Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మతనం

[శ్రీమతి సుగుణ అల్లాణి రచించిన ‘అమ్మతనం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది. మోకాళ్ళ నెప్పుల వలన గబగబా నడవలేక అవస్థలు పడుతూ తలుపు తీసింది గిరిజ .

ముప్పైయ్యారేళ్లకు అటుఇటుగా ఉన్న ఒకతను నిలబడి ఉన్నాడు.

కళ్లద్దాలు సర్దుకొని “ఎవరు?.. ఎవరు కావాలి?” అన్నది.

“నా పేరు శ్రవణ్.. గిరిజమ్మ గారూ..”

“ఆ..నేనే..”

“నమస్కారం.. అమ్మా!” అన్నాడు శ్రవణ్

“నమస్తే.. ఎవరు బాబూ..?”

“నాలుగేళ్ల నుండి వెదుకుతున్నాను.. మీ కోసం.. ఇప్పటికి కనిపించారు.. థాంక్ గాడ్!!” నిట్టూర్పు విడుస్తూ అన్నాడు శ్రవణ్.

“అవునా! నన్ను ఎందుకు వెదుకుతున్నావు?” ఆశ్చర్యంగా అన్నది గిరిజ.

“అమ్మా! లోపలికి రావచ్చా?”

“అయ్యో! రా బాబూ.. నా మతి మండా, అక్కడే నిలబెట్టాను.. కూర్చో! మంచి నీళ్లు పట్టుకొస్తాను” అంటూ వెళ్ళబోతుంటే

“అయ్యో! అమ్మా! వద్దు.. పరవాలేదు.. మీరు ఇలా కూర్చోండి.. మాట్లాడాలి మీతో..” అనీ ఆపబోయాడు.

“ఒక నిమిషం ఉండు.. వస్తాను..” అని వెళ్లి కాస్త కరాబూందీ.. ఒక మడతకాజా ప్లేటులో పెట్టుకొని మరో చేత్తో నీళ్ల బాటిల్ పట్టుకొని అడుగులో అడుగు వేస్తూ వస్తుంటే.. శ్రవణ్ ఎదురు వెళ్లి చేతిలోని వాటర్ బాటిల్ తీసుకోని మరో చేత్తో గిరిజ చేయి పట్టుకొని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టినాడు.

“తిను నాన్న!” అన్నది ఆప్యాయంగా.

ఆ ఆప్యాయతకి శ్రవణ్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

అది చూసి గిరిజ కంగారు పడి.. “ఏమైంది బాబూ! ఎందుకెడుస్తున్నావూ!” అన్నది

“ఏమీ లేదమ్మా!.. ఊరికే.. కళ్లలో నలక పడినట్టుంది” అన్నాడు.. వాటర్ బాటిల్ తీసుకోని కొన్ని నీళ్లు తాగాడు. పక్కన వచ్చి కూర్చున్నాడు..

“చెప్పు.. ఎవరు నీవు..? నన్ను నాలుగేళ్లుగా ఎందుకు వెదుకుతున్నావు? నేనెవరో నీకు తెలుసా? ఎలా తెలుసు?”

గిరిజ అన్ని ప్రశ్నలని ఒక్కసారి అడిగేసరికి.. శ్రవణ్‌కి నవ్వొచ్చింది..

“చెప్తాను.. ఇది మీరు జీవం పోసిన ప్రాణం! మీరిచ్చిన జీవితం.. చివరికి నా పేరు కూడా మీరు పెట్టిందే!.. అమ్మా!” అంటూ తన పేరు చెప్పాడు.

“ఓ.. ఆ శ్రవణా నీవు.. సన్నగా పీలగా ఉండేవాడివి.. ఎంత ఎదిగిపోయావు.. గుర్తు పట్టలేక పోయా.. నమ్మలేక పోతున్నాను.. చాలా ఆనందంగా ఉంది..” కళ్ళలో ఆనంద బాష్పాలు జారుతుండగా శ్రవణ్‌ని తడిమి చూసింది.

“ఇప్పుడు ఏమి చేస్తున్నావు? ఏమి చదుకున్నావు?”

“అమ్మా! నేను మెడిసిన్ చేశాను.. లండన్ వెళ్లి హార్ట్ సర్జరీలో స్పెషలైజేషన్ చేశాను.. ఇక్కడే హైదరాబాద్‌లో హాస్పిటల్ ఒకటి నిర్మించాను.. దానికి మీ పేరే పెట్టాను గిరిజామనోహర్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ అని.. అది పూర్తయి దాదాపు మూడు సంవత్సరాలయింది. కానీ మీతోనూ సర్ తోనూ ఓపెన్ చేయించాలి అని నా కోరిక.. అందుకే అలాగే ఉందింకా.. మీకు ఎప్పుడు వీలు ఉందో చెప్పండి ఆ రోజే ముహూర్తం పెట్టుకుందాం.. మీరు నాకు కనిపించిన రోజే నాకు మంచి రోజు..”

