[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
అణు వ్యర్థాలు..:
అమెరికా:
1946-70 ల నడుమ అమెరికా రేడియోధార్మిక వ్యర్థాలతో కూడిన/నింపబడిన రమారమి 48000 కంటైనర్లని శాన్ ఫ్రాన్సిస్కోకు పశ్చిమంగా ఉన్న సముద్రపు తీరానికి దిగువన కొంత లోతున విడిచిపెట్టింది.
అణు పరీక్షల విషయానికి వస్తే 1946 – 58 ల నడుమ ఒక దశాబ్దానికి పైగా 60కి పైగా అణు పరీక్షలను మార్షల్ దీవులలో నిర్వహించింది. ఆ పరీక్షల అనంతరం మిగిలిన వ్యర్థాలను ‘ప్లుటోనియం’ వంటి వాటిని మాత్రం కొంచెం జాగ్రత్తగా విస్ఫోటనం జరిగిన ఒక పెద్ద గోతిలో పోస్ పైన దాదాపు 1/2 మీటర్ల వరకు కాంక్రీట్ పోసింది. అప్పటికి అది ముందు జాగ్రత్త చర్యే. అయితే ఆ వ్యర్థాలను కుమ్మరించిన గోతిలో అడుగున మాత్రం ఎటువంటి రక్షణ ఏర్పాట్లూ చేయలేదు. ఆ కారణంగా – మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ కాంక్రీట్ కవచానికి బీటలు వస్తున్నాయి. సముద్రపు నీరు ఈ రక్షణ వ్యవస్థ ఉన్న గోతిలోనికి చేరి రేడియోధార్మిక వ్యర్థాలు ఫసిఫిక్ మహాసముద్రంలోనికి చేరుతున్నాయని ఐక్యరాజ్యసమితితో సహా పలువురు ఆందోళన వెలిబుచ్చడంతో తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తింది. 1970ల నుండి అమెరికా వ్యర్థాలను సముద్రంలో గ్రుమ్మరించడాన్ని ఆపేసింది.
యూరప్:
1949-82 ల నడుమ 2,00000 బారెల్స్ లో లెవెల్ రేడియోఏక్టివ్ వేస్ట్ [Low-level radioactive waste (LLRW)] 1,50000 టన్నులు సముద్రంలో 3000-5000 మీటర్ల లోతున డంప్ చేయబడ్డాయి. ఆ కంటైనర్స్ అన్నీ శిథిలమైపోయి ఆ వ్యర్థమంతా సముద్ర మట్టానికి చేరింది. చాలా తక్కువ స్థాయి అడినో న్యూక్లైడ్స్ అన్నది నిజమే కాని దీర్ఘకాలం నిలచిపోయేవి. 1980ల నాటికే యూరప్ కూడా డంపింగ్స్ను నిలిపివేసింది. కానీ అప్పటిదాకా జరిగిన డంపింగ్ తాలూకు నష్టం?
1981 నాటి రివ్యూలో 90% రేడియో ధార్మికత కనీస స్థాయిలకు పడిపోయి ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే పరిసరాల చేపలలో రేడియోఏక్టివ్ న్యూక్లిసైడ్స్ ఉన్నట్లు కనుగొనబడిన విషయం బయటకు రాలేదు.
ఫసిఫిక్‌లో అమెరికన్ నేవీ అటామిక్ ఎనర్జీ కమిషన్ తరపున చేపట్టిన రేడియో కార్మిక పదార్థాల డిస్పోజల్ కార్యక్రమం సైతం విపరిణామాలకు దారితీసింది. చాలా కంటైనర్స్ వాటిని వదిలిపెట్టిన చోట కనపడలేదు. అవన్నీ చెల్లాచెదురై దాదాపు 1400 చ.కిమీ. విస్తీర్ణం వరకు సముద్రతలంలో వ్యాపించిపోయాయి. వీటిలో చాలా భాగం ‘ఫారలాన్ మెరైన్ శాంక్చురీ’ పరిసర ప్రాంతాల లోనూ కనిపించాయి. ఇవి సముద్రంలో 100 మీటర్ల నుండి 200 మీటర్ల లోతు వరకు జారిపోయాయి. 1981లో, 1990లలో జియోలాజికల్ సర్వే, ఫారలాన్ మెరైన్ శాంక్చురీ సంయుక్తంగా జరిపిన అధ్యయనాలలో ‘సైడ్ స్కాన్ సోనార్’ సాంకేతికత – బారెల్ ఆకారంలో ఉన్న టార్గెట్స్ కి.మీ. లోతు వరకు జారుతున్నాయని తేల్చిచెప్పింది.
