Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమ్మెవరు?-3

[శ్రీ తోట సుబ్రహ్మణ్యం వ్రాసిన ‘అమ్మెవరు?’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ద్వితీయ బహుమతి గెల్చుకున్న రచన.]

[శేఖర్, అనుపమ తండ్రి హర్షవర్ధన్‌కి ఫోన్ చేస్తాడు. మాట్లాడుకోడానికి తన ఆఫీసుకు రమ్మంటాడు. హార్షవర్ధన్ వచ్చకా, శేఖర్ తన గదిలోకి వేరే ఎవరినీ రానివ్వద్దని ప్యూన్‌కి చెప్తాడు. హర్షవర్ధన్‍ కూర్చోమని చెప్పి, తనకూ, తన భార్యకు పెళ్ళయిన పదేళ్ళ వరకూ పిల్లలు పుట్టలేదనీ, తన భార్య రమ్య గర్భం దాల్చినా, నిలిచేది కాదని చెప్తాడు. ఓ దేవత ప్రత్యక్షమై, ఓ ప్రత్యేకమైన వైద్యం గురించి చెప్పడంతో ఆ వైద్యం చేయమని డాక్టర్లని అడిగామని, వారు దాన్ని సుసాధ్యం చేసి, తమకు సుశాంత్ కలిగేలా  చేశారని చెప్తాడు. హర్షవర్ధన్ ఆసక్తి కనబరచడంతో వైవాహిక జీవితం మొదలైన దగ్గర నుంచీ తన గతాన్ని చెప్పడం మొదలుపెడతాడు శేఖర్. పెళ్ళయ్యాకా, అప్పటి వరకూ చేస్తున్న ఉద్యోగం మానేసి సొంతంగా ఓ ఫ్యాక్టరీ పెడతాడు శేఖర్. వాళ్ళింట్లో పనిచేసే శాంతమ్మ, కేవలం పనిమనిషిగానే కాకుండా, పెద్ద దిక్కుగా ఉండేది. కడుపు పండడం లేదని బాధపడుతున్న రమ్యకి ధైర్యం చెప్పేది. తనకి కూడా పెళ్ళైన ఏడేళ్ళకి గాని కూతురు పుట్టలేదని చెప్తుంది. ఆ అమ్మాయి అప్పుడప్పుడూ శేఖర్ ఇంటికి వస్తుండేది. రమ్య పెళ్ళై ఐదేళ్ళయ్యేనాటికి ఆ అమ్మాయి తొమ్మిదో తరగతి చదివేది. చిన్నీ అని అందరూ పిల్చే ఆ అమ్మాయి పదో తరగతి మంచి మార్కులతో పాసవుతుంది. రమ్య చక్కగా దీవిస్తుంది. ఆ అమ్మాయి తర్వాతి చదువుకు కావల్సిన ఏర్పాట్లు చేస్తాడు శేఖర్. ఓసారి శేఖర్ చెల్లెలు శశిరేఖ, బావగారు వస్తారు. చిన్నీకి, శాంతమ్మకి ఇంట్లో అంత చనువ్వివడం శశిరేఖకి నచ్చదు. అక్కతో పాటు ఉండే ప్రభాకర్ మాత్రం వాళ్ళనేమీ అనడు. తమ మీద అభిమానం పెంచుకున్న ఆ దంపతులను చూసి ఆనందోద్వేగానికి లోనవుతారు తల్లీకూతుర్లు. – ఇక చదవండి.]

5

సంవత్సరం గిర్రున తిరిగి వచ్చేసింది. గత సంవత్సరం పదోతరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణరాలయ్యానని చెప్పిన అమ్మాయి ఈసారి ఆ మాటతో పాటు కళాశాల మొత్తం మీద ద్వితీయ స్థానంలో నిలిచానని కూడా చెప్పింది.

“ఒక్క మారుకులో పోయిందటమ్మగోరూ మొదటి మెట్టు!” అంది శాంతమ్మ.

ఆమె పక్కన నుంచున్న చిన్నీ చిరునవ్వు నవ్వుతూ “ప్రథమ స్థానం నేను పొందలేకపోయానని చెబుతోందండి” అంది రమ్యనుద్దేశించి.

మరలా తానే “మొదటి స్థానానికీ, రెండో స్థానానకీ మధ్య సాధారణంగా ఒకటి రెండు మార్కుల తేడానే ఉంటుందమ్మా!” అంది తల్లి వైపు తిరిగి.

