[శ్రీ తోట సుబ్రహ్మణ్యం వ్రాసిన ‘అమ్మెవరు?’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ద్వితీయ బహుమతి గెల్చుకున్న రచన.]
[కాలచక్రంలో మరో ఏడాది గడిచిపోతుంది. చిన్నీ ఇంటర్ ఫస్టియర్ కాలేజీ మొత్తంలో రెండో స్థానంలో నిలుస్తుంది. మొదటి స్థానానికీ, రెండో స్థానానికీ తేడా రెండే మార్కులని శాంతమ్మ రమ్యకి చెబుతుంది. ఇదంతా మీ వల్లే అని అంటుంది చిన్నీ. తన కూతురుకి ఈ చదువుకి ఏమైనా ఉద్యోగం దొరుకుతుందా అని శాంతమ్మ అడగగా, ఇంకా చదవాల్సింది చాలా ఉందని రమ్య, శేఖర్ చెప్తారు. మాటల సందర్భంలో చిన్నీ అసలు పేరు భాగ్యం అని తెలుస్తుంది. తన తల్లి పేరు భాగ్యవతి అని శాంతమ్మకి చెబుతుంది. ఆవిడ ఎప్పుడు పోయారని శాంతమ్మ అడిగితే, తనకి ఎనిమిదేళ్ళప్పుడు చనిపోయిందని చెబుతుంది రమ్య. మరి ప్రభాకరం బాబు అని శాంతమ్మ అడిగితే, తమ్ముడు పిన్నికి పుట్టినవాడని చెబుతుంది. భాగ్యాన్ని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుని భవిష్యత్తులో ఏం చదవాలో చెప్తుంది రమ్య. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో కాలేజ్ ఫస్ట్ రావాలని ఎంతో పట్టుదలగా చదువుతుంది భాగ్యం. ఇంతలో ఓ రాత్రి శాంతమ్మకి చలీ, జ్వరం మొదలై, చివరికి పక్షవాతం లోకి దింపుతుంది. చదువుని పక్కకి పెట్టి తల్లికి సేవలు చేయడంలో లీనమైపోతుంది భాగ్యం. చివరికి తల్లి స్థానంలో రమ్య, శేఖర్ల ఇంట్లో పనికి దిగుతుంది. ఆమెను పనిమనిషిలా కాకుండా కూతురిలా చూసుకుంటారు వాళ్ళు. రెండేళ్ళు గడుస్తాయి. రమ్యకి మరోసారి గర్భస్రావం అవుతుంది. తానేదో పత్రికలో చదివిన ఐవిఎఫ్ గురించీ, సరోగసీ గురించీ రమ్యకు చెప్తుంది భాగ్యం. తన బిడ్డను మోయడనికి అటువంటి స్త్రీ ఎవరు దొరుకుతారని అంటుంది రమ్య. తాను మోస్తానని చెబుతుంది భాగ్యం. తిట్టిపోస్తుంది రమ్య. ఈ విషయంలో ఒప్పుకోకపోతే, రమ్య వాళ్ళింట్లో పని మానేస్తానని బెదిరిస్తుంది భాగ్యం. శేఖర్‌కి చెబుతుంది రమ్య. అతనూ విస్తుపోతాడు. కానీ తన నిర్ణయం మార్చుకోదు భాగ్యం. చివరికి, రమ్య శేఖర్ రాజీపడి, ముందు తనకి పెళ్ళి చేస్తామని, కాబోయే భర్త ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిద్దామని అంటారు. కాబోయే పెళ్ళికొడుక్కి ముందే ఈ విషయం చెప్దామని, అప్పుడే ఏ గొడవలు రాకుండా ఉంటాయని అంటుంది భాగ్యం. – ఇక చదవండి.]
7
“నాకు పెళ్ళి చేస్తారటమ్మా!”
ఆ మాట వినగానే శాంతమ్మ కళ్ళల్లోకి వేయి కొవ్వుత్తుల కాంతి వచ్చి చేరింది.
భాగ్యం సరోగసీ ప్రస్తావన తల్లి దగ్గర అస్సలు తీసుకురాలేదు. అర్థంకాక భయపడుతుందని భావించింది.
