Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమృతగానం

ప్రపంచపటంలో దిష్టిచుక్కలాంటి చిన్నద్వీపం
ఇంత విశాల ఉపఖండంపై స్వారీచేయటం
రాజ్యవిస్తరణకోసం ఎత్తులు, పొత్తులు, జిత్తుల చరిత్ర

జలియన్వాలాబాగ్ సుందర ప్రశాంతతలో
పచ్చని మైదానాన్ని కౌగిలించుకున్న ప్రహరీగోడకు
నాలుగు దిక్కులా చిన్న చిన్న ద్వారాల సాక్షిగా
బైసాఖీపండగ సంబరాల్లో బాపూ సందేశం
రౌలట్ చట్టానికి సామూహిక ధిక్కారస్వరం
ఉలిక్కిపడిన ముష్కరమూకల కవాతులు
అహంకారి డయ్యర్ కాల్పులకు ఆదేశాలు
నిరాయుధ నిస్సహాయులై నేలరాలిన వృద్ధులు
తల్లుల గుండెల్లో తలదాచుకున్న పసివాళ్ళు
తూటాలు నింపుకోవటం.. కాల్చటమే నరహంతకత్వం
గొట్టాలపొగ.. దుమ్ము .. ధూళి లోంచి
ఎగసిన హాహాకారాలు.. ప్రవహించిన రక్తపుటేరులు
జలియన్వాలాబాగ్ మృత్యువుకు ఒక చిరునామా!

ద్వారాలకు తాళాలేస్తే .. ఎక్కలేని ఎత్తయిన గోడలుంటే
ముందస్తు హెచ్చరికలు లేకుండా గుండెలకు గురిపెట్టి కాలుస్తుంటే
పాడుబడ్డ బావిలో దూకినా ప్రాణాలుంటాయా!
రక్తదాహం తీర్చుకున్న తెల్లపులి
ఎర్రని బూట్లకాళ్లతో గర్వంగా వెళ్లిపోతున్నప్పుడు
బలితీసుకున్న మరణాలను లెక్కిస్తుందా?
గాయాలలోతు తెలుసుకుంటుందా?
అంగవైకల్యాల వికృతవేదన అర్థం చేసుకుంటుందా?
రవి అస్తమించని సామ్రాజ్య ప్రభుత మాత్రం..
రక్తపుకూటికి స్వర్ణ కరవాలం కానుకిచ్చింది!

పూలు పూయాల్సిన తోటలో గడ్డకట్టిన దుఃఖంపై
స్వాతంత్ర్య వీచికలు సౌరభాలు వెదజల్లాయి
అందరు అమాయకుల రక్తంతో నిండిన ఆ బావినీళ్ళు
ఇప్పుడు కొంచెమయినా ఉప్పగా లేవు
వేల వేల విరుల శోకం వ్యాపించినచోట
ఒక్క మల్లెకూడా ఎర్రదనం పులుముకోలేదు
మన వీరుల త్యాగజలాలు అందుకున్న తోటంతా
ఇప్పుడు త్రివర్ణ ప్రసూనాలు విరబూస్తున్నాయి
సమరయోధుల ఆత్మగానం వినిపిస్తున్నాయి!
అమృతోత్సవ స్ఫూర్తిని దేశమంతటా ప్రసరిస్తున్నాయి!!

Exit mobile version