[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
ఏ ఒక్కరిదో కాదు – అందరి బాధ్యత:
ప్రభుత్వాలు –
ఫిలిఫైన్స్ ప్రపంచంలోనే మొట్టమొదటగా ‘కోరల్ లార్వా’ను క్రయోప్రిజర్వేషన్ విధానంలో సంరక్షించడం మొదలుపెట్టింది. వాతావరణ కాలుష్యం, సముద్ర కాలుష్యం వంటి వాటి కారణంగా పగడపుదిబ్బలు అంతరించిపోతున్నాయి. తత్కారణంగా పగడపు దిబ్బలను ఆశించి ఉండే అనేక జీవరాశుల మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. అపారమైన జీవ వైవిధ్యానికి నెలవులైన పగడపుదిబ్బలను కాపాడుకోవడం కోసం ఫిలిప్షన్స్ ఈ చర్యలు తీసుకుంది. ఈ ‘కోరల్ లార్వా క్రయో బ్యాంక్’ ప్రపంచం లోనే మొట్టమొదటిది. యూనివర్శిటీ ఆఫ్ ది మెరైన్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ దీనిని పర్యవేక్షిస్తోంది. ‘కోరల్ ట్రయాంగిల్’ పరిధిలో ఇది పని చేస్తుంది.
పగడపు లార్వాను 196°C వద్ద లిక్విడ్ నైట్రోజన్‌లో భద్రపరచడమే ‘క్రయోప్రిజర్వేషన్’. ఈ విధానంలో రార్వాను భద్రపరచడం వలన భవిష్యతలో దెబ్బతిన్న పగడపుదిబ్బలను ఈ లార్వా ద్వారా తిరిగి పెంపొందించవచ్చు.
సంస్థలు –
శాన్ బెర్నార్డినో ‘మౌంటెన్ లాండ్ ట్రస్ట్’ – లాభార్జన ఆపేక్ష లేని ఒక స్వచ్ఛంద సంస్థ. పర్వత ప్రాంతాలను, వణ్యప్రాణుల ఆవాసాలు, నీటి వనరులు, చారిత్రక భూములకు రక్షిస్తూ ఉండటం గురించి ఏర్పాటైన సంస్థ. బాల్డ్ ఈగిల్, మరికొన్ని అరుదైన వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక దశాబ్దాలుగా కృషి జరుగుతోంది. అక్కడి ‘మూన్ కాంప్’ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాజెక్టుల బారినుండి కాపాడి అక్కడి ప్రకృతి వ్యవస్థలను జీవవైవిధ్యాన్ని కాపాడటం కోసం ఆ ప్రాంతాన్ని రిజర్వ్ చేయటానికి 10 మిలియన్ డాలర్ల నిధిని కూడా సేకరించడం జరిగింది. ఇది ట్రస్ట్ సాధించిన అపూర్వమైన విజయం.