శాంతమ్మ ఏదో చెప్పింది. పక్షవాతం వల్ల మాటల్లో స్పష్టత లేదు. కానీ, ఆమె హావభావాలను బట్టి భాగ్యం అర్థంచేసుకుంది.
‘అమ్మగారు, అయ్యగారు దేవుళ్ళు. నేను లేకపోయినా వాళ్ళుంటారు నీకు. వాళ్ళనే తల్లిదండ్రులుగా భావించు. నమ్మకస్తురాలిగా ఉండు. వాళ్ళ అనుబంధాన్ని చెడగొట్టుకోకు’ అన్నది ఆమె మాటల్లోని భావన.
“అలాగేనమ్మా! వాళ్ళు నా ప్రాణంగా భావిస్తాను” అంది భాగ్యం.
అది విని శాంతమ్మ చాలా సంతోషించింది.
ఓ రోజు పనికి వెళ్ళబోతూ “ఈరోజు నాకు పెళ్ళి చూపులు జరగబోతున్నాయి” అని చెప్పింది.
శాంతమ్మ ఆనందానికి అవధుల్లేవు. మూతి వంకరపోయిన ఆ ముఖంలోకి కొత్త అందం వచ్చి చేరినట్లైంది.
పనిచేయవలసిన ఇంటికెళ్ళేటప్పటికి అక్కడ అన్ని పనులూ చేసేయబడి ఉన్నాయి.
“నువ్వు ఈరోజు ఏ పనీ చేయొద్దు. అక్కడ కొత్త బట్టలున్నాయి, కట్టుకో!” అంది రమ్య.
“నన్నులానే చూస్తే మంచిది కదా అమ్మగారూ! నేనిక్కడ ఏం చేస్తానో, ఎలా ఉంటానో అతనికి తెలిస్తే, తర్వాత మా మధ్య గొడవలుండవు కదాండి!”
‘ఏంటీ పిల్ల?! ఈ వయసులో ఇంత పరిపక్వత ఏంటి?’ అనుకుంది రమ్య.
“నువ్వేంటన్నది ఆ అబ్బాయికి చెప్పాములే! నువ్వెళ్ళి ఆ బట్టలు వేసుకో! ఇంకేం మాట్లాడకు” అంది.
“అక్క పెద్దది కదా! అన్నీ తనకు తెలుసు కదా! తను చెప్పినట్లు చేయి చిన్నీ!” అన్నాడు ప్రభాకర్.
“ఏయ్ ప్రభా, చిన్నీ కాదు, భాగ్యం” అంది రమ్య.
“సారీ అక్కా! పొరపాటున వచ్చేసింది ఆ పిలుపు.”
భాగ్యం వైపుకు తిరిగి “అక్క చెప్పినట్లు చేయి భాగ్యం!” అన్నాడు.
తప్పదన్నట్లు వెళ్ళి, అక్కడున్న ఖరీదైన కొత్త బట్టలు ధరించి వచ్చింది.
ఆమెను చూసిన ముగ్గురూ అవాక్కయ్యారు. క్షణం తర్వాత ‘ఎంత బాగుంది!’ అనుకున్నారు మనసులో.
‘నా దిష్టే తగిలేలా ఉంది పిచ్చిపిల్లకి’ అనుకుంది రమ్య.
‘ఇంత అందమైన అమ్మాయి మాకు పుడితే ఎంత బాగుంటుంది!’ అనుకున్నాడు శేఖర్.
ప్రభాకర్ దృష్టి మరల్చలేకపోతున్నాడు భాగ్యం మీద నుంచి. ‘ఇంత అందాన్నిచ్చి అంత పేదరికాన్నిచ్చావేమయ్యా భగవంతుడా? పనిపిల్లైపోయింది గానీ, నేనే పెళ్ళి చేసేసుకుందును’ మనసులో గొణుక్కున్నాడు.
“బాగోలేదా అమ్మగారూ?” భాగ్యం అడిగింది.
“అప్సరసలా ఉన్నావు” నోరుజారి నాలుక్కరుచుకున్నాడు ప్రభాకర్.
“చాలా బాగున్నావు తల్లీ!” అన్నాడు శేఖర్.
