Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అమృత

[శ్రీమతి శ్రీదేవి బంటుపల్లి గారు రచించిన ‘అమృత’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

గిసి పడుతున్న కెరటాల వంక తదేకంగా చూస్తూ కూర్చుంది అమృత. పోటెత్తుతున్న అలల అలజడిలా మనసంతా గందరగోళంలా ఉంది.

“అమృతా! ఇక్కడ కూర్చున్నావా! బాగుంది.. చాలా బాగుంది.. అలల అలజడిని మనసుతో ముడి వేసుకుని బేరీజు వేసుకుంటున్నావా! ఇక్కడ. ఏమిటీ? నాన్నతో మాటలాడలేదట.. ? అమ్మ మీద అలిగావట? ఎందుకూ?” అంటూ వచ్చాడు డాక్టర్ రవికాంత్.

“ఏం? మా అమ్మా, నాన్న మిమ్మల్ని రాయబారం పంపారా!” అంటూ అటు తిరిగి కూర్చుంది అమృత.

“మీ నాన్న మనసులో ఉన్నది బయటకు చెబితే ఇక సమస్య ఏముంది? ఆయన నోరు విప్పడు కదా! మిత్రుడిని కదా! వాడి ప్రవర్తనని గమనించి వాడి మనసులో సంఘర్షణని గ్రహించే కొద్ది పాటి అనుభవం ఏడ్చి౦దిలే నాకు. ఎందుకంటే నా జీవితమంతా మీ అమ్మా నాన్న మనసులను చదవడంతోనే సరిపోయింది.. నేను ఎం.డి పుస్తకాలకంటే, వీళ్ళ మనసులనే ఎక్కువ చదివాను.. డాక్టర్ సిలబస్ పూర్తి చెయ్యగానే ఓ పరీక్ష రాసి పాస్ అయిపోవచ్చు.. కానీ మీ అమ్మా నాన్న మనసులు చదవటానికి ఆదీ, అంతం, లేదు నాకు.. వాళ్ళ ప్రవర్తన, మూడ్స్ చూసి వాళ్ళ సమస్య ఏమై ఉంటుందో అని నేను బుర్ర బద్దలు కొట్టుకోవడమే కాని వాళ్ళు నోరు తెరిచి చెప్పరు కదా!”

“నాన్న మీకు చెప్పకపోతే, నాన్నా నేను మాట్లాడటం లేదు అని మీకెలా తెలిసింది, అమ్మ మీద అలిగానని ఎలా తెలిసింది?.. ”

“అదా! మీ అమ్మ వంట అధ్బుతంగా చేస్తుంది.. కాని వారం రోజులనుంచి ఉప్పు, కారం సరిగా లేదు సరికదా, ఓ రోజు క్యారేజ్‌లో కూరకి బదులు నీళ్ళు పోసింది.. ఇంకో రోజు పచ్చి కాయగూర ముక్కలే పెట్టేసింది.. మరో రోజు పచ్చడిలో నీళ్ళే.. అప్పుడప్పుడు చేస్తే పొరపాటే కాని.. ప్రతి రోజు అదే పని.. నిన్నటికి నిన్న కారేజీ కప్పులు రెండూ ఖాళీగా ఉన్నాయ్.. మూడో కప్పులో కాస్తా పెరుగు అన్నం కలిపి ఉంది.. పోనీ అదేమైనా అడిగి ఎందుకు ఇలా చేస్తున్నావు.. నీకేమైంది అని మీ నాన్న అడుగుతాడా అంటే! అదీ లేదు.. ఏది ఉంటే అది ఓ యంత్రంలా.. వేళ్ళను నోట్లో పెట్టి అన్యమనస్కంగానే తిని భోజనం అయిపొయింది అని భావిస్తాడు మీ నాన్న.. అంతేగాని ఏమి వండి పెట్టిందో.. ఎందుకు అలా ఉందో అడిగి చావడు ఈ బడుద్దాయ్.. ఆ బాక్స్ లలో ఈ రోజు ఏమి స్పెషల్ వస్తుందో అని రోజూ ఎదురు చూస్తూ ఉన్న నా పరిస్థితి ఏమిటి? చెప్పు?

“అదా మీ బాధ.”.. అంది నిట్టూరుస్తూ.

“అదొక్కటే కాదు, వాడు ముభావంగా ఉంటే నేను చూడలేను అమృతా!.. ఇంటికెళ్ళి చూస్తే మీ అమ్మ కూడా అంతే.. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటుంది.. గలగలా మాట్లాడుతూ కాఫీ పెట్టమంటావా అన్నయ్యా! టిఫిన్ చేసి వెళ్ళు అని నా వెంటపడే మీ అమ్మ నన్ను పట్టించుకోవడం లేదు.. ఏమి జరిగిందో చెప్పు అంటే ఇద్దరూ చెప్పరు. కానీ ఏదో సమస్య ఉందని మాత్రం అర్థం అవుతోంది.. ” అన్నాడు రవికాంత్.

