[శ్రీ లాల లింగమూర్తి గారి ‘అమ్మతోడు అరుణా, వచ్చే జన్మల ఈ తప్పులు చేయను!’ అనే కవితాసంపుటి సమీక్ష అందిస్తున్నాము.]
శ్రీ లాల లింగమూర్తి గారు రచించిన ‘అమ్మతోడు అరుణా, వచ్చే జన్మల ఈ తప్పులు చేయను!’ అనే 116 పుటల ఈ పుస్తకంలో 31 ఎలిజీలున్నాయి. అన్నీ కవి జీవిత భాగస్వామిని స్వర్గీయ అరుణ గారి తాలూకు స్మృతులే.
కొన్ని సార్లు మనుషులు జీవించి ఉన్న సమయంలో వారి విలువ మనం గ్రహించం, వారి విలువ తెలియదు.
“అవి నీతోనే అనాలి/ఏనాడు అనలేదు/ఎప్పుడూ చెప్పలేదు, మన్నించు/అజ్ఞానమే, అహం కాదు” అన్నారు కవి ‘మెచ్చుకోలు’ అనే కవితలో
ప్రేమ వివాహమో, పెద్దలు ఏర్పాటు చేసిన వివాహమో, లింగమూర్తి తన ఆశయాల ప్రకారం ప్రమాణాల పెళ్లి, రిజిస్టర్ పెళ్లి రెండూ చేసుకుంటారు. ఆమె విద్యావతే, తనను కాలేజీకి పంపి ఉన్నతవిద్య చదివిస్తాడు. డిగ్రీ తర్వాత ఆమె కాలేజీలో చేరి రెండు మూడేళ్లు ఫార్మసీ డిప్లొమా కూడా చేస్తుంది, తను ఆమె ఎడబాటు సహించలేక పోయినా.
వారి దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగుతున్నసమయంలో ఆడబిడ్డో అత్తగారో జోక్యం చేసుకుని ఇద్దరి నడుమ కలతలు పుట్టిస్తారు. వైమనస్యం, అపోహలు, బయటి వారి జోక్యం, మొత్తం మీద ప్రేమమయ జీవితం కడగళ్ళ పాలవుతుంది. కాలం గడిచిపోయింది, ప్రేమమయి, అరుణ జీవిత భాగస్వామిని అరుణ చనిపోతుంది.
“ఉంటారు ఉంటారు/కొత్త జంటల్ని పీక్కతింటారు/చల్లన సాగే సంసారాల్ని/నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తారు.” అని ‘మరియానా ట్రెంచ్’ అనే కవితలో వాపోయారు కవి.
ఇప్పుడు ఆమె జ్ఞాపకాలతో అతను జీవితం గడపవలసి వస్తుంది. తను పోగొట్టుకున్న ఆమె విలువ తెలిసి వచ్చినా చేయగలిగింది ఏమీ ఉండదు.
ప్రేమాస్పదురాలు, తన అరుణకు సంబంధించిన ప్రతి వస్తువు ఆమె జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. చిన్న చిన్న సంఘటనలు – ఆమె తెచ్చిన గేస్‌లైటర్ కూడా ఆమె తాలూకు స్మృతులను రేపుతాయి.
“ఏళ్లకు ఏళ్లు/కాల ప్రవాహంలో కలుస్తున్నాయి/ఆ లైటర్ అలాగే పొయ్యి రాజేస్తోంది/నాలో క్రాంతిని పోగేస్తూ!” అన్నారు ‘స్టౌ లైటర్’ కవితలో.
తన బంధువు సత్యవతమ్మ మాటలు విని అరుణతో ఎంత అమానవీయంగా, దయా రహితంగా వ్యవహరించింది గుర్తొచ్చి పశ్చాత్తాపంలో మునిగిపోయి, మరలా అటువంటి తప్పు చేయనని వాపోతారు.
“అమ్మ తోడు అరుణా వచ్చేజన్మల ఈ తప్పు చేయన”ని వాపోయారు. అన్ని ఎలిజీలు ఈ పల్లవి వంటి చరణంతో ముగుస్తాయి.