వ్యక్తిస్థాయిలో సైతం –
ఫ్లోరిడాలో నివసించే ఒక జంట స్టీవెన్‌సన్, తనకా స్టీవెన్‌సన్ రాష్ట్ర పార్క్ బయోలజిస్ట్. తనకా చక్కటి నేచర్ ఫోటోగ్రాఫర్. వీరు తమ ఇంటిని అనుసరించి ఉన్న 45 ఎకరాల చిత్తడి నేలను ఖరీదు చేశారు. అత్యంత ప్రాముఖ్యం కలిగిన రాజధాని నగరం అయిన ‘టల్లాహస్సీ’ లో నివసిస్తున్నప్పటికీ ఈ జంట తాము ఖరీదు చేసిన ఆ 45 ఎకరాలను అభివృద్ధి చేయటానికి ఇచ్చి లబ్ధి పొందటానికి బదులుగా జాగ్రతగా కాపాడటం మొదలుపెట్టారు. దశాబ్దాల వారి కృషి ఫలితంగా వారి ఆ వ్యక్తిగత ఆస్తి రకరకాల పక్షిజాతులకు, వన్యప్రాణులకు ఆశ్రయం అయ్యింది. 2007లో వారు కొన్న ఆ 45 ఎకరాల చిత్తడినేల, దశాబ్దాల వారి కృషి ఫలితంగా నగర ప్రాంతంలోని ఒక చిత్తడినేల కాపాడబడడమే కాక ప్రకృతి వ్యవస్థగా రూపుదిద్దుకుంది. బాతులు, ఎలిగేటర్స్, అట్టర్స్, హెరాన్స్, ఉడ్ స్టార్క్స్ వంటి వివిధ జాతుల జీవజాలంతో ఆ ప్రాంతం అలరారుతోంది. తనకాకు ఆ వ్యవస్థ కేవలం ఒక ప్రకృతి వ్యవస్థ కాదు. వన్యపాణుల జీవితాన్ని డాక్యుమెంట్ చేయడానికి లభించిన ఒక అద్భుతమైన, అపురూపమైన తావు. ఆమె తన ఇంటి వెనుక బాగాన్ని అందుకు సంబంధించిన ఒక ప్రయోగశాలగా మార్చేసుకుంది. వారి కృషి మరికొందరు 45 నుండి 50 మంది స్థానిక స్వంతదారులకూ స్ఫూర్తిదాయకం కావకం ఇక్కడ మరొక గొప్ప విశేషం.
1984లో U.S. ‘ఉడ్ స్టార్క్’ ను అంతరించిపోతున్న జీవుల జాబితా లోనికి చేర్చి రక్షించవలసిన జాతుల జాబితాలో చేర్చడం జరిగింది. అటువంటిది ఇపుడు వాటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. పదివేల నుండి 14,000 దాకా జతల స్టార్క్స్ ఆ సమీపంలో 100 సైట్లలో లెక్కకు రాగా వాటిని జాబితా నుండి తొలగిందే దశకు వాటి సంఖ్య చేరుకున్నట్లుగా ధృవీకరించుకోవడం జరిగింది . యు.ఎస్. ‘ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్’ రిపోర్డులో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి.
భారతదేశంలో –
నార్త్ ఈస్ట్ ప్రాంతంలో మూడు క్రొత్త కాస్కేడ్ కప్ప జాతులు కనుగొనబడ్డాయి. పుదుచ్చేరిలో మొట్టమొదటసారిగా ఒక సర్వేలో 118 స్పీషిస్ ‘మోత్’ లు రికార్డ్ చేయబడ్డాయి.
‘ఫెల్షిలేరియన్ బ్రైట్’ అనే పుష్పం వైద్యచికిత్సలో వినియోగం నిమిత్తం 2000 సంవత్సరాల క్రిందటి నుండి సాగు చేయబడుతున్నది. ఇది 5 సంవత్సరాలకి ఒకసారి పుష్పిస్తుంది. ఈ పువ్వుల పొడి 1 పౌండ్ ఖరీదు 218 డాలర్లు. 3½ వేల పుష్పాలు లేనిదే 1 పౌండ్ పొడి తయారు కాదు. ఇది పశువుల మేత నుండి మానవుల నుండి తనను తాను రక్షించుకోవడం కోసం ఆకర్షణీయమైన రంగు నుండి బ్రౌన్ కలర్ లోనికి మారిపోతున్నట్లు అధ్యయనాలు చెప్పన్నాయి.
క్యాట్ ఫిష్ లోని కొన్ని జాతులు పరిసరాలకు, వాతావరణానికి అనుగుణంగా తమ శైలిని మార్చుకుంటున్నాయనీ తెలుస్తోంది. ఒక ప్రముఖ పర్యావరణవేత్త అన్నట్లు మనం దాడి చేస్తే ఏం చేసుకోవాలో ప్రకృతికి గుర్తుంటుంది. ప్రకృతి వ్యవస్థల పునరుద్ధరణకు మన వద్దనున్న శక్తిమంతమైన ఆయుధం – వాటి దారిన వాటిని కొనసాగనీయడమే.
