Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మాయి నవ్వింది

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘అమ్మాయి నవ్వింది’. రచన శ్రీమతి రోహిణి భైరవజోశ్యులు.]

ఇల్లు ఖాళీ చేసి, సామాన్లంతా లారీలో నింపేసి, వేరే ఇంటికి బయలుదేరారు సుధ, సంతోష్‌లు.

“మళ్ళీ ఇటుకేసి రావాలి సుధా” అన్నది విజయ.

“ఏమిటో! ఇంటి ఓనర్స్‌కు ఈ ఊరికి బదిలీ అవడంతో, మీరీ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇన్నాళ్లూ అందరూ అక్కచెల్లెళ్లలాగా కలసిపోయి సరదాగా ఉన్నాం. వెళ్ళిపోతుంటే బాధగా ఉంది” సుందరి బాధగా నిట్టూర్చింది.

అలా ఆ వీధిలో ఉన్న ఆడవాళ్ళంతా వీడ్కోలు ఇచ్చారు.

“ఈ ఊరిలోనేగా ఉంటాం! ఆ కొత్త ఇంటికి అందరూ రావాలి.” వీడ్కోలు తీసుకుంటూ చెప్పింది సుధ.

లారీతో పాటు తామూ స్కూటర్ పైన బయలుదేరారు సుధా, సంతోష్‌లు.

అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.

***

పెద్ద ఇనుపగేటు తెరచుకుని లోపలికి ప్రవేశించారు సుధా, సంతోష్‌లు. అదొక పెద్ద ఇల్లు. ఇంటి చుట్టూ చాలా పెద్ద కాంపౌండ్. ఈ మధ్యనే శుభ్రం చేయించినట్టుంది.

‘కాస్త చదును చేయించి, మట్టి వేయించుకుంటే, మొక్కలు పెంచుకోవచ్చు.’ అనుకుంది సుధ.

ఈ ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు, లోపలంతా దుబ్బుగా పెరిగిన గడ్డి, ఎండిపోయిన మొక్కలతో చూడడానికి ఒక అడవిలా ఉండేది. ‘ఇదంతా శుభ్రం చేసుకుంటే, ఎన్నో మొక్కలు వేసుకోవచ్చు. ఇంతకు ముందున్న ఇంట్లో ఇంత విశాలమైన ఆవరణ లేదు.’ అనుకున్నది సుధ.

ఓనర్స్ నాగపూర్‌లో ఉంటారు. ఇల్లంతా శుభ్రం చేయించారు కానీ ఈ ఆవరణ శుభ్రం చేస్తానన్న మనుషులు వెంటనే రాలేదని, మరో వారంలో వస్తారని, రాకపోతే తమనే శుభ్రం చేయించుకోమని వాళ్ళు చెప్పారు. అన్నట్టుగానే శుభ్రం చేయించారు.

సామానంతా లోపల చేరవేశారు. ఇల్లు బాగా పెద్దగా విశాలంగా ఉంది. ఇంటికి ముందువైపు గ్రిల్ ఉన్న వరండా, లోపల హాల్, తరువాత డైనింగ్ ఏరియా, పక్కనే వంటిల్లు, హాల్‌కు రెండు వైపులా మూడు పడక గదులు, బాత్ రూములు, వెనుకవైపు మళ్ళా ఒక నడవా ఉంది.

‘ఇల్లు చాలా సౌకర్యవంతంగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వారో?’ పాత ఇంటి దగ్గర ఉన్న స్నేహితురాళ్లను తలచుకుంది.

మరుసటి రోజు సెలవు కాబట్టి ఇద్దరూ కలసి సామాన్లు సర్దుకున్నారు. తరువాత రోజునుంచి ఆఫీస్‌కు వెళ్ళడం మొదలు పెట్టాడు సంతోష్. అతను ఆఫీస్ నుంచి వచ్చేలోపల వీలైనంత సామాను సర్దేసేది సుధ. సాయంత్రం ఇద్దరూ ముందరి వరండాలో కుర్చీలు వేసుకుని, కూర్చుని, టీ తాగుతూ, కబుర్లు చెప్పుకునేవారు.

