[శ్రీ తోట సుబ్రహ్మణ్యం వ్రాసిన ‘అమ్మెవరు?’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ద్వితీయ బహుమతి గెల్చుకున్న రచన.]
[ప్రేమించిన అనుపమతో జరగాల్సిన పెళ్ళి ఆగిపోయినందుకు బాధపడుతూంటాడు సుశాంత్. తాను వెళ్ళి అనుపమ తల్లిదండ్రులతో మాట్లాడి, వాళ్ళ అనుమానం సరైనదని కాదని చెప్తానని అంటాడు సుశాంత్ మేనమామ ప్రభాకర్. రెండేళ్ళ పాటు ప్రేమించిన తన ప్రేమ అనుపమకి అర్థం కాలేదని, తన తల్లిదండ్రులని ఈ పెళ్ళికి ఒప్పించిన కష్టాన్ని ఆమె తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదని వాపోతాడు సుశాంత్. అసలెందుకు పెళ్ళి వద్దన్నారో కారణం చెప్పమని సుశాంత్ మేనమామని అడుగుతాడు. సుశాంత్ – భాగ్యంతో చాలా అనురాగంతో ఉండడం, ఆమె కూడా అతని మీద ఎక్కువ ప్రేమ చూపడం, అంతకుముందు ఏవేవే వినడం వల్ల ఈ సంబంధం వద్దనుకున్నారని ప్రభాకర్ చెప్తాడు. తాను ఒకరిని ‘అమ్మా!’ అని పిలవడం వాళ్ళకి ఎందుకంత తప్పులా అనిపిస్తోందని అడుగుతాడు సుశాంత్. పనిమనిషి పట్ల సుశాంత్‌కి అంత అనురాగం ఉండడం వాళ్ళకు నచ్చలేదని, అతడు భాగ్యం కొడుకేమోననీ, ఆమెకీ సుశాంత్ నాన్నగారికీ ఏదైనా అక్రమ సంబంధం ఉందేమోనని వాళ్లు అనుకుంటున్నారని చెప్తాడు ప్రభాకర్. నిర్ఘాంతపోతాడు సుశాంత్. ఈ పెళ్ళి ఆగిపోవడం మంచిదేనట్టు తన తల్లిదండ్రులు ప్రవర్తించడం సుశాంత్‌కి ఆశ్చర్యంగా ఉంటుంది. అనుపమకి ఫోన్ చేసి అడిగితే, మీకు దగ్గరివాళ్ళే మావాళ్ళకి అలా చెప్పారని చెబుతుంది. తండ్రివైపు దగ్గరి బంధువంటే మేనత్త శశిరేఖ, అమ్మవైపు దగ్గరి బంధువంటే మావయ్య ప్రభాకర్. వాళ్ళిద్దరూ అలా చేయరని భావిస్తాడు సుశాంత్. అనుపమ తండ్రితో స్వయంగా మాట్లాడమని నాన్నకి చెప్తాడు. – ఇక చదవండి.]
3
ఉదయం ఏడు గంటలకు శేఖర్ సెల్ఫోన్ ఏదో శబ్దం చేసింది. వాట్సాప్ మెసేజ్ వచ్చిందని తెలియడానికి పెట్టుకున్న రింగ్‌టోన్ అది.
ఫోన్ వైపుకు చూడగానే అనుపమ తండ్రికి కాల్ చేయాలని గుర్తుకొచ్చింది శేఖర్‌కి.
వాట్సాప్‌కి ఏమొచ్చిందో చూద్దామని ముందు అది ఓపెన్ చేశాడు. చిన్ననాటి స్నేహితుడు పంపిన ఇమేజది. నల్లటి సముద్రపు నీటిలోంచి ఎర్రటి బాల భానుడు ఆకాశంలోకి ఎగబాకుతున్నట్లుంది. అతనికి కుంకుమార్చన చేసినట్లు అతని చుట్టూ ఆకాశం ఎరుపెక్కి ఉంది.
“నిన్నటి శ్రమనంతా సముద్ర స్నానంతో మరిచి, కొత్త ప్రయాణం మొదలుపెట్టిన దినకరుడు మనకేదో చెప్పాలనుకుంటున్నట్లున్నాడు చూడు!” అని రాశాడు స్నేహితుడు ఆ ఫోటో కింద.
‘గతం గతః. నిన్న జరిగింది మరిచిపోయి, నేడు కొత్తగా ప్రయత్నం మొదలుపెడదాం!’ అనుకుంటూ కాంటాక్ట్స్ ఓపెన్ చేశాడు.
