Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మణ్ని కథలు!-23

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని ఇంట్లో ‘మంచిమాటలు!’ 😢 🤔  🏃‍♂

మా నాయనగారు ప్రతీ ఆదివారం నాడూ తన పిల్లలందరినీ  మేడ మీద తన గదిలో  కూర్చోబెట్టి, ‘ఆదివారం పూజ’ చేయించేవారు.

అది దివ్యజ్ఞాన సమాజం వారు.. వాళ్ల సంస్థ సభ్యుల కోసం నిర్దేశించిన నిత్య పూజా పద్ధతి. మా నాయన ఆ సంస్థలో సభ్యులు. ఆ సంస్థలో ఎన్నో పదవులు నిర్వహించి, ఎంతో సేవ చేసినారు కూడా. ఆ పూజను ఆయన చాలా యేళ్లు నిర్వహించినారు.

 ఆ కారణంగా మా నాయనగారి గది నిండా దివ్యజ్ఞాన సమాజంలోని ప్రముఖుల ఫోటోలు, మరి కొందరు మహనీయుల ఫోటోలూ వేలాడుతుండేవి.

మేడమ్ బ్లావెట్ స్కీ, అనీబిసెంట్, జినరాజదాస, శ్రీరామ్, రుక్మిణీదేవి అరుండేల్ వంటి పేర్లు వినబడుతూ వుండేవి.

ఆదివారం పూజలో దేవుడి పటాలూ వగైరా ఏమీ ఉండవు. దీపాన్ని వెలిగించి షోడశోపచారాలూ దీపానికే సమర్పిస్తారు. దేవతార్చన మంత్రాలే వుంటాయి పూజలో. అది కులమతాలకు అతీతంగా చేసే పూజ!

నాయన స్నేహితులు, ఊళ్లో ఉన్న ఒకరిద్దరు దివ్యజ్ఞాన సమాజ సభ్యులు వొచ్చేవాళ్లు. మేము పిల్లలం సరేసరి!

పూజ పొద్దున ఎనిమిదింటికి మొదలై ఒక అరగంటకల్లా అయిపోయేది.

ఆదివారం నాడు కూడా పొద్దున్నే స్నానాలు చేసేసి, పూజలో కూర్చోవాలంటే మాకందరికీ మాకు ప్రాణాల మీదికి వొచ్చినంత బాధ కలిగేది! బలవంతం మాఘస్నానం మాదిరి వుండేది.

మా అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లలో కొందరు మా నాయన చేత మంచి అనిపించుకోవాలనుకున్న వాళ్లు ముందు ముందే తయారై మేడ పైకి పోయి కూర్చునేవాళ్లు. చాపలు పరచడం, పూజ సామాను తీసుకురావడం వంటి పనుల్లో నాయనకు సాయం చేసేవాళ్లు.

వాళ్లు నాయనకు మస్కా వేస్తున్నారని మేము వెక్కిరించే వాళ్లం.. చాటుగా.

నేను పూజకు ఆలస్యంగా వొస్తానని, “అమ్మణ్నీ! త్వరగా తయారయిపోయి పూజకు రా..ఇంకా తీరిగ్గా కూర్చున్నావేమి?” అని మందలించేవారు నాయన.

పూజ తర్వాత నాయన చెప్పే ‘మంచిమాటలు’లో వాళ్లను.. అదే పూజకు శ్రద్ధగా వొచ్చేవాళ్లను నాయన పొగుడుతుంటే.. మాకు మాత్రం ఒంటికి కారం రాసుకున్నట్టుగా వుండేది.

మేమూ అలా మెప్పు పొందాలనిపించేది.

లోలోపల విసుక్కుంటూనే పైకి శ్రద్ధను ప్రదర్శించేవాళ్లం! ఎలాగో అందరం పూజా పద్ధతిని బాగానే నేర్చుకున్నాం.

పూజ ఎట్లాగో అరగంటలో పూర్తవుతుంది కానీ, తరువాత మా నాయన వేదాంత ఉపన్యాస ధోరణిలో చెప్పే ‘మంచిమాటలు’ వినాలంటే మరీ బోర్!