ఇన్ని రోజులైనా చుట్టుపక్కల వాళ్లెవరున్నారో కూడా తెలియలేదు. ఒకటి రెండుసార్లు పక్క కాంపౌండ్ లోని ఇంటివైపు చూసింది. ఎవరో ఒకావిడ బయటికి వచ్చి, సుధను చూసింది కానీ కనీసం పలకరింపుగా కూడా నవ్వలేదు. ఒకసారి సుధే ఆమెను చూసి, చిరునవ్వు నవ్వి, పలకరించబోయింది. కానీ ఆమె పని ఉన్నదానిలా వెంటనే లోపలికి వెళ్ళిపోయి, దడాలున తలుపులు మూసేసుకుంది.

‘అబ్బో! ఇది పోష్ లోకాలిటీ కాబోలు.. ఎవరూ ఎవరితో మాట్లాడరనుకుంటాను. అందరి ఇళ్ళ తలుపులూ ఎప్పుడూ మూసుకునే ఉంటాయి.’ నిట్టూర్చింది సుధ.

ఒకరోజు, “ఏమండీ! ఇక్కడ ఎవరూ మాట్లాడేవాళ్ళే లేరు. ఇంత పెద్ద ఇంట్లో, ఒక్కతే కూర్చుని, కూర్చుని బోర్ కొడుతోంది. ఎంతసేపని ఆ టీవీ చూస్తాను, పుస్తకాలు చదువుతాను? ఇంటిముందు చదును చేయిస్తే, మొక్కలు వేసుకోవచ్చు. నాకూ కాస్త కాలక్షేపం అవుతుంది. ఎవరైనా మనుషులు దొరుకుతారేమో చూడండి. ఈ నేలంతా చదును చేయించి, మట్టి వేయిద్దాము. వర్షాకాలం మొదలయింది. మొక్కలు కొని, నాటాలి.” అడిగింది భర్తను.

“ఆఫీస్‌లో కనుక్కుంటాను.” అన్నాడు సంతోష్.

***

“రేపు ఆదివారమే కదా! ఏదైనా సినిమాకెళదాం!” అడిగింది భర్తను.

‘అలాగే’ అన్నట్టు తల ఊపాడు.

***

ఆదివారం సాయంత్రం ఇద్దరూ సినిమాకు వెళ్లడానికి బయటికి వచ్చారు. ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఏ నిమిషంలోనైనా వర్షం పడే సూచనలు కనబడ్డాయి.

“వర్షం వచ్చేటట్టు ఉంది. స్కూటర్ వద్దులే! ఆటోలో వెళదాం.” అన్నాడు సంతోష్.

రోడ్డుమీద వెళుతున్న ఆటోను కేకేసి, అందులో సినిమా హాల్‌కు వెళ్ళారు. హాల్‌లో కూర్చున్నారు. ఇంకా సినిమా మొదలు పెట్టలేదు. చుట్టూ కలయచూసింది సుధ.

తమకు, రెండు వరుసల ముందు కూర్చున్న ఒకమ్మాయి, వెనక్కి తిరిగి, సుధను చూసి నవ్వింది.

అయోమయంలో పడిపోయింది.

‘ఎవరీ అమ్మాయి? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసానా? ఎప్పుడూ చూసిన గుర్తు లేదే.’ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగింది.

అంతలో లైట్లు ఆరిపోయాయి. సినిమా మొదలైంది. సినిమా చూడడంలో లీనమైపోయి, ఈ విషయం మర్చిపోయింది.

ఇంటర్వెల్ లో లైట్లు వెలిగాయి. అనుకోకుండా ఆ అమ్మాయి కూర్చున్న వైపు చూసింది. ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి తిరిగి, సుధను చూసి నవ్వింది.

మళ్ళీ ఆలోచనలో పడింది. భర్తను అడుగుదామనుకుంది. సంతోష్ బయటకెళ్ళి రెండు చిప్స్ ప్యాకెట్లు కొనుక్కొచ్చాడు. ఒకటి భార్య చేతికిచ్చి తానొకటి తీసుకుని, కూర్చుని, ప్యాకెట్లు ఓపెన్ చేస్తున్నాడు.

అతను పక్కన కూర్చోగానే, “ఏమండీ..” అని అడగబోతుండగానే, మళ్ళీ సినిమా మొదలైంది.

సినిమా అయిపోయాక, అందరూ హడావిడిగా బయటికి వెళుతున్నారు. ఆ గుంపులో ఆ అమ్మాయి కనిపించలేదు.

బయటకెళ్ళి ఆటోకోసం నిలబడ్డారు. సన్నని తుంపరతో మొదలైన వాన, కాస్త పెద్దగా కురవసాగింది.

“స్కూటర్ మీద రాకపోవడం మంచిపనైంది.” అన్నాడు సంతోష్.