“పెళ్ళి చూపులైన తర్వాత నీకు దిష్టితీయాలమ్మా!” అంది రమ్య.
పెళ్ళికొడుకు వచ్చాడు. అమ్మాయిని చూసి ఆనందపడిపోయాడు. ఆ ఆనందంతో అతనిలో కూడా అందం పెరిగింది.
“మీతో పెర్సనల్‌గా మాట్లాడాలి” అంది రమ్య.
“అవన్నీ తర్వాత మాట్లాడదాంలేమ్మా!” శేఖర్ అన్నాడు. సరోగసీ విషయమే ఆమె చెప్పబోతోందని గ్రహించాడు. అమ్మాయి నచ్చిన ఆనందంలో ఉన్న ఆ అబ్బాయికి ఆ విషయం చెప్పడం సరైంది కాదనిపించింది.
“ముందే మాట్లాడాలి అయ్యగారూ!”
“మాట్లాడనివ్వండి సర్!” అన్నాడు పెళ్ళికొడుకు.
“సరే కేశవ్! నేను ఇంతకుముందు చెప్పినవే తనూ చెబుతుంది. విని ఓకే అంటావనుకో!” అన్నాడు శేఖర్.
అరగంట తర్వాత డాబా మీదనుంచి వచ్చారు భాగ్యం, కేశవ్.
అబ్బాయి ఏం చెప్పబోతున్నాడనే ఆదుర్దాలో ఉన్నారు శేఖర్ దంపతులు.
“సర్, తాను చాలా మంచిదండి. తన కండిషన్‌కి నిజంగానే అంగీకరించానండి. తాను చేయబోయే మంచి పనికి ఈ విధంగా నేను కూడా భాగస్వామిని అవడం చాలా సంతోషంగా ఉందండి” అన్నాడు కేశవ్.
“మా అమ్మాయి నీకు అంతగా నచ్చినందుకు చాలా సంతోషం బాబూ!” అన్నాడు శేఖర్.
“మంచి పిల్ల, ప్రేమగా చూసుకో! మీ ఇద్దరి జీవితం చాలా బాగుంటుంది” రమ్య అంది.
“మీ లాంటి వారి అభిమానాన్ని పొందిన అమ్మాయి నాకు భార్య కాబోతుడడం నా అదృష్టమండి” రెండు చేతులూ జోడించాడు కేశవ్.
రమ్య, శేఖర్ ఎంతో ఆనందించారు – భాగ్యానికి మంచి భర్త లభించబోతున్నందుకు, అతను సరోగసీకి అంగీకరించినందుకు కాదు.
ఆ మంచి పనేంటో ప్రభాకర్‌కి అర్థంకాక బుర్ర గోక్కున్నాడు.
అబ్బాయి ఫోటో చూసి చాలా సంతోషించింది శాంతమ్మ. అందగాడు మాత్రమే కాదు, చాలా మంచివాడని విని మరింత ఆనందించింది.
“పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నాతోనే ఉంటావని అతనికి చెప్పాను. అతను ‘సరే’ అన్నాడు” అంది భాగ్యం.
“నేనెదుకు మీకడ్డం! నన్ను ఏదైనా ఆశ్రమంలో చేర్పించు. అయ్యగారితో చెప్పు, ఆ ఏర్పాటు చేస్తారు” అందని భాగ్యం అర్థం చేసుకుంది.
“నిన్ను అలా చేర్పింవలసి వస్తే, అసలు పెళ్ళే చేసుకోను. అందుకే ముందే చెప్పేశాను అతనికి” అంది.
“నేను నీతో రాను, ఆశ్రమానికే వెళతాను.”
“నిన్ను వదిలి నేనుండలేనమ్మా!”
భాగ్యాన్ని దగ్గరకు రమ్మనట్లు సైగ చేసింది శాంతమ్మ. బాగున్న చేత్తో భాగ్యం తల వెనుక చేయివేసి నుదుటి మీద ముద్దుపెట్టుకుంది.
తన కూతురికి మంచి సంబంధం చూసినందుకు తాను దణ్ణాలు పెట్టిందని రమ్యశేఖర్లకు చెప్పమంది.
