[శ్రీ తోట సుబ్రహ్మణ్యం వ్రాసిన ‘అమ్మెవరు?’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో ద్వితీయ బహుమతి గెల్చుకున్న రచన.]
[భాగ్యానికి తామే తగిన సంబంధం చూసి పెళ్ళి చేస్తామంటారు రమ్య, శేఖర్‍లు. తల్లికి ఆ విషయం చెబుతుంది భాగ్యం. పక్షవాతంతో ఉన్న శాంతమ్మ కూతురు చెప్పింది అర్థం చేసుకుంటుంది. కేశవ్ అనే కుర్రాడితో భాగ్యం పెళ్ళి కుదురుతుంది. హఠాత్తుగా శాంతమ్మ చనిపోతుంది. భాగ్యం క్రుంగిపోతే, రమ్య, శేఖర్ ఓదార్చి, ధైర్యం చెబుతాఅరు. మూడు నెలలు దాటాకా భాగ్యం పెళ్ళి జరుగుతుంది. పెళ్ళిలో శశిరేఖ బాగా గొడవ చేస్తుంది. ఓ కూతురుకి తల్లవుతుంది భాగ్యం. తమ బిడ్డకి సరోగేట్ మదర్‍గా ఉండే విషయంలో మరోసారి ఆలోచించుకోమంటారు రమ్య, శేఖర్. తాను సిద్ధమని గట్టిగా చెబుతుంది భాగ్యం. – ఇక చదవండి.]
9
“సంప్రదాయ ఐవిఎఫ్‌కు అవకాశం లేదు. ఈ విధానంలో తల్లి గర్భంలో పిండం ఏర్పడకపోతే, తల్లిదండ్రుల నుంచి సంతానోత్పత్తి కణాలను తీసుకుని, రెంటినీ కలిపి పిండాన్ని తయారుచేసి తల్లి గర్భంలో ప్రవేశపెడతాం!” లేడీ డాక్టర్ చెప్పుకుపోతోంది.
ముగ్గురూ శ్రద్ధగా వింటున్నారు. పాప భాగ్యం భుజం మీద నిద్రపోతోంది.
“కానీ, మీ విషయంలో అండం పిండంగా మారే ప్రక్రియకు ఆటంకం ఏం లేదు. కానీ పిండాన్ని గర్భాశయం నిలుపుకోలేకపోతోంది. కాబట్టి, సరోగసీ ఐవిఎఫ్ చేయవలసి ఉంది. సరోగేట్ మదర్ని ఏర్పాటు చేసుకోవాలి మీరు. అంటే- మీ పిండాన్ని తన గర్భాన మోయడానికి ఒప్పుకునే స్త్రీని మీరు చూసుకోవాలి.”
“ఈ దేవతేనండి ఆమె! తాను సరోగేట్ మదర్ అవడానికి మమ్మల్ని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చింది డాక్టర్!” అంటూ భాగ్యాన్ని చూపించాడు శేఖర్.
ఏమీ అర్థం కానట్లు చూసింది డాక్టర్. “ఏమంటున్నారు మీరు? మీ బిడ్డను తన గర్భాన మోయడానికి ఆమెను ఒప్పించి తీసుకొచ్చారు. అంతే కదా!”
“కాదండీ! తానే మమ్మల్ని ఒప్పించి తీసుకొచ్చింది పిచ్చిపిల్ల” అంది రమ్య.
“పిచ్చిపిల్లా?!.. నో.. అలా అయితే నేను చేయను” డాక్టర్ కంగారుపడింది.
“ఇటువంటి సాహసం చేస్తున్న ఆ అమ్మాయి మీద ప్రేమతో నా భార్య అలా అంది. తిను మాకు బాగా కావలిసిన అమ్మాయి. మా సమస్య తెలుసుకుని మాకు సాయం చేయడానికి తానే వచ్చి మమ్మల్ని ఒప్పించింది” శేఖర్ డాక్టర్‌కి అర్థమయ్యేలా వివరించాడు.
డాక్టర్ ఆశ్చర్యంగా చూసింది భాగ్యం వంక. ఆత్మీయంగా పలకరించింది కళ్ళతో.
భాగ్యం రెండు చేతులతో నమస్కరించింది.