స్కూటర్లపై వచ్చిన వాళ్ళు కొంతమంది, వర్షం వల్ల కాసేపు అక్కడే నిలబడిపోయారు. కొందరు నడిచి వచ్చిన వాళ్ళు కూడా ఆటోలను పిలుస్తున్నారు. వర్షం వల్ల ఆటోలకు బాగా డిమాండ్ పెరిగింది.

అదృష్టం.. ఒక ఆటో దొరికింది. దానిలో కూచోబోతూ, కొంచెం దూరంలో తనవైపే చూస్తూ నిల్చున్న ఆ అమ్మాయిని గమనించింది సుధ.

మళ్ళీ ఆ అమ్మాయి సుధను చూసి చిరునవ్వు నవ్వింది. ఆటో ఆ అమ్మాయి ముందునుంచే వెళ్ళింది. ఆ అమ్మాయి నవ్వుతూ ‘బై’ అన్నట్టు చేయి ఊపింది.

“ఏమండీ! ఆ అమ్మాయిని చూడండి.” అన్నది భర్తవైపు తిరిగి.

“ఏ అమ్మాయి?” అన్నాడు తల పక్కకు తిప్పి.

కానీ ఆటో ఆ అమ్మాయిని దాటిపోవడంతో, అతనికి ఎవరూ కనబడలేదు.

“ఇందాక సినిమా హాల్‌లో మన ముందు వరుసలో ఎవరో ఒక అమ్మాయి కూర్చుని ఉంది. వెనక్కి తిరిగి, నన్ను చూసి పరిచయమున్నదానిలా నవ్వింది. బయటికి వచ్చాక కూడా నవ్వింది. ఇప్పుడేమో చేయి ఊపింది బై చెప్తూ.. నాకేమో ఆ అమ్మాయెవరో ఎంత ఆలోచించినా గుర్తు రావడంలేదు.” చెప్పింది.

“ఏ ఫంక్షన్ లోనో చూసింటుందేమో! నీవు గుర్తు పట్టకపోయినా, పాపం ఆ అమ్మాయి, నిన్ను గుర్తుపట్టి నవ్వింది. ముందే చెప్పుంటే మాట్లాడేవాళ్ళం కదా!” అన్నాడు.

“అవునండీ! ఆ విషయం నా మట్టి బుర్రకు తోచలేదు.” తల వెనుక చిన్న దెబ్బ వేసుకుంటూ అన్నది.

“ఈసారి కనపడితే మాట్లాడుదువుగానిలే!”

ఇంతలో ఇల్లు వచ్చింది. వర్షం అంతకంతకూ ఉధృతం కాసాగింది. గబగబా లోపలికి వచ్చి బట్టలు మార్చుకున్నారు.

భోజనం చేసి, గదిలోకెళ్లిపోయాడు సంతోష్.

వంటిల్లు శుభ్రం చేసుకుని హాల్ లోకి వచ్చిన సుధకు వరండాలో ఏదో అలికిడి అయింది. కిటికీ రెక్కలు తెరచి చూసింది. ఈదురు గాలికి, వానజల్లు ఒక్కసారిగా మొహం మీద కొట్టింది.

జాగ్రత్తగా బయటికి తొంగి చూసింది. మసక వెలుతురులో ఏదో తెల్లటి ఆకారం కనబడింది. గుండె ఝల్లుమన్నది.

మళ్ళీ అంతలోనే ‘దొంగేమో’ అని భయపడింది.

“ఎవరూ?” భయపడుతూనే అడిగింది.

“నేను ఆంటీ!” అన్న తీయని గొంతు వినబడింది.

‘అమ్మయ్య! దొంగలు కాదులే!’ అనుకుంది. మళ్ళీ ‘ఏమో ఆడ దొంగలేమో!’ తన ఆలోచనకు తనే నవ్వుకుంది.

“నేనంటే?” రెట్టించింది.

హఠాత్తుగా కిటికీ దగ్గరికి వచ్చి మొహంలో మొహం పెట్టి చూసిన ఆ అమ్మాయిని చూసి, ఒక క్షణం గుండె ఝల్లుమన్నది.

“ఇందాక సినిమా హాల్‌లో మిమ్మల్ని చూసి, నవ్వాను. గుర్తుందా ఆంటీ!” అన్నది.

కొంచెం ధైర్యం వచ్చింది.

“ఈ టైమ్‌లో వస్తున్నావేంటి?” అనుమానంగా అడిగింది సుధ.