కానీ, ఆయనకేమో తన పిల్లలందరినీ వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పటికిప్పుడు పెద్ద వేదాంతులను, జ్ఞానులను చెయ్యాలని మహా ఉత్సాహంగా వుండేది.

అమ్మ మాత్రం ఈ పూజకు ఎప్పుడూ ఒచ్చేది కాదు. ఆమె పూర్తి స్థాయి కర్మయోగిని. పనిలోనే పరమార్థాన్ని వెదుక్కుంటుంది ఆమె. అయినా పొద్దునపూట అమ్మకు పని తీరదు.

ఇల్లాలంటే ఇల్లు, పిల్లలను దిద్దుకొని, అందరితో మంచిగా వుండి, దానధర్మాలు చేస్తూ, పది మందికీ వొండి పెట్టి, తాను తిని, ఎప్పుడూ పని చేస్తూ, చేయిస్తూ వుండాలని ఆమె పరమ ఉద్దేశ్యం.

ఆమెకు ‘పురవేదన’ (అదేదో తమిళపదం అనుకుంటా.. మా ఇళ్లలో వాడేవారు.. పనులపైన అమిత శ్రద్ధతో ఎప్పుడూ పనుల గురించి ఆలోచించేవాళ్లను గురించి ఈ పదం వాడుతారు. పుర్రెలో పుట్టే వేదన కాబట్టి కూడా  రావత్తు, ఏత్వమూ లుప్తమై పురవేదన అయివుండొచ్చు) ఎక్కువ!

ఎప్పుడూ జరగాల్సిన, తాను నడుంకట్టి జరిపించాల్సిన పనుల గురించి ప్లానింగ్ ఆ బుర్రలో పాదరసం మాదిరిగా నిరంతరం పరిగెత్తుతూ వుండేది.

నాయనను నేరుగా యేమీ విమర్శించదు గానీ, ఎవరైనా వేదాంతధోరణిలో మాట్లాడితే,

“ఇవన్నీ మెట్ట వేదాంతాలు! ఆత్మ పరమాత్మ అని మాట్లాడినంత మాత్రాన ఏమీ ఉపయోగం లేదు. పని చెయ్యడమే పరమాత్ముని పూజ. మన బాధ్యత సక్రమంగా నిర్వహించడమే నిజమైన పూజ” అనేది అమ్మ.

ఏదో పెద్దవాళ్లు చెప్పినారు కాబట్టి, కొద్దిసేపు చిన్న పూజ దేవుడికి చేస్తే చాలు.. అనుకుంటుంది ఆమె. అందరికీ అన్నీ ఏ లోపం లేకుండా అమర్చడమే ఆమె ధ్యేయం!

కానీ, ఇంట్లో ఆచారవ్యవహారాలు, పూజలూ, వ్రతాలూ, నోములూ, పేరంటాలూ అన్నీ సవ్యంగా, ఘనంగా జరిపించేది.

మా ఇంట్లో ఏకాదశి ఉపోషాలూ, ద్వాదశి పారణల దగ్గర్నుంచీ,  చిన్నపండగలు నుంచీ పెద్దవాటి దాకా.. యథావిధిగా పద్ధతిగా జరిపించేది అమ్మ. దానికి పెద్దమ్మ వందశాతం తోడ్పాటునిచ్చేది.

(అసలు మా ఇంట్లో జరిపే పండగల గురించి మా స్నేహితురాళ్లు విని కూడా వుండరు. అట్లాంటి అందరికీ తెలియని పండగలను కూడా చేసేవాళ్లు. అంటే క్యాలెండర్‌లో రాసిన పండగలను, రకరకాల మహనీయుల జయంతులనూ కూడా శ్రద్ధతో జరిపేవారు)

అమ్మలు ఇద్దరూ కలిసి ఎప్పుడూ రకరకాల ప్రసాదాలు వొండేసి, వాటిని ఎట్లా ఖర్చుచేయాలా అని చూస్తుండేవారు.

ఆ రకంగా మా నోళ్లకు విరామం వుండేదే కాదు.

ఆ విధంగా ఆ తోడికోడళ్లిద్దరూ హైందవధర్మాన్ని ఉద్ధరించడమే కాక, మా శరీరాలు భారీగా మారడానికి కూడా కారణం అయ్యారు.

