Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మమ్మ అంతరంగము

సూర్యోదయం చాలా అందంగా ఉంటుంది దానిలో ఎన్నో వర్ణాల మార్పు. అవి చూడటానికే కాదు ఆరోగ్య రీత్యా ఆ కిరణాలు ఎంతో ఉపయోగం, ఆనందకరం.

ఆస్వాదించే మనసు ఉండాలి. అందులో ప్రయాణంలో బస్సు లోంచి రైల్ లోంచి చూస్తుంటే మరీ అందంగా బింబం ఉంటుంది. దాని నుంచి వెలువడే కాంతి కిరణాలు జీవిత వెలుగులు.

ఆకాశంలో ఎగిరే పక్షులు, మొక్కలపై వాలి ఉన్న రకరకాల పిట్టలు, అన్ని ఎంతో అందంగా కనిపిస్తూ కవ్విస్తూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మనం గమ్యం చేరాలి అంటే ఎన్నో దాటి వెళ్ళాలి. అది నీతి అనండి, విశ్వవిఖ్యాత నిజం అనండి తప్పదు, అంతే కదా.

ఎవరు ఎక్కడ ఎక్కినా తమ వంతు జీవిత గమ్యం కోసమెంతో పోరాడాలి. ఎంతో ఆరాటపడితే కానీ విద్యార్థికి చదువు, ఉద్యోగానికి తగిన సాధన, పెళ్లికి తగిన కృషి చేసి వెతికితే కానీ సంబంధాలు కుదరవు.

భూమి గుండ్రంగా ఉన్నదని ఎన్నో ఎన్నొన్నో మజిలీలు దాగాయి.

భార్యా భర్త నిరంతరం కుటుంబ ఉన్నతికి పాటు పడాలి. ఇద్దరు ఉద్యోగస్థులు అయితే జోడేద్దుల మాదిరి కష్ట పడి ఇంటికివస్తారు. సహజంగా ఇంటి ఇల్లాలే పనులు అందుకోవాలి. ఇది తర తరాల సందేశం. ఈ చరిత్ర మారదు. ఏదో కొందరు మారినా మిగిలిన వారు విమర్శిస్తారు. పిల్లల, ఇంటి భాధ్యత ఆడవారిదే. మగాడు ఉద్యోగంలో కష్టపడి వచ్చాడు అంటారు. అదే అడపిల్ల అయితే “అబ్బబ్బా. నీ పిల్ల నా మాట వినలేదు. పిల్లని చూసుకో” అంటారు. అమ్మ అయినా అత్త అయినా ఎవరైనా ఆలాగే సమర్థిస్తారు. ఆడపిల్ల సవ్యసాచిలా అన్ని పనులు చేస్తుంది. పెళ్లి కాని పిల్లలు అయితే కాలేజి, ఉద్యోగం నుంచి వచ్చి తల్లి వెనకాల పని అందుకుంటారు.

***

శ్రీవల్లి కూతురు శ్రావణిని పిలిచి, “ఇవ్వాళ శనివారం. సెకండ్ శాటర్‌డే కనుక నువ్వు అమ్మమ్మ ఇంటికి వెళ్లి గోరింటాకు కోసుకు రా” అన్నది. సరే అంది శ్రావణి. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు వస్త్రధారణ, నగలు అన్ని మార్చి అవిడకి నచ్చేలా వెడుతుంది. కారణం అవన్నీ అమ్మమ్మ కొని పెడుతూ ఉంటుంది.  “అప్పుడు అది కొని పెట్టాను, ఇప్పుడు ఇది కొని పెట్టాను. నువ్వు పెట్టుకో” అంటుంది.

అమ్మమ్మకి శ్రావణి అంటే ప్రాణం. ఎవరి మనసు నొప్పించకుండా శాంతియుతంగా కలిసి మెలసి ఉండాలి అన్నది ఆవిడకి ఆనందం కలిగించే విషయం.