“ఇందులో బలవంతం ఏమీ లేదు కదా! నీ అంగీకారంతోనే జరుగుతోంది కదా!” రూఢి చేసుకోవడానికి అడిగింది డాక్టర్.
“వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానమండి. నా అంతట నేనే వాళ్ళకు ఈ పని చేసిపెట్టాలనుకున్నానండి” మరలా దణ్ణం పెట్టి చెప్పింది భాగ్యం.
“నీకు కొన్ని వైద్య పరీక్షలు చేయాలమ్మా! చేయమంటావా?” డాక్టర్ అడిగింది.
“చేయండి” అంటూ ఆనందంగా తలూపింది భాగ్యం. పాపను రమ్యకిచ్చింది.
భాగ్యాన్ని వెనుక గదిలోనికి తీసుకెళ్ళింది డాక్టర్. అరగంట తర్వాత తీసుకొచ్చింది.
“ఒకసారి తల్లై ఉన్న ఈమె సరోగసీ ఐవిఎఫ్కు పూర్తి అనుకూలంగా ఉంది” అంది డాక్టర్.
ఆ భార్యాభర్తల ముఖాలు ఆశతో నిండి ప్రకాశించాయి. అది చూసి భాగ్యం సంబరపడింది.
ఆ తొమ్మిది నెలలూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో భాగ్యానికి డాక్టర్ వివరంగా చెప్పింది.
రమ్య అండం ఇవ్వడానికి ఎప్పుడు రావాలో కూడా చెప్పింది.
ముగ్గురూ ఇంటికి బయలుదేరారు.
శేఖర్ కారు నడుపుతున్నాడు. భాగ్యం, రమ్య వెనుక కూర్చున్నారు. పాప రమ్య ఒడిలో ఉంది.
“నువ్వు మాకు చేస్తున్న సాయానికి కృతజ్ఞత తెలపాలో, సాహసం చేస్తున్నందుకు మందలించాలో తెలియడం లేదు. సమాజం నిన్ను ఎలా చూస్తుందో అని భయపడుతున్నాం మేమిద్దరం” అంది రమ్య.
నేడు సరోగసీ చాలా సాధారణ విషయంగా ఉంది గానీ, అప్పుడు అటువంటి పని చేసి సమాజానికి ముఖం చూపడం సాహసమే!
రమ్య, శేఖర్ల పిండాన్ని భాగ్యం గర్భాశయంలో ప్రవేశపెట్టడం విజయవంతమైంది. భాగ్యం కుటుంబాన్ని తమ ఇంట్లో ఉండమని కోరారు ఆ భార్యాభర్తలు. అద్దె ఇల్లు ఖాళీ చేసి వచ్చేశారు కేశవ్, భాగ్యంలు.
భాగ్యాన్ని రమ్య కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఇష్టమైనవన్నీ వండి పెడుతోంది. తాత్కాలికంగా వేరే పనిమనిషిని పెట్టుకుంది. భాగ్యాన్ని కాలు కింద పెట్టనివ్వడం లేదు. గాజుబొమ్మలా చూసుకుంటోంది.
బజారులో ఎన్ని రకాల పళ్ళు దొరికితే అన్నీ తెప్పించి పెడుతోంది. ముఖ్యంగా- పుల్లగా ఉండేవి.
వేవిళ్ళతో ఇబ్బంది పడుతుంటే, దగ్గరుండి సేవలు చేస్తోంది.
ఓ రాత్రి శేఖర్తో “పాపం చిన్నపిల్ల శేఖర్! బిడ్డను కని ఆరు మాసలైనా కాకముందే మరలా వేవిళ్ళతో బాధపడుతోంది. వికారం, వాంతలతో నలిగిపోతోంది” అంది రమ్య.
“అందుకే కదా నువ్వు దగ్గరుండి చూసుకుంటావని అద్దె ఇల్లు ఖాళీ చేయించి ఇక్కడికి తీసుకొచ్చింది!”
“అది మంచి పనే అయింది. లేకపోతే ఇబ్బందయ్యేది.”
“జాగ్రత్తగా చూసుకో! ముఖ్యంగా భాగ్యానికి ఏమీ కాకూడదు. మనకు మంచి చేయడానికి వచ్చిన తన ప్రాణానికి ఏమీ కాకూడదు.”