హర్షవర్ధన్ మీద క్లిక్ చేశాడు.
చాలా సేపు మోగింది అవతలి సెల్. ‘ఇక ఆగిపోతుందేమో!’ అనుకుంటుండగా “హలో” అని వినిపించింది.
మనసులో ‘థ్యాంక్ గాడ్’ అనుకుని, గొంతు సవరించుకున్నాడు. ‘హలో బావగారు’ అనబోయి ఆగిపోయాడు. “హలో హర్షవర్ధన్ గారూ! గుడ్ మార్నింగండీ!” అన్నాడు.
క్షణం నిశ్శబ్దం తర్వాత ఇక తప్పదన్నట్లు “గుడ్ మార్నింగ్” అన్నాడు హర్షవర్ధన్.
“మీతో కొంచెం మాట్లాడాలండీ! ఎక్కడ కలుద్దాం!”
మరలా నిశ్శబ్దం.
“హలో.. హలో..” శేఖర్ గొంతు పెంచి కొంచెం కంగారుగా అన్నాడు.
“హలో.. లైన్లోనే ఉన్నానండి” హర్షవర్ధన్ సమాధానమిచ్చాడు.
“నన్ను మీ ఇంటికి రమ్మంటారా? నా ఆఫీస్‌కి మీరే వస్తారా?” శేఖర్ ఓ ఫ్యాక్టరీ యజమాని.
“నేనే వస్తాన్లెండి!”
“థ్యాంక్యూ.”
“వెల్కమ్” అని కాల్ కట్ చేశాడు హర్షవర్ధన్.
‘నా బంగారుకొండ ప్రేమను గెలిపించడానికి ఇతనితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి’ మనసులో అనుకున్నాడు శేఖర్.
హర్షవర్ధన్ వచ్చేటప్పటికి తానుండాలని సరిగ్గా తొమ్మిదయ్యేటప్పటికి ఆఫీస్‌లో ఉన్నాడు.
తొమ్మిదిన్నరకు హర్షవర్ధన్ వచ్చాడు.
ఎవరినీ తన గదిలోకి రానివ్వొద్దని ఫ్యూన్‌కి చెప్పాడు శేఖర్.
కుశల ప్రశ్నలైన తర్వాత అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు.
“మాకు పెళ్ళైన పది సంవత్సరాల వరకూ పిల్లలు లేరండి. నా భార్య గర్భం దాల్చేది కానీ, గర్భం నిలబడేది కాదు. చాలా ఆసుపత్రులు, గుడులు తిరిగామండి. డాక్టర్ల వల్లా కాలేదు. దేవుళ్ళ వల్లా కాలేదు.”
హర్షవర్ధన్ ప్రశ్నార్థకంగా చూశాడు శేఖర్ ముఖంలోకి.
శేఖర్ మరలా చెప్పడం మొదలుపెట్టాడు. “ఓ రోజు ఓ దేవత ప్రత్యక్షమైంది. ఓ ప్రత్యేకమైన వైద్యం గురించి చెప్పింది. మేము ఆ వైద్యం కావాలని వైద్యులను అడిగాం! వారు దాన్ని సాధ్యం చేసి, మాకు మా బాబు సుశాంత్ కలిగేలా చేశారు.”
ఏం వైద్యం అన్న ప్రశ్న హర్షవర్ధన్ ముఖంలో కనిపించింది.
వైవాహిక జీవితం మొదలైన దగ్గర నుంచీ తన గతాన్ని చెప్పడం ప్రారంభించాడు శేఖర్.
***
శేఖర్‌కి పెళ్ళయ్యే నాటికి ఓ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. స్వంత గ్రామంలో తన తండ్రి భూస్వామి అయినప్పటికీ, ఉద్యోగం పురుష లక్షణమని భావించి, మంచి జీతమొచ్చే ఆ ఉద్యోగంలో చేరాడు. పని చేసే నగరంలోనే నివాసముంటున్నడు.
అతని పెళ్ళైన తర్వాత అతనింటిలో పనిమనిషిగా చేరింది శాంతమ్మ. కేవలం పనిమనిషిగానే కాకుండా, పెద్ద దిక్కుగా ఉండేది.
