[శ్రీ తోట సుబ్రహ్మణ్యం వ్రాసిన ‘అమ్మెవరు?’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ద్వితీయ బహుమతి గెల్చుకున్న రచన.]
“పెళ్ళాగిపోయిందని బాధపడుతున్నావురా?”
సుశాంత్ నుంచి ఏ సమాధానమూ రాలేదు. తుఫాన్ ముందు ఏర్పడే నిశ్శబ్దం వ్యాపించింది ఆ గదిలో.
“బాధపడకురా! నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళ అనుమానం సరైంది కాదని చెబుతాను.”
సుశాంత్ సూటిగా చూశాడు ప్రభాకర్ కళ్ళల్లోకి. “బాధపడుతున్నానని ఎవరు చెప్పారు నీకు?”
“ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేదు. కానీ ఇప్పుడు చింత నిప్పుల్లా ఎర్రబడిన నీ కళ్ళు చెబుతున్నాయి.”
“బాధ కాదు. మనసు కోపంతో రగిలిపోతోంది. ఆ వేడి కళ్ళల్లోకి చేరి ఎరుపెక్కి ఉంటాయి.”
“కోపంతోనైనా మనసు పాడుచేసుకోవద్దని చెబుతున్నాను.”
“నువ్వెళ్ళి మాట్లాడితే ఒప్పేసుకుంటారా? రెండు సంవత్సరాల నా ప్రేమ ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఈ సంబంధం వద్దన్న అమ్మానాన్నలను ఎంతో కష్టపడి నేను ఒప్పించండం ఆమె తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదు. అటువంటి వాళ్ళు నీ మాట వినేస్తారని ఎలా అనుకుంటున్నావు మావయ్యా?”
“నీ ప్రేమను గెలిపించాలనే బలమైన నా కోరిక సాధ్యం చేస్తుందనే ఆశతో అనుకుంటున్నాను. అవునూ.. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించింది కదా!”
“ప్రేమించింది. కానీ, మొదటి నుంచీ ఓ నిబంధన పెట్టింది. ఆ విషయం మన వాళ్ళందరికీ చెప్పాను కదా!”
“ఈ అమ్మాయిది స్వచ్ఛమైన ప్రేమైతే, లేనిపోని అనుమానాలతో ఈ పెళ్ళిని వద్దంటున్న తల్లిదండ్రులను వారించి, పెళ్ళి జరిపించమనేది. నిన్ను తప్ప ఎవరినీ పెళ్ళి చేసుకోనని చెప్పేది.”
“నువ్వూ, అత్తయ్యా ప్రేమించుకున్న రోజులు కావివి మావయ్యా! ఇప్పుడు అంత స్వచ్ఛమైన, నిజమైన ప్రేమలు చాలా అరుదుగా ఉన్నాయి. చాలా వరకూ టైంపాస్ ప్రేమలే నడుస్తున్నాయి.”
“ఆ అరుదైన ప్రేమికుల్లో నువ్వొకడివి. నేటి చాలా మంది లాంటిది ఆ అమ్మాయి.”
“అసలు వాళ్ళ అనుమానం ఏంటి మావయ్యా? నేను భాగ్యం-అమ్మను ‘అమ్మా!’ అని పిలవడమే తప్పైపోయిందా? ఊహ తెలిసినప్పటి నుంచీ అలా పిలుస్తున్నాను. ఇప్పుడు ఎలా మానేయగలను?!”
“అంతే కాదు, నువ్వు భాగ్యంతో చాలా అనురాగంతో ఉండడం, తను కూడా నీ మీద ఎక్కువ ప్రేమ చూపడంతో వాళ్ళు అంతకుముందు విన్నది నిజమనుకుంటున్నారు.”
“వాళ్ళు అంతకుముందు ఏం విన్నారు? ఎవరు చెప్పారు?”
“ఏం విన్నారన్నది నా నోటితో చెప్పలేను కానీ, ఎవరు చెప్పారన్నదానికి జవాబు – మనమంటే గిట్టనివాళ్ళు.”