“లోపలున్న బిడ్డకు ఏమైనా కూడా తను తట్టుకోగలగదు. అంత అంకిత భావంతో ఉంది.. మనకు బిడ్డనివ్వాలని.”
భాగ్యానికి అంతా మంచి జరగాలని వాళ్ళిద్దరూ తమ మనసుల్లో దీవించి నిద్రలోకి జారుకున్నారు.
కొన్ని వారాలకు వాంతులు తగ్గాయి. నెలలు గడుస్తున్నాయి. కడుపులో బిడ్డ ఎదుగుతుంటే చేత్తో తడుముకుంటూ ఏదో అనుభూతికీ లోనవుతోంది భాగ్యం.
రమ్య అది చూసి ఏదో న్యూనతా భావానికి లోనవుతోంది. బిడ్డ తనదే! గర్భంలో వృద్ధి చెందుతోంది. ఆ గర్భం తనది కాదు, ఆ అనుభూతులు తాను పొందలేకపోతోంది. మనసుకు చాలా బాధ అనిపిస్తోంది.
‘భగవంతుడా! బిడ్డను సృజించే శక్తినిచ్చావు. కడుపున మోసే సామర్థ్యాన్ని ఇవ్వలేదు. నా తరుపున గర్భాన్ని ధరించే మనిషినిచ్చి, మథురమైన అనుభూతులకు దూరం చేశావు. నాకెందుకు ఇంత శిక్ష వేశావయ్యా!’ అనుకుంటూ కంటతడి పెట్టుకుంది.
ఆ తర్వాత భాగ్యం గర్భంతో ఆయాసపడుతుండడం చూసి జాలిపడింది.
మరో సందర్భంలో భాగ్యం ఆనందం చుసి, ‘నేను కేవలం నెలసరపప్పుడు బయటకు పోయే అండాన్ని మాత్రమే ఇచ్చాను. తను రక్తమాంసాలను పంచిస్తూ బిడ్డను గర్భాన పెంచుతోంది. అందుకు ప్రతిఫలంగా ఆ ఆనందాన్ని పొందుతోంది. ఎంతో గొప్ప సాయం చేస్తున్న ఆ బంగారు తల్లికి అది దక్కడం నాకూ ఆనందమే’ అనుకుంది.
ఓరోజు భాగ్యానికి బిడ్డ కదలికలు, చిట్టి చిట్టి పాదాలతో తన్నడం తెలిసాయి. ఆ విషయాన్ని చాలా అనందపడుతూ రమ్యకు చెప్పింది.
రమ్య ఏడ్చేసింది. తన బిడ్డ తన కడుపులో ఉండి చేయవలసినవి వేరే ఉదరంలో చేయడం తట్టుకోలేకపోయింది. కానీ బయటకు ఆనందంతో కలిగిన దుఃఖంలా భాగ్యం భావించేలా ప్రవర్తించింది.
ఆ రోజు శేఖర్ మధ్యాహ్నం మూడు గంటలకే ఇంటికి వచ్చేశాడు.
“ఈ సమయంలో వచ్చావేంటీ?” రమ్య అడిగింది.
“ముడి సరుకు కొరత వల్ల నాలుగు రోజులుగా ఉత్పత్తి ఆగింది. దాని వల్ల ఆఫీస్‌లో ఈరోజు మధ్యాహ్నం నాకేమీ పనిలేకుండా పోయింది. రేపు ప్రొడక్షన్ మొదలవుతుంది. మళ్ళీ బిజీ అయిపోతాను. ఈ పూట నీతో సరదాగా గడుపుదామని వచ్చాను” భార్య వంక చిలిపిగా చూస్తూ అన్నాడు.
రమ్య చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు.
“ఏమైంది?” అన్నాడు.
రమ్య భాగ్యం గదిలోకి తొంగి చూసి, ఆమె నిద్రపోతోందని గ్రహించింది.
“నువ్వు చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుని కూర్చో! నేను కాఫీ తెస్తాను గదిలోకి” శేఖర్‌తో అంది.
రమ్య కాఫీ కప్‌తో వెళ్ళేటప్పటికి శేఖర్ పరుపు మీద కూర్చుని ఉన్నాడు.
కప్పు అందించింది.
అతను మొదటి గుటక వేసి, కాఫీ చాలా బాగుందని చెప్పాడు.
