Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మా..! ఓ అమ్మా..!!

[శ్రీ పోలయ్య కూకట్లపల్లి రచించిన ‘అమ్మా..! ఓ అమ్మా..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

అమ్మా.. ఓ అమ్మా..!
నీ ప్రేమెంత పరిమళమో
ఎవరికి తెలుసు..?

ప్రభాత పవనంలో
పరిమళించే ఆ
పుష్పసుగంధానికి తప్ప..

అమ్మా.. ఓ అమ్మా..!
నీ మనసెంత లోతైనదో
ఎవరికి తెలుసు..?

అలలు ఎగిసిపడే
అంతులేని ఆ సాగరానికి తప్ప…

అమ్మా.. ఓ అమ్మా..!
నీ పిలుపులోని పసితనం
ఎంత కమ్మనిదో
నీ పలుకుల్లోని పరవశం
ఎంత తియ్యనిదో
ఎవరికి తెలుసు..?

కొమ్మల్లో కూసే ఆ
కోయిలమ్మ గానానికి తప్ప…

అమ్మా.. ఓ అమ్మా..!
నీ త్యాగమెంత ఘనమైనదో
ఎవరికి తెలుసు..?

తాను కరిగి లోకానికి
వెలుగునిచ్చే ఆ దీపశిఖకు తప్ప…

అమ్మా.. ఓ అమ్మా..!
నీ ఓర్పెంత విశాలమో
నీ సహనమెంత శాశ్వతమో
ఎవరికి తెలుసు..?

అన్నిటినీ భరించే ఆ నేలతల్లికి తప్ప…

అమ్మా.. ఓ అమ్మా..!
నీ అనురాగమెంత అమృతమో
నీ ఆరాధనెంత అపురూపమో
ఎవరికి తెలుసు..?

సృష్టికి శ్వాసనిచ్చిన ఆ బ్రహ్మకు తప్ప…

అమ్మా.. ఓ అమ్మా..!
నీ వుంటే..
ఇల్లంతా మమతల హారమే..
నీవు నవ్వితే..
జీవితమంతా వసంత విహారమే..
నీవు లేకుంటే..
గుండె గర్భంలో గాఢాంధ కారమే…

అందుకే
అమ్మంటే.. ఒక పదం కాదు…
అది ప్రాణానికి పరమార్థం…
అమ్మంటే.. ఒక పదం కాదు..
అది అనంత ప్రేమకు ఆది అక్షరం..!

Exit mobile version