1994 లో నేవీకి చెందిన మానవరహిత, ఆధునిక, డీప్ సబ్‌మెర్జెన్స్ సామర్థ్యం గల జలాంతర్గామి టార్గెట్లని నేరుగా కనుగొనడం జరిగింది. అయితే వాటిని కదిలిస్తే రేడియో ధార్మికత వ్యాప్తి ముప్పు పెరిగే అవకాశం ఉండగలగన్న భయంతో ఎక్కడ ఉన్న వాటిని అక్కడే ఉంచి నిరంతరం పర్యవేక్షణ కొనసాగించడానికి నిర్ణయించారు.
శాంక్చురీ రికార్డ్స్ ప్రకారం పాదరసం, బెరీల్లియమ్ వంటి కొన్ని భారలోహాలు నీళ్లలోకి చేరిపోయాయి. చాలా వరకు నష్టం జరిగిపోయింది.
అంతర్జాతీయ చట్టాలు 1993లో రేడియో ధార్మిక వ్యర్థాలను సముద్రంలో పారబోయడాన్ని నిషేధించాయి. అప్పుటి ‘లండన్ కన్వెన్షన్’ కు జరిగిన సవరణ రేడియో ధార్మిక వ్యర్థాలను సముద్రంలో పారబోయరాదని, పారిశ్రామిక వ్యర్థాలను సముద్రంలోనికి వదలరాదనీ, మండించరాదనీ నిషేధం విధించింది. 12 నవంబర్ 1993న ఆమోదం పొందిన ఆ ఒప్పందం 1994 ఫిబ్రవరి 24 నుండీ అమలు లోనికి వచ్చింది. ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగానే ఉన్నప్పటికీ విధ్వంసాన్ని నిలువరించగల చర్య కనుక, మంచి పరిణామం గానే భావించాలి.
కొసమెరుపు:
కొన్ని సంవత్సరాల క్రిందట న్యూక్లియర్ ఇంజనీర్ పాట్రిక్ ఛార్డన్, మెరైన్ జియోలజిస్ట్, జేవియర్ ఎస్కార్టిన్ (ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్) – వీళ్ళిద్దరికీ న్యూక్లియర్ వ్యర్థాల డంప్స్ అన్నీ ఏమయ్యాయి? పర్యవసానాలు ఏమిటి అన్న కుతూహలం కలిగింది.
ఫలితంగా ‘NODSSUM’ (న్యూక్లియర్ ఓషన్ డంప్ సైట్స్ సర్వే మానిటరింగ్) ఆవిర్భవించింది. ఇది ఒక ఇంటర్-డిసిప్లినరీ ప్రాజెక్టు. ఫిజిక్స్, జియోలజీ, ఓషనోగ్రఫీ, బయోలజీ, మెరైన్ బయోలజీ అండ్ కెమిస్ట్రీ వంటి అంశాలలో నిపుణులు ఈ ప్రాజెక్టులో ఉన్నారు.
బారెల్స్ పరిసరాల పర్యావరణంపై చూపుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేయడం గురించి 2025లో ‘Ulyx’ ఒక స్వతంత్ర మానవరహిత జలాంతర్గామిని ప్రయోగించడం జరిగింది. రేడియో ధార్మిక వ్యర్థాలతో నిండి ఉన్న ఆ బారెల్స్‌ను వాటి ఉనికిని గుర్తించి బారెల్స్‌ను ఫోటోలు తీసి, అక్కడి నీటిని సేకరించి, పరిసరాలలోని అవశేషాలను సేకరించి, సమీపంలోని జలజీవుల నమూనాలకు ఒక నెల లోపునే 3,355 బారెల్స్ ఉన్న ప్రాంతాలను కనుగొని మేపింగ్ చేయడం జరిగింది.
విచిత్రంగా ఆ బారెల్స్ అన్నీ కంటైనర్స్ గానే కాక, స్పాంజెస్, సీ కుకుంబర్స్, చేపలు, పీతలు, నత్తలు – వంటి వాటితో నిండిపోయి ఉన్న సముద్రపు గర్భపు ప్రకృతి వ్యవస్థగా రూపాంతరం చెందిపోయాయి.
మానవాళి గుండెల మీది కుంపటిలా భావించబడుతున్న రేడియో ధార్మిక వ్యర్థాలతో కూడా సహజీవనం చేయగలిగేలా వివిధ జీవరాశులతో కూడిన ప్రకృతి వ్యవస్థలు ఏర్పడుతున్నాయంటే ‘గరళకంఠుడిగా మనం కొలిచే పరమశివుని వంటిదే ప్రకృతిమాత’ అని అనిపించటం లేదూ!