“అలాగా..” ఆశ్చర్యంతో తేరుకోలేకపోయింది గిరిజ.

“అమ్మా! అయ్యగారు..?”

“లోపల పడుకున్నారు.. చూస్తావా..” అంటూ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లింది.

మంచం మీద గిరిజ భర్త మనోహర్ పడుకొని దిండుకానుకొని పుస్తకం చదువుతున్నారు.

“సర్! నమస్కారం” అంటూ కాళ్లకు దండం పెట్టాడు శ్రవణ్.

“అమ్మా! ఏమైంది సర్‌కి..!”

“ఏదో నరాల బలహీనత అంటున్నారు.. ఎక్కువ నడవలేరు.. ఇదుగో ఈ వాకర్‌తో నడుస్తారు. మూడేళ్లు అయింది.. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసారు.. మందులు ఇచ్చారు.. అవే వేసుకుంటున్నారు..”

“ఒకసారి నాకు రిపోర్ట్ చూపించగలరా..”

“ఆ.. తప్పకుండా.. తెస్తాను ఉండు.. ”

ఆ రిపోర్ట్స్ అన్ని చూసి.. ఫోన్ తీసుకొని బయటకు వెళ్లి ఎవరితోనో మాట్లాడి వచ్చాడు శ్రవణ్.

“ఇప్పుడు నా ఫ్రెండ్ వస్తాడు.. న్యూరో సర్జన్.. రమేష్. అతను సర్‌ని ఒకసారి చూసి ఏమైనా సజేషన్ ఇస్తాడేమో చూద్దాం అమ్మా!” అన్నాడు శ్రవణ్.

మనోహర్ కూడా హాల్లోకి వచ్చారు.. అరగంటలో డాక్టర్ వచ్చాడు..

గిరిజ టీ చేస్తే శ్రవణ్ ట్రే పట్టుకొని వచ్చి అందరికి ఇచ్చాడు.

రమేష్ రిపోర్ట్ లు అన్నీ చూసాడు..

“ఎప్పుడైనా కింద పడ్డారా సర్..” అన్నాడు

“ఏమో.. ఈ మధ్య కాలంలో అలా ఏమీ జరగలేదు. ఎప్పుడో కాలేజీ రోజుల్లో బైక్ పైనుండి పడ్డాను. కాలు ఫ్రాక్చర్ అయింది మూడు నెలలకు బాగైంది.. మళ్ళీ ఎప్పుడూ కిందపడిన గుర్తు లేదు మరి.”

“సరే సర్.. ఒక్కసారి హాస్పిటల్‌కి రండి.. చెక్ చేద్దాము..”

“అలాగే..”

“నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను సర్..” అన్నాడు శ్రవణ్.

“అయ్యో మేమే వస్తాము.. డ్రైవర్ ని తీసుకోని..” అన్నది గిరిజ.

“అలా కాదమ్మా.. నేను వస్తాను.. అమ్మా! ఇనాగరేషన్ డేట్‌తో త్వరలో వస్తాను..” అంటూ నమస్కారం చేసి వెళ్లిపోయారు.

***

“చాలా సంతోషంగా ఉందండి.. అసలు ఊహించలేదు. అశ్చర్యంగాను ఉంది.” సంతోషంతో అన్నది గిరిజ.

“సన్నగా పీలగా ఉండే ఆ పిల్లవాడు ఇలా ఇంత అందంగా ఎలా అయ్యాడు? అసలు బతుకుతాడో లేదో అని కూడా అన్నారు..”

అందుకు మనోహర్.. “అప్పడే కదా.. నీవు ఆ పిల్లాడిని చూసావు.. ఆ గిల్డ్ చిల్డ్రన్స్ హోంకి ప్రతినెలా మనం డబ్బు ఇచ్చేవాళ్ళం.. గుర్తుందా! నేను బ్యాంకు అకౌంట్‌లో వేద్దాము అంటే వినకుండా నీవు స్వయంగా ఇచ్చి పిల్లలను చూసి కాసేపు ఆడుకుని రావచ్చని నెలకోసారి వెళ్లి పిల్లలతో ఆడుకొని రావడం అప్పుడు మనకలవాటైన పనికదా..

ఈ అబ్బాయి చాలా అనారోగ్యంతో హోంలో జాయిన్ అయ్యాడని చెప్పారు. నీవు చూసి తల్లడిల్లి పోయావు.

