Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ కడుపు చల్లగా-71

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

నీరు

సమస్త జీవరాశి సజావుగా మనుగడ సాగించడానికి అనుగుణంగా అన్ని వనరులనూ ప్రకృతి ఒక క్రమపద్ధతిలో సమకూరుస్తూ వస్తోంది. అయితే మానవాళి ప్రకృతి ప్రసాదిస్తున్న వనరులను ఆదాయానికి, అవసరానికి మంచి ఖర్చు చేస్తోంది. చిక్కంతా ఇక్కడే వస్తోంది. వాతావరణంలో వస్తున్న పెను మార్పులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. కరువులు, వేడి వంటివి సమస్యలను, వాటి తీవ్రతను మరింత హెచ్చవేస్తున్నాయి.

సంవత్సరంలో కనీసం ఒక నెల నీటి కరువును అనుభవిస్తున్న వాళ్లు 4 మిలియన్లకు పైమాటే, మనిషి విచక్షణా రహితమైన వినియోగంతో నదులు, చెరువులు, చిత్తళ్లు, భూగర్భజాలాలు వేటికీ మినహాయింపు లేదు. కరగిపోతున్న గ్లేజియర్స్, ఎండిపోతున్న చెరువులూ వీటన్నిటకీ ప్రత్యక్షకారణం ‘భూతాపం పెరిగిపోవడమే’గా కనిపిస్తున్నా దానికి కారణభూతం మానవుల కార్యకలాపాలే. ప్రకృతి వ్యవస్థలన్నీ ఒక నియతితో పని చేస్తూ ఉంటాయి.

నీటి విషయానికి వస్తే ప్రకృతి మంచు, వానలు వంటి రూపాలలో నీటిని ఆదాయం/వనరుగా ప్రసాదిస్తోంది. ఈ వనరులను విచక్షణారహితంగా వాడేస్తున్నది మనిషి మాత్రమే. నదులు, చెరువులు, చిత్తళ్లు, భూగర్ఘజలాలు వేటికీ ఈ వినియోగం నుండి మినహాయింపు లేదు.

భూగర్భ జలాలను విపరీతంగా తోడివేసిన కారణంగా మెక్సికో ప్రతి ఏడాదికీ రమారమి 20 అంగుళాలు క్రుంగిపోతోంది. U.S. లో నైరుతి ప్రాంతంలో వర్షాభావం, కరువులను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ‘కొలరాడో’ నది నీటిని పంచుకోవడంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. దక్షిణాఫ్రికా, మిడిల్ ఈస్ట్ లోని కొన్ని ప్రాంతాలలో ఎక్కవ నీటి కొరత నెదుర్కుంటున్న పరిస్థితే. దక్షిణాసియాలోనూ కొన్ని ప్రాంతాలది అదే సమస్య. యునైటెడ్ నేషన్స్ నీటి వనరులపై జరపిన అధ్యయాలలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నీటి సంక్షోభం గురించిన వాస్తవ చిత్రం వెల్లడైంది.

వినియోగంలో మార్పులు:

వ్యవసాయ భూములతో సహా – వివిధ రకాల అటవీ భూములూ పారిశ్రామిక అవసరాల నిమిత్తం వినియోగ మార్పిడికి మళ్లించబడేటట్టే నీటి వినియోగం లోనూ మార్పులు వచ్చాయి. త్రాగు, సాగు నీటి అవసరాలతో బాటు పరిశ్రమలు, డేటా సెంటర్లు, వస్త్ర పరిశ్రమలు ఇలా మనిషి నిత్య జీవితంలో వినియోగిస్తున్న ప్రతి వస్తూవూ నీటి వినియోగం లేకుండా మనగలిగే పరిస్థతి లేదు.

పెరిగిన జనాభా రీత్యా ఆహార అవసరాల నిమిత్తం వ్యవసాయ రంగంలోనూ నీటి వాడకం విస్తారంగా పెరిగిపోయింది. వేసవికాలంలో నీటి వనరుల మట్టాలు తగ్గిపోవడం, వానాకాలంలో పుంజుకోవడం వంటి సహజ ప్రక్రియలో నీటి వాడకంలో కొంత కట్టడే ఉండేది. శక్తివంతమైన మోటర్ల సాయంతో నీటిని తోడటం సులభం అయిపోయాక వాడకంలో విచక్షణకు తావు లేకుండా పోయింది. త్రాగునీరు మార్కెట్టు వస్తువుగా కూడా మారాకా పరిణామాలు చెప్పనే అక్కరలేదు.

జనావాసాలన్నీ కాంక్రీట్ మయం అయిపోయాక వానలు కరుణించినా నేలలో వాన నీరు ఇంకే పరిస్థితి లేదు. ఎంత వానైనా, వాడకం నీరైనా డ్రైయినేజీ పాలు కావలసిందే. ఇంక నీటికి సంక్షోభం ఏర్పడటంలో ఆశ్చర్యం ఏముంది?

ఆరోగ్యవంతమైన భూములు నీటిని పట్టి ఉంచుతాయి. తద్వారా కరువు కాటకాల నుండి, తుఫానుల నుండి వాటి ప్రభావాల నుండీ మనను చాల వరకు కాపాడతాయి. భూమిని సహజ రీతిలో దాని పని దానిని చేయనిస్తే నీటిని నిలబెడుతుంది. వైపరీత్యాలను పరిమితం చేస్తుంది. ఆహార పంటలకూ దోహదం చేస్తుంది. నేలకూ విశ్రాంతి కావాలి. నిరంతర వినియోగం నేలసారాన్ని దాని ప్రాకృతిక లక్షణాలను నాశనం చేస్తుంది. నేలకు కొంత కాలం విశ్రాంతి లభిస్తే తనను తాను బాగు చేసుకోగలదు. మట్టిలో ఆరోగ్యం, లోతైన వేళ్లతో గడ్డి పెరగటం, కరువుకు, వానకు తట్టుకోగల సామర్ద్యం వంటివి తిరిగి పెంపొందుతాయి.

ప్రకృతి వ్యవస్థలు ఎంత బలహీనమైపోయినప్పటికీ మళ్లీ గాడిన పడే అవకాశం వాటికి లభిస్తే తిరిగి యథాస్థితికి రాగల వన్న నిజం ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఋజువైంది. మనం చేయవలసిందల్లా విధ్వంసాన్ని ఆపి, ఊపిరి తీసుకొనే అవకాశాన్ని ఆ వ్యవస్థలకు కల్పించడమే.

Exit mobile version