[శ్రీమతి దేవి తనయ గారు రచించిన ‘అమ్మ మనస్సు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఆ రోజు మే 10.
అంతర్జాతీయ మాతృ దినోత్సవం.
నాలుగైదు రోజుల నుండి మాతృదినోత్సవ శుభాకాంక్షలతో సోషల్ మీడియా మోత మోగిపోతుంది.
ఫోన్ పట్టుకుని సోఫాలో కూర్చుంది ఊర్వశి.
భర్త రత్నాకర్ ఉదయమే ఆఫీసుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం వరకు రాడు. అతని మటుకే వంకాయ కూర, పాలకూర పప్పు చేసింది. ఎందుకంటే మధ్యాహ్నం తన కోసం ప్రత్యేకంగా స్విగ్గి నుండి ఏదైనా పార్సిల్ వస్తుందేమోనని ఊహిస్తుంది. తన ఇష్టాయిష్టాలు వాళ్లిద్దరికి బాగా తెలుసని మురిసిపోయింది.
అసలు ముందురోజు నుండే ఫోన్లో ఒక్క మెసేజ్ కూడా వదలకుండా చూస్తుంది.
కుప్పలా పోసిన వస్తువుల మధ్య మనకి కావలసిన వస్తువు తప్పకుండా కనిపిస్తుంది. కానీ అదేంటో మెసేజ్ల మధ్య ఎన్నిసార్లు వెతికినా వాళ్ళది కనిపిoచడం లేదు.
ఏదో సమూహంలో ఎక్కువ లైక్స్, కామెంట్స్ వచ్చిన వీడియో తెరిచింది. తల్లిగా మారబోతున్నానని తెలిసిన దగ్గర నుండి, పిల్లలని పెంచడం వరకు అమ్మలు పడే కష్టాలు ఉన్నాయి.
అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. కళ్ళు తుడుచుకుని పూర్తిగా చూసింది. వీడియో నచ్చి మళ్ళీ మళ్ళీ చూసింది.
అవును, నిజమే దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు.
అప్రయత్నంగా పొట్టను తడుముకుంది. కొడుకు ప్రణవ్ కడుపులో పడ్డప్పటి నుండి బయటపడేవరకు ఏది తిన్నా కడుపులో ఉండేది కాదు. వేవిళ్ళతో సతమతమయ్యేది. ఎన్నో ఇబ్బందులు భరించి, ఎముకలు విరిగిపోయే నొప్పితో ప్రసవించింది. ఆపై కూతురు సుశ్రిత కాన్పులో ఐతే మరణం అంచులవరకు వెళ్ళి వచ్చింది.
ఇద్దరిని అల్లారుముద్దుగా పెంచారు. ఇద్దరికీ హైదరాబాద్లో మంచి ఉద్యోగాలు వచ్చాయి.
ఈ సంవత్సరం ఎందుకో పిల్లలిద్దరు కనీసం మెసేజ్ కూడా చెయ్యలేదు. ఒక్కరోజు వాళ్ళతో మాట్లాడకపోతే ఉండలేదని వాళ్ళకి తెలుసు.
భారంగా నిట్టూర్చింది.
కాఫీ కలుపుకుందామని వంటగదిలోకి వెళ్ళింది. చిక్కటి కాఫీ కలుపుకుని వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చుంది.
ఇంతలో ఫోన్ మోగింది. తీసి చూస్తే స్నేహితురాలు రాగిణి.
“హ్యాపీ మదర్స్ డే, ఊర్వశి” నవ్వింది రాగిణి.
“నీకు కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, రాగిణి” ప్రతిస్పందించింది ఊర్వశి. “ఐనా మనలో మనం చెప్పుకోవడం కాదు మన పిల్లలు మనల్ని గుర్తించి చెప్పాలి.” అంది.
“అందుకేగా మావాళ్లు కొత్త చీర, కేక్ ఆన్లైన్లో పంపించారు. వాళ్ళు వచ్చాక కేరళ ట్రిప్ కూడా వెళ్దామని చెప్పారు.” ఆనందమంతా ఆ గొంతులోనే తెలుస్తుంది.
“ఓహ్ గ్రేట్!! మంచి బహుమతులు ఇచ్చారు.” పొగిడింది ఊర్వశి. మీవాళ్లు అని రాగిణి ఆడగకముందే ఏవో మాటలు మార్చి కాసేపయ్యాక ఫోన్ పెట్టేసింది.
‘ఇంతకీ ఈమెoదుకు ఫోన్ చేసింది విషెస్ చెప్పడానికా, గొప్పలు చెప్పుకోడానికా? నా పిల్లలు కూడా ఏదైనా పంపించాక నేనూ చెప్తాను గొప్పలు..’ మూతి తిప్పుకుంది.