జబ్బు ఏంటో తెలియదు అన్నారు డాక్టర్లు.

ఆఫీసుకి లీవు పెట్టి ఆపిల్లవాడితో హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్లతో మాట్లాడినావు. మూడేళ్ల పిల్లవాడు ఏడాది పిల్లాడిలా ఉండడం చూసి న్యూట్రిషన్ డెఫిసిటి అన్నారు.. అందుకోసం వాళ్ళు చెప్పినట్లే రోజూ హోమ్‌కి వెళ్లి వాడికి కావలిసిన ఫుడ్ మందులు తీసుకెళ్లి పొద్దున నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి వాడిని చూసుకునేదానివి కదా!..” అంటూ గతం లోకి వెళ్లాడు మనోహర్

“ఎందుకో వాడంటే నాకు ఎంతో ఇష్టం ఉండేది.. ఏదో బంధం మమ్మల్ని దగ్గర చేసిందనుకునే దాన్ని. ఇంటికి తెచ్చుకుందామని.. దత్తత తీసుకుందామని ఎంత బతిమాలినా అత్తగారు మామగారు అసలు ఒప్పుకోలేదు.. వాళ్లకు మీరొక్కరే.. మన పిల్లలే వారసులు కావాలని పట్టుబట్టడంతో ఏమీ చేయలేక పోయాము.. వాళ్ళు కాలంలో కలిసిపోయారు.. పిల్లల కోసం ఎదురుచూస్తూ కాలం ఎప్పుడు గడిచిపోయిందో మనకు తెలియనేలేదు. అమ్మను కాకుండానే జీవితం ముగింపు దగ్గరకొచ్చింది” అంటూ కళ్ళు తుడుచుకుంది గిరిజ

“ఎవరన్నారు నీవు అమ్మవు కావని? నీ హృదయం అమ్మతనంతో నిండి ఉంటుంది.. ఎందరు అమ్మాయిలకు పెళ్లిళ్లకు సహాయం చేసావు.. ఎందరికి చదువు చెప్పించావు.. కంటేనే తల్లి కాదు గిరిజా! అమ్మ ప్రేమ కలిగిన ప్రతి ఆడది అమ్మే..” అంటూ గిరిజ చేతులను పట్టుకున్నాడు మనోహర్.

“ఏమో.. కానీ మనూ.. నా గుండెలో ఏదో మూల శ్రవణ్ కదులుతూనే ఉంటాడు. వాడిని తలుచుకునపుడు ఎలా వున్నాడో, అస్సలున్నాడో లేదో అని మనుసు విలవిలలాడుతుంది. ఇలా నా ముందుకు వస్తాడని అనుకోలేదు.. మనూ.. గుర్తుందా.. మీరు ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్లేప్పుడు యాభై వేలు వాడి పేరు మీద డిపాజిట్ చేసి.. ఆ ఇంట్రస్ట్ మందులకు మంచి తిండికి వాడమని చెప్పి.. మేజర్ అయ్యాక వాడి చదువుకున్న ఉపయోగించమని రాసి ఇచ్చి వచ్చాము.. ఎంత మంచిదైంది.. అవి ఎంతవరకు వాడికి ఉపయోగ పడ్డాయో కానీ.. వాడు బతికి మంచి డాక్టర్ అయ్యి సమాజానికి ఉపయోగ పడుతున్నాడు” గిరిజ ముఖం వెలుగులు చిమ్ముతున్నది.

“ఏమైనా నీ సంకల్పం చాలా గొప్పది గిరిజా! ఏమి ఆశించకుండా నీవు చేస్తావు చూడు.. నీలో నా కదే నచ్చేది.. అవి అందరికి అర్థం కావు.. ఏ స్వార్ధం లేకుండా ఎందుకు చేస్తుంది అంటారు అనుకుంటారు కూడా.”

“అనుకునే వాళ్ళు ఎన్నో అనుకుంటారు.. వాళ్ళ నోటికి అడ్డు కాగలమా.. అయినా ఇవాళ నెగెటివ్ మాటలొద్దు మనూ! నేను చాలా హ్యాపీగా వున్నాను..”

“మళ్ళీ శ్రవణ్ వస్తాను అన్నాడు కదా..! వాడికి పెళ్లి అయిందంటారా? అడగనేలేదు.. సరిగా మాట్లాడనేలేదు.. ఏంటో అంతా అయోమయం.. అలా అయింది నా పని..” అని నుదురు చేత్తో తట్టుకుంది

“మళ్ళీ వస్తాడు కదా! అన్ని కనుక్కుందువు లే! దిగులెందుకూ!!!”

“అంతే లెండి..”

