[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘అమ్మ ఒడి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నీ ఊరొచ్చాను అమ్మ
అచ్చం నీలాగే ఉంది
ముచ్చటగా పలకరించింది
స్వచ్ఛమైన ప్రేమను పంచింది
పచ్చని పల్లె సీమల్లే
పదహారణాల కాంతులతో
వెన్నెల్ల జల్లులు కురిసింది
చిరునవ్వు చిలికింది
నీతోనే ఉన్నట్లుగా
నీ నీడే అన్నట్లుగా
వెచ్చదనాన్ని ఇచ్చింది
ఎంచక్కా నన్ను లాలించింది
అవును అమ్మ పుట్టిన ఊరు
అమ్మ తిరిగిన ఊరు
అమ్మ ఒడిలాగానే
ఎంతో సేద తీరుస్తోంది
అమ్మతనానికి నిలువెత్తు
ప్రతిరూపంగా సాక్షాత్కరిస్తోంది
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