మా ఇంట్లోని ఆడపిల్లలెవరికీ అత్తగారిళ్లకు పోయిన తర్వాత గానీ.. ఆకలంటే ఏమో తెలియలేదంటే అతిశయోక్తి కాదు!

మొగపిల్లలకు అయితే పై చదువులకు వేరే వూళ్లకెళ్లి హాస్టళ్లలో వున్నప్పుడు మాత్రమే అన్నం విలువ, ఆకలి విలువ తెలిసింది!

పెద్దమ్మకు పొద్దున వంట పని వుంటుంది కనుక ఆమెకు ఆదివారం పూజకు రావడానికి కుదరదు.

అయితే ఆమె రామాయణ భారత భాగవతాలతో పాటు వేదాంత గ్రంథాలనూ తెగ చదివేస్తుంటుంది.. పుస్తకాల పురుగు మాదిరిగా..

అప్పుడప్పుడూ నాయనా, పెద్దమ్మా ఇంటికి సంబంధించిన విషయాలూ, లోకవిషయాలూ మాట్లాడుకునేటప్పుడు, మామూలు మాటల్లో మొదలుపెట్టి వేదాంత ధోరణిలోకి వెళ్లిపోతారు.  అప్పుడు వాళ్ల భాషే మారిపోతుంది.

జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ, అన్నమయకోశము, మనోమయ కోశము, శమము, దమము, తితీక్ష, యమము, నియమము, శ్రద్ధ, సమాధానము, అరిషడ్వర్గాలు, రాగద్వేషాలు, జ్ఞానము.. అంటూ మేము అంతవరకూ వినని ఏవేవో వేదాంత సాంకేతిక పదాలు వాళ్ల సంభాషణల్లో దొర్లుతుండేవి. మహదానందంగా వుండేది వాళ్లకు ఆ మాటలు మాట్లాడుకుంటుంటే!

నాకు అవేవీ చచ్చినా అర్థం అయ్యేవి కావు. కానీ, ఆశ్చర్యంగా వింటూ వుండేదాన్ని.

అలాంటి సంభాషణలను అమ్మ ఖాతరు చేసేది కాదు. అవన్నీ టైమ్ వేస్ట్ మాటలని ఆమె నిశ్చితాభిప్రాయం!

మా తమ్ముళ్లు ఒకరిద్దరు ఆదివారం పూజ అయిపోగానే, నాయన చెప్పే మంచిమాటలు వినాల్సి వస్తుందేమోనన్నట్టుగా.. ఆ మేరకు ఆట సమయం వృథా కాకుండా.. వెనక్కు తిరిగి చూడకుండా కిందికి పరిగెత్తేవాళ్లు. నిజానికి నాకు కూడా అట్లా పరిగెత్తి వెళ్లిపోవాలని అనిపించేది.. కానీ, నా పెద్దరికం, మొహమాటం, నాయనను బాధపెట్టకూడదనే స్పృహ అడ్డువొచ్చేది.

అప్పుడు మా నాయన నిర్వికారంగా ఒక నవ్వు నవ్వేవారు. అందులో ఎన్ని కావాలంటే అన్ని అర్థాలు వెతుక్కోవొచ్చు.. మనకు ఓపికుంటే..

“అప్పుడే పూజ అయి పోయిందేమిరా?” అని తమ్ముణ్ని పెద్దమ్మ అడిగితే..

“పూజ అయిపోయింది పెద్దమ్మా.. నాయన మంచి మాటలు చెప్తున్నారు. అందుకే వొచ్చేసినా..” అని చెప్పినాడు మా వాడు.

“నీకు మాత్రం మంచి మాటలు వొద్దా? అంత చేదయినాయా నీకు మంచిమాటలు?” అని పెద్దమ్మ పకపకా నవ్వేది.

అమ్మ గుంభనంగా నవ్వుకునేది. ఆ నవ్వులో కూడా వెతుక్కోగలిగిన వాళ్లకు వెతుక్కోగలిగినన్ని అర్థాలు దొరికేవి!