“కంగ్రాట్యులేషన్స్ చిన్నీ!” అంది రమ్య.

“ఇది మీ వల్లే కదా జరిగిందమ్మగారూ!”

“కాదమ్మా! ఇది నీ కష్టం. నువ్వు అకుంఠిత దీక్షతో సాధించిన విజయం.”

రమ్య మెచ్చుకుంటుంటే చిన్నీ కాస్త సిగ్గుపడింది.

“అమ్మగోరూ! దానికి మంచి ఉజ్జోగం వస్తుంది కదామ్మా!” శాంతమ్మ ఆశగా అడిగింది.

“అమ్మా! ఇంటర్మీడియట్ అనేది రెండు సంవత్సరాల చదువని చెప్పాను కదా! ఒక సంవత్సరమే కదా అయింది. ఇంకో సంవత్సరం చదవాలి. ఆ తర్వాత డిగ్రీ కూడా చదివితే ఉద్యోగం వస్తుంది” చిన్నీ వివరించింది తల్లికి.

“అది ఎన్ని సంవచ్చరాలు చదవాలి?”

“మూడు..” అని చిన్నీ, “నాలుగు” అని రమ్యా ఒకేసారి అన్నారు.

‘ఇంకా నాలుగైదు సంవచ్చరాలు చదవాలా?’ అనుకుంటూ శాంతమ్మా, ‘నన్ను అమ్మగారు ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నారా?’ అనుకుంటూ చిన్నీ ఆశ్చర్యపోయారు.

“ఆ ఇంటరేదో అయిపోయిన తర్వాత మానేత్తాదిలెండి అమ్మగారూ! ఇంకా అన్ని సంవచ్చరాలు చదివిత్తానంటే చదివేయడం మాకు బావియం కాదమ్మా!” అంటూ శాంతమ్మ చేతులు జోడించింది.

“అవునమ్మగారూ! ఇంటర్ అయిన తర్వాత ఏదైనా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రైవేటుగా చేస్తాను” అంది చిన్నీ.

“సంవత్సరం తర్వాత కదా! అప్పుడేం చేయాలో అయ్యగారూ, నేనూ చెబుతాంలే!”

తల్లీకూతుళ్లిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. అంత సహాయం అందుకునే అర్హత తమకు లేదనే భావన వారి ముఖాల్లో ఒకరికొకరికి కనిపించాయి.

“అక్కా, బావా చదివిస్తానంటే చదువుకోవచ్చు కదా చిన్నీ! అందరికీ రాదు కదా ఆ అదృష్టం. నీకొచ్చింది.. వినియోగించుకో!” అప్పుడే బయట నుంచి వచ్చిన ప్రభాకర్ అని, తన గదికి వెళ్ళిపోయాడు.

రమ్య వాళ్ళిద్దరి వంకా చిరునవ్వుతో చూసింది. ఆ నవ్వులో ఎంతో చల్లదనం కనిపించింది. దానితో బయట వర్షం కురిసి వెలసిన చల్లదనం పోటీపడి గెలవలేకపోయింది.

రమ్య సెల్ మోగింది. శేఖర్ కాల్ చేస్తున్నాడు.

“హలో!” అంది రమ్య.

“ఏం చేస్తున్నావు?”

“శాంతమ్మా, చిన్నీలతో మాట్లాడుతున్నాను.”

“అవునూ.. ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం రిజల్ట్స్ వచ్చాయి కదా! చిన్నీ అన్ని సబ్జెక్టులూ పాసైందా?”

“పాసవడమేంటి? కాలేజీ సెకండ్!”

“ఓహో.. అద్భుతం. తనకివ్వు సెల్.”

స్పీకర్ ఆన్ చేసి ఇచ్చింది.

“కంగ్రాట్యులేషన్స్ భాగ్యం! నీ పేరులోనే కాదు, నువ్వు ఏదైనా సాధించడంలో కూడా ఉంది భాగ్యం. ఇలాగే చదువుకుంటే నీ భవిష్యత్తు చాలా బాగుంటుందమ్మా!”

“ధన్యవాదాలు అయ్యగారూ!”

“స్పీకర్‌లో పెట్టు.”

“అమ్మగారు స్పీకర్‌లో పెట్టే నాకిచ్చారండి.”

