[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు
ప్రపంచవ్యాప్తంగా సాలీనా 62 మీలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి. అవి విడుదలయ్యే రేటు వేగంగా పెరుగుతోంది. 22 లేదా 23 శాతానికిలోపే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించడబడి రీసైకిల్ చేయబడుతున్నాయి. అయితే పెద్దగా పట్టింపులు లేకుండా అశాస్త్రీయంగా జరిగే రీసైక్లింగ్ విధానంలో ఈ వ్యవర్ధాలు సూమారు 1000 రకాల రసాయనాలను విడుదల చేస్తాయి. వీటిలో సీసం, పాదరసం వంటి అనేక రసాయనాలు నాడీ వ్యవస్థకు హాని కలిగించేవని అధ్యయనాలు నిరూపించాయి. అసంఘటిత కార్మిక వర్గంలోని పిల్లలు, స్త్రీలు వంటి వారు మిలియన్ల సంఖ్యలో ఈ న్యూరో టాక్సిన్లకు గురౌతున్నారు. ఈ గురికావడం వారి ఆరోగ్య భద్రతకు ముప్పుకాగల ప్రమాదం ఉంది.
భారతదేశంలో 70% ఎలక్ట్రానిక్ వ్యర్థాల విడదల – AC ల నుండి 115000 టన్నులు; 6,75,000 టన్నులు రెఫ్రిజిరేటర్ల నుండీ; 6,30,000 టన్నులు వాషింగ్ మెషీన్ల నుండీ; టి.వీ.ల నుండీ 36,000 టన్నులు; లాప్‌టాప్స్ నుండీ 10,000 టన్నులు కాగా మిగితాది స్మార్ట్ ఫోన్స్ వంటి వాటి నుండే విడదల అవుతున్నది. భారతదేశం e-waste విడుదలలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. 2020లో చైనా విడుదల చేసిన e-వేస్ట్ 12 మిలియన్ టన్నులు.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సాధారణ వ్యర్థాలతో కలిపి డంప్ చేయడం, వేడి చేయడం, కాల్చడం, నీటి వనరులలో పారవేయడం వంటివి గాలి, నీరు, నేలలను కలుషితం చేస్తాయి. అంతే కాక, శాస్త్రీయమైన విధానాలతో వీటిని రీసైకిల్ చేసినపుడు వాటి తయారీలో వినియోగించబడిన విలువైన వనరులను వేరు చేసి పునర్వినియోగించుకోగల అవకాశం ఉంటుంది.
మునిసిపల్ వ్యర్థాలు
ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.1 బిలియన్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి. 2050 నాటికి ఇది 4 బిలియన్ టన్నులకు చేరగలదని అంచనా. ఇప్పటికే వ్యర్థాల నిర్వహణ చాలా వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉన్నది. 2050 నాటికి ఈ వ్యయం 640 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా.
ప్లాస్టిక్ వ్యర్థాలు
ఇక ప్లాస్టిక్ వ్యర్థాల విషయానికి వస్తే ఇది జీర్ణం కావడానికి 1000 సంవత్సరాల వరకూ కూడా పడుతూ ఉంటుంది.
మిగిలిన వ్యర్ధాల సంగతి సరేసరి. ఏటా 1 బిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది.
ప్రస్తుతం మనం సరుకు లభ్యత సమస్య కంటే తీవ్రమైన సమస్య సరుకుల వినియోగానంతరం వ్యర్ధాల నిర్వహణ సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నాం.
ఈ దశలోనైనా మనం విచ్చలవిడిగా కొనుగోలు చేసే సంస్కృతి నుండి బయటపడి ప్రతి వస్తువును ఆచితూచి కొనుగోలు చేయడం, సరిగా వినియోగించుకోవటం, పునర్వినియోగం వంటి అవకాశం ఉన్న చోట దానిని అమలు చేయడం – వంటి చక్కని, భద్రమైన వినియోగ సంస్కృతిని అలవరుచుకోవాలి.
అయితే అవసరాలను బట్టి పరిష్కార మార్గాలూ పుట్టుకొచ్చినట్టే ప్రస్తుత సంక్షోభాలకు పరిష్కారంగా అనేక క్రొత్త ఆలోచనలూ ఆచరణలూ అమలులోకి వస్తున్నాయి. క్రొత్త సాంకేతిక నైపుణ్యాలతో సమస్యల పరిష్కారానికై కృషి శక్తివంచన లేకుండానే జరుగుతోందన్నది యథార్థం.
పెరుంగుడి డంప్ యార్డ్ 96 ఎకరాలు. దశాబ్దాలుగా అక్కడ చెత్త పేరుకునిపోతూ వచ్చింది. ఆ డంప్ యార్డ్‌ని శుభ్రం చేయడంలో భాగంగా 1.7 మిలియన్ల క్యూబిక్ మీటర్ల చెత్త హానిరహితమైన విధానాలతో శుద్ధి చేయబడింది. విశేషం ఏమిటంటే అంత డంప్ లోనూ ఏ వ్యర్థమూ వృథాగా పోలేదు. ప్రతి వ్యర్థ వస్తువూ జాగ్రత్తగా రీసైకిల్ చేయబడి పునర్వినియోగానికి యోగ్యమైనదిగా మార్చబడింది. స్టీలు – గిన్నెలు, హార్డ్‌వేర్ ఉపకరణాలుగా మార్చబడగా, 3000 టన్నుల గ్లాస్ – బాటిల్స్‌గా మార్చబడింది. రాళ్లురప్పలు కాంక్రీట్‌గా రూపుదిద్దబడ్డాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు ఆరుబయిట వినియోగించుకో గలిగిన ఫర్నిచర్‌గా మార్చబడ్డాయి. అదీ మరో 7 లేక 8 మార్లు రీసైకిల్ చేసుకోదగిన/గలిగిన విధంగా.