ఆమె చిరునవ్వు నవ్వింది.
“ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం?”
“ఏముంది? ఏమీ లేదు. కాఫీ తాగు ముందు, చల్లారిపోతుంది” ముభావంగా అంది.
శేఖర్ తాగడం పూర్తి చేశాడు. కప్పు ఆమె చేతికిచ్చాడు.
ఆమె వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని ఆపి, “ఏదో చెప్పాలనుకున్నావు, చెప్పలేదు” అన్నాడు.
హఠాత్తుగా విస్ఫోటనం జరిగినట్లు ఒక్కసారి ఏడ్చేసింది. బయటకు వినబడుతుందేమోనని రెండో చేత్తో నోరు నొక్కుకుంది. ఒక చేతిలో ఖాళీ కాపీ కప్పుంది.
“ఏమైంది రమీ?” లాలనగా అన్నాడతడు భుజం మీద చేయి వేసి.
ఆమె అతని గుండెల మీద వాలిపోయి నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె స్థిమితపడే వరకూ అతనేమీ మాట్లాడలేదు.
“మన బిడ్డ భాగ్యం పొట్టలో కదులుతోంది తెలుసా?” అంది.
“ఓ.. వెరీ గుడ్. ఆరోగ్యంగా ఉందన్న మాట.”
“బుల్లి బుల్లి పాదాలతో తన్నుతోందట! భాగ్యం చెప్పింది.”
“అవునా?! ఆ పాదాలు రెండేసి అంగుళాలుంటాయా?” ఉత్సుకతతో అడిగాడు.
“నాకెలా తెలుస్తుంది? నన్ను తన్నుతోందా? అంత అదృష్టం నాకు లేదు కదా!” కళ్ళ నుంచి వస్తున్న నీటిని పవిటకొంగులోకి ఇంకిపోయేలా వొత్తుకుంది.
“బాధపడకు” ఓదార్పుగా అన్నాడతడు.
“శేఖర్! భార్యాభర్తల బంధం వివాహ బంధం. అది కాకుండా, కుటుంబంలోని మరే బంధాన్నైనా రక్త సంబంధం అంటారు. కానీ, తల్లీబిడ్డల మధ్య బంధాన్ని అంతకుమించి అంటారు, అదేంటో చెప్పు.” అతని గుండెల మీద నుంచి తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తోంది.
“అదీ.. అదీ..” ప్రయత్నించాడు గానీ, ఏం గుర్తుకురాలేదు.
“పేగుబంధం అంటార్రా మొద్దు! అది నాకూ, నా బిడ్డకు లేదు. రక్తమాంసాలు పంచిస్తున్న భాగ్యంతో ఏర్పడింది” అతని చొక్కాని గట్టిగా పట్టుకుని తల మరలా గుండెల మీద వాల్చి మళ్ళీ ఏడ్చేసింది.
రెండు చేతులతో ఆమెను కౌగిలించుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాడు శేఖర్.
రెండు క్షణాల తర్వాత ఆమె తేరుకుని, “జన్యు కణాలు నావి కాబట్టి చట్ట ప్రకారం నేను బైలాజికల్ తల్లినవుతాను. కానీ, తన ఒంటిలోని శక్తిని పంచి పేగుబంధం ఏర్పరుచుకున్న భాగ్యమే అసలైన తల్లవుతుందనిపిస్తోంది శేఖరం! ఎందుకంటే- గుడ్డు ఏ కోడిదైనా, పొదిగి తనలోని ఉష్ణశక్తిని అందించి పిల్లను చేసిన కోడే తల్లికోడి కదా!” అని అతన్నుంచి విడిపించుకుంది.
పవిటకొంగుతో కళ్ళూ, ముఖమూ తుడుచుకుంది.
అన్నీ ఆమెయే చెబుతుండడంతో అతనేమీ మాట్లాడలేకపోతున్నాడు.
“ఆ కుటుంబాన్ని ఎప్పటికీ మనతోనే ఉంచేసుకుందామని నాకు మాటివ్వు. వాళ్ళిద్దర్నీ విడదీయకూడదు. తల్లి నుంచి బిడ్డని విడదీయడం చాలా పెద్ద పాపం శేఖరం!” అంది.
శేఖర్ ఆమె చేయి తీసుకుని, అరచేతిలో తన ఆరచేయి వేశాడు.