“వాన పెద్దగా కురుస్తుండటంతో,. మాకు ఆటోలు తొందరగా దొరకలేదు ఆంటీ! ఇంతకుముందే ఒక ఆటో దొరికింది. నా స్నేహితురాలు నీలిమ ఇల్లు ఈ పక్క వీధిలోనే ఉంటుంది. తను అక్కడ దిగిపోయింది. సరిగ్గా మీ ఇంటిముందరికి వచ్చేటప్పటికి, హఠాత్తుగా నేనెక్కిన ఆటో ఆగిపోయింది. ఆటో అతను ఏదో రిపేర్ చేస్తున్నాడు. నాకు భయమేసి, మీ కాంపౌండ్ లోకి వచ్చి, ఇక్కడ నిల్చున్నాను.”

“అయ్యో! అవునా! మమ్మల్ని పిలవాల్సింది.”

“మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టంలేకపోయింది. వర్షం ఆగిపోయింది. ఇక వెళ్తాను ఆంటీ” బయలుదేరబోయింది.

“ఉండమ్మాయ్! ఇంత రాత్రప్పుడు ఒక్కదానివే ఎలా వెళ్తావ్? మా వారు వచ్చి నిన్ను దిగబెడతారు.” అన్నది.

“ఫరవాలేదు. మా ఇల్లు ఈ పక్కనే ఉంది. వెళ్ళిపోగలను.”

చక చకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. గేట్ దాటి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసి నవ్వింది.

‘ఈ అమ్మాయికి నవ్వడం బాగా అలవాటేమో?’ అనుకుంది.

‘అవునూ ఆ అమ్మాయి పేరు కూడా కనుక్కోలేదు. తనను ఎక్కడ చూసిందో అడగలేదు. నిజంగా తనది మట్టి బుర్రే!’ చిన్నగా నవ్వుకుని, పడుకోవడానికి లోపలికి వెళ్ళింది.

***

ఆ రోజు సాయంత్రం నుంచీ తుఫాను ప్రభావం వల్ల ఒకటే వాన, ఈదురుగాలి..

వర్షంలో తడిచిన భర్తతో, “మనం కారు కొందామండి! కారుంటే ఇలా వర్షంలో తడిసే అవస్థ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా కారులో వెళ్ళి రావచ్చు. మన తోటి వాళ్ళంతా అప్పుడే కార్లు కొన్నారు. మనమే ఇంకా కొనలేదు.” అన్నది సుధ భర్తతో.

“కొందాములే డియర్! నా చెల్లెలి పెళ్లికి అయిన అప్పు తీరనీ.” అన్నాడు.

వేడి వేడిగా ఉప్మా చేసింది. తినేసి, మజ్జిగ తాగి రూంలోకి వెళ్ళి ఫోన్‌లో ఏదో చూసుకుంటూ పడుకున్నాడు సంతోష్. సుధ మాత్రం టీవీలో ప్రోగ్రామ్ చూడసాగింది.

ముందరి వరండాలో అలికిడి అయినట్టయి కిటికీ తెరిచి చూసింది. మళ్ళీ ఆ అమ్మాయే. ఈ టైములో ఇక్కడ..

అనుమానంగా చూస్తూ, “ఎవరూ?” అడిగింది.

“నేనే ఆంటీ!” అన్నది ఆ అమ్మాయి కిటికీలోంచి చూస్తూ.

ఎంతో అందమైన మొహం.. పై పెదవికి కొంచెం పైన పెసరబద్దంత పుట్టుమచ్చ కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది.

“ఆంటీ! ఏంటి ఆలోచిస్తున్నారు? నా గురించేనా?” మళ్ళీ నవ్వింది. ఈ సారి కాస్త గట్టిగా నవ్వింది.

“అవును! నీగురించే ఆలోచిస్తున్నాను. నీ పేరేంటి? నేను నీకెలా తెలుసు?” అంటూ తలుపు తీయబోయింది.

“ఒద్దొద్దు! తలుపు తీయకండి. నాతో పాటు వాననీళ్లు, బురద మీ ఇంట్లో కొచ్చేస్తాయి.” నవ్వుతూ అన్నదా అమ్మాయి.

తలుపు తీసే పని మనకుంది సుధ.

“ఇప్పుడు చెప్పు! ఎవరు నువ్వు? నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? ప్రతి రోజూ రాత్రి ఇదే సమయానికి మా ఇంటికి ఎందుకొస్తున్నావు?”