నాలుగేళ్ళ తర్వాత ఉద్యోగం మానేశాడు. తాను కూడబెట్టిన డబ్బుకు తండ్రినడిగి మరికొంత డబ్బు తెచ్చి జత చేసి, చిన్నగా ఓ ఫ్యాక్టరీ స్థాపించాడు. అది దినదినాభివృద్ధి చెందడం మొదలైంది. సంవత్సర కాలంలోనే అతను తయారుచేస్తున్న వస్తువుకు మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఏర్పడింది.
బ్యాంక్ లోన్ తీసుకుని మంచి ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఒకవేళ వ్యాపారంలో ఇబ్బందులొచ్చినా, బ్యాంక్ వాయిదాలు కట్టుకోగల ఆర్థిక స్తోమత అతనికుంది. స్వగ్రామంలో ఉన్న ఆస్తి మీద మంచి ఆదాయమే వస్తోంది.
శాంతమ్మకు తాను అద్దెకుండే ఇంటి నుంచి పని చేసే ఇల్లు దగ్గరైంది.
వ్యాపారంలో దూసుకుపోతున్న శేఖర్‌కి కుటుంబంలో శాంతి లేకుండాపోయింది. రమ్యకొస్తున్న గర్భాలు నిలబడడం లేదు. పెళ్ళై ఐదేళ్ళైనా ఇంట్లో పసిబిడ్డ కేరింతలు వినపడలేదు.
ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ డబ్బు ధారాళంగా ఖర్చుపెడుతున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు.
రమ్య బాధపడుతుంటే, శాంతమ్మ ఓదార్చేది. తనకు పెళ్ళైన ఏడేళ్ళకు గాని సంతానం కలగలేదని చెప్పేది. ఒకే ఒక కూతురు పుట్టిందనీ చెప్పేది. ఆ అమ్మాయి అప్పుడప్పుడూ శేఖర్ ఇంటికి వస్తుండేది. రమ్య పెళ్ళై ఐదేళ్ళయ్యేనాటికి ఆ అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతోంది.
“మన శాంతమ్మకు ఏడేళ్ళ తర్వాత కూతురు పుట్టిందట. మనకూ పుడతారు శేఖర్!” అంది రమ్య ఓ రోజు.
“మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయికి కూడా తొమ్మిదేళ్ళ తర్వాత బాబు పుట్టాడట!” అన్నాడు శేఖర్.
ఇద్దరూ ఒకరినొకరు అలా ఓదార్చుకునేవారు. రోజులూ, నెలలూ గడుస్తున్నాయి. రమ్య ఒడి నిండడం లేదు.
శాంతమ్మ ఓ రోజు మహదానందంపడిపోతూ ఓ వార్త మోసుకొచ్చింది – తన కూతురు పదోతరగతి మొదటి శ్రేణిలో పాసైందని.
“సాయంత్రం తనను తీసుకురా! తనకు గులాబ్‌జామ్ ఇష్టం కదా, చేసి ఉంచుతాను” అంది రమ్య.
“ఇప్పుడే వచ్చి, తన నోటితోనే ఆ వార్త మీకు చెప్పాలనుకుంది. కానీ ఇంతలో తన సేయితురాళ్ళు వచ్చి బడికి తీసుకుపోయారమ్మా.. పాటాలు చెప్పిన మేట్టార్లకు కురతజ్జనతలు చెప్పాలని” అంది. బడికెళ్ళడమే ఎరుగని తనకు పదోతరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణరాలయ్యే కూతురు పుట్టినందుకు చాలా ఆనందంగా ఉందామెకు.
“ఏ కాలేజీలో చేరుస్తావు?” రమ్య అడిగింది.
“ఇంతవరకూ చదివించడమే చాలా గొప్ప ఇసయమమ్మా నాకు. కాలేజీలకెక్కడ పంపగలనమ్మా!”
రమ్య, ఫ్యాక్టరీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న శేఖర్ ముఖముఖాలు చూసుకున్నారు. ఫస్ట్ క్లాసులో పాసైన అమ్మాయిని చదువు మానిపించేయడం వాళ్ళకు నచ్చలేదని వాళ్ళ ముఖాలు చెబుతున్నాయి.
“మాన్పించ వద్దు” ఇద్దరూ ఒకేసారి అన్నారు శాంతమ్మ వంక చూస్తూ.
ముగ్గురూ ఆశ్చర్యపోయారు అనుకోనీ ఆ సంఘటనకు.
భార్యాభర్తలిద్దరూ నవ్వుకున్నారు. శాంతమ్మ అయోమయంగా చూసింది వాళ్ళ వైపు.