“వాళ్ళిద్దరికీ ఉండే ఒకే ఒక సమస్య నేనే అంకుల్. నా విషయంలో మరీ పోసెసివ్ అయిపోతున్నారు వాళ్ళిద్దరూ.. నేనింకా చిన్న పిల్లనా! నాకేమి తెలీదా! ప్రసాద్‌ని ఇస్టపడుతున్నా అని చెప్పా! కాస్త టైం కావాలట మీ ఫ్రెండ్‌కి. అంత అవసరమా! ప్రసాద్ గురించి చెప్పి ఏడాది దాటుతోంది.. కానీ ఇప్పటిదాకా అవుననో, కాదనో చెప్పలేదు. వాళ్లకి ఆమాత్రం నా మీద నమ్మకం లేదా.. గట్టిగా ఏదైనా అంటే ఇద్దరూ.. ఇదిగో.. మీరు చెప్పినట్టే మౌనముద్రలో మునిగిపోతారు. అయినా! ఇందులో ఇంత ఆలోచించే అవసరం ఉందంటారా! చెప్పండి మీరైనా! ప్రసాద్‌ని పెళ్లి చేసుకోవద్దు అంటే.. అక్కడే ఆగిపోతాను కదా! నా చావు నేను చస్తా కదా!” అంది విసుగ్గా అమృత.

“అలా ఎలా అనేసావు అమృతా! నీ మంచి చెడు చూడాల్సిన అవసరం వాళ్లకు కాకపొతే ఎవరికి ఉంటుంది? నీకు సంబందించిన ప్రతీది వారికి అవసరమే. వాళ్ళ జీవితాల్లో నువ్వు ఒక అపురూపమైన కానుకవి.. నువ్వు నవ్వితే వాళ్ళు నవ్వుతారు.. నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు.. ఒక్కపూట నువ్వు అలిగి అన్నం తినని రోజు వాళ్ళిద్దరూ పచ్చి మంచి నీళ్ళు కూడా తాగరు.. అది నీకు తెలుసా! నీకు ఓసారి టైఫాయిడ్ జ్వరం వచ్చింది బహుసా నీ ఆరో ఏట అనుకుంటా! ఇంత పెద్ద డాక్టరు నీరు కారిపోయాడు.. ఇక మా చెల్లాయి అయితే చెప్పనే అక్కర్లేదు.. చెయ్యని పూజలు లేవు.. వ్రతాలు లేవు.. ఉపవాసాలంటే ఇక చెప్పనే అక్కర్లేదు.. ఇకపోతే ఓ అనాథని అల్లుడిగా తీసుకువస్తానంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడు చెప్పు.”

“నా లెక్కలు నాకున్నాయి, నా కారణాలు నాకున్నాయి. మరీ ఇంత.. పొసేసివ్‌నెస్ ఉంటే మీ మిత్రుడితో.. మీ చెల్లాయితో ఇబ్బందే సుమా!” అంది నాటకీయంగా.. రెండు చేతులు తిప్పుతూ..

“ఆ అనాథను చేసుకోవద్దని చెప్పడానికి, ఒకవేళ నువ్వు ఇష్టపడ్డ వ్యక్తిని కాదు అని ఎలా చెప్పాలో తెలియక తర్జన బర్జన పడిపోతున్న వాళ్ళకీ కారణాలు ఉన్నాయి..” అన్నాడు రవికాంత్.

“అబ్బో ఏమిటో ఆ కారణాలు.. నాతో చెప్పుకోలోని కారణాలు?” అంటూ అటు తిరిగింది అమృత.

“అంత.. ” అని రెండు చేతులు చాస్తూ.. “అంటే ఆకాసమంత ప్రేమ.. వాళ్లకి నువ్వంటే.. ” అన్నాడు రవికాంత్ తానున్న వైపు తిరిగి..

“మరి నాకేనా లేదు.. అంత ప్రేమ.. నా పెళ్లి నా ఇష్టానికి వదిలేయ్యవచ్చు కదా! నా కారణాలు ఇప్పుడప్పుడే చెప్పలేను, అవి మీకు చెప్పే తీరాలి, కాని ఇప్పుడు చెప్పలేను. కానీ ఇలా ఇబ్బంది పెట్టడం దేనికి” అంది అమృత.

“ఇబ్బందా! నీకు ఇబ్బందిగా ఉందా!.. అసలు ఇంత వరకు నువ్వడిగింది.. వాడు ఇవ్వంది ఒక్కటి చెప్పు.. తనకున్న పెద్ద కుటుంబాన్ని వదిలేసి నీ చుట్టూ ఓ ప్రపంచాన్నే సృష్టించుకున్నారు వాళ్ళు ఎందుకో తెలుసా! వాళ్ళ జీవితాల్లో అమూల్యమైన వస్తువు ఏదైనా ఉంది అంటే.. అది నువ్వే.. ఎందుకంటే.. ఎందుకంటే.. నువ్వు వాళ్ళ కన్నబిడ్డవు కాదు కాబట్టి” అన్నాడు

“ఏంటి? మళ్ళీ చెప్పండి.. మీరు.. మీరు జోక్ చేసున్నారు కదా!.. అయినా.. అయినా అంత మాట అనేసారెంటి?” అంది కాస్తా కంగారుగా అమృత. “ఛీ ఛీ.. అది అది అనడానికి మీకెలా ఉందో కానీ, వినడానికి అసలు.. అసలు.. బాగాలేదు అంకుల్” అంది.

“అవును అమృతా! అది నమ్మలేని నిజం, జీర్ణించుకోలేని నిజం.. కాని నువ్వు ఆ నిజం తెలుసుకోవాలి.. ఎందుకంటే.. ఇప్పుడు.. ఇప్పుడు నువ్వు తెలుసుకునే తీరాలి ‘వాళ్ళ’ గురుంచి. నువ్వు నీ ‘ఉనికి’ నువ్వు తెలుసుకోవాలి, ఆ సమయం వచ్చేసింది.