అమ్మ విషయంలో అమ్మమ్మ చాలా సమస్యలు వియ్యాల వారిచే ఎదుర్కొంది. ఇప్పటికి ఏదో రకంగా మనిషి మనసు కష్టపెడుతునే ఉంటారు శ్రీవల్లి ఆడబడుచులు, అత్తగారు కూడా.

శ్రావణి నాన్న నిమిత్తమాత్రుడిలా ఎవరికి ఏమీ చెప్పడు. “ఇంటి విషయాలు ఆడవాళ్లే చూసుకోండి” అని తెలివిగా మాట్లాడుతాడు. కారణం – తన తల్లి చెల్లి పెంకి వాళ్ళు అని బాగా తెలుసు. ఏదో శ్రీవల్లి అయితే ఊరుకుంటుంది. మరి కోడలిగా అత్త ఇంట ఉండాలి అంటే, వాళ్ళు చెప్పినది వినాలి. కాదన్నా లేదన్నా అంతా గొడవే కదా.

ఇవన్నీ పెద్ద వాళ్ళ విషయాలు. అయినా ప్రతి ఆడపిల్ల ఎదుర్కొనే సమస్య ఇది అని అమ్మమ్మ చెపుతూ ఉంటుంది. ఇప్పుడు తనకి సూక్తి ముక్తావళి మొదలుపెడుతుంది అనుకున్నది శ్రావణి. అమ్మమ్మ ఇంటికి పరికిణి ఓణీ వేసుకుని బుట్ట పట్టుకుని స్కూటర్ పై వెళ్ళింది. అప్పటికే అమ్మమ్మకి అమ్మ ఫోన్ చేసింది. గేటు తెరిచి రెడీగా ఉంచింది.

“రా వే మనవరాలా” అని గారంగా పిలిచింది. ‘అమ్మమ్మా’ అంటూ రెండు చేతులు పట్టుకుని ఆప్యాయంగా చుట్టేసుకుంది శ్రావణి.

“ఉండవే ఉండవే. ఇన్నాళ్ళకి నేను కనిపించాను. వస్తే తుఫానుల మాదిరి ప్రవర్తిస్తావు. లేకపోతే ఒక్కసారి అయినా ఫోన్‌లో మాట్లాడవు” అంటూ గారం చేసింది అమ్మమ్మ.

“ఓ అమ్మమ్మ, నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఇంట్లోనే అమ్మతో సరిగా మాట్లాడుతూ ఉండటం కుదరదు.. ఇప్పుడు వచ్చేసానుగా” అంటూ మాట మార్చింది శ్రావణి.

“అబ్బా ఎంత ఎర్రగా చేతులు పండాయో? తాతయ్యకు నువ్వు అంటే ఎంతో ఇష్టం” అంది శ్రావణి.

“నువ్వు మాటల చిలుకవి” అంటూ అమ్మమ్మ మురిసి పోయింది.

“ఆహా! నాకూ మీ తాత అంటే ఎంతో ఇష్టం. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. కష్టం, సుఖం తెలిసి మసలు కుంటారు..” అంటూనే “నాకు ఏ లోటూ లేకుండా చూశారు. ఇంటికి పెద్ద కొడుకు అయినా ఇద్దరు చెల్లెళ్ళ కి పెళ్లి చేశారు. తమ్ముడికి మంచి ఉద్యోగం వేయించారు. బ్యాంక్‌లో మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యారు” అంది అమ్మమ్మ.

ఇంకా కుటుంబ విషయాలు ఏవో మాట్లాడుతూ అమ్మమ్మ ఆలోచనల్లోకి జారుకుంది.