తరచూ కవి జీవితంలో సంఘటనలు, ఇతర మనుషుల ప్రస్తావనలు కవితల్లో వస్తాయి. పాదసూచికల్లో వివరణలు ఇచ్చినా, కొన్ని విషయాలు, సంఘటనలు స్పష్టాస్పష్టంగా ఉన్నా, కవితలను చదివి అర్థం చేసుకోవచ్చు. ఆర్తి, కవి హృదయంలో అరుణ పట్ల ప్రేమ, ఆమె లేకపోయినా, ఎంతో కాలం గడిచిపోయినా ఆమెకు గుండెల్లో గుడి కట్టిన ఆరాధన ప్రతి ఎలిజీలో విషాదమోహనంగా వ్యక్తపరిచారు.
“ప్రేమతత్వం నీది/అమరత్వం నీది/తెలియని తత్వం నాది/మూర్ఖత్వం వికసతి” అన్నారు ‘నీకో దేవళం’ కవితలో.
అక్కడక్కడా తెలంగాణ భాష, యాస, కొంత సంస్కృత పదాలు నిండిన అభివ్యక్తితో లింగమూర్తి ప్రత్యేకమైన రచనా విధానం ఎంచుకొన్నారు.
కవితలన్నీ చదిన తర్వాత అరుణమ్మ సాధవర్తన, లౌక్యంలేని అమాయకత్వం కలిసిన ఒక సౌశీల్యం పాఠకుల హృదయాల్లో ఆవిష్కరించబడుతుంది.. అయ్యో, ఇంత మంచిమనిషి ఎన్ని ఇడుములపాలైంది! అని విషాదం పఠితల మనసులో ఆ సౌశీల్యవతి పట్ల ఒక ఆదరం, అభిమానం ఏర్పడి, కవి కృతార్ధతను సూచిస్తుంది.
లింగమూర్తి రచనలో సమర్థులు, చేయితిరిగివారు. సంసార జీవితం, తొలినాళ్ళ స్వప్న సదృశమయిన అనుభవాలు, ఆ చుట్టం రూపంలో ప్రవేశించిన భూతం నిజస్వరూపం గ్రహించలేని అశక్తత, తన గృహస్థ జీవితంలో కలతలు కలిగించేవారి motives, అంతా కలిపి మంచి నవలారూపంలో చిత్రిస్తే బాగుంటుందేమో లింగమూర్తి ఆలోచించి చూడగలరు. తమ మధ్య భౌతికంగా దూరం ఉన్నా మానసికంగా మీరు దగ్గర అయినారు.
తన తల్లి, సోదరి, సోదరులే తమ ప్రేమను అర్థం చేసుకోలేక ఆటంకాలు కలిగించారు. మనస్పర్థలకు తన ఇంటివాళ్ళూ కారణమైనారనే ఆవేదన – ఆ తొలి వయసులో తన, తన భార్య అమాయికత్వం కష్టాలకు కారణమైనాయని ఆవేదన చెందుతారు. ప్రేమే సర్వస్వం అని నమ్మేస్తారు.
“విషాదం కుళ్ళు మనుషులు మనతో ఉండటం/అలభ్య హంతకులు నిత్యం నమ్మకద్రోహులే” అని బాధపడతారు కవి ‘కీసరి దానయ్య’ కవితలో
ఎప్పుడూ అరుణగారూ అనే పిలుస్తారు మితి మీరిన ప్రేమతో.
“అరుణ గారూ/అలానే పిలిచేవాన్ని/భయంతోనైతే కాదు/అతి, మితిమీరి ప్రేమతో” అన్నారు లింగమూర్తి ‘సోదయినా వినాలి’ కవితలో.
భారంగా ‘అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్లి పోయావు. నేనూ వస్తున్నాను దివసాలో పక్షాలో -’ అంటారు. ఏళ్ళు గడిచినా తన అరుణే తన లోకం.. పొరపాట్లు ఇక చెయ్యను క్షమించు.. మరుజన్మ ఉందని నువ్వే నా ప్రణయినివి అంటారు.
తనలాగా యువతరం బాధపడగూడదు. పరిపక్వత వచ్చేవరకూ ఆవేశకావేశాలకు పోకుండా వీళ్ళు వాళ్ళు అనే మాటలు పట్టించుకోకుండా ప్రేమపండించుకోవాలి. అందుకే ఈ రచన అంటారు.
అభినందనలతో
డాక్టర్ కాళిదాసు పురుషోత్తం,
డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్
***
రచన: లాల లింగమూర్తి
ప్రచురణ: చిట్టి పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 116
వెల: ₹ 60/-
ప్రతులకు:
చిట్టి పబ్లికేషన్స్, హైదరాబాద్
ఫోన్: 9866456009
~
శ్రీ లాల లింగమూర్తి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-mr-lala-lingamurthy/
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.