అగ్నిలో ఆజ్యం పొయ్యడమంటే అంటే ఏమిటో అర్థమయ్యింది.
వార్తా పత్రికలో ఏ విశేషాలు ఉన్నాయోనని పత్రిక తిరగేయసాగింది. అక్కడ కూడా మాతృ దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక ఆఫర్స్ అంటూ ఊరిస్తున్నాయి.
టక్కున టీపాయ్ మీదకి గిరాటేసింది.
అక్కకి ఫోన్ చేద్దామా అనుకుంది. ఎందుకులే లేనిపోని గొడవ.. వాళ్ళ పిల్లలు ఏమిచ్చారో అని ఊరుకుంది.
ఉదయం కాస్త మధ్యాహ్నం అయ్యింది. ఏమీ తినాలనిపించక రెండు గ్లాసుల నీళ్ళు తాగి, మంచం ఎక్కింది.
అమ్మ గొప్పతనాన్ని, ప్రేమను, త్యాగాన్ని వర్ణిస్తూ పుంఖానుపుంఖాలుగా కథలు, కవితలు ఫోన్ లోని వివిధ సమూహాలలో ప్రత్యక్షమవుతున్నాయి. చదువుతూ ఉద్విగ్నత చెందసాగింది.
ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా పిల్లలని పెంచడానికి ఎంత కష్టపడింది. అత్తామామలు తమ పెళ్ళయిన కొత్తలోనే ఒకరితర్వాత ఒకరు కాలం చేశారు.
పిల్లల పరీక్షలప్పుడు వాళ్ళతోపాటు తెల్లవార్లు మేలుకుని ఉండేది. ఒంట్లో బాగోకపోతే తగ్గేదాక తినడం కూడా మానేసి సేవలు చేసేది. అవన్నీ తలుచుకుంటుంటే కళ్ళు మూతలు పడడంలేదు.
సాయంత్రం అవ్వగానే రత్నాకర్ వచ్చాడు.
ముభావంగా ఉన్న ఊర్వశిని చూసి “ఏంటోయ్!! పిల్లల మీదకి గాలి మళ్ళిందా, రమ్మనమని చెపుదాంలే.” నవ్వాడు.
“ఆ!! రమ్మనమనండి. మీ పిల్లలకి నేనంటే ఎంత ప్రేమో తెలుస్తుంది.” కాస్త ఉక్రోషంగా అంది.
“ఏదో పని ఒత్తిడిలో ఉండి, మర్చిపోయింటారు.” అన్నాడు విషయం అర్ధమయిన రత్నాకర్.
“ఎంత ఉంటే మాత్రం అమ్మని ఎలా మర్చిపోతారు. ఒక్క ఫోన్ లేదంటే ఒక్క మెసేజ్ చేస్తే వాళ్ళ సొమ్మేo పోతుందట. ఏదో ఈరోజు ప్రత్యేకం కదాని ఆశించాను.”
“పోనీ బయటికి వెళ్దామా?” అడిగాడు.
“అక్కరలేదులెండి.” అంటూ విసురుగా వంటగదిలోకి వెళ్ళి ఇడ్లీ, చట్నీ చేసింది.
మర్నాడు పొద్దున్న ప్రణవ్ నుండి ఫోన్.
‘నిన్న చెయ్యలేదు కానీ ఇప్పుడు మాత్రం తెల్లవారిసరికే చేసాడు.’ మూతి తిప్పుకుంది.
అలకలో ఉన్న ఆమెకు సుశ్రిత నుండి వీడియో కాల్ వచ్చింది.
“అమ్మా!! ఎక్కడున్నామో చెప్పుకో” కిలకిల నవ్వింది.
వీడియోలో తేరిపార చూసేసరికి తనకెంతో చిరపరిచితమైన ప్రదేశం కానీ ఈమధ్య కొన్ని నెలలుగా వెళ్లని ప్రదేశం..
“అక్కడికి ఎప్పుడు వెళ్లారు?” ఆశ్చర్యపడింది.
“మేము మొన్న రాత్రే ఇక్కడికి వచ్చాం, అమ్మా” అన్నాడు ప్రణవ్.
తనకి తెలియకుండా తల్లిని చూడటానికి వెళ్లినందుకు కించిత్ బాధ కలిగినా, సంతోషించింది.
“వద్దంటున్నా అమ్మమ్మ మా కోసం ఏం చేసిందో చూడు.” అంటూ ఒక గిన్నె మూత తీసి చూపించాడు.
చేపల పులుసు..
చూడగానే నోట్లో నీళ్ళూరాయి. అమ్మ చేత్తో ఏం చేసిన అమృతమే, చేపల పులుసైతే చెప్పనే అక్కరలేదు.