***

ఉన్న ఊళ్లోనే సంబంధం అని శ్రీవల్లిని రఘురామ్‌కి ఇచ్చి చేశారు. అతను పంచాయితీరాజ్ ఇంజనీర్. అంతా బాగుంది, కుటుంబం మంచిదని పెళ్ళి చేశారు. కానీ వాళ్ళకి డబ్బు కాంక్ష ఎక్కువ. ప్రతీది వంక పెట్టేవారు. ఉయ్యాల చీర, కట్టు విడుపు చీర కూడా అతి ఖరీదు జార్జెట్ చీరలు ఎంబ్రాయిడరీవి పెట్టింది. కట్టు విడుపు చీర కట్టి ఇవ్వవద్దు, ఊరికే భుజం మీద వేసుకుని ఇవ్వమనండి అన్నారు.

నా కూతురు కట్టిన చీర కట్టదు అన్నారు. సరే. చీర పట్టుకెళ్ళిన నెలకి ఆ చీరకి చిల్లులు ఉన్నాయి అన్నారు.

ఇరుగు పొరుగు పనిమనిషి వంట మనిషి వాళ్ళకి ఆప్తులు. కోడలు పై నుంచి వచ్చింది.

అలా ప్రతి చిన్న విషయానికి విసిగిస్తు ఉన్నారు.

ఆ చీర పనిమనిషి ఇచ్చేయండి వేరే పంపుతాను అంటే, మా పని వాళ్ళు అలాంటివి కట్టరు. మా స్టేటస్ అలాంటిది అన్నారు. అయితే పంపేయండి మీకు వేరే పట్టు చీర పంపుతాను అని అన్నది.

ఇంకా ఎక్కడ, ఎవరికో ఇచ్చేసాము అన్నారు. మహా పెంకి లక్షణాలు.

ఎప్పుడో పెళ్లి అయింది, ఆ పిల్లని ఇప్పటికీ సాధిస్తూ ఉంటుంది.

***

అమ్మమ్మ అమ్మ పెళ్లి గురించి ఏదో ఒకటి చెపుతూనే ఉంటుంది అనుకుంది శ్రావణి.

అమ్మకి కోడళ్ళు వచ్చే వయసు వచ్చింది. అయిన అమ్మమ్మ మనసు ఆరాటపడుతూ, అంతరంగంలో ఏదో ఒక మంచి అలోచన చేస్తూనే ఉంటుంది

శ్రీవల్లి ఇద్దరు కొడుకులు ఇంజనీరింగ్ చదివారు, కాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగాలు వచ్చాయి. ఆడపిల్ల శ్రావణి పి.జి. చేసింది.

ఊళ్ళో కాలేజ్. ఎంతైనా చదువుకో అన్నారు తల్లిదండ్రులు.

అమ్మమ్మ అంతరంగంలో శ్రీవల్లి కుటుంబం గురించి సదా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అన్ని ఉన్నాయి, అయినా పిల్లకి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాని నుంచి బయట పడి అనందం వెతుక్కోవాలి .

ఇప్పుడు తగ్గ పెళ్లి కొడుకుల్ని మనవరాలికి వెతకాలి. ప్రస్తుత అలోచన ఇది. అంతరంగ మథనంలో ఎన్నో రకాల మంచి జరగాలని అమ్మమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది

“మీ అమ్మకి బాగా పండుతుంది. మా ఇంటి గోరింట తీరు అద్భుతం” అన్నది అమ్మమ్మ.

“అవును అవును. మా అమ్మకి బాగా పండుతుంది” అన్నది శ్రావణి.

“ఆషాడంలో చేతికి గోరింట, ఆహారంగా మునగ తినాలి. వర్షాకాలం కదా చేతికి కాళ్ళకి గోరింట పెట్టుకుంటే ఆరోగ్యం, ఆయుష్షు. ఐదవతనం, ఆనందం, అలంకరణ కూడా” అంది అమ్మమ్మ.

“అవును కదా అందుకే ఆడవాళ్ళు ప్రతి శుభకార్యం పండుగలకు గోరింటాకు పెట్టుకుంటే మంచిది అంటారు. అయిన తరచూ నీళ్ళల్లో పనిచేస్తారు కనుక గోరింట కాపాడుతూ చర్మ రక్షణకి ఉపయోగంగా ఉంటుంది.”