“మన మీద అంత ద్వేషం ఎవరికుంది?”
“నేడు – అభిమానం చూపించే వారి కంటే, ద్వేషం పెంచుకునే వారే ఎక్కువ కదా! బంధువులో, మనం స్నేహితులనుకునే వారో, ఇరుగుపొరుగు వారో.. ఎవరో కొందరుంటారు కదా!”
“అవును, అటువంటి దుర్మార్గులుంటారు. అద్సరే, నేను ఒకరిని ‘అమ్మా!’ అని పిలవడం వాళ్ళకంత తప్పెందుకైపోయిందో చెప్పు మావయ్యా! నీ నోటితో చెప్పలేకపోవడానికేముంది! వాళ్ళన్నదే కదా నువ్వు చెబుతావు.”
“పనిమనిషి పట్ల నీకంత అనురాగం ఉండడం వాళ్ళకు తప్పనిపించడం ఒప్పు కాదేమో గానీ, తప్పు కూడా కాదనిపిస్తోంది నేటి సమాజం తీరును బట్టి. ఇంక రెండో విషయమంటావా.. నేను చెప్పలేనన్నా చెప్పమని బలవంతం చేస్తున్నావు కాబట్టి తప్పడం లేదు. నువ్వు భాగ్యం కొడుకువేననీ, తనుకూ మీ నాన్నగారికీ అ.. స.. సంబంధం ఉందనీ వాళ్ళ దుర్మార్గపు అనుమానం.”
‘సంబంధం’ అన్న మాట అంటున్నప్పుడు ప్రభాకర్ గొంతు తడబడ్డాని బట్టి దాని ముందు మరో మాట అనడానికి అతని మనసు అంగీకరించలేదని సుశాంత్ అర్థం చేసుకున్నాడు.
‘ఛిఛీ.. అంత కుసంస్కారులా అనుపమ తల్లిదండ్రులు?!’ అనుకున్నాడు.
“అసలు విషయం తెలియని కొందరు నువ్వు పుట్టినప్పటి నుంచీ అలానే అనుకుంటున్నారు. వాస్తవం ఏంటో తెలుసుకోకుండా అభాండాలు వేయడం కొందరి నైజం కదా!”
సుశాంత్‌కు అంతా అయోమయంగా అనిపించింది. ఇంకేం మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
“నేను వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నించడం నీకిష్టమో, కాదో మీ నాన్నగారు తెలుసుకోమన్నారు. చెప్పు.. ప్రయత్నించనా?”
“నన్ను అడగమన్నారా?!”
“అవును.”
సుశాంత్ ఆశ్చర్యంగా చూశాడు.
“అవున్రా! నీ ఆనందం కన్నా తనకేది ముఖ్యం కాదన్న ధోరణిలో చెప్పారు.”
ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు సుశాంత్.
ఆ నిమిషంలో అరగంట క్రితం హాల్లో జరిగిన సంభాషణ గుర్తుతెచ్చుకున్నాడు ప్రభాకర్.
భార్య చంద్రికతో కలిసి తాను ఆ ఇంటికొచ్చేటప్పటికి తన అక్క రమ్య, బావ శేఖర్ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. “నాకీ సంబంధం అస్సలు ఇష్టం లేదు. వాడు ఆ అమ్మాయినే చేసుకుంటానని పట్టుపట్టడంతో ఒప్పుకున్నాను. వాళ్ళు వద్దనడం మనకు మంచిదే! మన స్థాయికి తగిన సంబంధం చూసుకుని చేసుకుందాం!” అంది రమ్య.
శేఖర్ ఏదో అనబోయాడు. ఇంతలో రమ్య తనను, చంద్రికను చూసి, “ఇప్పుడే కదా ఇక్కడ నుంచి వెళ్ళావు. ఏం కొంప మునిగిపోయిందని చీకటి పడుతున్న సమయంలో తనని తీసుకొచ్చేశావు?” అంది.