భూకంపపు పొరల్లో నుంచి.. భూదేవిలా వచ్చిన నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన నీ తల్లి తండ్రులు గురుంచి నువ్వు తెలుసుకోవాలి” అన్నాడు బలంగా రవికాంత్.

“ఏంటి అంకుల్ మీ పాటికి మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు.. ప్లీజ్ స్టాప్ ఇట్.. ” అంది చెవులు మూసుకుంటూ అమృత.

“నీ రెండు చెవులపై ఉన్న చేతులు తీసి విను. స్పష్టంగా విను. వాళ్ళు.. వాళ్ళు.. నిన్ను కనలేదు. అమృత.. వినబడుతోందా.. వాళ్ళు నిన్ను కనలేదు” అన్నాడు గట్టిగా మళ్ళీ.

ఒక్కసారిగా కాళ్లకింద భూమి కదిలినట్టనిపించింది అమృతకి. దబ్బున పక్కలో బాంబ్ పేలినట్టైంది. ఆశ్చర్యపోతూ “ఇది.. ఇది అబద్ధం కదా అంకుల్” అంటూ రవికాంత్‌కి దగ్గరగా వచ్చింది అమృత.

“ఇది పచ్చి నిజం.. ఇదే నిజం” అంటూ కొనసాగించాడు రవికాంత్.

“ఆశ్చర్యపోకు అమృత. ఇది వాస్తవం.. ఎక్కడో బొంబాయిలో లాథోర్‌లో దొరికిన నువ్వు వాళ్ళకి ఒక అరుదైన బహుమానానివి తల్లీ.. అటువంటి బహుమానం వేరేవారికి ఇవ్వాలంటే ఎంత కష్టమో నీకు తెలీదు అమృతా..” అన్న అంకుల్ మాటలు చెవిని చేరుతుంటే ఇది నిజమా.. అబద్ధమైతే బాగుండు కదా! అనిపించింది అమృత మనసుకి.

“సుధీర్ స్వప్నల ప్రాణానివి నువ్వు.. అటువంటి ప్రాణాన్ని వేరేవారి చేతిలో పెట్టాలంటే ఎంత ఆలోచించాలి? ఎన్ని ఆలోచించాలి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు.. మంచిచెడ్డలు తెలుసుకోనవసరం లేదా!.. అది ఒక పుస్తకం కాదు, బొమ్మ కాదు నువ్వు అడగగానే ఒప్పుకోవడానికి, తెచ్చి ఇవ్వడానికి. అది నీ జీవితం తల్లీ.. ఈ విషయంలో ప్రతీ తల్లి తండ్రులు ఇలానే ఆలోచిస్తారు, కానీ మీ అమ్మా, నాన్న ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు.. అందులో తప్పు ఉందా చెప్పు తల్లీ” అంటున్న అంకుల్ చేతిని అమాంతంగా పట్టుకుని “ఇది.. ఇది కల అయితే బాగుండు అంకుల్, నేను నేను.. ” అంటున్న అమృత తల పై చెయ్యి వేసి, “అవును తల్లీ.. కల అయితే బాగుండు.. కానీ ఇది నిజంగా నిజం. ఇరవై అయిదేళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన.. మీ నాన్న నేను కొత్తగా డాక్టర్ వృత్తిలో చేరిన రోజులు.. ” అంటూ చెప్పసాగాడు.

“డాక్టర్ సుధీర్.. మీరు మీ టీం ని తీసుకుని బొంబాయికి ఈ రోజే ప్రయాణం అవ్వండి” అన్నారు డీన్ మిష్టర్ భుజంగం.”

“ఎస్ సర్.. తప్పకుండా..”

ఆ టీం లో నేను కూడా ఒక సభ్యుడిని.. మీ నాన్న వెంట బయలుదేరడానికి సిద్దమయ్యాను.

“చూడండి, వైద్యపరమైన ఇబ్బందులేమి వచ్చినా.. నాతో మాట్లాడండి.. టీంలో ప్రతి ఒక్కరు కష్టపడాలి.. కొనఊపిరితో ఉన్నా మన ఆసుపత్రులకు షిఫ్ట్ చెయ్యండి” అని ఆర్డర్ వేసారు డీన్.

“తప్పకుండా.. సర్..” అంటూ అక్కడనుంచి కదిలి.. టీం లో అందరికీ సిద్దం కమ్మని చెప్పి ఇంటికి వెళ్ళాడు సుధీర్.

“స్వప్నా.. స్వప్నా.. బాంబే వెళ్ళాలి. నా బట్టలు సర్ది పెట్టు.”

“ఆ.. ఇప్పటికిప్పుడు.. బాంబే.. అస్సలు కుదరదు..”

“రేపు ఎంతో ఇంపార్టెంట్ పని ఉంది మర్చిపోయారా..” అంది భార్య స్వప్న.

“స్వప్నా అర్థం చేసుకో.. అక్కడ బాంబే.. లాతోర్‌లో వచ్హిన భూకంపానికి ఎంతోమంది చనిపోయారు.. కొన్ని శవాలు అట్టడుగున ఉండిపోయాయి. కాళ్ళు లేక.. కొందరు, కళ్ళు లేక కొందరు ఒడ్డున పడి ఉన్నారు.. వైద్య సదుపాయాలు చాలక నానా ఇబ్బందులు పడుతున్నారు.. వెళ్ళి తీరాలి.. కొంతమందినైనా రక్షించగలిగితే అదే పదివేలు.. టి.వి ఆన్ చేసి చూడు.. వాళ్ళ పరిస్థితి చూస్తే మనిషన్నవాడికి నిద్రపడుతుందా!”.. అని చెబుతున్న సుధీర్‌ని చూస్తూ.. ”బావా నా కల..” అంది స్వప్న.

