[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘అమ్మరో.. వందనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చాలా రోజుల తర్వాత
తనను చూడడానికి వస్తున్న
పిల్లల రాక కోసం
నిరీక్షిస్తున్న కన్నతల్లివోలె
ఏడాదికోసారి తన పేరిట
జరిగే జాతరకు తరలివస్తున్న
అశేష భక్త జనులను
వీక్షిస్తున్నది అమ్మవారు
అమ్మరో.. వందనం
అందుకో అనుదినం
విందులు వినోదాలు
భౌతికానందాలు వగైరాలే
అమ్మ కోసం ప్రేమతో
తెచ్చింది లేదు ఇచ్చింది లేదు
ఆమె నుంచి ఆశపడడమే
దండాలు పొగడ్తలు
అట్టహాసాలు ఆర్భాటాలే
అమ్మవారిని భక్తితో
కొలిచింది లేదు తలిచింది లేదు
ఏదో మొక్కుబడిగా రావడమే
అమ్మరో.. వందనం.
అందుకో అనుదినం
అమ్మా అని పిలిస్తే చాలు
ఉదారతకు గొప్ప నిరూపణం
బిడ్డల కోరికలను గమనించి
వాళ్ళను మెప్పించిందే తప్ప
ఏ మాత్రం నొప్పించింది లేదు
అమ్మవారిని స్మరిస్తే చాలు
ఆదరణకు నిలువెత్తు నిదర్శనం
భక్తుల నివేదనలు ఆలకించి
ఎన్నిటినో పరిష్కరించిందే తప్ప
ఏ మాత్రం తిరస్కరించింది లేదు
అమ్మరో.. వందనం
అందుకో అనుదినం
ఇద్దరిది ఒకే సారూప్యం
అమ్మ మానవతామూర్తి
అమ్మవారు దేవతామూర్తి
నిజానికి ఇద్దరమ్మలకు
అడిగింది ఇవ్వడమే తప్ప
ఏది అడగని గొప్పతల్లులు
అమ్మరో.. వందనం
అందుకో అనుదినం