“నేను పొద్దుట వెళదాం అంటే తను వినలేదక్కా! జరిగింది విని, నిన్ను వెంటనే కలిసి మాట్లాడాలని పట్టుపట్టింది. తీసుకురాక తప్పలేదు” అన్నాడు తను.
“బంధువులన్నాక ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పలకరించి, ‘మేము తోడుగా ఉన్నామ’నే భరోసా కలిగించాలి కదా వదిన గారూ!” అంది చంద్రిక.
“మనకేం ఇబ్బంది కలగలేదు చంద్రికా! మంచే జరిగింది మనకు” రమ్య ఆనందాన్ని వ్యక్తం చేసింది.
‘అది – ఇంట్లో అడుగు పెట్టగానే వినిపించిన మీ మాటలను బట్టి అర్థమైంద’ని చంద్రిక మెల్లగా అనుకోవడం తాను విన్నాడు.
“మనకు మంచిదే అక్కా! వాడు బాధపడుతున్నాడేమో కదా!” తానన్నాడు.
“మనం కాదు కదా వద్దన్నది. వాళ్ళు సరిగా లేరని అర్థంచేసుకుని, ఆ అమ్మాయిని మరిచిపోతాడులేరా!”
“మరిచిపోయే లోపు చాలా నలిగిపోతాడు వదినగారూ! ఇప్పటి అబ్బాయిల్లా కాకుండా, చాలా నిజాయితీగా ప్రేమించాడు. ఆ అమ్మాయి పట్ల తనకున్న ప్రేమ తన ప్రతీ మాటలోనూ వ్యక్తమయ్యేది” చంద్రిక అంది.
భాగ్యం అతిథిలిద్దరికీ రెండు గ్లాసులతో జ్యూస్ తెచ్చి ఇచ్చింది. “ఇదంతా నా వల్లే జరిగింది. నేనిక్కడుండకపోతే బాగుండేది. పాపిష్టిదాన్ని.. చిన్న బాబు పట్ల అంత అభిమానంగా ఉన్నట్టు కనిపించకుండా ఉండాల్సింది” అంది.
“నువ్వేమీ ఫీలవుకు భాగ్యం! వాళ్ళ బుద్ధి మంచిది కాదంతే!” రమ్య అంది.
“ప్రభా! నువ్వు వాడి గదికెళ్ళి వాడి మనసులో ఏముందో తెలుసుకోవయ్యా!” శేఖర్ అన్నాడు బావమరిదితో.
“తెలుసుకుని ఏం చేస్తాం శేఖర్? వాడిప్పటికీ ఇష్టపడుతున్నాడని తెలిస్తే, మనం వాళ్ళని మరోసారి అడగ్గలమా? ఒకవేళ అడిగినా, వాళ్ళు మరోసారి వద్దంటే, మన పరువు మరింత పోతుంది కదా!” అంది రమ్య.
“నాకు వాడి ఆనందం కన్నా ఏదీ ముఖ్యం కాదు. మరోసారే కాదు, మరెన్ని సార్లైనా అడుగుతాను.. వాడికి మంచి జరిగే అవకాశముందంటే! పరువెంత పోయినా పట్టించుకోను.”
అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో అవాక్కయ్యారు. చాలా కోపిష్టైన అతను.. పరువు కోసం ప్రాణాన్నైనా ఫణంగా పెట్టే అతను కొడుకు ఆనందం కోసం పరువెంత పోయినా ఫర్వాలేదు అనుకోవడం వాళ్ళ ఆ స్థితికి కారణమైంది.
నిజానికి శేఖర్ అంత కోపిష్టేం కాదు, గంభీరంగా కనిపిస్తాడంతే! ఏదైనా సంస్థను నడిపే వ్యక్తి ముఖంలో ఆ మాత్రం గాంభీర్యం చోటుచేసుకుంటుంది.