చిన్నతనంలో విసుక్కున్నా.. వయసు పెరిగే కొద్దీ  నాయన చెప్పే మంచిమాటల్లో నాకు ఎంతో స్వారస్యం కనిపించేది. ఎంతో వినాలనిపించేది.

కొన్ని కథలు, సంఘటనలు జీవితాలనే మార్చగలిగినవిగా అనిపించేవి. ముఖ్యంగా వేదంలోని, ఉపనిషత్తులలోని కథలు చాలా రసవత్తరంగా వుండేవి.

“అహింసా ప్రథమం పుష్పం

పుష్పమింద్రియ నిగ్రహః

సర్వ భూత దయా పుష్పం

క్షమా పుష్పం విశేషతః

శాంతి పుష్పం తపః పుష్పం

జ్ఞాన పుష్పం తధైవచ..”

“సహనం సర్వ దుఃఖానాం చింతాశోక విలపనం..” వంటి అనేక శ్లోకాలకు అద్భుతమైన అర్థాలు సోదాహరణంగా చెప్పేవారు నాయన.

వేదభాగమైన భృగువల్లిలోని ‘అన్నం న నింద్యాత్ ..అన్నం నపరిచక్షీతాత్’ వంటి మంత్రాలు, వాటి అర్థాలూ మనసును ఎంతో రంజింపజేసేవి.

సత్యం, శౌచం, అస్తేయం, అపరిగ్రహం, దానం వంటి అనేక విషయాల గురించి చెప్పిన కథలు.. మా జీవితాలను, వ్యక్తిత్వాలను దిద్దుకోవడంలో మాకందరికీ చాలా ఉపయోగ పడినాయి.

నాయనలో గానీ, అమ్మలోగానీ ఛాందసభావాలు కనిపించేవి కాదు. మా నాయనది జ్ఞానపూర్వక భక్తి. ఆయన కులమతభేదాలు కూడా పెద్దగా పాటించేవారు కాదు. ఆయన తర్వాత రోజుల్లో ఇతర కులాల వాళ్లకూ రుద్రం నేర్పించినారు. ఇప్పుడు రుద్రం చెప్పగల పెద్ద బృందం తయారయింది ఆ వూళ్లో. నేర్చుకోవడానికి శ్రద్ధ ఒక్కటే ముఖ్యమని ఆయన భావం!

నాయన చెప్పే కొన్ని కథలు, సంఘటనలు నా మనసులో నిలిచిపోయినాయి.

అందులో అబూ బెన్ ఆడమ్ అనే క్రిస్టియన్ భక్తుడి కథ ఒకటి! ఆడమ్  పరమభక్తుడు. నిత్యం దైవచింతనతో వుండేవాడు. కష్టించి పనిచేస్తూ, అందరికీ తలలో నాలుకగా వుంటూ, చేతనయిన దానధర్మాలు చేస్తూ, ప్రతీ పనీ దైవం తనకు అప్పగించిన కర్తవ్యంగా, శ్రద్ధగా చేసేవాడు.

ఒక రాత్రి అతను ధ్యానంలో వున్నప్పుడు ఒక దేవదూత ఒక పుస్తకంలో ఏదో రాస్తూ కనిపించినాడు. ఆయనకు అభివాదాలు తెలిపి, ‘ఆ పుస్తకంలో ఏమి రాస్తున్నావ’ని అడిగినాడు ఆడమ్ దేవదూతను.

“దేవుడిని ఇష్టపడుతున్నవాళ్ల జాబితా తయారుచేస్తున్నా”నని చెప్పినాడు దేవదూత.

“అందులో నా పేరేమైనా వుందా?” అడిగినాడు ఆడమ్. పేర్లన్నీ చదివినాడు దేవదూత. అందులో ఆడమ్ పేరు లేదు.

‘అయ్యో.. నేను చేస్తున్న సాధన సరిపోవడం లేద’నుకొని, మరింత శ్రద్ధగా ధ్యానంలో మునిగి పోయినాడు ఆడమ్ .

మరి కొన్నాళ్ల తర్వాత ఒక రాత్రి మళ్లీ  ఆ దేవదూత కనిపించినాడు. మళ్లీ యేదో రాస్తున్నాడు. ‘ఈసారి ఏమి రాస్తున్నావ’ ని అడిగినాడు ఆడమ్.