“ఏంటి రమ్యా! చిన్నీకి గులాబ్ జామ్ చేసి పెడుతున్నావా? కొంచెం ఎక్కువ చేయి, నాక్కూడా ఇష్టం కదా!” అన్నాడు.

“అది సరే, భాగ్యం అంటున్నావేంటీ?” అడిగింది రమ్య.

“చిన్నీ అసలు పేరు అదే! చిన్నీ అనేది ముద్దు పేరై ఉంటుంది కదా! కాలేజ్లో చేరుస్తున్నప్పుడు అప్లికేషన్ మీద ‘చేదల భాగ్యం’ అని రాయడం చూశాన్లే!”

“భాగ్యం.. పేరు చాలా బాగుంది. ఇక నుంచి అలానే పిలుద్దాం!”

“సరే, గులాబ్ జామ్‌లు నాకుంచు.”

“ఉంచుతాన్లే! ఇంతకీ ఫోనెందుకు చేశావో చెప్పలేదు.”

“ఆఫీస్ అటెండర్ రమణను పంపుతున్నాను, నా షెల్ఫ్‌లో పసుపు రంగు ఫైల్ ఉంటుంది, అది అతనికిచ్చి పంపు.”

“సరే!”

“ఉంటాను” అని కాల్ కట్ చేశాడు శేఖర్.

“ఏంటి శాంతమ్మా! తినకి భాగ్యం అని పేరు పెట్టావా? మీ పెద్దవాళ్ళ పేరేదో పెట్టుంటావు, అది వెంకమ్మో, సుబ్బమ్మో అయివుంటుంది, అందుకే చిన్నీ అని పిలుచుకుంటున్నావు అనుకున్నాను.”

“అవునమ్మగారూ.. దీని పేరు బాగ్గిమేనండి! ‘మొకంలో లచ్చిమీ కల ఉలిక్కిపడుతోంది, బాగ్గిమని పేరుపెట్టండి’ అని ఓ పంతులుగారు చెబితే, దీని నాయనా, నేనూ పెట్టామండి. ఇది పుట్టిన ఐదేళ్ళకే దీని నాయన పాము కరిచి చచ్చిపోయాడమ్మగోరూ!”

“అయ్యో.. ఎంత పని జరిగింది! అతనుండుంటే మీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది.”

“ఏం మెరుగ్గాలెండమ్మా! సంపాదించిందంతా తాగుడుకు తగలేసేవోడు. అప్పుడు కూడా నేను సంపాదించిన దానితోనే ఇల్లు గడిచేదమ్మా!”

“సరే, ఈరోజు నుంచి తినని భాగ్యమనే పిలుద్దాం! మా అమ్మ పేరు భాగ్యవతి.. తెలుసా!” అంటూ కళ్ళు వొత్తుకుంది రమ్య.

“అమ్మగారు ఎప్పుడు పోయారండి?”

“నా ఎనిమిదేళ్ళ వయసప్పుడు.”

“పెబాకరం బాబు వయసెంతప్పడు ఆమ్మగోరూ?”

“అప్పటికి వాడు పుట్టలేదు.”

“అంటే.. అమ్మగోరూ..?”

“అమ్మ పోయిన తర్వాత నాన్నగారు రెండో పెళ్ళి చేసుకున్నారని చెప్పాను కదా! తమ్ముడు ఆమెకు పుట్టాడు.”

“ఆయెమ్మి మనమ్మగారిని చాలా బాధ పెట్టేదట చిన్నీ!” అంది శాంతమ్మ.

చిన్నీ “ఉష్షూ..!” అంది నోటి మీద చూపుడు వేలు పెట్టుకుని.. ప్రభాకర్ వింటాడు సుమా అన్నట్లు.

“శాంతమ్మా.. చిన్నీ కాదు, భాగ్యమని పిలుచుకుందామన్నాను కదా!’

“అలాగే అమ్మగోరూ, మరిచిపోయాను.”

శాంతమ్మ వంటగదిలోకి వెళ్ళింది చేయవలసిన పనులు గుర్తు చేసుకుంటూ.

“రా భాగ్యం.. ఇలా కూర్చో!” సోఫాలో తన పక్క చోటు చూపించింది.

“ఇలా కూర్చుంటాను అమ్మగారూ!” అంటూ ఆ పక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంది.