“నీ కలదేముంది బంగారం.. నువ్వు కోరుకున్న బిడ్డని నువ్వు దత్తత తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తా.. ముందు అక్కడికి వెళ్లి రానీ..” అని దగ్గరికి తీసుకుని బుజ్జగించాడు స్వప్నని.

“అయితే ఒక కండిషన్ బావా..”

“ఆ చెప్పు స్వప్నా.. చెప్పు..” అన్నాడు సుదీర్.

“నేను నీతో వస్తా బావా.. నీతో”

“నీకేమైనా మతి పోయిందా.. అక్కడ నీరు.. ఉండడానికి వసతులు లేవంట.. ఎక్కడ చూసినా శవాలే.. అక్కడ నువ్వు ఉండలేవు.. నిన్ను తీసుకుని వెల్తే నిన్ను చూసుకుంటూ అక్కడ పని చెయ్యటం కష్టం స్వప్నా..” అన్నాడు సుదీర్.

“అస్సలు నిన్ను ఇబ్బంది పెట్టను బావా.. ప్లీస్.. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా.. నీళ్ళు కూడా నిన్ను అడగను.. భోజనం అడగను.. అసలు.. అసలు నిన్ను ఇబ్బంది పెట్టను” అని గెడ్డం పట్టుకున్న స్వప్నను కాదనలేకపోయాడు సుధీర్.

పోనీలే పాపం.. రానీ.. ఇక్కడ ఒక్కర్తి.. బోర్ కదా.. పాపం జాలేస్తోంది స్వప్నని చూస్తే, పిల్లలు లేరని.. పొద్దస్తమాను బాద పడే స్వప్నకి.. తన బాద ఎంత చిన్నదో అక్కడకు వస్తే అర్థమవుతుంది.. ఇదీ మంచికేలే అనుకున్నాడు సుధీర్.

“సరే అయితే బయలుదేరు” అన్నాడు.

బట్టలు.. ఫైల్స్.. అన్నీ సిద్దం చేసుకుని బయలు దేరారు.. బొంబాయ్..

టీం లో ఉన్న సబ్యులలో ఒకటే ఉత్కంఠ.. కొంతమంది లాతోర్.. ఖిలారి లకు పయనమయ్యారు.

ఖిలారీలో అడుగుపెట్టిన సుధీర్ స్వప్నలకు అక్కడ ఉన్న దృశ్యాలు కలవరపెట్టాయి. ఎక్కడ చూసినా ఆర్తనాదాలే.. కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వారు కొందరైతే.. పిల్లలు కోల్పోయిన వాళ్ళు కొందరు.. తల్లి తండ్రులను కోల్పోయినవాళ్ళు కొందరు.. బందువులను కోల్పోయి కొందరు, స్నేహితులను కోల్పోయినవారు మరికొందరు.. ఇలా ఎక్కడ చూసినా.. రక్తపు మడుగులే.. ఏడుపులే.. ఆర్మీ స్టాఫ్.. శిధిలాల మద్య ఇర్రుక్కుపోయిన శవాలను గుట్టలుగా పేర్చారు.. ఇంకా శిధిలాల మద్య ఇర్రుక్కున్న శవాలు వస్తూనే ఉన్నాయి.. ఇర్రుక్కున్న శవాలను తీయడానికి ఎంతో కస్టపడుతున్నారు మరో వైపు.. కాళ్ళు విరిగిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వాళ్ళకి.. అక్కడికక్కడే వైద్యం చేస్తూ.. దగ్గరలో ఉన్న శిబిరాలకి పంపుతున్నారు.. అలా కొన్ని వందల మంది పని చేస్తున్నారు.. అందులో డాక్టర్ సుధీర్‌తో పాటు నేను కూడా పాలు పంచుకోవడం కాస్తా గర్వంగానే అనిపించింది నాకు.

అక్కడ హృదయ విదారకమైన దృశ్యాలను చూస్తూ తల్లడిల్లిపోయింది స్వప్న. తనని గమనించే పరిస్థితుల్లో మేము లేము.. ఎందుకంటే వచ్చిన వారికి వైద్యం అందించడంలో తలమునకలై పోయాం.. మద్యాహ్నం మూడుగంటల సమయంలో అనుకుంటా.. స్వప్న ఎక్కడ ఉందో, ఎలా ఉందో ఓ సారి చూసి రమ్మని మీ అమ్మ దగ్గరకి నన్ను వెళ్లి రమ్మన్నాడు మీ నాన్న.

ఓ మూల బిగుసుకున్న చేతులతో, భయం భయంగా కూర్చుని గుండె రాయి చేసుకుని శవాలను చూస్తూ కూర్చుంది. దగ్గరకి వెళ్లి “స్వప్నా స్వప్నా” అని పిలిచాను.