‘ఈసారి దేవుడికి ఇష్టమైన వాళ్ల పేర్ల జాబితా తయారుచేస్తున్నా’నని చెప్పినాడు దేవదూత.

“మరి నా పేరు యేమైనా ఇందులో వుందా?” అడిగాడు ఆడమ్ .

“మొదటి పేరు నీదే!” చెప్పినాడు దేవదూత ఆనందంగా.

సంతోషంతో, మరింత కృతజ్ఞతతో దైవసేవకు అంకితమైనాడు ఆడమ్.

దేవుడిని గంటల కొద్దీ పూజించడం కంటే దైవీగుణాలను ఒంటబట్టించు కోవడమే దైవాన్ని చేరుకోవడానికి తేలికమార్గం అని చెప్పే ఈ కథ మాకందరికీ ఇష్టమైనది.

మరో సంఘటన కూడా ఒకటి, చాలా విలువైనది చెప్పేవారు మా నాయన.

మా బంధువుల్లో మన్యం మునిస్వామయ్య గారని ఒక పెద్దాయన నంద్యాలలో లాయర్‌గా వుండేవారు.

ఆయన కూడా దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడిగా వుండి, ఆ సంస్థలో ఏవో కీలక బాధ్యతలు నిర్వహించినారు. ఆయన ప్రేరణతోనే నాయన దివ్యజ్ఞాన సమాజంలో చేరినారట!

ఒకసారి అనీబిసెంటు గారు (ఆవిడ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించి, ముందుకు నడిపినవారిలో ప్రముఖురాలు) రాయలసీమ పర్యటనలో భాగంగా నంద్యాల లోని మునిస్వామయ్య గారింట్లో బస చేసినారు.

అనీబిసెంటును గురువుగా భావించిన మునిస్వామి గారి తల్లి  ఆమె పాదాల దగ్గర వినయంగా కూర్చుని, తమిళంలో.. “అమ్మా! నాకేదైనా మంత్రం చెప్పమ్మా! శ్రద్ధగా చేసుకొని, తరించిపోతాను” అని ప్రాధేయపూర్వకంగా అడిగినారట!

దానికి సమాధానంగా అనీబిసెంట్ గారు తల ఒక పక్కగా వొంచి, నవ్వుతూ, ఆమె కళ్లలోకి లోతుగా చూస్తూ,

“Be good.. that is the mantra “ అన్నారట.

దాని అర్థం కొడుకు ద్వారా తెలుసుకున్న పెద్దావిడ ..

“అది సరేనమ్మా.. నేను అడిగింది మంత్రం అమ్మా.. ఏదైనా దేవుడి మంత్రం నా చెవిలో చెప్పు తల్లీ!” అని మరింత వినయంగా అడిగిందట.

“Be always good.. that is the greatest mantra.. దీనికన్నా గొప్ప మంత్రం నేనేమీ చెప్పలేను” అన్నారట అనీబిసెంట్ .

అప్పుడు ఆ పెద్దావిడ అర్థం చేసుకున్నారు, మంచితనాన్ని మించిన మంత్రం లేదని..

ఇలాంటివి విన్నప్పుడు ఒళ్లు పులకరించి పోయేది.

మరో చిత్రమైన కథ చెప్పేవారు నాయన.

ఒక ఋషి తాను రోజూ భోంచేసేటప్పుడు ఒక ఆకు దొన్నెలో కొన్ని నీళ్లు, ఒక చిన్న ఆకులో ఒక సూదిని తను తినే విస్తరి పక్కన పెట్టమనేవారట భార్యతో. ఆవిడ అట్లాగే చేసేదట. కానీ దాన్ని దేనికీ వాడే వాడు కాదు ఆయన.

అసలు రోజూ దాన్ని భోజన సమయంలో ఆయన ఎందుకు పెట్టమంటాడు.. అన్నది ఆమెకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

‘ఎప్పుడైనా ఆయనే చెప్తారులే’ అని ఊరుకున్నది ఆవిడ.

ఏళ్లు గడిచిపోయినాయి.

చివరకు ఋషి గారికి వృద్ధాప్యం వచ్చి, చివరి క్షణాల్లో వున్నారు. భార్యకూ, పిల్లలకూ చెప్పవలసినవి అన్నీ చెప్పినారు.

