[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
కుడి ఎడమైతే:
ప్రపంచవ్యాప్తంగా పాడైపోయిన, శిధిలావస్థలో నున్న ఆనకట్టలను కూల్చివేసే ప్రక్రియ జోరుగా సాగతోంది. కారణాలు అనేకం.
ఒకప్పుడు – ఆనకట్టల నిర్మాణం జోరుగా సాగి వ్యవసాయానికి నీటి లభ్యత బాగా పెరగడంతో సాగు భూములు విస్తారంగా పెరిగాయి. అనేక మందికి ఉపాధి దొరకడంతో బాటుగా తాగునీటి అవసరాలూ తీరాయి. ఆయకట్టు విస్తీర్ణం పెరగడంతో ఆహార ఉత్పత్తుల సంఖ్యా పెరిగింది. ఆహార లభ్యత పెరిగింది. హరిత విప్లవం ఫలితంగా అనేక దేశాలు ఆహార కొరతను అధిగమించి ఆహార ధాన్యాల సమృద్ధిని సాధించగలిగాయి. తిండిగింజల కోసం దిగుమతులకై వేరే దేశాలపై ఆధారపడవలసిన దుస్థితి తొలగిపోయింది. ఎరువులు, పురుగు మందులు జమపడ్డాక దిగుబడులూ పెరిగాయి. అయితే ఇదంతా ‘అభివృద్ధి’ నాణేనికి ఒక పార్శ్వం మాత్రమే.
ఈ ‘అభివృద్ధి’ పరిణామ క్రమంలో సంభవించిన దుష్పరిణామాలకూ లెక్కలేదు. పంటల నాణ్యత తగ్గిపోవడం మొదలుకొని భూసారం క్షీణించడం వరకు అనేక దీర్ఘకాలికమైన దుష్ప్రభావాలనూ కొట్టిపారవేయగలిగిన పరిస్థితి లేదు.
పెద్ద పద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టుల నుండి ఒక మాదిరి ఆనకట్టల వరకు తిలా పాపం తలా పిడికెడుగా పర్యావరణానికి హాని జరిగింది. ఆనకట్టల కారణంగా అవక్షేపాలు క్రమంగా పేరుకొనిపోయి ఒక స్థాయిని మించిపోయిన కారణంగా జలాధారిత జీవ జాతుల వలస/మనుగడ వంటి కార్యకలాపాలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడింది. జలావరణంలోని బయోడైవర్శిటీ/జీవ వైవిధ్యానికీ అవరోధం ఏర్పడింది. పరిసర ప్రాంతాల గాలి, నీటి నాణ్యతలోనూ తేడా రావడం జరిగింది.
అదీగాక పెద్ద పెద్ద రిజర్వాయర్స్ మిథేన్ ఉద్గారాలకు కూడా దోహదం చేస్తాయి. సమర్థవంతంగా పని చేసినప్పుడే కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పుడు వాటి పని తీరు దెబ్బతిని శిధిలావస్థకు చేరుకున్నపుడు సంఘటనాత్మకంగా జరిగే నష్టాన్ని గురించి చెప్పే దేముందీ. అయితే చెదురు మదురుగా కొన్ని ఆనకట్టలు మినహాయింపు కోవలోనికీ వస్తాయి.
ఉదా: తమిళనాడులోని కల్లనైయి ఆనకట్ట చాలా పురాతనమైనది. కావేరి నదిపై 329 మీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ ఆనకట్ట 2000 సంవత్సరాల నాటిది. ఇది ఈ నాటికీ సమర్థవంతంగా పని చేస్తోంది.
జోర్దాన్ – ఆకస్మికంగా వరదలు ముంచెత్తినపుడు ఆ వరద నీటిని ఒడిసిపట్టి ఉంచటానికి 3000 ఏళ్లనాడు రాతితో ధృడంగా నిర్మించబడిన ఆనకట్ట ప్రపంచంలోనే మొట్టమొదటిగా భావించబడుతోంది. ఇది మెసపటోమియన్స్ కాలం నాటిదని అందనా.
రష్యాలోని అతి పెద్ద డామ్ బ్రాట్స్క్ 169 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని పట్టి ఉంచగలదు.
అమెరికాలోని ‘కోవ్‌లీ’ డామ్; భారదేశంలోని ‘సర్దార్ సరోవర్’ ప్రపంచంలోని ఎన్నదగిన ప్రాజెక్టుల కోవలోనికే వస్తాయి.
చైనాలోని ‘యాంగ్జే’ బేసిన్ లోనూ వందలాది డామ్స్ ఉన్నాయి.
యూరోపియన్ యూనియన్ నదులు స్వేచ్ఛగా ప్రవహించగల దూరాన్ని 25000 కిలోమీటర్ల వరకైనా పునరుద్ధరించగలగాలని నిర్దేశించింది. అక్కడ 600కు పైగా ఆనకట్టలు తెగగొట్టబడ్డాయి. నదీ ప్రవాహాలు పునరుద్ధరింపబడ్డాయి.
అమెరికాలో 4 అతి పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుల డామ్‌లతో సహా అనేక ఆనకట్టలను నిర్మూలించడం జరిగింది. అక్కడ ‘లోయర్ క్లామత్’ ప్రాజెక్టు పూర్తయ్యింది. సాల్మన్ చేపల మనుగడకు ముప్పు తప్పింది.
చైనాలోని యాంగ్జే నదీ లోయలోనూ పాతబడిపోయిన వందలాది ఆనకట్టలను తొలగించి జలావరణ జీవజాతు మనుగడకు దారిని సుగమము చేయటమే కాక నీరు స్వేచ్ఛగా ప్రవహించే వాతావరణాన్ని కల్పించారు. అక్కడ ఇటీవలి కాలంలోనే 100 దాకా ఆనకట్టలు తొలగించబడ్డాయి. ఫలితంగా ఒక రకంగా పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ జరిగంది.
మొత్తం మీద ఈ ఆనకట్టల తొగింపు ప్రక్రియలో జలావరణ జీవవ్యవస్థకు కొంత వరకు స్వస్థత చేకూరింది. నదీ ప్రవాహాలకు స్వేచ్ఛ లభించింది. నీటి కాలుష్యం గణనీంగా తగ్గింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన జరుగుతున్న ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తే ఒక సందేహం కలుగుతుంది. ఇది పురోగమనంలో – తిరోగమనమా? తిరోగమనంలో పురోగమనమా!
ప్రతి అభివృద్ధి నమూనాకూ ఉత్థాన పతనాలు ఉంటాయి. ‘కాలదోషం’ అన్న పరమ సత్యం వాటికీ వర్తిస్తుంది.