10
భాగ్యం ఆరోగ్యంగా ఉన్న మగబిడ్డను ప్రసవించింది. ఇంట్లో అందరూ సంతోషించారు.
ప్రభాకర్‌కి సరోగసీ ఐవిఎఫ్ గురించి అర్థమైంది తనకు మేనల్లుడు పుట్టాడని తెలుసుకున్నాడు.
తమకు కొడుకు పుట్టాడని శేఖర్ దంపతులు పండగ చేసుకుంటుంటే, రమ్యను గర్భిణిగా చూడకుండా బిడ్డెలా వచ్చాడని నోర్లు నొక్కుకున్నారు జనం.
బారసాలకు అందరినీ పిలిచి జరిగిందంతా చెప్పారు.
సరోగసీ గురించి ఎంత చెప్పినా, కొందరు అక్కడ ఊకెట్టెళ్ళి, బయట తప్పుడు ప్రచారం చేశారు. ఆ బిడ్డ శెఖర్, భాగ్యంల బిడ్డంటూ వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టారు.
భాగ్యం డబ్బుకు లొంగిపోయిందని నోటికొచ్చిందల్లా మాట్లాడుకున్నారు. భాగ్యం ఒంటరిగా కూర్చుని ఏడ్చేది. తాను బాధపడుతున్నట్లు ఇంట్లో ఎవరికీ తెలియనివ్వలేదు.
కేశవ్ ఆమె బాధను అర్థం చేసుకున్నాడు.
“ఇటువంటి పరిస్థితి వస్తుందనే అమ్మగారు, అయ్యగారూ సరోగసీ వద్దన్నారు. నువ్వు వినలేదు. ఆ ధైర్యాన్ని ఇప్పుడు చూపించాలి.. అప్పుడు కాదు” అన్నాడు.
“నువ్వు బాధపడ్డం లేదు కదా!” అంది భాగ్యం.
“లేదు, ఇటువంటి పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కోవడానికి నేను అప్పుడే సిద్ధపడ్డాను.”
ఆమె అతన్ని కౌగిలించుకుని ఏడ్చింది. “నువ్వు నాకింత అండగా ఉంటే, నాకు ప్రపంచంతో పనిలేదు” అంది. అతని చేతులు కూడా ఆమె చుట్టూ బిగుసుకున్నాయి.
శేఖర్, రమ్యలు కూడా ఆమెకు ధైర్యం చెప్పారు.
ఇద్దరి తల్లుల ముద్దుల బిడ్డ సుశాంత్ అల్లారు ముద్దుగా పెరిగాడు. బాగా చదువుకున్నాడు.
అమెరికా వెళ్ళే అవకాశం వచ్చినా వదులుకుని స్టార్టప్ కంపెనీ పెట్టాడు. తన తెలివి, విజ్ఞానం దేశానికీ, దేశంలోని ప్రజలకూ ఉపయోగపడాలని అతను చదువుకునే రోజుల్నుంచీ అనేవాడు.
వేరే కంపెనీలో పని చేస్తున్న మేనమామ ప్రభాకర్ని పిలిచి, తన కంపెనీలో ఉద్యోగం ఇవ్వడమే కాకుండా, ఇరవై శాతం వాటా ఇచ్చాడు.
కంపెనీ బాగా అభివృద్ధి చెందింది. అనుపమతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా పరిణామం చెందింది. పెళ్ళి వరుకూ వెళ్ళింది.
చూసి ఓర్వలేని కొందరు అతని పెళ్ళి జరక్కుండా చేశారు.
***
శేఖర్ చెప్పినదంతా విని హర్షవర్ధన్ నిట్టూర్చాడు. “చెల్లాయి సంతానం కోసం పరితపించి, కుదరక, సరోగసీకి అంగీరిచడం చాలా చాలా ఆమోదయోగ్యం. నేడు కొందరు డబ్బుందన్న దర్పంతో పురిటి నొప్పులను తప్పించుకోవడానికీ, అందం తగ్గకూడదనీ అద్దె గర్భాలను ఆశ్రయిస్తున్నారు. చెల్లాయిలా అవకాశంలేక పొందలేకపోయిన గర్భవతులు పొందే మథురానుభూతులను చేజేతులాలారా కోల్పోతున్నారు” అన్నాడు.