“ఆంటీ! ఆగండాగండి! ఇన్ని ప్రశ్నలూ ఒక్కసారే గుప్పిస్తే ఎలా?” అని నవ్వింది.

“నవ్వడం ఆపి చెప్పమ్మాయ్.” కాస్త గట్టిగా అడిగింది కిటికీ ఇవతలనుంచే.

“నా పేరు సుస్మిత. నేను ఇంటర్ చదువుతున్నాను. మీ ఇంటికి నాలుగిళ్ల అవతల ఉంటాము. మా నాన్నగారు ప్రముఖ లాయరు. అమ్మ గృహిణి. ఈ పక్క వీధిలో నా స్నేహితురాలు నీలిమ ఉంటుంది. మేమిద్దరూ కలసి రోజూ కంబైన్డ్ స్టడీస్ చేస్తాము. ఇద్దరూ కూర్చుని లెక్కలు, సైన్స్ చదువుకుంటాము. వాళ్ళ అమ్మా నాన్నలిద్దరూ లెక్చరర్లు. మాకు రోజూ అర్థం కాని పాఠాలు చెప్తారు. ఒక్కొక్కసారి ఈ సమయం వరకూ చదువుకుంటాము. మిమ్మల్ని నేను చాలా సార్లు చూసాను. మీరీ ఇంటికి కొత్తగా వచ్చారు కదూ! ఇవి నా వివరాలు. చాలా ఆంటీ? వర్షంలో తలదాచుకోవడానికి రాత్రి పూట మీ ఇంటి వరండాలో నిల్చుంటే, నేనేదో దొంగనో, దయ్యాన్నో అన్నట్టు అనుమానిస్తున్నారు.” అన్ని వివరాలు చెప్పి, చివరి మాటలు మాట్లాడుతూ నవ్వేసింది.

“అయ్యో! సారీ అమ్మా! మేము ఈ ఇంటికి కొత్తగా వచ్చాము కదా! అందుకే ఈ వివరాలేవీ తెలియక, నా ప్రశ్నలతో నిన్నిబ్బంది పెట్టాము. అయినా.. లోపలికి రమ్మంటే రావు!” నిష్ఠూరంగా అన్నది.

“చెప్పాను కదా ఆంటీ కారణం. అరె! వర్షం ఆగిపోయింది. వెళ్తాను. ఈసారి తప్పకుండా లోపలికి వస్తాను.” అన్నది వెళ్ళిపోతూ.

మళ్ళీ వెనక్కి తిరిగి చూసి అదే నవ్వు నవ్వింది.

***

ఇంకొకరోజు..

రాత్రి అయింది. క్యాంపుకెళ్లిన సంతోష్ ఆ రోజు వస్తానన్నాడు. రాత్రి వంట చేసి, అతనికోసం ఎదురు చూడసాగింది. ఇంతలో కరెంట్ పోయింది. క్యాండిల్స్ వెతికి, వెలిగించింది.

తలుపు తట్టిన చప్పుడైంది.

‘సంతోష్ వచ్చాడు.’ అనుకుని ఆనందంగా తలుపు తీసింది. ఎదురుగా సుస్మిత.

ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. అయినా సర్దుకుని, “రా!.. రా! చాలా రోజులైంది నీవు రాక. ఎప్పుడూ వర్షంలో వచ్చేదానివి. ఈరోజు వర్షం లేదు కానీ కరెంట్ పోయింది. ఇలాంటప్పుడు వచ్చావు.” అన్నది సుధ.

“అయితే లోపలికి రావద్దా ఆంటీ?” చిలిపిగా అన్నది లోపలికి వస్తూ.

“ఆంటీ తలుపు వేసి గడియ పెట్టేయండి. అసలే కరెంట్ లేదు. ఏ దొంగ వెధవైనా వస్తాడు.” అన్నది సుస్మిత తలుపు వేస్తూ.

గడియపెట్టి ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.

“అంకుల్ ఇంకా రాలేదా ఆంటీ?” అన్నది.

“వచ్చేస్తారమ్మా! తలుపు చప్పుడైతే ఆయనే అనుకున్నాను.”

“పాపం డిసప్పాయింట్ అయ్యారా?” అన్నది కొంటెగా నవ్వుతూ.

 ఈ చిలిపి మాటలకు తనూ నవ్వేసింది సుధ.

“ఆంటీ! మొదటి సారి మీ ఇంటికి వచ్చాను. టీ ఇవ్వరా?” ఆ అమ్మాయి చనువుకు ఆశ్చర్యపోయింది.