ముడతలు పడ్డ శరీరంతో, నీరసంగా ఉన్నా ఇంకా ఏదో ఒకటి వండి పెట్టాలని తపనపడుతుంది విజయమ్మ.
చేతులు సన్నగా వణుకుతున్నా దొండకాయ వేపుడు చేస్తానంటూ దొండకాయలు తరగబోయింది. పిల్లల కడుపు నిండితే తమ కడుపు నిండినట్లు సంతోషిస్తారు అమ్మలు.
“ఇంకేం వండొద్దు గానీ నువ్విలా కూర్చో, అమ్మమ్మా” అంటూ మంచంపై కూర్చోబెట్టారు సుశ్రిత, ప్రణవ్లు.
“ఇదిగో అమ్మతో మాట్లాడు.” అంటూ ఫోన్లో ఊర్వశిని చూపించారు.
“బాగున్నావా, తల్లీ” విజయమ్మ ఆప్యాయంగా అడిగింది. “ఎన్నాళ్ళయ్యిoదో నిన్ను చూసి..” కళ్ళు తుడుచుకుంది.
బాగా వడలిపోయిన తల్లినలా చూడగానే దుఖం పొంగుకొచ్చింది అయినా తమాయించుకుంది ఊర్వశి. ఆ మాత్రం బింకం చూపించకపోతే గానీ పనవ్వదు.
“బాగున్నాను, నువ్వెలా ఉన్నావు.” అడిగింది.
“బాగున్నాను. నువ్వు పంపించావని మనవడు, మనవరాలు వచ్చారు. నా కోసం ఈ చీర, పళ్ళు తెచ్చారు.” అని చూపిస్తూ మురిసిపోయింది.
ఫోన్ పెట్టేశాక ‘వాళ్ళు అమ్మతో అలా చెప్పారా’ అనుకుంటూ ఎక్వేరియం నుండి జారిపోయిన చేప పిల్లలా గిలగిలలాడింది ఊర్వశి.
అమ్మ కాసుల పేరు..
అది ఒకసారి వేసుకుని పేరంటానికి వెళ్తే అందరూ బాగుందన్నారు. అందుకే తనకి ఇచ్చేయమని అడిగింది. అమ్మ చెప్పిన సమాధానం వినగానే ఒక్కసారిగా అహం దెబ్బ తింది.
ఇప్పటివరకు తను ఏదీ పెద్దగా అడగలేదు ఆ మాత్రం ఇవ్వలేదా?
రోషం పెరిగి ఆరునెలలు అయ్యింది.
కాసేపయ్యాక ప్రణవ్ మళ్ళీ ఫోన్ చేసాడు.
“అమ్మా! మేమిప్పుడు పొలం వైపు వచ్చాము. అమ్మమ్మ మునుపటంత చురుకుగా ఉండలేకపోతుంది. చూపు కూడా తగ్గినట్లుంది. బంగారు నగ కావాలంటే కొనుక్కోవచ్చు కానీ బంగారంలాంటి అమ్మమ్మ మళ్ళీ దొరుకుతుందా, ఆమెతో గడిపే క్షణాలు మళ్ళీ వస్తాయా?” అడిగాడు ప్రణవ్.
“నిన్నంతా నీకు ఎందుకు ఫోన్ చేయలేదో నీకీపాటికి అర్థమై ఉంటుంది. నీకు చెప్పాల్సిన వాళ్ళం కాదు కానీ నువ్వు అమ్మమ్మతో మాట్లాడకపోవడం మమ్మల్ని బాధ పెట్టింది. అమ్మమ్మ నీమీద ఎటువంటి ఫిర్యాదు చెయ్యలేదు, తెలుసా?” అంది సుశ్రిత.
తండ్రి హఠాత్తుగా పోతే, ఊహించని కష్టాలు ఎదురైనా ధైర్యంగా తమని పెంచింది. చదువు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసింది. ఎప్పుడు పడుకునేదో, ఎప్పుడు లేచేదో తెలిసేది కాదు. ఒక సందర్భంలో ‘బావ స్థితిమంతుడు, స్థిరవంతుడు కాదు పైగా అక్కకి ముగ్గురు ఆడపిల్లలు. కాబట్టి కాసులపేరు అక్కకి మూడు వంతులు, నీకు ఒక వంతు ఇద్దామని అనుకుంటున్నాను’ అని అంది. అమ్మ మనస్సు అర్థం చేసుకోలేకపోయింది. అకారణంగా దేవత లాంటి అమ్మని బాధ పెట్టింది’ అనుకోగానే కళ్ళు సజలమయ్యాయి.
కంఠం పూడుకుపోతుండగా “రాత్రికి మేము బయలుదేరివస్తాము. అందరం కలిసి అమ్మమ్మని మనింటికి తీసుకువద్దాము.” అంది ఊర్వశి.