“ఇలా వచ్చి కూర్చోమని చెప్పానా?” గట్టిగా అంది.

భాగ్యం బెరుకు బెరుగ్గా వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది.

“ఫ్రీగా కూర్చో!” అంది రమ్య.

తర్వాత, వివిధ కోర్సులు, వాటికి సంబంధించిన ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తు మొదలగు విషయాల గురించి రమ్య చెబుతుంటే భాగ్యం వింటోంది.

కానీ, భాగ్యం భవిష్యత్తును కాలం ఎలా నిర్ణయిస్తుందనేది ఎవరికి తెలుసు?

6

సంతానం కోసం రమ్య చేయని పూజలు, వ్రతాలు లేవు. తిరగని ఆసుపత్రులు, మింగని మందులు లేవు. ఫలితం మాత్రం శూన్యం.

భాగ్యం రెండో సంవత్సర పరీక్షల్లోనైనా కళాశాల మొదటి స్థానాన్ని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది.

శాంతమ్మ ఓ రాత్రి చలీ, జ్వరంతో పెద్దగా మూలుగుతోంది. భాగ్యం భయపడిపోయింది. రమ్యకు ఫోన్ చేసింది.

శేఖర్ కారులో వచ్చి శాంతమ్మను, భాగ్యాన్ని కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. డాక్టర్లు పక్షవాతం అని తేల్చారు.

ఆ మాట వినగానే భాగ్యం కుప్పకూలిపోయింది. ప్రి-పైనల్ పరీక్షలకు దీక్షగా చదువుతున్న తాను వాటిని మరిచిపోయింది. తల్లిని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలనే ఆలోచనలో పడిపోయింది.

శాంతమ్మను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏ సమయానికి ఏ మందులు ఇవ్వాలో ఆ సమయానికి ఆ మందులను ఖచ్చితంగా ఇస్తోంది. కొన్ని రోజులు శాంతమ్మ మంచం మీద నుంచి అస్సలు లేవలేకపోయింది. భాగ్యం అన్ని సేవలూ చేస్తూ తల్లిని పసిపాపలా చూసుకుంది.

చదువు మానవద్దని రమ్య, శేఖర్ ఎంత చెప్పినా వినలేదు. తన తల్లి కన్నా ఏదీ ఎక్కువ కాదని తెగేసి చెప్పేసింది.

తన తల్లి ఉద్యోగం తనకిస్తే, దాన్ని తల్లిలాగే సక్రమంగా చేసుకుంటూ ఆమెని పోషించుకుంటానని చెప్పింది.

శేఖర్ దంపతులు చేసేదేమీ లేక భాగ్యాన్ని తమ ఇంటి పనిమనిషిగా పెట్టుకోక తప్పలేదు. కానీ, పనిమనిషిలా కాకుండా ఇంటిమనిషిలా చూసేవారు. తమకో కూతురుంటే ఎలా చూసుకుంటారో అలా చూసుకోవడం మొదలుపెట్టారు.

భాగ్యం ఇంటి పని మొత్తం చేసేది. యజమానులకు ఏ లోటూ రాకుండా చూసుకునేది. ఇంటికెళ్ళి తల్లిని సాకేది.

జీతం ఎంతనేది లెక్కలేదు. డబ్బులు అవసరమైనప్పుడు ఇంత కావాలని భాగ్యం అడిగేది. అంతకుమించి ఇస్తే, అవసరమైనంతా తీసుకుని మిగిలింది వెనక్కిచ్చేసేది.

రెండు సంవత్సరాలు గడిచాయి.

భాగ్యం చదువు కొండెక్కింది గానీ, జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది.

రమ్య జీవితంలో మాత్రం శాంతి ఏర్పడలేదు. మరోసారి గర్భస్రావం జరిగింది. ఆమె దుఃఖానికి అంతులేకపోయింది. తనకింక సంతానం కలగదని కుమిలి-కుమిలి ఏడ్చింది.

తననెంతో ప్రేమించే తన భర్తకు వారసులను ఇవ్వలేకపోతోందన్న అపరాధనా భావం ఆమెను మరింత కృంగదీసింది.

అదంతా చూసి తట్టులేకపోయింది భాగ్యం. తానేదో పత్రికలో చదివిన ఐవిఎఫ్ గురించీ, సరోగసీ గురించీ రమ్యకు చెప్పింది.