“అయ్యో! నాది మట్టి బుర్రమ్మా! ఏదీ తోచదు. ఏమనుకోవద్దు. ఇప్పుడే తెస్తాను.” అని లోపలికి వెళ్ళి టీ తయారు చేయసాగింది.

 టీ చేస్తున్నంతసేపూ ఆ అమ్మాయి మాట్లాడుతూనే ఉంది.

‘వసపిట్ట’ అనుకుని నవ్వుకుంది. కప్పుల్లో టీ పోస్తూ, “ఈసారి నీ స్నేహితురాలు నీలిమను కూడా వెంటబెట్టుకుని రా! నాకిక్కడ తెలిసిన వాళ్లెవరూ లేక, విసుగ్గా ఉంది. ఏమీ తోచడం లేదు.” అన్నది సుధ.

జవాబు రాలేదు. హఠాత్తుగా ఆ అమ్మాయి దగ్గరినుంచి మాటలు ఆగిపోయాయి.

“సుష్మితా! ఏంటి మాటలు ఆపేసావ్?” అని కప్పులతో బయటికి వచ్చింది.

అక్కడ సుస్మిత లేదు.

‘ఎక్కడికెళ్లింది?’

“సుష్మితా!” రెండు మూడు సార్లు పిలిచింది.

జవాబు లేదు.

లోపలి గదులంతా వెతికింది. ఎక్కడా లేదు.

బయట ఏదో కదులుతున్న తెల్లటి ఆకారం కనబడింది.

‘ఎవరిదా ఆకారం?’ అనుకుని, కిటికీలోంచి తొంగి చూసింది.

ఆ తెల్లటి ఆకారం ఎవరో కాదు సుస్మితే.. అలా కనబడింది. ఆ అమ్మాయి గేటు దాటి వెళ్ళిపోతూ కనబడింది. కనీసం గేటు చప్పుడు కూడా కాలేదు.

అప్పుడు గుర్తొచ్చింది.

‘ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చినా చప్పుడు చేయకుండా.. కనీసం గేటు చప్పుడు కూడా కాకుండా వస్తోంది.’

ఈ ఆలోచనకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది ఒక్క క్షణం.

మామూలుగానే వెనక్కి తిరిగి, సుధను చూసి, నవ్వింది.

తలుపువైపు చూసింది. లోపలి గడియవేసే ఉంది.

‘ఆ అమ్మాయి బయటికి ఎలా వెళ్ళింది?’ తలుపులు లాగి చూసింది. నిజంగానే వేసే ఉన్నాయి. ‘తను కూడా గడియ తీయలేదే? ఎలా వెళ్ళింది?’ మెదడులో ఇదే ప్రశ్న పదే పదే మ్రోగుతోంది.

“సుధా!” అన్న భర్త పిలుపుతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది.

గడియ తీసి తలుపు తెరిచింది.

“కరెంట్ లేదా?” లోపలికి వస్తూ అన్నాడు సంతోష్.

జవాబు చెప్పకుండా బొమ్మలా నిలుచున్న భార్యను చూసి, “నేను లేటుగా వచ్చానని అలకా?” అడిగాడు.

“అబ్బే అదేంలేదు. ఏదో పరధ్యాన్నంలో ఉండి..” తడబడుతూ అన్నది.

కరెంట్ వచ్చింది. గదంతా వెలుతురు పరుచుకుంది.

“ఎవరో వచ్చినట్టుంది?” టీ కప్పులు చూస్తూ అన్నాడు.

“అవునండి!” అని జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పి, “వేసిన గడియ వేసినట్టే ఉంది. ఆ అమ్మాయి బయటికెలా వెళ్ళింది అనే నా అనుమానం.”

“ఊరికే ఆలోచించకు. నీవే తలుపు తెరిచి ఆ అమ్మాయి అటు వెళ్లగానే మళ్ళీ తలుపు మూసి గడియ పెట్టేసుంటావు. నువ్వే అంటుంటావు కదా ‘నాదసలే మట్టి బుర్ర’ అని.”

బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.

“బాగా ఆకలిగా ఉంది. నీ చేతి భోజనం ఎప్పుడు చేద్దామా అని ఉంది. పద భోంచేద్దాం.”

రాత్రంతా ఇవే ఆలోచనలతో నిద్రపట్టలేదు సుధకు.