“కంగారుపడకు శాంతమ్మా! తన చదువుకయ్యే ఖర్చు ఆయన చూసుకుంటారులే!” అంది రమ్య.
“వద్దమ్మా! వద్దు బాబుగారూ! చాలా కరుచవుతాదని విన్నాను. అంత రుణం నేను తీర్చుకోలేను.”
“ఇన్నేళ్ళుగా పని చేస్తున్నావుగా! దాని ప్రతిఫలమిదనుకో! నువ్వేమీ రుణపడిపోవులే!”
రెండు చేతులతో దణ్ణం పెట్టింది శాంతమ్మ.
సాయింత్రం తల్లీకూతుర్లిద్దరూ వచ్చారు.
“అమ్మగారి కాళ్ళకు దణ్ణం పెట్టు” అంది శాంతమ్మ కూతుర్నుద్దేశించి.
సోఫాలో కూర్చునున్న రమ్య వద్దంటున్నా వినకుండా కాళ్ళకు నమస్కరించిందా అమ్మాయి.
“వద్దనకండమ్మా! మీ దీవెనలు దానికి సీరామ రక్చమ్మా! దాని బతుకూ, బవుసత్తూ బాగుండాలని దీవించండమ్మా!” శాంతమ్మ రెండు చేతులూ జోడించి అంది.
రమ్య కాళ్ళ దగ్గర నుంచి లేవలేదు శాంతమ్మ కూతురు.
“బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకుని, మంచి అబ్బాయీతో పెళ్ళై, పిల్లాపాపలతో సంతోషంగా ఉండు” అని దీవించింది రమ్య. చిరునవ్వు నవ్వుతూ రెండు చేతులతో ఆ అమ్మాయి భుజాలు పట్టుకుని పైకి లేపింది.
ఆమె కళ్ళల్లో నీళ్ళూరున్నాయి.
“అరే.. ఈ మాత్రం దానికే?! కళ్ళు తుడుచుకో!” అంటూ సోఫా మీద తన పక్కనున్న తువాలందుకుని ఇచ్చింది.
“ఇంత ప్రేమగా ఎవరూ దీవించలేదండి ఇప్పటి వరకూ!” అని ఏడ్చేసింది.
“పిచ్చిదానా! సంతోషంగా ఉండవలసిన ఈ సమయంలో కన్నీరు పెట్టుకుంటారా ఎవరైనా?” అంటూ రమ్యే తుడిచింది ఆమె కళ్ళను.
కాస్త దూరలో నుంచున్న శాంతమ్మ తన కళ్ళు పవిటకొంగుతో తుడుచుకుంటూ “అయి కన్నీళ్ళు కాదమ్మగోరూ, ఆనంద బాసపాలు” అంది.
“ఇప్పుడు చెప్పమ్మాయీ, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటావు?” అక్కడి ఆ పరిస్థితిని తేలికపరచడానికి టాపిక్ మార్చి అడిగింది రమ్య.
“మీరేది తీసుకోమంటే అదే తీసుకుంటానమ్మగారూ!”
“నీకు ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం?”
“అన్ని సబ్జెక్టులూ బాగా ఇష్టమే అమ్మగారూ!”
ఆశ్చర్యపోయింది రమ్య. ఎంత తెలివైన విద్యార్థికైనా ఒకటో రెండో సబ్జెక్టులు బాగా ఇష్టమై ఉంటాయి.
ఆశ్చర్యాన్నుంచి తేరుకుని, “ముందు- మాటకు ముందో అమ్మగారూ, వెనకో అమ్మగారు అనడం మానేయ్!”
‘ఏమనాలి?’ అన్నట్లు చూసింది.
“అక్కా” అను. “మరలా దానికి ‘గారు’ తగిలించావనుకో కొట్టేస్తాను.”
ఇద్దరూ గలగలా నవ్వుకున్నారు.
శాంతమ్మ కూడా సంతోషంగా నవ్వుకుంది. గిన్నెలు కడగడానికి వంటగదిలోకి వెళ్ళింది.
“అయితే, ఎంపీసీ తీసుకో! మంచి భవిష్యత్తుంటుంది” అంది రమ్య.
“అలాగే అమ్మగారూ!”
“నిన్ను కొట్టేస్తాను సుమా!” అంటూ చేయెత్తింది రమ్య.