“అలాగే.. చెబుతాన్లే! నువ్వు పడుకో!” అంది భాగ్యం.
తల్లిని తనతో ఉండనిస్తానన్న కేశవ్ మంచితనాన్ని తలుచుకుంటూ పడుకుంది. అంతకు మించిన గొప్పతనం సరోగసీకి అంగీకరించడం అనుకుంది. అతనితో తన జీవితం మథురంగా ఉండబోతున్నట్లు ఊహించుకుంది. మంచి ఆలోచనలతో హాయిగా నిద్రలోకి జారుకుంది.
కూతురి పెళ్ళి జరుగుతున్నట్లు, అత్తారింటికి వెళ్ళినట్లు, తనకు మనవడు పుట్టినట్లు ఆ రాత్రంతా ఎన్నో కలలు కన్నది శాంతమ్మ. తన జీవితంలా కాకుండా, కూతురు జీవితం మంచిగా ఉండబోతున్న భావం హృదయం నిండా నిండిపోయింది. పరమానంద భరితురాలై పరలోక ప్రయాణం చేసింది.
ఉదయం తల్లి కదలకపోవడం గమనించి ఘొల్లుమంది భాగ్యం.
నలుగురైదుగురు బంధువులు వచ్చారు. భాగ్యం ఏడుస్తూనే ఉంది.
“తన అనారోగ్యం నుంచి విముక్తి పొంది, నీకు శ్రమ తగ్గించింది” అన్నారెవరో.
“అమ్మకు సేవ చేయడం శ్రమనిపించలేదు, భారమనీ భావించలేదు. అమ్మ బతికితే ఇంతకుముందు కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటాను” అంటూ ఇంకా పెద్దగా ఏడ్వనారంభించింది.
ఆమె బాధ చూసి కొందరు కంటితడి పెట్టుకున్నారు.
కారొచ్చి ఆగింది. రమ్య, శేఖర్లు దిగారు.
భాగ్యం దుఃఖాన్ని అదుపు చేసుకోలేకపోయింది. వాళ్ళిద్దరి పాదాల మీదా పడి గోడు గోడున విలపించింది.
ఆమెను ఓదార్చి అక్కున చేర్చుకున్నారు ఆ దంపతులు.
జరగవలసిన కార్యక్రమాలు జరిపించారు. తర్వాత భాగ్యాన్ని తమింటికి తీసుకుపోయారు.
అంతా శూన్యమైపోయినట్లు అనిపించింది భాగ్యానికి. ఆ పుణ్య దంపతులు ధైర్యం చెప్పగా.. చెప్పగా శిశిర రుతువులో ఆకు రాలిపోయిన చెట్టు వసంత రుతువులో చిగురించినట్లు ఆమెలో ధైర్యం పుంజుకుంది.
8
“ముహూర్తాలు పెట్టించేస్తానమ్మా!” శేఖర్ అన్నాడు.
భాగ్యం మాట్లాడలేదు. తాను పెళ్ళి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గాని, ఆ ఇంటి బిడ్డకు సరోగేట్ మదర్ అవడానికి ఆ ఇంటి యజమానులు ఒప్పుకోరు. తనకు కుటుంబం ఏర్పడిన తర్వాతే వాళ్ళకి ఏదైనా చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం.
“ఇంటర్ పరీక్షల ముందు మీ అమ్మకు పక్షవాతం వచ్చి నీ చదువు పాడైంది. ఇప్పుడు ఏకంగా చనిపోయి, నీ పెళ్ళిని ఆపింది. తనకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నా గానీ తన వల్లే నీ జీవితానికి ఇబ్బందులేర్పడ్డాయి. ఇప్పుడిక నీకే ఇబ్బందీ ఉండదులే!” ప్రభాకర్ అన్నాడు.
“అంటే ఏంటి బాబూ! మా అమ్మ లేకపోవడం నాకు మంచిదంటారా?”
“ఏం మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడాలో ఏదీ తెలియదా నీకు? తెలియకపోతే నిశ్శబ్దంగా ఉండు” అంటూ తమ్ముడు మీద కోప్పడింది రమ్య.
తాను తప్పేమీ మాట్లాడలేదని చెప్పడానికి ప్రయత్నించాడు ప్రభాకర్.