అప్పుడు ఆయన భార్య ఆయన పక్కన కూర్చుని, “నాకొక సందేహం వుంది. మీరు తప్పక తీర్చాలి. రోజూ భోజనసమయంలో దొన్నెలో నీళ్లు, సూది ఎందుకు పెట్టమనేవారు? దాని అంతరార్థం ఏమిటి?” అని అడిగిందట.

దానికి ఆయన చిన్నగా నవ్వి, “అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా.. చిన్న మెతుకును కూడా నిర్లక్ష్యం చేయరాదు. నీవు వడ్డించే సమయంలో గానీ, నేను తినేటప్పుడు గానీ పొరబాటున మెతుకు కిందపడితే.. ఎడం చేత్తో అన్నాన్ని ముట్టుకోకూడదు, తింటున్న ఎంగిలి చేతిని నేల పైన  పెట్టకూడదు కదా.. అందుకే ఆ మెతుకును సూదితో గుచ్చి తీసుకొని, దొన్నెలోని నీళ్లలో దాన్ని  కడిగి, ఆకులో వేసుకోవచ్చని అట్లా పెట్టమన్నాను. కానీ, ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నువ్వు ఒక్క అన్నం మెతుకును కూడా కిందపడేలా వడ్డించలేదు. నేనూ అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకును కూడా కింద పడనివ్వలేదు. మనిద్దరం అంత శ్రద్ధగా పనులు చేసినాము.. జీవితాన్ని సార్ధకం చేసుకున్నాము. ఎల్లప్పుడూ అన్నాన్ని దైవభావంతో చూడాలి..” అని చెప్పి ప్రాణం విడిచి పెట్టినాడట ఆ ఋషి.

అన్నం విలువ చెప్పడానికి ఈ కథ చెప్పేవారు మా నాయన.

అప్పటికి మాత్రం ‘ఈసారి నించీ ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినాల’ అని ప్రతిజ్ఞలు చేసుకునేదాన్ని.

ఎంత ప్రయత్నించినా ఈనాటికీ ఆ మంచి అలవాటు నాకు అలవడనే లేదు. మా నాయనకు కంఠశోషే మిగిలింది.

అట్లా మా నాయన చెప్పే మంచిమాటలు వినేసి, చాపలన్నీ సర్దేసి, అందరం బిలబిల్లాడుతూ కిందికి వొచ్చేసేవాళ్లం.

తరువాత అరుగుల మీద కూర్చుని, రకరకాల ఆటలు ఆడడం, పేపరు, వారపత్రికలు, నవలలు చదవడం లాంటి కార్యక్రమాల్లో మునిగిపోయేవాళ్లం!

ఇంతలో పేపర్లు, వారపత్రికలు తెచ్చే సుబ్బారెడ్డి వొచ్చి “ఆంధ్రప్రభ వొచ్చింది.. తీసుకోండీ..” అని ఒక్క కేకపెట్టి అరుగు మీద పేపర్లతో పాటు పత్రికనూ విసిరి వెళ్లిపోయేవాడు.

మా వూరికి పొద్దెక్కి ఆలస్యంగా వొచ్చేవి పేపర్లు, పత్రికలూ.. బస్సెక్కి ఏ హైదరాబాదు నుంచో, కర్నూలు నుంచో రావాల కదా! వారపత్రికలు కూడా ఒకటి రెండు రోజులు ఆలస్యంగా వొచ్చేవి.

ఆ కేక వినగానే మా అక్కావాళ్లు “నాకు ఫస్ట్..” అని ఒకరంటే, “నాకు సెకెండ్.. నాకు థర్డ్..” అని  మరొకరూ, ఇంకొకరూ  ఇట్లా గావుకేకలు పెట్టి ఆ వారపత్రికను రిజర్వ్ చేసుకునేవాళ్లు.

