Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ కడుపు చల్లగా-72

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

జీవ వైవిద్యానికి చోదక శక్తి ‘పరస్పర సహకారం’

ప్రపంచంలోనే అతి పెద్దది, 8.1 చదరపు కిలోమీటర్లుకు దరిదాపుగా ఉండి భూమి పై 20% (దాదాపు) అటవీ ప్రాంతాన్ని కవర్ చేస్తూ బిలియన్ల టన్నుల Co2 ను గ్రహిస్తూ వస్తున్న రష్యాలోని ‘టైగా’ అటవీ ప్రాంతం అత్యధికంగా కార్బన్ డయాక్సై‌డ్‌ను క్రమబద్దీకరిస్తున్న అడవిగా ప్రసిద్ధి.

జీవజాతుల మనుగడలో ఉండే ప్రధాన సూత్రం, పరస్పర సహకారం. ఇదే జీవ వైవిద్యానికి చోదక శక్తి. జీవపరిణామ క్రమంలో జీవరాశులన్నీ విడదీయలేనంతగా, విడదీయ రాదన్నంతగా మమేకమైపోయాయి.

మొక్కల, జంతువుల భౌతిక నిర్మాణానికి కారణమైన క్లోరోఫ్లాస్ట్స్, మైటోఖాండ్రియా వివిధ రకాల సూక్ష్మజీవులు ఒక దశలో విడదీయలేనంత పరస్పరాధారితమై మనుగడ సాగించే స్థితికి పరిణామం చెందిపోయాయి. ఆ విధంగా ప్రకృతిలో జీవజాతులన్నీ ‘పరస్పర సహకారం’ అన్న సూత్రం ఆధారంగా జీవిస్తున్నాయి తప్ప పోటీ పడి కాదు.

మారిషస్‌లో ఒక ద్వీపానికి జయింట్ తాబేళ్లను తీసుకొని వచ్చిన కొన్ని సంవత్సరాలకు అరుదైన జాతికి చెందిన చెట్టు ఒకటి దానంతట అదే (మానుషులు నాటకుండానే) మొలకెత్తి వృద్ధి చెందడం ప్రారంభించింది.

ఫలించిన పునరాద్ధరణ ప్రణాళికల కారణంగా మెక్సికో, చిలీ, ఫ్లోరియానా, మార్షల్, గలపోగోస్ వంటి ద్వీపాలలో తిరిగి వస్తున్న సీబర్డ్స్ కారణంగా మృత మృత్తిక సారవంతమౌతోంది. వాటి విసర్జితాలు విత్తనాలు లేకుండానే మొక్కలు, తిరిగి మొలకెత్తేలా చేస్తున్నాయి. పగడపు దిబ్బలనూ పునరుద్ధరిస్తున్నాయి. పక్షులు మనుషుల కంటె వేగంగా త్వరితగతిని బంజర్లను అందమైన సుందర దృశ్యాలుగా మార్చివేస్తున్నాయి.

కోస్టారికా, బ్రెజలియన్ అట్లాంటిక్ అడవులలో పనికి రాకుండా పోయిన కారణంగా వదలి వేయబడిన పొలాలు ఇప్పుడు హరితవనాలుగా రూపొంది పక్షుల కిలకిలారావాలతో సందడి చేస్తున్నాయి.

1980లలో అడవుల నరికివేత ఆపివేయబడిన చోట్ల 30 సంవత్సరాలలో మిలియన్ల హెక్టార్లలో చెట్లు తిరిగి వృద్ధి చెందాయి. ఉపగ్రహ చిత్రాలలో గతంలో బ్రౌన్‌గా ఉన్నవి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి కనిపించాయి. యూరప్‌లో శతాబ్దాల క్రిందట తుడిచి పెట్టివేయబడిన ఉడ్‌లేండ్స్ నిశ్శబ్దంగా తిరిగి పెరుగుతున్నాయి. రైతులు సాగు చేయని ప్రదేశాలలోనూ ప్రకృతి తన నియామానుసారం ఒక క్రమ పద్ధతిలో పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తోంది.

ఎండ, నేలసారం వంటి అంశాలతో పని లేని జీవుల మొదటిగా చేరతాయి. అవి గాలిలో తీసుకొని వచ్చిన విత్తులతో, క్రమంగా చిన్నపాటి పచ్చదనం ఏర్పడుతోంది. చెట్లు చచ్చిపోయినా పూర్తిగా నశించని/ధృఢమైన వేళ్ళు మిగిలి ఉన్న చోట అవి తిరిగి చిగురించి మెల్లిగా పెరిగి చెట్ల నీడ ఏర్పడుతోంది. ఆ నీడ ఆ ప్రాతాన్ని చల్లబరచి ఫంగై వంటి మరిన్ని జీవజాతులకు ఆహ్వానం పలుకుతోంది. అలా మరిన్ని జీవరాశులు పెంపొందడమో, తరలి రావడమో జరుగుతుంది. క్రమేపీ చిద్రమైపోయిన అటవీ వ్యవస్థ పునరుజ్జీవితం అవుతుంది. ఇక్కడ విధ్వంసంలోనే మనిషి ప్రమేయం ఉంది తప్ప పునరుద్ధరణలో లేదు. ఏ కోణంలో తీరచి చూసిన మనిషే ప్రకృతిపై ఆధారపడి ఉన్నాడు తప్ప ప్రకృతి మనిషిపై ఆధారపడి లేదు. ఇది కాదనలేని సత్యం.

Exit mobile version