“రా” అంటూ లోపలికి తీసుకెళ్ళి పూత రేకులు పెట్టింది అమ్మమ్మ.

“జున్ను చేశాను. పట్టుకెళ్ళవచ్చును. డబ్బాలో ఉంచాను.”

“జున్ను ఎక్కడిది?”

“పై నున్న వాళ్ళకి ఎవరో అవు జున్ను పాలు పంపారుట వాళ్ళు కొన్ని మనకి ఇచ్చారు.”

సరే అంది శ్రావణి.

ఫ్రిజ్ తీసి అందులో నుంచి కనకాంబరం మరువం వేసి మల్లెలు చేర్చికట్గిన కదంబం, సింహచలం సంపెంగ పూలు నాలుగు తీసి మనవరాలికి ఇచ్చింది.

“ఆహ, నాకు ఎంతో ఇష్టం అని చెప్పి ఇవన్నీ రెడీ చేశావా?”

“నీకు ఇన్నాళ్లు కాలేజ్ సరిపోయింది. ఈ ఏడాది ఖాళీగా ఉన్నావు, అందుకు పండుగలు పబ్బాలు అన్నీ తెలుసుకోవాలి” అన్నది అమ్మమ్మ.

“చిత్తం అమ్మమ్మా. తాతగారు ఏరి?”

“వస్తారు. ఇప్పుడే పైన ఉన్న ఆయన రమ్మంటే వెళ్ళారు.”

“ఆహా, వచ్చిన వారానికి స్నేహాలు కుదిరాయి. వరుసలు పెట్టేసి ఉంటారు, సంబంధాలు కలిపేస్తారు” అన్నది శ్రావణి.

“అవును వాళ్ళు అంతా కూడా తమిళ్ ఎక్కువ మాట్లాడుతారు. అవిడ నిత్యం పట్టుచీర కడుతుంది. పూజ, మడి, ఆచారం, ఆచరణ పద్ధతి ప్రకారం ఉంటారు.”

“ఏం మనం లేమా? విదేశాలు వెళ్లిన మన వాళ్ళు పూజలు జపాలు చేస్తున్నారు కదా? ఇంక రాష్ట్రం మారితే గొప్ప ఏం ఉంది?” అడిగింది శ్రావణి. “వెళ్ళి గోరింటాకు కోసుకొస్తాను” అన్నది.

“అక్కర లేదు. ఉదయం పై వాళ్ళ పిల్ల కోసి ఇచ్చింది. మీ కోసం మునగాకు పప్పు పులుసు చేశాను. క్యారేజ్‌లో పెట్టి ఇస్తాను. ఈ వర్ష ఋతువులో చేతికి గోరింట, ఆరోగ్యానికి ఆహారంలో మునగ వంటలు వండుకు తినాలి అని పెద్దలు చెప్పారు. నేడు ఈ తరం కోసం ఛానెల్స్‌లో తెగ చెపుతున్నారు. ఛానల్ వారు చెపితే కానీ మీరు వినరు కదా. ఏ సినిమా స్టార్ అయినా చెపితే అప్పుడు ఎక్కుతుంది, అవునా?” అన్నది అమ్మమ్మ.

బుట్టలో జున్ను డబ్బా, పప్పు పులుసు డబ్బా, గోరింట ఆకు ఓ ప్లాస్టిక్ డబ్బా లో వేసి సర్దిందిi:

***

పిల్లని చేసుకునే వారు ఎన్నో అడుగుతారు. శ్రావణి మేనత్త కొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. ఇంజనీరింగ్ చదివినా మంచి ఉద్యోగం కాదు. అయినా మేనత్త కొడుకు కదా అని ఇష్టపడుతుంటే, వాళ్ళు ఒప్పుకోవడం లేదు.