అప్పటివరకు ఆవేదనంతా ఉగ్గబట్టుకుని కూర్చుందేమో! నన్ను చూసిన వెంటనే లేచి గట్టిగా పట్టుకుని వల వలా ఏడుస్తూ “అన్నయ్యా! ఎంత ఘోరం.. ఎంత ఘోరం.. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు.. ఇలా ఎక్కడి నుంచి వస్తున్నాయో శవాలుగా వస్తూనే ఉన్నాయి, ఆ కింద నుంచి తీస్తూనే ఉన్నారు” అంటూ బోరున ఏడ్చింది.

“ప్రపంచంలో అందరి కంటే నాకే భగవంతుడు అన్యాయం చేసాడు, పిల్లలని ఇవ్వకుండా బాధపెడుతున్నాడు, ఇంత బాధ ఇచ్చాడు అని ఎప్పుడూ ఏడ్చేదాన్ని.. పెళ్ళై పదేళ్ళు అవుతున్నా పిల్లలు లేరని.. కాని.. కాని నా బాధ.. చాలా చిన్నది.. ఇక్కడితో పోలిస్తే.. అదిగో అదిగో అన్నయ్యా కాళ్ళు, చేతులు లేవు వాళ్లకి.. అక్కడ చూడు అన్నయ్యా పసిమొగ్గలు చనిపోయి ఉన్నారు.. పాపం ఆవిడకి చూడు తల ఎలా బద్దలైపోయిందో, పాపం వీళ్ళకి జీవితమే లేదు.. నాకు జీవితం ఉంది కదా!” అంటూ ఆ దృశ్యాలను చూసి చలించి పోయింది.

“నేను.. నేను చాలా అదృష్టవంతురాలిని అన్నయ్యా! నాకు.. నాకు ఆ భగవంతుడు జీవితం ఇచ్చాడుగా అన్నయ్యా! నాది ఎంత అందమైన ప్రపంచం.. నా ప్రపంచంలో బావా నేను.. అంతే, వేరే ఎవరూ లేరు.. రారు.. అప్పుడప్పుడు ప్రేమగా పలకరించే మీరూ. చుట్టాలు, స్నేహితులు చాలా మంది ఉన్నారు.. ఒకప్పుడు వచ్చిన వారంతా ఇప్పుడు రారు.. ఎందుకంటే పిల్లలు లేరు గదా.. నన్ను వదిలేసి వేరే పెళ్ళి చేసుకోమని చెప్పిన వారు కొందరు.. ‘మా పిల్లని పెంచుకో మా పిల్లాడిని పెంచుకో’ అని కొందరు ఒత్తిడి చేసేవారు.. వారందర్నీ దూరంగా పెట్టేసాడు బావ.. వాళ్ళు వచ్చినప్పుడంతా నన్ను ఏదో రకంగా ఒత్తిడి చెయ్యడం, నేను ఏడవటం.. ఇదంతా భరించలేక వాళ్ళను ఇంటికి రావద్దని.. అనవసర జాలి చూపించద్దని, ఖరాఖండిగా చెప్పేసాడు బావ.. దానితో ఎప్పుడో గాని తల్లి తండ్రులు, అక్కచెల్లెలు కూడా రారు.. అయినా నా ప్రపంచం అందంగానే ఉంది అన్నయ్యా!” అంటూ ఉద్వేగాన్ని అనుచుకోలేక ఏడ్చేసింది.

“ఓకే స్వప్నా! బీ కూల్.. అవును నీకు దొరికిన జీవితం చాలా అందమైనది.. చూసావా! ఇక్కడ పరిస్థితి చూసిన తరువాత నీ సమస్య ఎంత చిన్నది అయిపోయిందో” అంటూ ఓదార్చి అక్కడ ఉన్న ఒక బల్లమీద కూర్చో బెట్టి త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చి వచ్చేసాను.

***

“హుం.. హూ..” అనే మూలుగు.. స్వప్న చెవిని ఎక్కడినుంచో తాకుతోంది. ఏమై ఉంటుంది?.. అదెక్కడ? దెబ్బ తగిలిన వాళ్ళుచాలా మంది మూలుగుతున్నారు.. వారిదేమో! కాదు.. కాదు.. ఎవరో చావుబతుకుల మద్య ఉన్నప్పుడు వచ్చే మూలుగు.. ఎంతో కష్టంగా గుండెలో నుంచి శ్వాసని బయటకు బలవంతంగా తోస్తున్న మూలుగు.. నీరసంగా నిస్సత్తువుగా ఊపిరి తీస్తున్న శబ్దం.. నూతిలోనుంచి వచ్చినట్టుగా.. చిన్నగా ఓ ఊపిరి ఆగిఫోయినట్టుగా.. మరో ఊపిరి ప్రాణం పోసుకున్నట్టుగా..

కాసేపటికి.. క్యార్ క్యార్‌మన్న ఏడుపు.. ఒక చంటి పాప.. ఏడుపు.. చెవిని కాస్తా దులుపుకుని పరిశీలనగా వింటొంది.. స్వప్న. చంటి పాప ఏడుపు.. అది అది ఖచ్చితంగా చంటిపాప ఏడుపే.. కాని ఎక్కడనుంచి.. వస్తోంది.. అని చుట్టూ పరికించి చూస్తోంది స్వప్న. ఒక్కసారిగా వెనక్కు జరిగినిది స్వప్న.. తన కాళ్లకింద ఉన్న శిధిలాల నుంచే.. ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి.. భయం భయంగా.. ఒక్క ఉదుటున లేచి నిలబడింది.. “అన్నయ్యా! ఒక్కసారి ఇలా రా!” అంటూ గావు కేక పెట్టింది. ఏమైందో అని వెనక్కి వెళ్ళాను. ఆ శిధిలాలు చూపిoచింది స్వప్న.. “ఇక్కడ ఎవరో ఉన్నారు.. ఓ పసిపాప.. పసివాడో ఉన్నారు అన్నయ్యా!” అంది.. అక్కడకి దగ్గర్లో ఉన్న ఆర్మీ వ్యక్తిని పిల్చి ఆ శిధిలాలను తొలిగించమని చెప్పాను.

