అమ్మంటే అమ్మే కదా!
ఎవరెన్ని విధాలుగా వర్ణించినా
ఆకాశమంత అమ్మ త్యాగవర్ణాలను
సూర్యకిరణాలతో పోల్చగలం!
రక్తంలో రక్తంగా.. మాంసంలో మాంసంగా
బొడ్డుతాడు మాతృత్వబంధాన్ని
ఆజీవనం నిర్వహించిన అమ్మ
అమృతత్వాన్ని ఏ దైవత్వంతో పోల్చగలం!
పొత్తిళ్ల పురిటివాసన దాటీదాటకముందే
బుడి బుడి అడుగుల బహుకష్టపు నడకల్లో
లేత పిడికిళ్లలో ధైర్యమంత్రం పోసి
పడినా లేపి ముందుకే నడిపించిన అమ్మ
కర్తవ్య పదముద్రల్ని ఏ సందేశగ్రంథాలతో పోల్చగలం!
అక్షర సముద్ర తరంగాలలో మునకలేస్తూ
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు
మునివేళ్ళతో లేతపదాలను మోహరిస్తూ
అలలకి ఎదురునిలవటం నేర్పించిన అమ్మ
పోరాటపటిమను ఏ ప్రపంచయుద్ధాలతో పోల్చగలం!
విధినిర్వహణలో వేసటచెందే దూరంలో ఉన్నా
విరామంలేకుండా రేయింబవళ్ళు బిడ్డలకోసమే
కనురెప్పల్ని కాపలా ఉంచిన అమ్మ
పహరాను ఏ సైనికుడితో పోల్చను!
చివరి కంటిబొట్టుతో తుదిశ్వాస విడుస్తూ
చితిమంటల్లోంచికూడా అటువైపే చూస్తూ
వదలలేక దీవించి వెళ్ళిపోయిన అమ్మ
వీడ్కోలు వైరాగ్యాన్ని ఏ యోగితో పోల్చగలం!
కన్నతల్లినుంచి నేలతల్లిదాకా
సాగించే మన జీవనయానంలో
అనుక్షణం దర్శించిన అమ్మతనాన్ని
ఏ ఋణభారంతో పోల్చగలం!
ఎన్ని జన్మలకైనా ఎలా తీర్చగలం!
మొదటి చూపు.. ముద్దు.. పంచి ప్రేమించిన
అమ్మతనాన్ని ఏ దైవత్వంతో పోల్చగలం!