“అసలు విషయం అర్థం చేసుకున్నందు కృతజ్ఞుడను బావగారూ!” శేఖర్ అని, గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాడు.
“ముందు పుణ్యాత్మురాలైన భాగ్యం గారికి క్షమార్పణలు చెప్పుకోవాలి బావగారూ!” హర్షవర్ధన్ కళ్ళ నిండా అపరాధనా భావం నిండి వుంది.
శేఖర్ భాగ్యానికి ఫోన్ చేసి, సెల్ హర్షవర్ధన్‌కిచ్చాడు.
“నేను హర్షవర్ధన్‌ని. నన్ను క్షమించు తల్లీ!” అన్నాడు.
హర్షవర్ధన్ మాట్లాడబోతున్నాడని శేఖర్ చెప్పి ఉండడంతో విషయం అర్థంచేసుకుందామె. “అయ్యో.. మీరు పెద్దవారు, నన్ను దీవించవలసినవారు, అలా మాట్లాడకండి” అంది.
“నీది ఇంత గొప్ప సంస్కారం అమ్మా! నేను పెద్ద మూర్ఖుణ్ణి. ఉంటాను తల్లీ!”
“దణ్ణాలయ్యగారూ!”
కాల్ కట్ చేసి ఫోన్ శేఖర్‌కిచ్చాడు.
‘అక్రమ సంతానమనుకున్న ఆ అబ్బాయి ఇద్దరు పుణ్య స్త్రీల బిడ్డ. ఇప్పుడే అతనితో మాట్లాడాలి’ మనసులో అనుకున్నాడు.
సుశాంత్‌కి కాల్ చేశాడు. “మరలా ముహూర్తాలు పెట్టించమంటావా అల్లుడూ?” అన్నాడు.
“పెట్టించండి. కానీ క్యాన్సిల్ చేయంచకండి” అన్నాడు అవతల్నుంచి సుశాంత్.
‘అల్లుడు చమత్కారే!’ అనుకుని, “పొరపాటు పునరావృతం కాదులే బాబూ! ఉంటాను” అన్నాడు.
అవతల్నుంచి సుశాంత్ “సరేండి!” అని కాల్ కట్ చేశాడు.
“చాలా సంతోషమండి. ప్రభాకర్‌ని పంపడం కన్నా మనిద్దరం మాట్లాడుకోవడం మంచిదైంది” అన్నాడు శేఖర్.
“అతన్ని పంపితే చాలా పెద్ద తప్పు చేసినవారవుదురు. ఇక బయలుదేరతానండి” అని లేచాడు హర్షవర్ధన్.
ఇద్దరూ ఒకరికొకరు నమస్కరించుకున్నారు. హర్షవర్ధన్ వెళ్ళిపోయాడు.
సుశాంత్‌కు ఫోన్ చేశాడు శేఖర్.
“ప్రభాకర్ మావయ్యను పంపొద్దని ఎందుకన్నావు?”
“ఆయన వెళ్ళిపోయారా?”
“ఆఁ.. ఇప్పుడే!”
“ఈ పెళ్ళి చెడగొట్టడానికి ప్రయత్నించింది ప్రభాకర్ మావయ్యా, శశిరేఖ అత్తయ్యా. తన కూతురికి నన్ను చేసుకోలన్నది మావయ్య ఆశ. నా కన్నా పెద్దోడైన తన కొడుక్కి పెళ్ళవకుండా నాకైపోతోందని అత్తయ్య బాధ.”
శేఖర్ అవాక్కయ్యాడు. క్షణమాగి కాల్ కట్ చేశాడు సుశాంత్.
11
ఐదు నిమిషాల తర్వాత శేఖర్ ఫోన్ చేశాడు.
“చెప్పండి నాన్నగారు.”
“మావయ్యని ఏమన్నా అన్నావా?”
“ఏమీ అనలేదు. ఇప్పుడే నా చాంబర్‌కు వచ్చి వెళ్ళాడు. నేనేం మాట్లాడలేదు. మాట్లాడనిపించలేదు నాన్పగారూ! మాట్లాడతానేమోనని చూశాడు. నేను సీరియస్‌గా ల్యాప్‌టాప్‌లో ఏదో పని చేసుకుంటుంటే, అలమరాలోంచి ఏదో ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడు.”
