ఆహార అవసరాలకు సంబంధించిన వనరుల వెతుకులాట, గుర్తింపు వంటివి తెలియజేసే సంకేతాలు మరొక విధంగా ఉంటాయి. జతను వెతుక్కుంటున్నడు వెలువరించే ధ్వనులు ప్రత్యేకంగానే ఉంటాయి. ఈలలు, పల్సెస్, క్లిక్స్ వంటి వివిధ రకాల ధ్వనులు ఈ సమాచార వ్యవస్థలో ఉంటాయి. వేటగాళ్ళ నుంచి రక్షణకై చేసే హెచ్చరిక ధ్వనులూ ప్రత్యేకంగానే ఉంటాయి.

వేల్స్ సమాచార వ్యవస్థ చాలా సంక్లిష్టమైనదని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇవి జత కోసం వెతుక్కుంటున్నప్పుడు చక్కని పాటల వంటి ధ్వనులను వెలువరిస్తాయట.

డాల్ఫిన్స్ తమ ఉనికిని/నైసర్గిక పరిసరాలను తెలపడానికి ఒక రకమైన ఈలలు, క్లిక్స్ వంటి ధ్వనులను వెలువరిస్తాయట.

చేపలు సైతం వాటి ఆవాసాల రక్షణకు, జతకు ప్రత్యేకమైన ధ్వనులను వెలువరిస్తాయి.

పగడపు దిబ్బలు సైతం 4000కు మించిన జాతుల చేపలు, పగడాలు, ఇతర సముద్ర జీవులకు ఆవాసాలు. సముద్ర వ్యవస్థలో ఒక శాతానికి మించని ఈ కోరల్ రీవ్స్ 25% జీవజాలానికి ఆవాసంగా ఉన్నాయి.

ఇంత జీవ వైవిధ్యానికి ఆలవాలమైన పారావార సమాచార వ్యవస్థ సంక్లిష్టంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.

సముద్ర వ్యవస్థలోని జీవజాలమంతా వ్యవస్థలో అంతర్గతంగా సహజసిద్ధంగా ఏర్పడి ఉన్న సమాచార వ్యవస్థ ఆధారంగానే మనుగడ సాగిస్తాయి. సముద్రం లోని క్షీరదాలు సైతం ప్రతిస్పందనలు, కదలికలు, వెలువడే ధ్వనులు – వాటి ప్రత్యేకమైన సంకేతాల ఆధారంగా సురక్షితంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటాయి. ఈ సమాచార వ్యవస్థ ప్రమాదంలో పడిందని మెరైన్ బయోలజిస్టుల పరిశోధనలు చెప్తున్నాయి.

శబ్ద కాలుష్యం కారణంగా సముద్ర జీవుల సమాచార వ్యవస్థలో అవరోధాలు ఏర్పడి అవి అయోమయానికి గురి అవుతున్నాయి. తమ ఆహార అన్వేషణలో, జతను వెతుక్కోవడంలో తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా అవి ఒంటరితనానికి, విపరీతమైన గందరగోళానికి లోనవుతున్నాయి.

పెరిగిపోయిన రవాణా వ్యవస్య, మరబోట్లు, అవి సృష్టిస్తున్న విపరీతమైన శబ్దకాలుష్యం సముద్ర జీవుల మనుగడకు అవరోధాలను కలిగిస్తున్నాయి. ఈ శబ్ద కాలుష్యం వాటిలో ఆందోళన స్థాయిలను కూడా పెంచుతోంది. ఈ అవరోధాలకు వేల్స్ వంటి పెద్ద జీవులు కూడా అతీతం కాకపోవడం ఆందోళన కలిగించే విషయం.

వ్యవస్థలోని వైవిద్యభరితమైన జీవరాశి వెలువరించే కూతలు, కేకలు వంటి సహజ ధ్వనులన్నిటిని మిగిలన జీవులు గుర్తించగలవు. సముద్ర రవాణా వ్యవస్థ కారణంగా వెలువడే హెచ్చు స్థాయి శబ్దకాలుష్యం ఆ సహజ సమాచార వ్యవస్థకు భంగం కలిగిస్తున్నాయి.

మానవ సమాజంతో ఏ మాత్రం ప్రమేయం లేని సముద్ర జీవుల – జీవనశైలి/మనుగడ సైతం మానవ కార్యకలాపాల తాలూకు దుష్ప్రభావాల కారణంగా ప్రమాదంలో పడటం – మనిషి తన జీవన విధానాన్ని పునరాలోచించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.

Exit mobile version