అతను అలా అన్న తర్వాత తను మేనల్లుడి గదికొచ్చాడు. ఒకప్పుడు తాను వాడిన గదది.
“ఏంటి మావయ్యా ఆలోచిస్తున్నావు?” సుశాంత్ అనడంతో తన ఆలోచన్ల నుంచి బయటపడ్డాడు ప్రభాకర్.
“ఏం లేదు, మా బావగారు నీ కోసం ఎంతకైనా తెగించారు కదా అనుకుంటున్నాను.”
“మరి నువ్వెళ్ళి ప్రయత్నిస్తావా?”
“ప్రయత్నించనా?”
“నాన్నగారు ప్రయత్నించమన్నారు కదా!” అని సుశాంత్ చిరునవ్వు నవ్వాడు.
“సరే అయితే..” అంటూ ఆ గది నుంచి బయటకు నడిచాడు ప్రబాకర్. ‘కోపం వచ్చినట్లు నటిస్తున్నాడు గానీ, వీడికి ఆ పిల్ల మీద ప్రేమ పోలేదు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు’ మనసులో అనుకున్నాడు.
హాల్లో ఉన్న అక్కాబావలతో “రేపు నేను అనుపమ అమ్మానాన్నలను కలుస్తాను” అన్నాడు.
“వాడికింకా బుద్ధి రాలేదా?” అంది రమ్య కోపంగా.
“మీ అక్క మాటలకేం గానీ, నువ్వు రేపు ఆ పని మీదుండు” అన్నాడు శేఖర్.
“సరే బావగారూ!”
శేఖర్ చిరునవ్వు నవ్వాడు. రమ్య మూతి తిప్పుకుంది.
“చంద్రికా.. బయలుదేరదామా?” ప్రభాకర్ అన్నాడు.
“సరే..” అంటూ లేవబోయింది.
“ఎక్కడికెళతారు ఈ చీకట్లో? పొద్దుట వెళుదురు గాని” అంటూ చంద్రిక చేయి పట్టుకుంది రమ్య.
“ఫర్లేదు వదినగారూ! కారులోనే కదా వెళ్ళేది” అని నిలబడింది చంద్రిక.
“తను చెప్పింది కరెక్టే కదాక్కా.. వెళ్ళొస్తాం! బావగారూ ఉంటామండీ!” అంటూ సింహద్వారం వైపు అడుగులు వేశాడు ప్రభాకర్.
“ఒక్క నిమిషం. సుశాంత్‌ని పలకరించి వస్తాను” అంది చంద్రిక ప్రభాకర్‌నుద్దేశించి.
“కారు తిప్పి పెడతాను, తొందరగా వచ్చేయ్!” అంటూ బయటకు వెళ్ళాడు.
ఐదు నిమిషాల్లో ఆమె కూడా కారు దగ్గరకు వచ్చింది.
2
సుశాంత్ సెల్ మోగింది. ఎవరు ఫోన్ చేస్తున్నారని చూశాడు. ‘అనుపమ’ అని ఆంగ్లంలో కనిపించింది.
ఎత్తలేదు.
మరలా మోగింది. రింగ్ వినపడకుండా ఉండడానికి పక్క బటన్ నొక్కాడు.
మూడోసారి మోగుతుంటే కాల్ కట్ చేశాడు. స్విచ్చాఫ్ చేయబోతుంటే మరలా మోగింది. తనకూ మాట్లాడాలని ఉండడంతో ఆన్సర్ చేయకుండా ఉండలేకపోయాడు.
పచ్చ కీ క్లిక్ చేసి, సెల్ చెవి దగ్గర పెట్టుకుని “హలో” అన్నాడు.
“నా కాల్ ఆన్సర్ చేయకూడదనుకున్నావా?”
“చేశాను కదా, చెప్పు.”
“చేశావులే నాల్గోసారి చేశాక.”
“అనుపమా! విషయం చెప్పకుండా ఏంటిది?”