పదిలక్షలు అన్ని కలిపి ఇస్తాము అంటే “నాలుగు చీరలు జాకెట్స్ కలిపి లక్ష అవుతుంది. అబ్బే నువ్వు రిటైర్ అయిన సొమ్ము పిల్లకి ఇచ్చెయ్యి. వదిన పేరున ఉన్న ఐదు ఎకరాల పిల్లకి ముందు రాయాలి” అంది శ్రావణి మేనత్త.

“ఆ తరువాత మగపిల్లలకి పంచితే ఎలా? అని లెక్కలు అడిగింది. “వదిన నీ దగ్గర దర్జాగా ఉండేది. మరి నా కోడలు ఆలా ఉండాలి” అన్నది మేనత్త.

వారం తరువాత తాతగారు “శ్రావణి నువ్వు వచ్చి నన్ను స్కూటర్ పై తీసుకెళ్ళు. పనుంది” అన్నారు

సరే అని బయలుదేరి వెళ్ళింది. తాతగారిని తీసుకు వచ్చింది శ్రావణి.

ఆయన శ్రీవల్లితో, “అమ్మా, అమ్మాయినికి ఒక పెళ్లి కొడుకు మాట చెప్పాలి. అల్లుడు గారికి నువ్వు చెప్పు. మన మెడ మీదున్న వాళ్లకి ఒక్కడే కొడుకు. ఇద్దరు ఆడపిల్లల పెళ్లికి ఉన్నారు. మన శ్రావణిని ఆయన చూశారు. ‘పిల్ల చలాకీగా ఉన్నది, కట్నం వద్దు. పిల్లనిచ్చి పెళ్ళి చేయండి’ అన్నారు” అని చెప్పారు

“కానీ నాన్నా, ఎరగని సంబంధం ఆయన ఊరుకోరు” అంది శ్రీవల్లి.

తనే మాట్లాడుతూ, “నా ఆడబడుచు ఏనాడూ ప్రేమగా చూడలేదు. నువ్వు డబ్బు ఉన్న దానివని గర్వంగా ఉంటావు అనేది. ఎప్పుడూ మా అయనకి నాకు పుల్లలు పెట్టి అల్లరి చేసేది. కానీ అయిన సంబంధం అని ఆలోచన. అప్పటికి పిల్లకి రెండు ఏకరాలు రాసి ఇస్తామని చెప్పినా ఊరు కోదు” అంది.

“నాన్నా, ఆడపిల్లకి పెళ్ళి తప్పదు, కట్నం కూడా తప్పదు కానీ మరి ఎక్కువ శూర్ఫణఖ కోరికలు! ఒక విధంగా చెప్పాలి ఆంటే కైకేయి మందర కలిపి మిక్సి అడిన పిండి మనిషి లక్షణాలు తనవి. అంత గర్వం అహంకారం ఉన్నాయి. అయినా పిల్లని చెయ్యాలనే మా ఆయన పట్టు వల్ల తప్పడం లేదు. సరే నాన్నా, ఈ శ్రావణంలో పెళ్లి చెయ్యాలి. ఆయన వచ్చాక చెపుతాను” అన్నది శ్రీవల్లి.

***

అమ్మమ్మ ఫ్రిజ్‌లో ఎన్నో వస్తువులు పెడుతుంది.

బోగడ పూల దండలు, పారిజాత దండలు గుచ్చడం నేర్పింది.

“సున్నితమైన పూలు, చాలా జాగ్రత్తగా దండగా గుచ్చాలి. సున్నితంగా ఉంటాయి ఆడపిల్లలు మల్లేనే, జాగ్రత్తగా పెంచాలి. ఆడపిల్లలలీ ప్రేమతో మనుగడ సాగించడం నేర్పాలి.” అంది అమ్మమ్మ.

“అమ్మమ్మ నీ పని చాలా బాగుంటుంది” అంది శ్రావణి.