“అలవాటైన పిలుపు గదా అమ్మగోరూ, పిలవనివ్వండి. ఎక్కడుండాల్సినోళ్ళు అక్కడుంటేనే బాగుంటుందండి!” శాంతమ్మ వంటగదిలోంచి అంది.
జరిగినదంతా రాత్రి ఇంటికి వచ్చిన శేఖర్‌తో భోజనం వడ్డిస్తూ చెప్పింది రమ్య. ఆ అమ్మాయి తెలివితేటలు, మంచితనం గురించి విని అతను కూడా సంతోషించాడు.
ఆర్భాటాలెక్కువ, చదువు తక్కువ ఉండే కాళాశాలల్లో కాకుండా, చదువు పద్ధతి ప్రకారం చెప్పే సామాన్యమైన కళాశాల్లో చేర్చాడు శేఖర్. తన కూతుర్నైతే చదువు రాకపోయినా ఫర్వాలేదు స్టేటస్ ప్రధానమని పెద్ద పెద్ద ఫీజులు కట్టించుకునే కళాశాల్లో చేర్చేవాడు. ఆ అమ్మాయికి చదువు ముఖ్యమని భావించి అలా చేశాడు.
***
శేఖర్ తమ గతాన్ని చెబుతూ ఉంటే, హర్షవర్ధన్ ఉత్సుకతతో వింటున్నాడు. అసలు విషయం చెప్పకుండా ఏవేవో చెబుతున్నాడేంటని కాస్త విసుగ్గా కూడా ఉన్నాడు.
4
పనిచ్చిన కుటుంబానికే ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు శాంతమ్మా, ఆమె కూతురూ. కూతురి చదువు బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కుటుంబం కోసం ప్రాణాలనైనా ఫణంగా పెట్టేంతగా అభిమానాన్ని పెంచుకున్నారు.
ఓ రోజు విషాదంగా ఇంటికొచ్చిన శాంతమ్మను ఏమైందని అడిగింది కూతురు.
“ఏమీలేదు చిన్నీ! అమ్మగోరు ఈసారైనా తల్లవుతారని చాలా ఆశపడ్డారు. మళ్ళీ కడుపు పోయిందమ్మా! ఆవిడి బాద చూల్లేకపోతున్నానే తల్లీ!”
“అయ్యో పాపం! ఎందుకలా జరుగుతోందమ్మా?” చిన్నీ అడిగింది.
“ఆవిడి గరబసంచి చాలా బలఈనంగా ఉందట! అందుకే గరబం నిలబడ్డం లేదట! డాట్టరుగోరు చెప్పారట!”
“మరెలా అమ్మా? అమ్మగారికి ఇక పిల్లలు పుట్టరా? మంచివారికే దేవుడిలా ఎందుకు చేస్తాడమ్మా?” బాధ నిండిన గొంతుతో అడిగింది చిన్నీ.
“నా బాద కూడా అదే తల్లీ! వాళ్ళు అంత మంచోరు కదా, వాళ్ళకెందుకలా జరుగుతోందనిపిత్తాది. కానీ, ఏదో జనమలో జరిగిన చిన్న పొరపాటుకు దేవుడు ఇంత శిక్చ ఏసేశాడేమో అనుకుంటాను.”
“ఈ జన్మలో ఇంత మంచివాళ్ళు కదా! ఆ శిక్ష తీసేసి, వాళ్ళకో బిడ్డను ప్రసాదించొచ్చు కదా! దేవుడు కూడా అంత మంచోడు కాదేమో అమ్మా!”
“ఏయ్.. లెంపలేసుకో! దేవుడ్ని అలా అనకూడదు.” శాంతమ్మ భయపడిపోతూ చిన్నీ చేతులతోనే చిన్నీ చెంపల మీద కొట్టింది.
“ఆ కుటుంబానికి అలా చేస్తున్న ఆయన మీద నాకు కోపంగానే ఉంది” అంది చిన్నీ మొండిగా.
“తప్పన్నానా! మనం మనుసులం, మనుసులుగానే ఉండాలి. ఆయన్ని, ఆయన నిరణయాలను ప్రశనించడానికి మనమెవరం? ఎంతటోళ్ళం?” మళ్ళీ ఇందాకిటిలానే చిన్నీకి లెంపలేసింది.
మర్నాడు చిన్నీ రమ్యను చూడ్డానికి వెళ్ళింది.