“నా మాటలు వినడానికి విసుగ్గా ఉందా?”
“అసలు విషయం చెప్పకుండా నన్ను ఇంటరాగేషన్ చేస్తుంటే ఎలా ఉంటుంది మరి?”
“ఇది వరకు నేనేం మాట్లాడినా వింటూనే ఉండాలనిపిస్తుందన్నావు. మరిప్పుడేంటి.. నాలుగు మాటలు కూడా వినలేకపోతున్నావు!”
“అందుకు కారణం ఎవరు? నేనా?”
“నేను కూడా కాదు. అది చెప్పాలనే చేశాను.”
“ఏంటది?”
“నీకు పెళ్ళి జరక్కూడదనుకునే మీ వాళ్ళెవరో మా వాళ్ళకి ఏదో తప్పుడు సమాచారమిచ్చారు.”
“ఎవరో ఏదో వాగితే, మీ వాళ్ళ సంస్కారం ఏమైంది? ఎవరెలాంటి వారని ఆలోచించనక్కర్లేదా? నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయరా? పెళ్ళి వద్దని అవమానిస్తారా?”
“నేనూ మా వాళ్ళు చేసిన దానికి బాధపడుతున్నాను. నాకు నువ్వు ముఖ్యం. నీ తల్లిదండ్రులేంటనేది నాకు అనవసరం.”
“నాకవసరం. నీ తల్లిదండ్రులు కూడా నాకవసరమే! మనల్ని పెంచి పెద్ద చేసిన పెద్దలను వాళ్ళ వృద్ధాప్యంలో మనకనవసరం అనుకోవడం నేరం, పాపం. అవి నేను చేయను.”
“మా వాళ్ళనుకునేది నిజమైతే, ఆ విషయాలు నాకనవసరమన్నాను.”
“నువ్వు కూడా అనుమానిస్తున్నావన్న మాట!”
“నేను అనుమానించడం కాదు, అది నిజమని నీ బంధువులే చెబుతున్నారు. వాళ్ళ నోర్లు మూయించు ముందు. అంతేగానీ, నన్ను తప్పుపట్టాలని చూడకు.”
“వాళ్ళెవరో చెప్పు, వాళ్ళ సంగతి చూస్తాను.”
“అది నా పని కాదు. నువ్వే తెలుసుకో!
“నన్ను ప్రేమించావు కదా! ఆ మాత్రం సాయం చేయలేవా?”
“ప్రేమించాను కాదు, ప్రేమిస్తూనే ఉన్నాను. నీ వెనుక జరుగుతున్న కుట్ర తెలుసుకుంటావనే ఫోన్ చేశాను. అది నువ్వు తెలుసుకుంటే, మన పెళ్ళి జరుగుతుందని నా ఆశ.”
“నేనే ముఖ్యమన్నావు కదా! మనం పెళ్ళి చేసేసుకుందాం! తర్వాత అన్నీ సర్దుకుంటాయి.”
“మా అమ్మానాన్నల తలలు మీద చేయివేసి వాళ్ళ అనుమతితోనే పెళ్ళి చేసుకుంటానని ప్రమాణం చేశాను.”
ప్రశ్నార్థకంగా చూశాడు సుశాంత్.
“నేను హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో మా నాన్నగారు ప్రమాణం చేయమని అడిగారు. నేను చేశాను.”
“ఇదంతా ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు?”
“అప్పుడెంతవసరమో అంతే చెప్పాను.”
“ఇప్పుడు ఒక విషయం అవసరమైనంతా చెప్పలేదు.”
“మన పెళ్ళి చెడగొతున్న మీ వాళ్ళు ఎవరన్నదే కదా! మా నాన్నగారు నాకు చెప్పిన దాని ప్రకారం ఒకరు మీ నాన్నగారికి, మరొకరు మీ అమ్మగారికి దగ్గరి బంధువులు” అని కాల్ కట్ చేసింది.