‘బ్లూప్లానెట్ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్’ అనే సంస్థ ‘బయో మిమికింగ్ టెక్నాలజీ’తో ఈ బృహత్కార్యాన్ని సాధించగలిగింది. ఈ సంస్థ సురక్షితమైన విధానాలతో వ్యర్థాలను త్రవ్వితీసి, శుద్ధి చేసి, విడగొట్టి రీసైకిల్ చేసే వినియోగ యోగ్యమైన వస్తువులుగా మారుస్తోంది. కరెక్ట్‌గా నప్పే సాంకేతికతతో దశాబ్దాల వ్యర్థాలు కూడా విలువైన వనరులుగా మారిపోయాయి. నిర్లక్ష్యానికి, పర్యావరణానికి ప్రమాదకరం కాగలగడానికి కారణభూతమైన ఒకప్పటి ‘పెరుంగుడి’ ఇప్పుడు ఆదర్శవంతమైన, సుస్థిరమైన ‘వ్యర్థాల నిర్వహణ’ విధానానికి ప్రతీకగా నిలుస్తోంది.
‘బ్లూప్లానెట్’ సంస్థ రోజుకు సూమారు 9000 టన్నుల వ్యర్థాలను నిర్వహిస్తుంది. ‘జీరో/0’ కాలుష్యాన్ని నిర్ధారించుకోవడంలో భాగంగా ప్రతీ బేచ్ 52 సురక్షితా ప్రమాణాల పరిశీలనను దాటుకొని వెళ్లవలసిందే. ఈ సంస్థ ఇప్పుడు ‘కొడున్‍గయూర్’ వ్యర్థాల నిర్వహణను చేపట్టింది. ఇక్కడి వ్యర్థాలు పెరుంగడి చెత్తకు మూడు రెట్లు.
దేశవ్యాప్తంగా ఈ సంస్థ 700 ఎకరాలలో 1.4 కోట్ల టన్నుల చెత్తను శుద్ధి చేసింది. ఈ సంస్థకు 24 గంటలలో 437,975 కిలోల కాయితం చెత్తను సేకరించిన రికార్డు ఉంది. ‘గ్రేటర్ నోయిడా ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్’ సంస్థ వ్యవస్థ ఏర్పాటు ద్వారా భారీ ఎత్తున ‘ఎలక్ట్రానిక్ వేస్ట్’ శుద్ధి నిర్వహణ కార్యక్రమాలనూ నిర్వహిస్తోంది. మునిసిపాలిటీల ఘనవ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ సంస్థకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. వందల ఎకరాల డంప్ యార్డ్స్ వినియోగయోగ్యంగా మారాయి. ఇది వేరే వేరే పరిశ్రమల నుండి Co2 ఉద్గారాలను ఒడిసిపట్టి కొన్ని ప్రత్యేకమైన విధానాలతో సింథటిక్ సున్నపురాయిని తయరు చేస్తోంది. దానిని భవన నిర్మాణంలో వినియోగించవచ్చు. దీని వినియోగం వలన ఇసుక, కంకర వాడకాన్ని కొంత వరకు తగ్గించుకోగల అవకాశం ఉంది. Co2 ను సింథటిక్ సున్నపురాయిగా తయారు చేయడానికై ‘బయో మిమెటక్ మినరలైజేషన్’ సాంకేతిక ప్రక్రియను ఉపయోగిస్తుంది. అంటే భూమి పొరలలో సహజ సిద్ధంగా సున్నపురాయి ఏర్పడే విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అదే విధానాన్ని అనుకరించి (కొంచెం అటూ ఇటుగా) సున్నపురాయిని తయారు చేయడం. ఈ రకంగా బ్లూప్లానెట్ ఎన్విరాన్‌మెంట్ సొల్యూషన్స్ హరిత గృహవాయువుల ఉద్గారాలను – ఉదా: మిథేన్, Co2 వంటి సుమారు 7.5 మిలియన్ల టన్నులను – జీవ ఇంధనం, ఇతర వినియోగ సామాగ్రిగా మారుస్తోంది.
డెన్మార్క్ లోని కోపెన్‌హగన్ హెడ్‌క్యార్టర్స్‌గా సందర్భోచితంగా నిధులను అందచేసే ‘IFU’ గుర్తింపు కూడా ఈ సంస్థకు లభించింది. దానితో ఈ సంస్థ మరింత విస్తారంగా తన కార్యక్రమాలను చేపట్టే దిశగా ప్రణాళికను రచించుకుంటోంది. 2017లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రశాంత్ సింగ్, భరద్వాజ్ చివుకుల, మధుజీత్ చిమ్మి, మన్వజీత్ చిమ్మి వ్యవస్థాపక సారథులుగా తన విశిష్టమైన సేవలని నిరంతర కృషితో అంతర్ఝాతీయ సేవల దిశగానూ విస్తరించుకొంటూ పోతోంది.