రమ్య చిరునవ్వుతో పలకరించింది. ఆ నవ్వు వెనుక నిన్నటి విషాదం కనిపిస్తోంది. గతం కన్నా పదిహేను రోజులు ఎక్కువ నిలబడ్డం వల్ల ఈసారి సంతానం కలగడం ఖాయమనుకుంది. కానీ నిరాశే మిగిల్చింది.
శశిరేఖ, ఆమె భర్త అక్కడే ఉన్నారు.
ప్రభాకర్‌కి ఇంకా పెళ్ళి కాలేదు. గ్రామం నుంచి వచ్చి ఆ నగరంలో ఏదో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అక్క ఇంట్లో ఉంటున్నాడు.
వాళ్ళంతా శాంతమ్మకు తెలుసు గానీ, చిన్నీకి తెలీదు. రమ్య అందర్నీ పరిచయం చేసింది.
“మా అన్నయ్య నీ తెలివితేటలు చూసి సంతోషించి, నీకు చదువు చెప్పిస్తున్నాడు. నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అంది శశిరేఖ చిన్నీనుద్దేశించి.
శేఖరూ, రమ్యా కంగారుపడిపోయారు.
“ఆపు శశీ! నీకెవరు చెప్పారు ఆ విషయం. మేమేమీ పెద్ద ఘనకార్యం చేయడం లేదు. మేమో మంచి పని చేయడానికి తానే మాకో మంచి అవకాశాన్ని కలిగించింది” అన్నాడు శేఖర్.
“నేను మొన్నొచ్చినప్పుడు ఆ విషయం వాళ్ళమ్మే చెప్పింది. ఇక అవకాశమంటావా? ఆ అవకాశాన్ని ఎవరూ తీసుకోలేదు కదా! నువ్వు మాత్రమే తీసుకున్నావు కదా!”
“శశిరేఖా! దయచేసి ఆ విషయాన్నిక వదిలేయ్!” రమ్య అంది.
“గోరంత చేసి, కొండంత చెప్పుకుంటున్నారు జనం. ఇంత గొప్ప పని చేస్తూ, చెప్పుకోవడానికి సిగ్గుపడతారేంటీ?”
“సిగ్గుపడడం కాదండి వదినగారూ! అది అక్కాబావల సంస్కారం. తన కూతురికి చదువు చెప్పిస్తున్నారని శాంతమ్మ నలుగురికీ చెప్పుకోవడం అది ఆమె కృతజ్ఞత. మనం మాట్లాడ్డం మాత్రం కుసంస్కారమని అక్కాబావా అభిప్రాయపడుతున్నారు” ప్రభాకర్ అన్నాడు. అతని తీరు శశిరేఖకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు లేదు. వాళ్ళు ఎంతైనా కృతజ్ఞత కలిగివుండాల్సిందే, ఎన్ని సార్లైనా చెప్పాల్సిందే అన్నట్లుంది.
“నోర్ముయ్యరా! కుసంస్కారమంటూనే అదే విషయం గురించి మాట్లాడతావెందుకు?”
చిన్నీ వెళ్ళి రమ్య కాళ్ళకూ, ఆ తర్వాత శేఖర్ కాళ్ళకూ నమస్కారించింది.
“కాలేజీకి వెళ్ళొస్తానమ్మగారూ, అయ్యగారూ!” అని బయలుదేరింది.
“టిఫిన్ చేసి వెళ్ళమ్మా! శాంతమ్మా, చిన్నీకి టిఫిన్ పెట్టు” అంది రమ్య.
“ఇంటి దగ్గర చేశానండీ!” అంది చిన్నీ.
“అవునమ్మగోరూ! ఇంటి దగ్గర ఉప్పమా వండొచ్చానండి” శాంతమ్మ అంది.
“అయ్యో వెళ్ళిపోయింది. నేను ఆఫీసుకెళుతున్నాను కదా! కార్లో దింపేద్దును” అన్నాడు శేఖర్.
“కాలోజీ ఇక్కడికి దగ్గరే కదా బాబుగోరూ! నడిచి వెళ్ళిపోద్దిలెండి!” అంది శాంతమ్మ.
“ఆడపిల్లను కారెక్కించుకోకపోవడమే మంచిది” అంది శశిరేఖ.
“ఏం మాటలవి శశిరేఖా! తను మాకు కూతుర్లాంటిది” రమ్య చిరాగ్గా అంది.
శేఖర్ శశిరేఖ వంక కోపంగా చూస్తూ ఆఫీస్‌కి బయలుదేరాడు.