“ఏమనకు. శశిరేఖత్తయ్యకూ ఫోన్ చేయకు. వాళ్ళకెలా బుద్ధి చెప్పాలో ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం!”
“అలాగే!” అన్నాడు సుశాంత్. కాల్ కట్ అయింది. తండ్రి ఏం చేయబోతున్నాడని ఒక నిమిషం ఆలోచించాడు. ఏం తెలియలేదు. వెంటనే తన పనిలో నిమగ్నమైపోయాడు. కానీ అతని మెదడు అంతరాంతరాల్లో ఆ విషయం గురించి ఆలోచిస్తూనే ఉంది.
ఇంటికి రాగానే శేఖర్ సుశాంత్ గదికి వెళ్ళాడు. సుశాంత్ పరుపు మీద పడుకొని పై కప్పును చూస్తూ ఆలోచిస్తున్నాడు. అలికిడి విని లేచి కూర్చున్నాడు.
శేఖర్ కుర్చీలో కూర్చున్నాడు.
“వాళ్ళను క్షమించేద్దామని చెప్పబోతున్నారు కదా!” అన్నాడు సుశాంత్.
“అవును, ఎలా చెప్పగలిగావు?”
“మీ గురించి నాకు తెలుసు కదా!”
“బుద్ధి చెబుదామని కదా చెప్పాను.”
“వాళ్ళను ఏమనకపోవడమే వాళ్ళకు పెద్ద శిక్షవుతుందని మీరు అనుకుంటారు. మనకు విషయం తెలిసి కూడా ఏమనలేదని వాళ్ళు మథనపడిపోతారని మీరు భావిస్తారు.”
“సరిగ్గా చెప్పావు.”
“కానీ నాన్నగారూ! వాళ్ళు నిన్న సాయంత్రం ఎంత నటించేశారిక్కడ?! మావయ్య అయితే, అనుపమ వాళ్ళను ఒప్పించడానికి వెళతానని కూడా చెప్పాడు!”
“అతన్ని పంపితే మరింత చెడగొట్టేవాడు. ఈ మాట నాది కాదు, నీ కాబోయే మావయ్యగారిది. అసలు నీకు వాళ్ళ మీద అనుమానం ఎలా వచ్చింది?”
“రాత్రి అనుపమ కాల్ చేసింది. వాళ్ళని చెప్పలేదు కానీ, మన దగ్గర బంధువులని చెప్పింది.”
“అయినా అనుమానం రాదు కదా! వాళ్ళిద్దరూ నీ మీద చాలా ప్రేమ చూపిస్తుంటారు కదా!” ప్రశ్నార్థకంగా చూశాడు శేఖర్.
“మొదట నాకూ అనుమానం రాలేదు. తర్వాత చిన్నగా అనుమానం మొదలైంది. అందుకే, హర్షవర్ధన్ గారితో మిమ్మల్నే మాట్లాడమన్నాను.”
“పూర్తిగా ఎప్పుడు తెలిసింది?”
“ఇందాక ఆయన నాకు ఫోన్ చేసిన తర్వాత. నేను అనుపమకు ఫోన్ చేసి, ఆయన పెళ్ళికి అంగీకరించారు కాబట్టి, మరోసారి చెడిపోకుండా ఉండాలంటే పేర్లు చెప్పమన్నాను. చెప్పింది.”
“అయితే మనమొక పని చేద్దాం! శశిరేఖ కొడుక్కి మంచి ఉద్యోగం నా కంపెనీలో ఇచ్చి, వాడికి మంచి పెళ్ళి సంబంధం కుదురుస్తాను. అక్కడక్కడా చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేక మానేశాడు గానీ, నేను పెద్ద ఉద్యోగమిస్తాను కాబట్టి మానకుండా కొనసాగుతాడు. నువ్వు మన కన్నా ఆస్తిపరులెవరైనా నీ స్నేహితుల్లో ఉంటే, ప్రభాకర్ కూతురికి అటువంటి సంబంధం కుదుర్చు” అన్నాడు శేఖర్.
అప్పుడే ఆ గదిలోకి వచ్చిన రమ్య “ప్రభాకర్ కూతురు అంటున్నారూ.. ఏంటి విషయం?” అంది.