***

మర్నాడు శ్రవణ్ వచ్చి మనోహర్‌ని హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేయించాడు.. డా. రమేష్ మరో ఇద్దరు న్యూరాలజస్ట్లను సంప్రదించి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.

గిరిజకు కూడా పరీక్షలు చేయించారు. మోకాళ్ళ నెప్పులకు మందులు ఇచ్చారు. అవసరమైతే మోకాళ్ళ ఆపరేషన్ చేద్దాము అని చెప్పినారు.

ఇంటికి వచ్చాక..

శ్రవణ్.. “అమ్మా! ఇక నుండి మిమ్మల్ని గురించి మీరు దిగులు పడకండి. నేనున్నాను. మీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను. ” అన్నాడు.

గిరిజ అడ్డుపడుతూ.. “ఎందుకు నీకు కష్టం.. ముందే డాక్టర్‌వి..నీ పనులతో బాగా బిజీగా ఉంటావు.. ఎప్పుడైనా ఇలా వచ్చి వెళితే చాలు శ్రవణ్.. ఏమీ ఇబ్బంది లేదు మాకు..” అన్నది.

“అమ్మా! నాకోసం మీరు ఉద్యోగానికి లీవు పెట్టినపుడు మీకు ఇబ్బంది కలిగిందా? ఆ రోజుల్లో అంత డబ్బు నాకోసం ఇచ్చినపుడు మీకు ఇబ్బంది కలగలేదా?”

“అది వేరు రా! అయినా ఇవన్నీ ఎలా తెలుసు?” అన్నది గిరిజ

శ్రవణ్ గట్టిగా ఊపిరి విడిచి “ఆ తర్వాత నేను ఒక సంవత్సరానికి లేచి నడవగలిగినానట. మెల్లిగా ఆరోగ్యం కుదుట పడింది. తర్వాత ఏ అనారోగ్య సమస్య రాలేదు. నేను గిల్డ్ హోమ్‌లో నాకు పదేళ్లు వచ్చేవరకు వున్నాను. తర్వాత వాళ్లకు సంబంధించిన మరొక హోంకి షిఫ్ట్ చేసారు. పదో తరగతిలో ఉన్నపుడు ఆ సూపర్‌వైజర్ రంగారావు గారు నాకు మీ గురించి చెప్పారు. ఆ యాభై వేల గురించి కూడా అప్పుడే చెప్పాడు. తనే గార్డియన్‌గా ఉండి ప్రతినెలా నాకు డబ్బు అందేలా చూసేవారు. ఆ తరువాత చాలా కష్టపడి ఎన్నో పనులు చేసి చదువుకున్నాను. మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. మెడిసన్ పూర్తయి ఒక హాస్పిటల్‌లో చేరాను.

దాదాపు ఇరవై ఏళ్లకు రంగారావు ఒకసారి మా హాస్పటల్‌కి ట్రీట్మెంట్ కి వచ్చారు.. నేనే గుర్తుపట్టి అడిగాను.. మీ గురించి. ఎవరెవరికో ఫోన్ చేసి సర్ ఆఫీస్ నెంబర్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని అప్పటినుండి వెతకడం మొదలుపెట్టాను. ఎక్కడెక్కడో తిరిగాను. ఇన్నాళ్ళు చేసిన నా ప్రయత్నం ఇప్పటికి నెరవేరింది.

ఇక మిమ్మల్ని నేను దూరం చేసుకోలేను. మీరు నా దగ్గరికి రాలేక పోతే నేనే మీ దగ్గరికి నా ఫ్యామిలీతో సహా వస్తాను..” అన్నాడు.

“ఫ్యామిలీనా? పెళ్లి అయిందా?” ఉత్సాహంగా అడిగింది గిరిజ.

“అవును.. రెండేళ్లు అయింది.. ఒక పాప కూడా.. మీ పేరే.. గిరిజామనోహరి..” అన్నాడు.

గిరిజా మనోహర్‌లు ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు. సంతోషంతో వెలుగుతున్నారు.

“సరే వస్తాము.. కానీ మాకు ఇక్కడ విసుగు వచ్చినపుడు వస్తాము. మా ఇష్టం వచ్చినన్ని రోజులండి ఇక్కడికి వస్తాము. ఒకేనా?” అన్నది గిరిజ

“సరే అమ్మా! మీ ఇష్టం కానీ నన్ను ఒంటరి వాడిని చేయకండి దయచేసి..” అంటూ కళ్ల నీరు పెడుతూ కాళ్ల మీద పడిపోయాడు

“అలాగే లేరా!” అంటూ శ్రవణ్‌ని లేపి నుదుటి పైన ముద్దు పెట్టింది గిరిజ.

Exit mobile version