చిన్నీ చేసిన పని రమ్యకు ఆశ్చర్యానందాలను కలిగించింది. ‘నోటితో ఒక్క మాట మట్లాడుకుండా ఎంత బాగా సమాధానం చెప్పింది – శశిరేఖ, ప్రభాకర్లకు’ అనుకుంది.
తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని కలిగిస్తారు కొందరు. అసలు మాటలే లేకుండా “నేను కృతజ్ఞతను కలిగే ఉన్నా” నని కాళ్ళకు నమస్కరించడం ద్వారా చెప్పడం చాలా తెలివైన పనిగా అక్కడున్న అందరికీ అర్థమైంది.
శశిరేఖ అర్థమయ్యాక మూతి తిప్పుకుని “నడు చైతన్యా! మనమూ వెళ్ళాలి కదా! నీకూ పనుంది కదా!” అంది భర్తనుద్దేశించి.
“నేను రెడిగానే ఉన్నాను, నీదే ఆలస్యం” అన్నాడతడు.
శశిరేఖ విసురుగా రాత్రి తాను పడుకున్న గదిలోకి వెళ్ళింది. ఓ హ్యాండ్ బ్యాగూ, ఓ బట్టల బ్యాగూతో తిరిగొచ్చింది. బట్టల బ్యాగు భర్త చేతికిచ్చి, “వస్తాం వదినా!” అంది.
“అదేంటీ? భోంచేసి వెళ్ళమని మీ అన్నయ్య చెప్పాడు కదా! మీరూ సరే అన్నారు!” అంది.
“పనుంది. అప్పుడు గుర్తులేక ‘ఊఁ’ అన్నాం గానీ, తర్వాత గుర్తొచ్చింది.”
“ఒక్క అరగంటలో బోజనం సిద్దమైపోద్ది. తినేసి ఎల్లండమ్మా!” శాంతమ్మ వంటగదిలోంచి పరుగున వచ్చి అంది.
“మిగిలిపోతే, మీ ఇంటికి తీసుకెళ్ళి నువ్వూ, నీ కూతురూ తినండి” విసురుగా అంది.
అప్పటి వరకూ చిరునవ్వుతో ఉన్న శాంతమ్మ ముఖం పాలిపోవడమే కాక, లక్కపిడతంత చిన్నగా అయిపోయినట్లు కనిపించింది.
“నువ్వూరుకో శాంతమ్మా! ముఖ్యమైన పనేదో ఉందంటున్నారు కదా! వెళ్ళనీయి, ఇబ్బంది పెట్టకు” అంది రమ్య.
“పనిమనిషి నన్ను ఇబ్బంది పెట్టడమేంటీ? పెడితే ఊరుకుంటానా? ఉంటాం వదినా!” శశిరేఖ అని బయలుదేరింది.
“ఉంటామండీ!” అని, ఆమెననుసరించాడు చైతన్య.
“శాంతమ్మా! కొందరు మనుషులు అలాగే ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. ఈర్ష్యా ద్వేషాలతో వాళ్ళు బాధపడుతూ, ఇతరులను బాధపెట్టడం వాళ్ళ నైజం. వాళ్ళను పట్టించుకోకూడదు” అంది రమ్య.
“మీరు గానీ, అయ్యగోరు గాని ఏమన్నా అంటే, నేనేదో తప్పు చేసుంటానని బాదపడాలండి. ఎప్పడో ఒకసారి వచ్చి, రెండు రోజులుండి ఎళ్ళిపోయేవారేమన్నా అంటే, నేనెందుకు బాధపడతాను అమ్మగోరు?”
ప్రభాకర్ ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. తనను కూడా రెండు రోజులుండి వెళ్ళిపోయే పట్టించుకోనక్కర్లేని మనిషిగానే భావిస్తుందా అనుకున్నాడు.
శాంతమ్మ అతని వైపు చూసి నాలుక్కరుచుకుంది.
ఇద్దరినీ గమనించిన రమ్య చిరునవ్వుతో “నిన్ను అలా అనుకోదులేరా శాంతమ్మ!” అంది.
రమ్య ముఖంలో నవ్వు చూసి, ‘హమ్మయ్యా.. అమ్మగోరు బాద నుంచి బయటపడి కాస్త నవ్వుతున్నారు’ అనుకుని సంతోషించింది.