శిధిలాలను తొలగించి హతాశుడైపోయాడు ఒక్కసారిగా.. ఆ శిధిలాల మద్య ప్రసవించిన తల్లీ బిడ్డ.. ఎంత విచిత్రం, ఎంత విడ్డూరం.. ఆ బిడ్డను ఒక్కసారిగా తీసి.. స్వప్నకిస్తూ.. “తల్లీ బిడ్డని వేరుచెయ్యాలి.. ఒక్కనిమిషం పట్టుకోండి..” అంటూ ఆ ఆర్మీ వ్యక్తి వెనక్కి వెళ్ళాడు.. రక్తం ఓడుతూ మీ అమ్మ చేతుల్లో పసిబిడ్డ.. అమ్మ చేతులు వణుకుతున్నాయి, కాని ఆ ముఖంలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి, ఆనందం, ఒళ్ళంతా చమటలు, మీ అమ్మ కనుకోనల నుంచి సన్నని కన్నీటి పోర నాకు కనిపించింది. తనకు తెలియకుండానే మనస్సంతా ఏదో తెలియని భావనతో నిండిపోయింది. ఇంతలో..

“మేడం ఒక్కసారి జరగండి..” అంటూ కత్తెరతో ప్రేగు కట్ చేసాడు.. తన పేగు కట్ చేసినంత బాధ మీ అమ్మ ముఖంలో నాకు ప్రస్ఫుటంగా కనిపించింది, ప్రేగు కత్తిరించగానే ఆ బిడ్డని తన ఒడిలోకి తీసుకుంది. ఇంతలో ఆ తల్లిని బయటకు తీసారు.. “ప్చ్.. తల్లి చనిపోయింది మేడం.. పాపం.. పాపని కన్న వెంటనే చనిపోయినట్టుంది” అన్నాడు ఆర్మీ పర్సన్.. తల్లి ముక్కు వద్ద చెయ్యి పెట్టి చూసింది స్వప్న. ఆ తల్లి మరణించింది.. ఎంత విధి వైపరీత్యం.. కదా! తల్లి మరణిస్తూ ఒక బిడ్డకి జన్మనిచ్హింది.. తాను శిధిలాలో కలిసిపోయింది.. ఇంకో తల్లి ఒడికి చేర్చింది అని నా మనసులో అనుకున్నా!.. “మేడం ఇప్పుడే పుట్టిన బిడ్డ కదా.. అక్కడ నర్స్‌కి ఇవ్వండి.. శుభ్రం చేస్తుంది, రిజిస్టర్లో రాస్తుంది” అన్నాడు. ఇదేదీ గమనించని మీ అమ్మ తన చీర కొంగుతో బిడ్డని శుభ్రం చేస్తోంది. ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు మెదులుతోంది.

“ఆ పాపని అక్కడ ఇవ్వండి. వాక్సిన్ కూడా వెయ్యాలి.. ఆ చివర.. ఒక పిల్లల డాక్టర్ ఉంటారు తీసుకుని వెళ్ళండి” అని చెబుతూ ఆ తల్లి శవాన్ని శిదిలాలనుంచి వేరు చేయ్యడంలో మునిగిపోయాడు ఆ ఆర్మీ వ్యక్తి. స్వప్న చేతిలో చంటి పాప.. ఇది నిజమేనా.. కలా.. అంటూ మంత్రముగ్ధగా నడుస్తున్న స్వప్న ఆ చివర ఉన్న పిల్లల డాక్టర్ దగ్గరకి వెల్లింది. “ఈ పాప ఇప్పుడే పుట్టినట్టుంది” అంది నర్స్. “క్లీన్ చెయ్యి. వాక్సిన్ వేయ్.. ఆ అలాగే అక్కడున్న పాల బాటిల్.. బట్టలు కూడా ఇవ్వండి” అని ఆర్డర్ చేసింది పిల్లల డాక్టర్. అన్నీ అందుకుంది.. “ఈ పాప తల్లి పేరు?” అని అడగ్గానే.. “స్వప్న” అని టక్కున చెప్పింది.. అలా చూస్తూనే ఉన్నాను.

స్వప్న అక్కడ దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని బిడ్డను పొత్తిళ్ళలో పెట్టుకుంది.. క్యార్ క్యార్మని ఏడుస్తున్న పాపాయికి బోటిల్ అందించింది.. ఆ పాపాయి వైపు చూస్తూ మైమరిచిపోయింది స్వప్న.. ఈ ప్రపంచాన్ని జయించినంతగా.. చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ.. నీకోసమే నేను వచ్చానమ్మా అని ఆ కళ్ళు చెబుతున్నట్టుగా ఆ పాప కళ్ళు అనిపించాయి స్వప్నకి. ఇదేది గమనించని సుధీర్.. “అక్కడేం చేసున్నావు రా! రవికాంత్, మీ చెల్లి చుట్టూ తిరుగుతున్నావా!.. రా రా” అని పిలుస్తున్నాడు దూరం నుంచి.