“ప్రభా ఆగు” అన్నాడు శేఖర్. ప్రభాకర్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
భాగ్యం తలొంచుకుని నుంచుంది.
శేఖర్ భాగ్యం వైపుకు తిరిగి, “మూడు నెలలైంది కాబట్టి ఆడపిల్ల పెళ్ళి చేసుకోవడానికి శాస్త్ర పరమైన ఆటంకం ఏమీ ఉండదు. మగపెళ్ళివారిని ఇంకా ఆగమనడం సరైంది కాదు. మంచి సంబంధం, చేజార్చుకోకూడదు” అన్నాడు.
“ఈ ఇంటి వారసుడో, వారసురాలో రావడం కూడా ఆలస్యమవకూడదండి. ముహూర్తాలు పెట్టించండి” అంది భాగ్యం.
ప్రభాకర్ మరోసారి అయోమయంలో పడ్డాడు. అతనికి సరోగసీ విషయం తెలీదు.
పురోహితుడు వచ్చాడు. భాగ్యానికి తన జన్మ నక్షత్రం తెలీదు. నామ నక్షత్రాలతో ఏవో లెక్కలుగట్టి ముహూర్తాలు నిర్ణయించాడు. ఇరవై రోజుల్లో భాగ్యం, కేశవ్‌లు భార్యాభర్తలు కాబోతున్నారు.
భాగ్యం బంధువుల చిరునామాలు తెలుసుకుని శుభలేఖలు పంపాడు శేఖర్. తన ఫ్యాక్టరీలోనూ, ఆఫీస్‌లోనూ పనిచేస్తున్న వారికిచ్చాడు.
శశిరేఖను పిలవొద్దని శేఖర్‌కి చెప్పింది రమ్య. శేఖర్ పిలవడం మానలేదు.
ఆమె పెళ్ళికి వచ్చి చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. శుభలేఖలో శేఖర్ ‘నా సోదరి కుమార్తె భాగ్యం’ అని రాయడాన్ని తప్పుపడుతూ అల్లరి చేసింది.
“మా అన్నయ్యకు నేనొక్కదాన్నే సోదరిని అనుకున్నాను. నాకు తెలియకుండా మరో సోదరి ఉందట! ఆమె కూతురికి పెళ్ళి చేస్తున్నాడట ఇప్పుడు. అంటే.. మా నాన్నకు మా అమ్మకు తెలియకుండా మరో ఆవిడతో సంబంధం ఉందా? నాకు తెలియని మా సోదరి ఆమె కూతురేమో! ఆ కూతురు కూతురే నేటి పెళ్ళికూతురన్న మాట!” అంటూ పెళ్ళి జరుగుతున్న చోట రసాభాస చేసింది శశిరేఖ.
శేఖర్ వచ్చి మందలించినా ఆమె ఆగలేదు.
“నీ లాంటి సోదరి కన్నా అటువంటి సోదరున్నా మంచిదే!” అంది రమ్య.
పెళ్ళికి వచ్చిన వాళ్ళతో “శాంతమ్మ మా ఇంట్లో ఎన్నో ఏళ్లుగా పని చేసి, ఆ మధ్య చనిపోయింది. ఆ కృతజ్ఞతతో పెద్ద దిక్కు ఎవరూ లేని ఆమె కూతురుకి మేము పెళ్ళి చేస్తున్నాం.. అంతే!” అంది.
వాళ్ళందరూ శశిరేఖ వంక అసహ్యంగా చూశారు. జరుగుతున్న పెళ్ళికి ఆంతరాయం కలిగించకుండా అక్కడ నుంచి వెళ్ళిపొమ్మన్నట్లు ఉన్నాయి ఆ చూపులు.
అప్పటికి గానీ ఆమెకు బుద్ధి రాలేదు. సిగ్గుతో తలొంచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మనసు మాత్రం కోపంతో రగిలిపోయింది.
ఆ రాద్ధాంతం తప్ప మిగతాదంతా సవ్యంగా జరిగిపోయింది.
కొత్త దంపతులకు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఇచ్చాడు శేఖర్. సంవత్సరం తిరిగేటప్పటికి భాగ్యం ఒడి నిండింది.
