[వాణి వేమవరపు గారు రచించిన ‘అమ్మ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఎల్లలెరుగని ప్రేమ చూపు,
మరుమల్లియ వంటి మదికి నెలవు,
వెల్లువైన అనురాగపు ధారల,
మెరిసిన భాగ్య రేఖ కదా, తల్లి మన జీవితాన.
ఎన్ని జన్మల పుణ్యమదియో,
లాలి పాటలు ఆలకించుచు తల్లి ఒడిన నిదురించగ,
ఎంత భాగ్య మొందితిమో,
తల్లి చేతి గోరుముద్దల అమృతాన్ని ఆస్వాదించగ.
ప్రగతి పథమున బిడ్డ గెలుపుకై
తల్లి పడే యాతన,
విశ్రాంతి ఎరుగని తల్లులెందరో
జయము నొందిన బిడ్డ వెనక,
తమ ఆకలి ఎరుగని తల్లులు ఎందరో
బిడ్డ కడుపులు నింపగ,
ఘడియ నిలచి ఆ కష్ట మెంచు,
తల్లిని నిరాదరణ చేయక.
ఆది గురువుగా అమ్మ
నేర్పిన విద్య ఎంతో జీవితాన,
అడుగు అడుగున అమ్మ వాక్కుల
అనుభూతి నొందెదవు నీ బ్రతుకు బాటన,
ఆ నిస్వార్థ ప్రేమకు వెలకట్టలేవు
ఎన్ని యుగములు దాటినా.