“ఇదిగో స్వప్న అక్కడకెళ్ళి భోజనం చెయ్.. పదా నేను వస్తా” అని దూరం నుంచే కేకేసాడు.

“బావా.. ఒక్కసారి.. ఇలా రా నీకు.. నీకు.. ఒక అద్బుతం చూపిస్తా.. రా.. రా..” అని ఇంతింత కళ్ళతో వెర్రి ఆనందంతో పిలుస్తున్న స్వప్నని విచిత్రంగా చూస్తూ.. ‘ఏమైంది.. అలా పిచ్చిగా చూస్తోంది, పిలుస్తోంది ఎందుకు’ అనుకుంటూ పరిగెత్తుకు వచ్చాడు డాక్టర్ సుధీర్.

స్వప్న ఒడిలో పసిపాప.. ఆశ్చర్య పోయాడు.. కంగారు పడిపోయాడు “ఏ.. ఎ.. ఎక్కడి నుంచి తెచ్చావ్.. దొంగతనం చేసావా!”.. అని అంటున్న సుధీర్‌తో..

“లేదు.. లేదు.. మనకి.. ఆ భగవంతుడు ఇచ్చాడు.. బావా!.. అందుకే నన్ను నీతో పంపాడు దేవుడు.. ఆయన చేసిన ప్రతిపనికి కారణం ఉంటుంది.. అంటారుగా..” అంది స్వప్న

“స్వప్నా!.. స్వప్నా!.. పిచ్చి గాని పట్టలేదుగదా.. ఏ శిబిరంలోనుంచి ఎత్తుకొచ్చావు.. చెప్పు.. నిజం చెప్పు.. నీకున్న పిల్లల పిచ్చితో ఎత్తుకొచ్హేసి ఉంటావు..” అన్నాడు సుధీర్.

“లేదు రా! సరాసరి ఆ భూదేవి ఓడిలోనుంచి స్వప్న ఒడిలోకి చేరింది ఈ పసిపాప.. స్వప్న ఎక్కడి నుంచి ఎత్తుకు రాలేదు. ఆ పాప ఎంత అదృష్టవంతురాలంటే.. శిధిలాల మద్య ప్రసవం అయిన తల్లి చనిపోయి, ఈ బిడ్డని స్వప్న ఒడిని చేర్చింది” అన్నాను.

“సర్.. లేదు సార్.. ఏ శిబిరం నుంచి ఎత్తుకు రాలేదు.. నిజంగా దేవుడిచ్చాడు.. మీకు.. ఆమె నిలబడ్డ శిధిలాల కింద.. ఆమె గుర్తించింది.. ఈ బిడ్డని.. దానికి నేనే సాక్ష్యం సార్.. మేడంని ఏమి అనకండి సార్. ప్రసవించిన వెంటనే ఆ తల్లి చనిపోయింది.. ఆ పాప చాలా అద్రుష్టవంతురాలు.. ఒక తల్లి ఒడిలోనుంచి మరో తల్లి ఒడిలోకి ఆ భగవంతుడు చేర్చాడు” చెప్పాడు.. నాతో పాటు ఆ ఆర్మీ వ్యక్తి.

ఎంత విచిత్రంగా ఉంది.. ఇది నిజమా!.. ముద్దు ముద్దుగా ఉన్న పాపాయి స్వప్న ఒడిలో.. ఓ మై గాడ్.. ఇది కలా నిజమా! నల్లటి కనుగుడ్లు, అందమైన పెదాలు, బుల్లి బుల్లి చేతులు, కాళ్ళు, తెల్లని చాయ, చందమామ లాంటి ముఖం.. నిజంగా పాప ఎంత అందంగా ఉంది అని ఓసారి తడిమి చూసుకున్నాడు డాక్టర్ సుధీర్.

“ఒరేయ్ రవికాంత్.. ఏమి చేద్దాం.. నాకు కాస్తా భయంగా ఉంది” అన్నాడు సుదీర్..

“ఇందులో భయపడాల్సింది ఏముంది.. అన్నీ నేను చూసుకుంటా.. మీరు భయపడకండి.. అవసరమైతే చట్టబద్దంగానే.. మనం ఇక్కడే దత్తత తీసుకున్నట్టు చూపిద్దాం” అంటూ ఏర్పాట్లు చేసాను.. కొంచెం కష్టమే అయినా, మీ అమ్మ ముఖంలో ఆనందం, మీ నాన్నలో సంతోషం దూరం చెయ్యకూడదు అనిపించి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి దత్తత కార్యక్రమం పూర్తి చేసా! ఆ ముద్దులొలికే నిన్ను ఇంటికి తీసుకొచ్హారు స్వప్న.. సుధీర్లు. ఒక్క క్షణం కూడా నిన్ను వదలటం లేదు స్వప్న.. సుధీర్‌లు. డ్యూటీ అయిపోగానే నీ సరసన చేరిపోతున్న వారికి రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా అర్థం కానంతగా మైమరిపించేశావు. నామకరణ మహోత్సవం చెయ్యాలని.. బంధువర్గానికి.. తల్లిదండ్రులకి కబురుపంపాడు మీ అమ్మానాన్న.. సుధీర్ స్వప్నలు. నామకరణ సంబరానికి అందరూ అన్యమనస్కంగానే విచ్చేసారు.. ఒక అనాథను పెంచుకోవల్సిన అవసరమేమొచ్చింది మీకు. అన్న పిల్లలు, చెల్లి పిల్లలు ఉన్నారు కదా!.. వారే మీ పిల్లలవుతారు కదా.. మీ పద్ధతి నాకు సుతరాము నచ్చలేదని అన్నారు సుధీర్ తండ్రి రాజారాం. ఇక్కడ నా బిడ్డ నామకరణ మహోత్సవం జరుగుతోంది.. ఇష్టం ఉంటే సంతోషంగా ఉండండి.. ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని ఖరాఖండిగా చెప్పేసాడు సుధీర్. ‘అది కాదన్నయ్య నా కూతురుని నువ్వు పెంచుకుంటాం అనుకున్నాం’ అని అలిగింది సుదీర్ చెల్లెలు. తనకు కూడా ఇదే సమాధానం చెప్పడంతో కిమ్మనకుండా కూర్చుంది చెల్లెలు జానకి. నామకరణ మహోత్సవం అయిపోయిన వెంటనే.. ‘ఈ పిల్ల ఎవరి రక్తమో.. నిన్ను చూస్తుందో లేదో.. ఏ కులమో, ఏ గోత్రమో తెలియదు..’ అని అన్నారు సుదీర్ తండ్రి.

