Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మ వెళ్లిపోయే ముందు రాత్రి

[26 ఏప్రిల్ 2026 తమ తల్లి రాధగారి 38వ వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఈ కవితని అందిస్తున్నారు వారాల ఆనంద్.]

(ప్రతీకాత్మక చిత్రం)

అమ్మ చనిపోవడం
అంటే ఎవరో ఒక మనిషి పోవడం కాదు
మన లోపల వెలిగిన మొదటి దీపం
నెమ్మదిగా ఆరిపోవడం

మన శరీరం.. ఆమె జ్ఞాపకం
మన శ్వాస.. ఆమె ఊపిరి
మన గుండె.. ఆమె తడిమిన వేడి
ఆమె వెళ్లిపోతే మనలో ఏదో ఒకటి కాదు
మనమంతా కొంచెం కొంచెంగా చనిపోతాం

ఆ రాత్రి నిద్ర నాకు దూరమైంది
చీకటి గదిలో గడియారం టిక్ టిక్ కూడా
ఒక గాయంలాగా వినిపించింది

(వారాల ఆనంద్ మాతృమూర్తి దివంగత రాధగారు)

అమ్మ పక్కన కూర్చుని తన చేతిని పట్టుకున్నాను
చిన్నప్పుడు నన్ను నడిపించిన
ఆ చేతి వేడి ఇంకా అలాగే ఉంది
కాలం మాత్రం చల్లబడిపోయింది

“అమ్మా..” అని పిలిచాను
అది కేవలం నా పిలుపు కాదు
జన్మంతా మిగిలిన ఒక ప్రతిధ్వని

నేను ఎప్పుడూ పలకని మాటలు
ఆ రాత్రి వచ్చి నా ముందు కూర్చున్నాయి
నా లోపల దాచుకున్న గాయాలూ

చెప్పలేక దాచుకున్న పశ్చాత్తాపాలూ
తెలియని భయాలూ
అన్నీ ఒక్కొక్కటిగా నా ముందు వచ్చి కూర్చున్నాయి

“నాకు జీవితం అంటే ఇష్టం అమ్మా” అన్నాను
కురుస్తున్న కన్నీళ్ల మధ్యలో కూడా
ఆ మాట ఓ వెలుగులా కనిపించింది

“నన్ను పుట్టించినందుకు ధన్యవాదాలు”
అని చెప్పేటప్పుడు నా గుండె మోకాళ్లపై కూర్చుంది

అమ్మ శాశ్వత నిద్రలోకి జారిపోతూ ఉండగా
నేను మెలకువలో ఉండిపోయాను
ఆ రాత్రి మాట్లాడింది నేను కాదు
నా లోపల ఉన్న ‘నందు’ అనే చిన్న పిల్లాడు

అమ్మ వెళ్లిపోయిన తర్వాత కూడా
బొడ్డు తాడు తెగలేదు
అది ఇప్పుడు జ్ఞాపకాల రూపంలో
నా గుండెను చుట్టుకుని కట్టు కట్టుకుంది

ఇప్పటికీ ఎప్పుడైనా ఒంటరిగా అనిపిస్తే
ఆ రాత్రిని అమ్మ పక్కన కూర్చున్నప్పటి
ఆ చివరి సంభాషణను గుర్తు చేసుకుంటాను

అప్పుడు తెలుస్తుంది
అమ్మలు ఎప్పుడూ చనిపోరు
మన లోపల సదా జీవిస్తూనే వుంటారు

Exit mobile version