***

భర్త ఆఫీసుకెళ్తూ, “ఈరోజు ఇద్దరు మనుషులు వచ్చి ఈ ఆవరణంతా చదును చేసి, మట్టి వేస్తారు. దగ్గరుండి పని చేయించుకో.” అన్నాడు

అన్నట్టుగానే ఒక ఆడ, మగ ఇద్దరు వచ్చారు పనిలోకి. దగ్గరుండి పని చేయిస్తోంది.

“ఇక్కడ మొక్కలు, విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి?” అడుగుతోంది సుధ.

వాళ్ళు జవాబులు చెప్తూ, “అమ్మగారూ! ఈ ఇల్లు మీరు కొన్నారా అండి?” కనుబొమ్మలు ముడి వేస్తూ అనుమానంగా అడిగాడు.

“లేదే! ఏం?”

“ఇంతకు ముందు ఈ ఇంట్లో ఒక లాయరుగారుండేవారమ్మా! వాళ్లకూ మీకులాగానే మొక్కలంటే ఎంతో ఇష్టం. నేనే వచ్చి మొక్కలు నాటేవాడిని. పాపం జరగరానిది జరిగిపోయింది.” బాధ పడుతూ అన్నాడు.

“ఒరే అప్పిగా! ఆ ఇసయాలన్నీ ఇప్పుడెందుకురా?” వారిస్తోంది ఆ ఆడమనిషి.

ఇదేదో రహస్యం అనిపించింది సుధకు.

“అసలు విషయమేమిటో చెప్పు.” గట్టిగా నిలదీసి అడిగింది.

భార్య వైపు భయంగా చూస్తూనే అన్ని విషయాలు చెప్పాడు.

“ఈ ఇంట్లో లాయరుగారు ఉండేవారని అన్నాను కదమ్మా. వాళ్లకు ఒక కూతురుండేది. ఎంత అందంగా ఉండేదో తెలుసాండి! ఆ అమ్మాయి అందమంతా ఆ నవ్వులోనే ఉండేదని అందరూ అనుకునేవాళ్లండి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఉరేసుకుని సచ్చిపోనాదండి.” చెప్పడం ముగించాడు.

స్థాణువులా నిలబడిపోయింది. నోట మాట రానట్టు నిశ్చేష్టురాలై బొమ్మలా బిగుసుకు పోయింది.

“చెప్పద్దురా అంటే విన్నావా? ఇప్పుడు చూడు అమ్మగారు ఎంత భయపడి పోతున్నారో.” అన్నది వాడి భార్య.

నిశ్చేష్ట అయిన సుధ, “ఆ అమ్మాయి పేరేమన్నా తెలుసా మీకు?” అడిగింది నిర్ధారణ చేసుకోవడానికి.

“తెలుసమ్మా! ఆ అమ్మాయి పేరూ.. నోరు తిరగడం లేదమ్మా.. అదేదో.. ‘సుమమ్మ’ అనుకుంటా” బుర్ర గోక్కుంటూ.

“సుస్మిత.. అవునా?” అన్నది సుధ.

“ఆ.. ఆ.. అదే పేరండి. మీకెలా తెలుసు? అయినా ఎవరో చెప్పే ఉంటారులెండి.” అన్నాడు.

“ఆ అమ్మాయి స్నేహితురాలు నీలిమ వాళ్ల ఇల్లు ఇక్కడికి దగ్గరే అని విన్నాను. నీకు తెలుసా నీలిమ ఇల్లు?”

“తెలుసమ్మా! ఆ నీలిమమ్మ ఈ ఇంటికి చాలా సార్లు వచ్చేది. అప్పుడప్పుడు వాళ్ళింట్లో కూడా పని చేసేవాడిని.” అన్నాడు.

“అయితే ఇప్పుడు వాళ్ళింటికి తీసుకెళ్ళు.” అడిగింది.

అప్పుడు టైమ్ సాయంత్రం అయిదయింది. నీలిమ కాలేజీ నుంచి వచ్చి ఉంటుందనే ఉద్దేశంతో.

***

“ఎవరూ?” గేట్ చప్పుడుకు లోపలినుంచి ఒకమ్మాయి బయటికి తొంగిచూస్తూ అడిగింది.

సుధను చూసి, వెంటనే బయటికి వచ్చి, “ఎవరు కావాలండీ?” అన్నది.

“నీతోనే కొంచెం మాట్లాడాలి.” సుధ అన్నది.

“లోపలికి రండి.” అంటూ ఆహ్వానించింది.

“నా పేరు సుధ. కొత్తగా ఈ కాలనీలో, నీ స్నేహితురాలైన సుస్మిత ఇంట్లో అద్దెకు దిగాము.” నీలిమ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నది.