“అవును నా వెనకాల మీ తాత ఉండి నేను చెయ్యలేని పని ఆయన అందుకుని సూదిలో దారంలా, దండలో దారంలా వెన్నంటి పనులు చేస్తారు. అయినా పిల్ల ముద్దు కానీ పని ముద్దు కాదు. పద్ధతిగా నేర్చుకోవాలి. పువ్వుల దండలు కట్టడం వల్ల సహనం నైపుణ్యం వస్తుంది. ప్రతి పనిలో నిదానత్వం, స్థిరచిత్తం వస్తాయి.”

“అమ్మమ్మా, నువ్వు పని చాలా తెలివిగా సులువుగా నేర్పిస్తావు కనుక నేను ఇంటరెస్ట్‌గా నేర్చుకుంటూ ఉంటాను” అంది శ్రావణి.

***

రెండు రోజులకు కూతురు శ్రీవల్లి ఫోన్ చేసి తండ్రికి అంగీకారం చెప్పింది. “పెళ్లిచూపులు మీ ఇంట్లోనే పెడతాను” అన్నది

“సరే అంతా కన్నానా తల్లీ” అన్నాడాయన.

ఏదో ఫార్మాలిటీ ప్రకారం జరిపారు. పెళ్లి కొడుకు శ్రీనివాస్ పిల్లని చూసాడు

“మా పిల్లని గారంగా పెంచాను. మీరు బాధ పడే మాటలు అనవద్దు” శ్రీవల్లి అన్నది

“అత్తమ్మా, మీ కన్నా బాగా చూస్తాను. ఈ పైనేగా ఉన్నది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లని పిలవండి పంపుతాను” అన్నాడు శ్రీనివాస్.

అబ్బాయి ఒప్పుకున్నా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఇంట్లో అందరి ఇష్ట ప్రకారం పెళ్లి చెయ్యాలి, లేకపోతే ఉత్తరోత్రా అనేక గొడవలు తెస్తారు. వస్తాయి కూడా.

ఆడపిల్లని ఎప్పుడో అప్పుడు ఒక అయ్య చేతిలో పెట్టాలి మరి. తప్పదు. మంచివాళ్ళు అయితే సుఖపడతారు.

శుభస్య శీఘ్రం అని వెంటనే అంతా తాంబూలాలు మార్చుకున్నారు. వాళ్ళు అన్ని రెడీ చేసుకునే వచ్చారు.

అతను మీడియా పర్సన్, అన్ని చేతిలో ఉంటాయి. వీడియో అది ఏర్పాటు చేసి అన్ని ఘనంగా చేశారు.

శ్రావణమాసంలో శ్రావణి పెళ్లి ఘనంగా చేశారు. ఎన్నో ఫోటోలు, వీడియోలు. బాధ పడి, భయపడినంత సేపు పట్టలేదు శ్రావణి శ్రీనివాస్‍గా మారడానికి.

పిడికిట తలంబ్రాలు పెళ్లి కూతురు అన్న శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన వాయిస్తుండగా పెళ్లి ఆనందంగా జరిగింది. ఎవరికైనా వారి ఋణమే వారికి దక్కుతుంది.

శ్రావణికి ఎన్నో చీరలు నగలు పెట్టారు, ఆనందంగా సారె పెట్టి సాగనంపారు. అమ్మమ్మ తాత ఎంతో సంతోషించారు.

(ప్రతి స్త్రీ జీవితంలో అత్తవారి ఇంట అత్త, అడబడుచు, మరిది, భర్త ఎవరో ఒకరి వల్ల సమస్యలు ఎదుర్కొని బాధ పడటం సర్వ సహజం. ఇవికాక, ఆర్థిక సమస్యలు కొన్ని. ఏది ఏమైనా స్త్రీ లలో అశాంతి, అసంతృప్తి అన్నది ఎంత చదువు ఉద్యోగం ఉన్నా తప్పటం లేదని ఒక సర్వే వల్ల విశదమయ్యింది. – రచయిత్రి)

Exit mobile version