[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
పర్యావరణ కాలుష్యం – రావాల్సిన మార్పు:
ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలను సైతం దాటి పోతున్నాయి. వడగాల్పులు/వేడిగాలులు, సముద్ర మట్టాలు షెరిగిపోవడం సాధారణం అయిపోయింది. జీవజాతుల సహజ ఆవాసాలూ తరిగిపోతున్నాయి.
పారిశ్రామిక వ్యర్థాలు, నానో ప్లాస్టిక్, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో త్రాగే నీరు, పీల్చే గాలి నాణ్యత లేకుండా పోయింది.
పర్యావరణం కాలుష్యం – దాని వలన సంభవించే రసాయనిక చర్యలూ, పరిణామాలు, ఆరోగ్య నిర్వహణ వంటి కీలకమైన/మౌలికమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని జరిపిన అధ్యయనాల ఫలితాల ఆధారంగా ‘ఎన్విరాన్మెంటల్ రిసెర్చ్ పబ్లికేషన్స్’ వెలువరించిన పత్రికలో ఈ విషయాలు వెలుగు చూశాయి. డా॥ ఉమేష్ చంద్ర కులశ్రేష్ఠ ఈ పత్రిక ఎడిటర్.
ప్రస్తుతం అమలులో ఉన్న అభివృద్ధి విధానాలు దారుణమైన పర్యావరణ కాలుష్యానికి, వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాయి. ప్రకృతి, తరిగిపోతున్న జీవ వైవిధ్యం, భూసారం క్షీణించడం, ఎడారీకరణ, విపరీతంగా కొనసాగుతున్న కాలుష్యం ఇవన్నీ ప్రపంచ ప్రజలకు, ఆర్థికానికి, జీవ వైవిధ్యానికి తీవ్రమైన నష్టాన్ని కలుగచేయడమే కాక పెను ప్రమాదానికి కారణం అవుతున్నాయి.
మెటీరియల్స్ వ్యర్థాల నిర్వహణ, ఎనర్జీ, ఆహారం, పర్యావరణం వంటి కీలకమైన అంశాలకు సంబంధించి ప్రజలలో, ప్రభుత్వ విధానాలలో మార్పు రావాలి. ప్రజలలో సైతం ప్రవర్తనా సంబంధమైన, సంస్కృతికి సంబంధించిన ఆలోచనా విధానాలలో మార్పు రావాలి. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న మూస ధోరణలు, నిష్క్రియాపరత్వం ఆర్థికానికి చేటు చేస్తున్నాయి.
పెట్టుబడులకు సంబంధించి విధానపరమైన మార్పులతో దీర్ఘకాలికమైన ప్రయోజనాలు పొందవచ్చు. వివిధ స్థానిక తెగల, సమూహాల ప్రజల వద్ద అపారంగా ఉన్న పారంపరిక విజ్ఞానాన్ని గౌరవించి సాధ్యమైనంత వరకు వినియోగించుకోగలగాలి. మేక్రో ఎకనామిక్స్ లాభాలు దీర్ఘకాలికంగా ఉండాలి. ఇంచుమించుగా 2050 నాటికి వీటి సత్ఫలితాలు కనిపించడం మొదలుపెట్టి 2070 నాటికి 20 ట్రిలియన్ యు.ఎస్. డాలర్లకు చేరుకోగలదని అంచనా.
82 దేశాల నుండి 287 మంది వివిధ రంగాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు, నిష్ణాతులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రపంచ పర్యావరణానికి సంబంధించి ఒక సమగ్రమైన, శాస్త్రీయమైన అంచనా వేయడం జరిగింది. దాని ప్రకారం ఒక రిపోర్టును వెలువరించడం జరిగింది.
దాని ప్రకారం ప్రకృతి, నేల, వాతావరణం వంటి అంశాలకు హాని చేయని పెట్టుబడులు; ఆరోగ్యకరమైన, స్థిరమైన పెట్టుబడులు సాలీనా ప్రపంచ ఆర్థిక G.D.P. కి ట్రిలియన్ డాలర్ల లాభాలను చేకూర్చి పెట్టగలవు. అంతేకాక, ఈ లాభాలు క్రమేపి పెరుగుతూ ఉంటాయి కూడా. మిలియన్ల సంఖ్యలో ప్రజల ప్రాణాలను నిలబెట్టగలవు. వందల మిలియన్ల ప్రజలను రాబోయే శతాబ్దాలలో పేదరికం నుండి, ఆకలి నుండి బయట పడవేయగలవు.
యు. ఎన్. ఎన్విరాన్మెంట్ ప్రోగామ్ వెలువరించిన ఈ రిపోర్టు ప్రపంచ పర్యావరణ సంక్షోభాన్ని గుర్తించి కార్యాచరణ మొదలు పెట్టాలని; కార్యాచరణలో విధానకర్తల నుండి సామాన్య ప్రజానీకం వరకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరింది.