నీలిమ ఒక్క క్షణం కలవరపడింది.

“మీ సుస్మిత మా ఇంటికి మూడు, నాలుగు సార్లు వచ్చింది.”

ఉలిక్కిపడింది. “అదెలా సాధ్యం?” అన్నది భయంతో వణికిపోతూ.

“ఏం? ఎందుకు సాధ్యం కాదూ?” నిలదీసింది.

“ఆంటీ! సుస్మిత చచ్చిపోయింది.” గట్టిగా ఏడుస్తూ చెప్పింది.

“ఎందుకు చచ్చిపోయింది?”

“ఆంటీ! నేనూ సుస్మిత ఇంటర్‌లో ఒకే క్లాసు. ఇద్దరూ కలిసి చదువుకునేవాళ్ళం. మా అమ్మానాన్నలుద్దరూ లెక్చరర్లు. మాకు పాఠాలు చెప్పి, చదివించేవారు. అందుకే తను మా ఇంటికి రోజూ వచ్చేది. చాలా అందంగా, చలాకీగా ఉంటుంది. ముఖ్యంగా ఆ నవ్వు.. ఎవరినో ప్రేమించింది. అతనొక మోసగాడు. సుస్మిత నాన్నగారు ఒక లాయరు. ఆయన, ఆ అబ్బాయిని తిట్టి, బెదిరించారు. దీనితో కక్ష పెంచుకున్న అతను, సుస్మితను వేరే ఊరికి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

తన అదృష్టం బాగుండి.. వాడు ఇంకెవరితోనో క్లోజ్‌గా ఉండడం చూసింది. ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. వాళ్ళ అమ్మానాన్నలు ఏదో పెళ్లికి వెళ్లినప్పుడు, కాలేజీలో క్లాసుల మధ్యలో నుంచి ఇంటికి వచ్చి, ఉరి వేసుకుని చచ్చిపోయింది.” వెక్కి వెక్కి ఏడ్చింది.

వాళ్లిద్దరూ ఉన్న ఫొటోలు చూపించింది. ఫోటోలో సుస్మిత.. పై పెదవి పై పెసర బద్దంత పుట్టుమచ్చ.. ఆ నవ్వు.. ఎదురుగా చూస్తున్నట్టే అనిపించింది.

ఇంటికి వెళ్లాలంటేనే భయపడిపోయింది సుధ. తమ్ముడికి ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మన్నది. పొద్దుటికల్లా దిగాడు సుధ తమ్ముడు గిరి. తమ్ముడితో పాటు అమ్మా వాళ్ల ఊరికి వెళ్ళిపోయింది.

“ఇక ఆ ఇంట్లో ఉండను. వేరే ఇల్లు వెతకండి. కొత్త ఇల్లు దొరికాక ఆ కొత్త ఇంటికే వస్తాను.” ఫోన్ చేసి చెప్పింది భర్తకు.

మరో నెలకు ఇంతకుముందున్న కాలనీలో ఒక ఇల్లు దొరికిందని తెలిసి సంతోష పడింది.

కొత్త ఇంటికి వచ్చాక, ఒకసారి సినిమాకు వెళుతూ, సుస్మిత ఇంటి మీదుగా వెళ్ళారు. ఆ ఇంటికేసి చూసింది సుధ.

ఆ ఇంటిముందు నవ్వుతూ నిల్చుని సుధను రమ్మని పిలుస్తోంది సుస్మిత.

కెవ్వున కేకేసింది సుధ.

“ఇక ఎప్పుడూ ఈ వీధిలోకి తీసుకు రాకండి.” అని వార్నింగ్ ఇచ్చింది భర్తకు.

మరో రెండేళ్లకు సుధకు కడుపు పండింది. పండంటి పాపాయి పుట్టింది.

“ఎంత ముద్దుగా నవ్వుతోంది కదండీ మన మనవరాలు. ముఖ్యంగా పై పెదవి మీది ఆ పుట్టుమచ్చ.” సుధ తల్లి అంటూంటే.. పాపను తేరిపార చూసింది సుధ. తనను గుర్తుపట్టినట్టుగా, పాప తనను చూసి నవ్వినట్టు అనిపించింది.

“సుస్మితా! మళ్ళీ నా దగ్గరకే, నాకు కూతురిగా వచ్చావా తల్లీ?” అన్నది పాపను ముద్దుపెట్టుకుంటూ.

Exit mobile version