“నేనూ ఎక్కడో చదివాను. ఐవిఎఫ్ ఫుల్‌ఫామ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ కదా! స్త్రీ నుంచి అండాన్ని సేకరించి, పురుష కణాన్ని దానికి కలుపుతారు. అది పిండమవుతుంది. తర్వాత దాన్ని స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. అవునా?”

“అవునమ్మా!”

“అదే వ్యాసంలో సరోగసీ గురించి కూడా చదివినట్లు గుర్తు. తల్లి గర్భాశయం అందుకనుకూలంగా లేకపోయినా, పిండాన్ని నిలుపుకోలేని స్థితిలో ఉన్నా వేరే స్త్రీ గర్భాశయాన్ని అందుకుపయోగించడాన్ని సరోగసీ అంటారు. అంతే కదా!”

“అవునండి.. అదే!”

“అటువంటామె మనకెక్కడ దొరుకుతుంది” అంది రమ్య.

అప్పట్లో అద్దెకి గర్భాన్నిచ్చే స్త్రీలు దొరకడం అంత సులభమైన విషయం కాదు.

“మీ ఇంటి బిడ్డను మోయడానికి నా గర్భం పనికిరాదా అమ్మగారూ?”

నిర్ఘాంతపోయింది రమ్య. “ఏంటి వాగుతున్నావు? పెళ్ళి కావలసిన పిల్లవు జీవితాన్ని పాడుచేసేకుంటావా? అలా చేస్తే నీకు పెళ్ళవుతుందా? నోరు మూసుకుని వెళ్ళి పని చూసుకో!” అని కోప్పడింది.

“నా అతి ముఖ్యమైన పని – మీరు సంతోషంగా ఉండడం చూడ్డం. అది జరగనప్పుడు నేనిక్కడ పని చేయలేనండి.”

భాగ్యం మాటల్లో జరిగి తీరాలన్న పట్టుదల ప్రస్ఫుటంగా వినిపిస్తోంది.

‘ఏంటి ఈ పిల్ల? ఇంత మొండిగా మాట్లాడుతోంది’ అనుకుంది రమ్య.

“నా సంతోషం కోసం నీ జీవితాన్ని బలి చేయగలనని ఎలా అనుకుంటున్నావు? అది జరగని పని.”

“రేపటి కల్లా మీ నిర్ణయం చెప్పండమ్మగారూ! అప్పుడు నేనిక్కడ పని చేయాలా, వేరే చోట పని వెదుక్కోవాలన్నది నేను నిర్ణయించుకుంటానండి.”

“నీకేమన్నా పిచ్చా? నేను చెప్పేది వినవేంటి? వేరే చోట పని చూసుకుంటాదట! అక్కడ ఇక్కడలా ఉండదు.. అక్కడ పనిపిల్లవే అవుతావు, తట్టుకోలేవు. నీకు పనెక్కువవుతుందని నాకనిపించినప్పుడు నేను కొన్ని పనులు చేస్తాను. అక్కడలా ఎవరూ చెయ్యరు.” నిజంగానే మానేసి వెళ్ళిపోతుందేమోనన్న అనుమానం కలిగి అంది.

“నా మనసులోని దేవత కళ్ళల్లో కన్నీరు అక్కడ నాకు కనిపించవండి. అక్కడ ఎవరో కొత్తవాళ్ళుంటారు.”

భాగ్యం మనసులో తాను దేవతైందన్న మాట రమ్య కళ్ళల్లోకి తేమ చేర్చింది. “ఈ మూర్ఖత్వంతోనే చదువు పాడుచేసుకున్నావు. జీవితాన్ని కూడా పాడు చేసుకుంటానంటే నేనొప్పుకోను.”

“మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం అమ్మగారూ! అటువంటి మంచితనం మీతోనే అంతమవడానికి నేను కూడా ఒప్పుకోనండి.”

“నీ మూర్ఖత్వం గురించి మీ అయ్యగారికి చెబుతాను. ఆయన చెబుతారులే నీకు ఎలా చెప్పాలో అలా!”

“అయ్యగారిని నేనొప్పించుకుంటాన్లెండి!”

సాయింత్రం పనైపోయిన తర్వాత భాగ్యం ఇంటికెళ్ళిపోయింది.