ఇంత హడావిడీ ఎందుకంటే..ఆ పత్రికలో వొచ్చే సీరియల్స్ చదవడం కోసం అన్నమాట! “శారద, ఆనంద్‌ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా?”,

“లత రాసిన ఉత్తరాన్ని చదివి సురేష్  ఏమంటాడు?”,

“అత్తగారింట్లో కమల కష్టాలు ఎప్పటికైనా గట్టెక్కుతాయా?” అని వారమంతా తర్జనభర్జన పడుతూవుంటారు కదా మరి! ఆ మాత్రం ఆత్రుత వుండటం సహజమే కదా!

పైగా అక్కావాళ్ల స్నేహితురాళ్లు కంబైన్డ్ స్టడీస్ పేరుతో కలిసి చదువుకోవడానికి మా ఇంటికి వొస్తుంటారు.

మేడమీద వరండాలో కూర్చుని చదువుకోవడమేమో గానీ, సీరియల్స్‌లో, కథల్లో పాత్రల గురించి విశ్లేషించుకోవడమే ఎక్కువ!

పాత్రచిత్రణలో రచయిత చేసిన తప్పులను దుమ్మెత్తి పోస్తుండేవారు. కొన్నింటిని విపరీతంగా మెచ్చుకునేవారు. అది దుఃఖాంత సీరియల్ అయితే కళ్లనీళ్ల పర్యంతమయ్యేవారు. సుఖాంతమైతే తుళ్లి పడుతుండేవారు.

ఇక ఆంధ్రప్రభలో వొచ్చే ‘ప్రమదావనం’ శీర్షిక మా అక్కావాళ్లకూ, అమ్మకూ చాలా ఇష్టం. ఆ శీర్షిక పేజీలనూ, కొన్ని ఇష్టమైన సీరియళ్లనూ కత్తిరించి, విడివిడిగా బైండ్ చేయించుకోని పెట్టుకునేవారు.

మా నాయన స్నేహితుడు ఒకాయన మాత్రం దానిని ‘ప్రమాదవనం’ అని ఎగతాళి చేసేవారు.

మాలతీచందూర్ గారి ‘జవాబులు’ శీర్షికను గురించి, ఆవిడ చెప్పే కొత్తకొత్త విషయాలను, వంటలను గురించి మా ఇంట్లో బోలెడు చర్చలు జరుగుతుండేవి.

జవాబులు శీర్షికలో ఇంటికి సంబంధించిన ప్రశ్న అడిగితే.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో సమాధానమిచ్చేవారు ఆవిడ. ఒక్కొక్కసారి అడిగిన ప్రశ్నకూ, ఇచ్చిన జవాబుకూ అంతగా సంబంధం వుండేది కాదు. కానీ, ఎంతో విలువైన సమాచారాన్ని  అందించి ఏళ్లతరబడీ అందరి అభిమానాన్నీ పొందిన శీర్షిక అది!

అట్లా ‘ప్రమదావనం’ శీర్షిక నవ్వుల పువ్వులు పూయిస్తూ వుండేది మా ఇంట్లో!

మా అక్కావాళ్లు చేసే ఇలాంటి చర్చలన్నీ నాలాంటి వాళ్లకు కథల, నవలల మంచిచెడులను ఎట్లా సమీక్షించుకోవాల.. అనే యోచనకి వూపిరులూదినాయి.

పొరబాటున మాలాంటి చిన్నపిల్లల చేతిలో పత్రికలు మొదట పడితే, అక్కావాళ్లు వొచ్చి మమ్మల్ని బతిమలాడేవారు.

రకరకాల వరాలు ఇచ్చేవాళ్లు. “అమ్మణ్నీ.. నీకేం కావాలంటే అది ఇస్తా” నంటూ ఆశ చూపించి పత్రికను పట్టుకెళ్లేవారు.

అయితే అవన్నీ నిలబెట్టు కుంటారనే భరోసా ఏమీ లేదు.

అప్పటికి సీరియల్స్ పైన నాకు అంత పట్టు లేకపోవడంతో.. పోనీలెమ్మని అక్కావాళ్లకు పత్రికను ఇచ్చేసేదాన్ని!

నేను చేసిన ఈ ఉపకారానికి బదులుగా అక్కావాళ్ల దగ్గర్నుంచి ఏమేమి పనులు సాధించుకోవొచ్చా.. అని ఆలోచనలో పడిపోయేదాన్ని!

Exit mobile version