సుశాంత్ ఆలోచనలో పడ్డాడు. ‘నాన్నగారి దగ్గర బంధువంటే రక్త సంబంధం ఉన్నవారనా? అంటే- శశిరేఖత్తయ్యా? ఛఛా.. అత్తయ్య అలాంటిది కాదు. విషయం తెలిసిన వెంటనే వచ్చి, సాయంత్రం నాలుగు గంటల వరకూ ఇక్కడే ఉంది. వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి, బాధపడొద్దనీ, ఇంత కన్నా మంచి సంబంధమూ, అమ్మాయీ వస్తాయని చెప్పి వెళ్ళింది’ అనుకున్నాడు.
‘అమ్మకు రక్త సంబంధీకుడు ప్రభాకర్-మామయ్య. అమ్మానాన్నల కన్నా కూడా ఎక్కువ ప్రేమగా ఉంటాడు నాతో. మావయ్యను అనుమానించడం అస్సలు సరైంది కాదు. మరింకెవరు అమ్మానాన్నలకు అంత దగ్గర బంధువులు?’ అనుకుని తల గోక్కున్నాడు.
ఆలోచిస్తున్న కొద్దీ బుర్ర వేడెక్కుతోంది గానీ, ఎవరై ఉంటారన్నది తెలియడం లేదు. ఇంకా ఆలోచిస్తే పిచ్చెక్కుతుందేమోనని కాసేపు ఆలోచించడం ఆపేయాలనుకున్నాడు. కానీ, అది సాధ్యంకాలేదు. మెదడు ఆలోచిస్తూనే ఉంది.
ఓ అరగంట తర్వాత తల్లిదండ్రుల దగ్గరకెళ్ళాడు.
“ఏం నాన్నా.. ఇలా వచ్చావు? నిద్రపట్టడం లేదా?” శేఖర్ అడిగాడు.
“అవును నాన్నగారూ! నిద్ర పట్టడం లేదు. మీరిప్పుడు ప్రభాకర్ మావయ్యకు ఫోన్ చేయాలి” అన్నాడు సుశాంత్.
“ఎందుకు?”
“రేపు తనను అనుపమ ఇంటికి వెళ్ళొద్దని చెప్పండి.”
“మనసు మార్చుకున్నావా? ఈ పెళ్ళొద్దనుకుంటున్నావా?” రమ్య ఉత్సాహంగా అడిగింది.
“కాదు, నాన్నగారే అనుపమ నాన్నగారిని పిలిచి మాట్లాడతారు.”
(ఇంకా ఉంది)
నా పూర్తి పేరు తోట వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు, కలం పేరు తోట సుబ్రహ్మణ్యం. స్వగ్రామం కోనసీమలోని మురమళ్ళ గ్రామం. తల్లిదండ్రులు తోట రామకృష్ణారావు, సత్యవతి. భార్య భారత స్వరాజ్యలక్ష్మి. నాకు ఇద్దరు కుమారులు. నేను మా ఊర్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఓ ప్రైవేట్ స్కూల్‌ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాను.
ప్రచురితమైన మొదటి కథ ‘ఆటా’ లో ఎంపికైన ‘మూడు లేఖలు’ అనే కథ. (2005లో ఆంధ్రభూమి దినపత్రిక). మొదటి కవిత ‘వానపాములు మిన్న!’ (ఆంధ్రభూమి దినపత్రిక). మొదటి వ్యాసం, ‘రిజర్వేషన్లతో సమస్య సమసిపోతుందా!’ (నా డిగ్రీ అయిన తర్వాత 1993-94 కాలంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రభ దినపత్రిక). కరోనాకు ముందు ‘వార్త’ ఎడిటోరియల్ పేజీలో పదికి పైనే నా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 2022, జనవరి 26న ‘విలువలెందుకు?’ అనే నా 20 కథల సంపుటి ఆవిష్కరణ జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సలీం గారు, గంటి భానుమతి గారు ముందు మాటలు రాశారు.