భాగ్యం బిడ్డకు బారసాల అయింది. కేశవ్ తన కూతుర్ని చూసుకుని మురిసిపోతున్నాడు. భాగ్యం పోలికతో ఆ పాప చాలా ముద్దుగా ఉంది. తన బిడ్డను బాగా చదివించి గొప్ప ఉద్యోగస్థురాలుని చేయాలనుకున్నాడు. అందుకు తనో మంచి ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నాడు.
అదే విషయం భాగ్యానికి చెప్పాడు.
“అయ్యగారిని అడుగుతాను. ఎక్కడైనా వేయిస్తారేమో!”
“ఎక్కడైనా ఎందుకు? వాళ్ళ కంపెనీలోనే వేసుకోచ్చు కదా!”
“ఖాళీ ఉండాలి కదా! అడుగుదాం! వారి దగ్గర ఖాళీ లేదని ఊరుకోరు. ఎక్కడొక చోట నీకో ఉద్యోగం చూస్తారనుకుంటున్నాను.”
“సరే! నేనిప్పుడు చేస్తున్న పనితో అయితే మన పాపను చదివించలేం! నాకో మంచి ఉద్యోగం ఉంటే డబ్బు పొదుపు చేసుంచి, బాగా చదివించవచ్చు!’
“రేపు అయ్యగారిని అడుగుతాను, నువ్విప్పుడు ప్రశాంతంగా నిద్రపో!”
మర్నాడు ఉదయం ఇద్దరూ పాపతో సహా వెళ్ళి, శేఖర్ని కలిశారు. రమ్య పాపను తీసుకుని ముద్దు చేస్తోంది.
కేశవ్‌కి ఏదైనా ఉద్యోగం చూసిపెట్టమని భాగ్యం శేఖర్ని అడిగింది.
“ఖాళీగా కాలక్షేపం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏదైనా పని చేసుకుంటాను అనేవారంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి, నీ భర్తకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం చూస్తాను” అన్నాడు శేఖర్.
“అమ్మగారు ఇక్కడ కూర్చోండి అయ్యగారి పక్కన. కేశవ్ నువ్వు కూడా విను. నేను పెళ్ళి చేసుకున్నాను, నా బంగారు చిట్టితల్లికి జన్మనిచ్చాను. ఇప్పుడు నేనిచ్చిన మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది” అంది భాగ్యం.
ఏంటన్నట్లు చూశాడు కేశవ్. మిగిలిన ఇద్దరికీ విషయం అర్థమైంది.
“ఏం లేదు కేశవ్! నాకు పెళ్ళి చేయాలన్న ఆలోచన వచ్చిందే అమ్మగారి, అయ్యగారి బిడ్డను నా గర్భాన మోస్తాననడం వల్ల. అది నీక్కూడా తెలుసు కదా!”
“తెలుసు.”
“అమ్మగారికి నాలుగు నెలల క్రితం కూడా మిస్ క్యారీ అయింది.”
“బాబూ, మేము వద్దన్నా వినదు. కాబట్టి నువ్వు చెప్పు. ఆ విషయం గురించి మీ అన్యోన్య దాంపత్యంలో ఏ ఇబ్బందీ మాత్రం ఏర్పడకూడదు. మీరిద్దరూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి” శేఖర్ అన్నాడు కేశవ్‌తో.
“మీరు చెబితే వినంది నేను చెబితే మాత్రం వింటుందాండీ! తన మాట నిలబెట్టుకోవాలనుకుంటోంది. నిలబెట్టుకోనివ్వండి.”
“అబ్బాయి చెప్పినట్లు వినొచ్చు కదా భాగ్యం!”
“తను వద్దని చెప్పడంలేదు కదాండయ్యగారూ!”
“మీరిద్దరూ మరోసారి ఆలోచించుకోవడం మంచిది. మేం మాత్రం ఈ సరోగసీ గోల వద్దనే చెబుతున్నాం” అంది రమ్య.
“మనం మరోసారి మాట్లాడుకోవాలా కేశవ్?”
“పెద్దవాళ్ళు చెబుతున్నారు కదా!”
“సరే అయితే! మనం మాట్లాడుకుని రేపు వద్దాం!”