ప్రభాకర్, శశిరేఖల ఘనకార్యం గురించి ఆమెకు చెప్పక తప్పలేదు వాళ్ళకి.
ఆమె ముఖం కందగడ్డలా అయిపోయింది. మనసు కోపంతో రగిలిపోతోంది. ప్రభాకర్‌కి ఫోన్ చేయబోయింది.
శేఖర్ ఆపాడు.
“అమ్మా, వాళ్ళకు మేము శిక్ష వేయబోతున్నాం!” అన్నాడు సుశాంత్.
“ఏం శిక్ష?”
సుశాంత్ చెప్పాడు.
“వరాలిస్తూ శిక్షలంటారేంటి?” ఇద్దరి మీదా చిరాకుపడింది రమ్య.
“అంత తప్పు చేసిన వారిని ఏమనకుండా ఉపకారం చేస్తే, అది పెద్ద మానసిక శిక్షవుతుంది. ఈ శిక్ష శత్రుత్వాన్ని పెంచకపోగా పోగొడుతుంది” శేఖర్ అని, ఆమెను ఒప్పించాడు.
శేఖర్ మాటలు అక్షర సత్యాలయ్యాయి. వాళ్ళు వచ్చి శేఖర్ కాళ్ళ మీద పడ్డారు.
“చిన్నవాడవైన నీకు ఆయుక్షీణం కాకూడదని నీ కాళ్ళు పట్టుకోలేదు” అన్నారు సుశాంత్‌తో.
తండ్రీకొడుకులిద్దరూ చిరునవ్వునే సమాధానంగా ఇచ్చారు.
ప్రభాకర్‌నీ, శశిరేఖనూ తండ్రీకొడుకులూ, భాగ్యం, కేశవ్ క్షమించేశారు. అమెరికాలో ఉన్న భాగ్యం కూతురు, అల్లుడు కూడా “అమ్మగారూ, అయ్యగారూ ముఖ్యం గానీ, వాళ్ళని పట్టించుకోనక్కర్లేదు” అన్నారు. రమ్య మాత్రం క్షమించలేకపోయింది.
సుశాంత్, అనుపమల పెళ్ళి ఘనంగా జరిగిపోయింది.
వాళ్ళు ఆనందంగా హనీమూన్‌కి వెళుతుంటే, అందరూ అంతకన్నా ఆనందంగా చేతులూపారు.. ప్రభాకర్, శశిరేఖలు కూడా.
శుభాలన్నీ ఒకేసారి జరిగినట్లు శేఖర్ తన తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా కట్టించిన గది ఇప్పుడు ఖాళీగా లేదు. మనవడి పెళ్ళికొచ్చిన వాళ్ళిద్దరూ ఇక మీదట ఇక్కడే ఉండడానికి అంగీకరించారు.
భాగ్యం పని పెరిగిందనుకోలేదు, వాళ్ళకు మూడో సంతానమైంది.
(సమాప్తం)
నా పూర్తి పేరు తోట వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు, కలం పేరు తోట సుబ్రహ్మణ్యం. స్వగ్రామం కోనసీమలోని మురమళ్ళ గ్రామం. తల్లిదండ్రులు తోట రామకృష్ణారావు, సత్యవతి. భార్య భారత స్వరాజ్యలక్ష్మి. నాకు ఇద్దరు కుమారులు. నేను మా ఊర్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఓ ప్రైవేట్ స్కూల్‌ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాను.
ప్రచురితమైన మొదటి కథ ‘ఆటా’ లో ఎంపికైన ‘మూడు లేఖలు’ అనే కథ. (2005లో ఆంధ్రభూమి దినపత్రిక). మొదటి కవిత ‘వానపాములు మిన్న!’ (ఆంధ్రభూమి దినపత్రిక). మొదటి వ్యాసం, ‘రిజర్వేషన్లతో సమస్య సమసిపోతుందా!’ (నా డిగ్రీ అయిన తర్వాత 1993-94 కాలంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రభ దినపత్రిక). కరోనాకు ముందు ‘వార్త’ ఎడిటోరియల్ పేజీలో పదికి పైనే నా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 2022, జనవరి 26న ‘విలువలెందుకు?’ అనే నా 20 కథల సంపుటి ఆవిష్కరణ జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సలీం గారు, గంటి భానుమతి గారు ముందు మాటలు రాశారు.