‘నేను సంతోషంగా ఉన్నానని సంతోషిస్తున్నావా శాంతమ్మా! ఏడేళ్ళగా పడుతున్న బాధే కదా, అలవాటైపోయింది. భగవంతుడు నాకు సంతానాన్ని ఇవ్వలేదు గానీ, నేను చిన్నప్పుడే కోల్పోయిన అమ్మను తిరిగిచ్చాడు’ అనుకుంది.
సాయింత్రం మరలా చిన్నీ వచ్చింది.
“కాలేజీ అయిపోయిందామ్మా?” రమ్య అడిగింది.
“అవును అమ్మగారూ! పొద్దుట మీతో మాట్లాడ్డం కుదర్లేదని కాలేజీ నుంచి ఇంటికెళుతూ వచ్చానండి.”
“మా ఆడపడుచు మాటలకు బాధపడకు. అసలు వాటిని పట్టించుకోకు.”
“నేనేమీ బాధపడలేదమ్మగారూ! ఆమె ఉన్న విషయాలే కదా మాట్లాడారు అనుకున్నాను. కానీ, ఆవిడ నన్ను బాధపెడుతున్నారనకుని మీరూ, అయ్యగారూ బాధపడినందుకు బాధపడ్డాను. నేనా సమయంలో రాకుండా ఉంటే బాగుండేదనుకున్నాను. నా వల్ల మీకు బాధ కలిగినందుకు మన్నించమని కోరడానికి వచ్చానమ్మగారూ!” అంటూ రెండు చేతులూ జోడించింది.
రమ్య నిశ్చేష్టరాలైపోయింది. అంత చిన్న వయసులో అంత గొప్ప సంస్కారం, మంచితనం, కృతజ్ఞతా భావం ఎలా అబ్బాయనే ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి అరనిమిషం పైనే పట్టింది. అటువంటమ్మాయిని తనెదురుగా చూస్తున్నందుకో, అనుబంధం కలిగున్నందుకో, మరెందుకో కళ్ళు చెమర్చాయి.
తల పక్కకి తిప్పుకుని, కళ్ళల్లో చేరిన తేమ బిందు రూపం దాల్చక ముందే తుడిచేసుకుంది.
“అయ్యో.. ఏమైందమ్మగారూ!” అంటూ కంగారుపడిపోయింది చిన్నీ.
అప్పుడే తనింటి దగ్గర నుంచి రమ్య ఇంటికి వస్తున్న శాంతమ్మ కూడా భయపడింది రమ్యకు ఏం జరిగిందో అని.
“ఏం లేదు, నలకేదో పడింది. నన్నింతగా ప్రేమించే మీరిద్దరూ ఉండగా నాకేం జరుగుతుంది? ఏం జరగదు” అంది రమ్య అందుబాటులో ఉన్న తువాలు అందుకుని కళ్ళు వొత్తుకుంటూ.
తమ మీద అంత గొప్ప అనురాగాన్నీ, నమ్మకాన్నీ ఏర్పరుచుకున్న రమ్యను చూస్తూ అమితమైన ఆనందోద్వేగానికి లోనయ్యారు ఆ తల్లీకూతుర్లు.
(ఇంకా ఉంది)
నా పూర్తి పేరు తోట వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు, కలం పేరు తోట సుబ్రహ్మణ్యం. స్వగ్రామం కోనసీమలోని మురమళ్ళ గ్రామం. తల్లిదండ్రులు తోట రామకృష్ణారావు, సత్యవతి. భార్య భారత స్వరాజ్యలక్ష్మి. నాకు ఇద్దరు కుమారులు. నేను మా ఊర్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఓ ప్రైవేట్ స్కూల్‌ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాను.
ప్రచురితమైన మొదటి కథ ‘ఆటా’ లో ఎంపికైన ‘మూడు లేఖలు’ అనే కథ. (2005లో ఆంధ్రభూమి దినపత్రిక). మొదటి కవిత ‘వానపాములు మిన్న!’ (ఆంధ్రభూమి దినపత్రిక). మొదటి వ్యాసం, ‘రిజర్వేషన్లతో సమస్య సమసిపోతుందా!’ (నా డిగ్రీ అయిన తర్వాత 1993-94 కాలంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రభ దినపత్రిక). కరోనాకు ముందు ‘వార్త’ ఎడిటోరియల్ పేజీలో పదికి పైనే నా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 2022, జనవరి 26న ‘విలువలెందుకు?’ అనే నా 20 కథల సంపుటి ఆవిష్కరణ జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సలీం గారు, గంటి భానుమతి గారు ముందు మాటలు రాశారు.