“మీరిద్దరూ దెబ్బలాడుకోవద్దు ఈ విషయం గురించి” శేఖర్ అన్నాడు.
“అవును, అదే ముఖ్యం. మీ కాపురం పాడవకూడదు” రమ్య అంది.
భాగ్యం వంట గదిలోకి వెళ్ళింది. కేశవ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. వాళ్ళ పాప రమ్య ఒడిలో ఆడుకుంటోంది. శేఖర్ కూడా ఆఫీస్‌కి బయలుదేరాడు.
ఆరోజు రాత్రి భాగ్యం చాలా కోపంగా ఉంది.
“మేడం చాలా అలిగినట్లున్నారు” అన్నాడు కేశవ్.
“నా పరువు తీసేశావు కదా! అందుకు అలగడమెందుకు? చాలా ఆనందంగా ఉన్నాను” ఆమె గొంతులో వెటకారం ప్రతిధ్వనించింది.
“అది కాదు భాగీ! వారు వద్దనుకుంటున్నప్పుడు నువ్వు అంత పట్టుబట్టడం ఎందుకు?”
“మన పెళ్ళికి ముందూ వాళ్ళు వద్దన్నారు. నేను పెళ్ళి చేసుకుని బిడ్డను కన్న తర్వాతైతే ఒప్పుకుంటామన్నారు. ఆ విషయం నీకు పెళ్ళి చూపులప్పుడు చెప్పాను.”
“ఈలోపులో నువ్వు మనసు మార్చుకుంటావనుకున్నారు.”
“నేను అటువంటి రకం కాదు.”
“సరే నీ ఇష్టం.”
భాగ్యం నవ్వింది. కేశవ్ సంతోషించాడు. ఆ రాత్రి సంతోషంగా గడిచింది వారికి. గర్భ నిరోధక సాధనం వాడాలని ఖచ్చితంగా చెప్పిందామె. అతను పాటించాడు.
మర్నాడు ఇద్దరూ శేఖర్ ఇంటికి వెళ్ళారు. కేశవ్ తన అంగీకారం తెలిపాడు. దాని తర్వాత యథావిధిగా డ్యూటీకి వెళ్ళాడు. మిగిలిన ముగ్గురూ పాపను కూడా తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు.
ప్రభాకర్ రెండు రోజులుగా చాటు నుంచి అంతా గమనిస్తున్నాడు. కానీ అతనికేమీ అర్థంకాలేదు. సరోగసీ అనే మాట అతని చెవిని పడుతున్నా, దాని గురించి అతనికి తెలీదు. తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ఇప్పటిలా అప్పుడు చేతిలో యాండ్రాయిడ్ ఫోన్ లేదు.
(ఇంకా ఉంది)
నా పూర్తి పేరు తోట వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు, కలం పేరు తోట సుబ్రహ్మణ్యం. స్వగ్రామం కోనసీమలోని మురమళ్ళ గ్రామం. తల్లిదండ్రులు తోట రామకృష్ణారావు, సత్యవతి. భార్య భారత స్వరాజ్యలక్ష్మి. నాకు ఇద్దరు కుమారులు. నేను మా ఊర్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఓ ప్రైవేట్ స్కూల్‌ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాను.
ప్రచురితమైన మొదటి కథ ‘ఆటా’ లో ఎంపికైన ‘మూడు లేఖలు’ అనే కథ. (2005లో ఆంధ్రభూమి దినపత్రిక). మొదటి కవిత ‘వానపాములు మిన్న!’ (ఆంధ్రభూమి దినపత్రిక). మొదటి వ్యాసం, ‘రిజర్వేషన్లతో సమస్య సమసిపోతుందా!’ (నా డిగ్రీ అయిన తర్వాత 1993-94 కాలంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రభ దినపత్రిక). కరోనాకు ముందు ‘వార్త’ ఎడిటోరియల్ పేజీలో పదికి పైనే నా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 2022, జనవరి 26న ‘విలువలెందుకు?’ అనే నా 20 కథల సంపుటి ఆవిష్కరణ జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సలీం గారు, గంటి భానుమతి గారు ముందు మాటలు రాశారు.