‘పిచ్చిపిల్ల, జీవితమంటే కృతజ్ఞత చూపడమే అనుకుంటోంది. కొంత స్వార్థం కూడా లేకపోతే జీవితం నిస్సారమైపోతుందని తెలుసుకోలేకపోతోంది. శేఖర్తో కాస్త బుద్ధి చెప్పించాలి తనకి’ అనుకుంది.

ఆ రాత్రి శేఖర్‌తో విషయం చెబితే, అతను ఆశ్చర్యపోయాడు. తామేం చేశామని ఆ అమ్మాయికి అంత కృతజ్ఞత? అనే ప్రశ్న అతని మెదడులో సంచరించింది.

చెప్పించిన చదువు ఎందుకూ ఉపయోగపడలేదు, మధ్యలోనే ఆగిపోయింది.

సహాయం ఉపయోగ పడిందా, లేదా అన్నది ఆ అమ్మాయికి ముఖ్యం కాదు. ‘చేశారు’ అన్నదానికే అంకితమైపోయింది.

సమాజంలో ఇంత మంచివాళ్ళు కూడా ఉంటారా? అనిపించిందతనికి. సరిగ్గా చూడకుండా, ఏవో కొన్ని అనుభవాలతో సమాజమంతా స్వార్థంతో నిండిపోయిందనో, విలువలను కోల్పోయిందనో, చెడిపోయిందనో నిర్ధారణకు వచ్చేయడం సరైంది కాదనుకున్నాడు.

తరచి చూస్తే అటువంటి ఆణిముత్యాలు ఎన్నో బయటపడతాయని తెలుసుకున్నాడు.

“రేపు తనకి నేనేం చెప్పాలి?” రమ్య ప్రశ్నతో ఆలోచనల నుంచి బయటపడ్డాడు శేఖర్.

“నేను మాట్లాడతాన్లే తనతో.”

మర్నాడు తాను లేచేటప్పటికి భాగ్యం గిన్నెలు తోముతుంది.

“వచ్చి ఎంత సేపైంది?” శేఖర్ అడిగాడు.

‘ఎప్పుడూ లేనిది ఇలా అడుగుతున్నారేంటి అయ్యగారు?’ మనసులో అనుకుంది భాగ్యం.

“ప్రశ్న కొత్తగా ఉందా?” అన్నాడు శేఖర్.

అతని వైపు ఆశ్చర్యంగా చూసింది.

“చాలా పెద్దదానవైపోయావు కదా! వేరే చోట పని చూసుకుంటానన్నావట! రేపట్నుంచి వస్తావో లేదో అని ఈరోజు కాస్త మాట్లాడాలనిపించిందమ్మా!” చిరుకోపంతో మొదలెట్టి, బేలగా ముగించాడు.

“నన్ను పరాయిదానిలా చూస్తే తట్టుకోలేనయ్యగారూ!”

“ఎవరు చూశారు?”

“అమ్మగారు.”

“నీ జీవితం జాగ్రత్తని చెప్పడం తప్పా?”

“ఈ కుటుంబ సమస్యతో నాకు సంబంధం లేనట్లు మాట్లాడితే నన్ను పరాయిదాన్ని చేసినట్లు కాదాండి?”

“మా స్వార్థానికి నీ జీవితాన్ని బలిచేయడం సరైందా?”

“జీవితాన్ని బలిచేయడం ఏముందండీ? నేనేం తప్పు చేయడంలేదు. నేను చేసిన మంచి పనిని అర్థం చేసుకున్నవాడే నా జీవితంలోకి వస్తాడండి.”

“ఒక పని చేద్దాం! ముందు నీకు పెళ్ళి చేస్తాం! నీకో బిడ్డ పుట్టిన తర్వాత నీ భర్త అనుమతితో సరోగసీకి వెళదాం!”

కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది భాగ్యం. తర్వాత “పెళ్ళికి ముందే పెళ్ళికొడుక్కి ఈ విషయం చెబుదామండి. ఒప్పుకున్న వాడితోనే నా పెళ్ళి” అంది.

పెళ్ళి కోసం కాక, ఆ కుటుంబానికి మేలు చేయడం కోసం పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్న భాగ్యాన్ని చూసి, అటువంటి అమ్మాయితో ఓ అనుబంధం ఏర్పడడం తమ అదృష్టంగా భావించారు రమ్యశేఖర్‌లు.

(ఇంకా ఉంది)

Exit mobile version