“ఈ కులాలు.. గోత్రాలు ఆ చంటిదానికి ఏమి తెలుస్తాయి నాన్నా.. తెలిస్తే వచ్చేది కాదు..”

“అప్పుడే పుట్టిన పాప సరాసరి.. మా ఒడిని చేరిందంటే అంతకంటే అదృష్టo ఏముంటుంది మామయ్యా.. మీరంతా తలో మాట అనడం ఏమీ బాగాలేదు.. ఈ రోజుల్లో సొంత పిల్లలే తల్లి తండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.. అలాంటిది ఎక్కడో పుట్టిన పిల్ల మా ఒడి చేరింది.. ఎందుకో? ఆ పిల్ల చూస్తుందో చూడదో ఎవరు చెప్పగలరు? ఒకవేళ చూడకపోయినా పరవాలేదు. ప్రస్తుతానికి మా ఒడిలో ఆడుకుంటుంది.. మాకు ఆనందాన్ని ఇస్తుంది. అంతకంటే ఏమి కావాలి..” అని ఏడుస్తూ బాధపడి లోపలకు వెల్లిపోయింది స్వప్న. ఎక్కడో పుట్టిన అనాథ ఎక్కువైపోయింది మనకంటే వీళ్ళకి అంటూ విసురుగా, కోపంగా అందరూ బయలుదేరారు.. అక్కడనుంచి. ఇదేమీ పట్టనట్టు నామకరణ మహోత్సవం ఉన్నవాళ్ళతో ఘనంగా చేసాడు.. ఆ పసిబిడ్డకి ‘అమృత’ అని పేరు పెట్టుకున్నారు ఆ దంపతులు. ఆ రోజునుంచి సుదీర్ బంధువులు గానీ, స్వప్న బంధువులు గాని పెద్దగా రాకపోకలు చెయ్యలేదు. ఆ బిడ్డలో సుదీర్, స్వప్నలు ఏమి చూసారో తెలీదు.. కానీ వాళ్ళు ప్రాణాలే పెట్టుకున్నారు.

అలా ఎక్కడో మహరాష్ట్ర , లాతూర్‌లో ఎవరికో పుట్టిన నువ్వు వీళ్ళ గారాల పట్టిగా పెరిగావు.. నీకు నచ్చిన బొమ్మ, నీకు నచ్చిన బట్టలు నీకు నచ్చిన భోజనం, నీకు నచ్చిన చదువు, ఆఖరికి ఈరోజు వరుడు కూడా నీకు నచ్చినవాడే కావాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. నువ్వే వాళ్ళ ప్రపంచం” అని ఆగాడు రవికాంత్.

మౌనంగా ఉండిపోయింది అమృత కళ్ళు జలపాతాల్లా వర్షిస్తున్నాయి, “ఇదంతా ఓ కథలా ఉంది అంకుల్.. ఇది నా కథేనా! అని ఆశ్చర్యంగా కూడా ఉంది” అంటూ రవికాంత్‌ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అమృత.

కాసేపటికి తేరుకుని “నాకు చాలా గిల్టీగా ఉంది అంకుల్. నాకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలన్న వాళ్ళ ఆరాటం వెనుక దాగిన వాస్తవం తెలియక ఎంత ఇబ్బంది పెట్టాను.. ఎంత బాద పెట్టాను.. అమ్మ చూపించే అతి ప్రేమని ఎన్ని సార్లు తిట్టుకున్నాను.. నాన్నని ఎన్నిసార్లు కసురుకున్నాను. అసలు ఎక్కడో పుట్టిన నా కోసం వాళ్ళ కుటుoబాన్నే వదిలేసారు.. నాకు భగవంతుడిచ్చిన అమ్మానాన్నలు ఎంత గొప్పవాళ్లో కదా! అసలు.. అసలు నమ్మలేకపోతున్నా.. జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.. వాళ్లకి నేను ఏమివ్వగలను అంకుల్, వాళ్ళ ఋణం ఎలా తీర్చుకోగలను” అని వెక్కి, వెక్కి ఏడ్చింది అమృత.

“వారు నాకు జన్మ ఇవ్వకపోతే ఏమి,. ‘అమృత’ అనే అందమైన పేరు పెట్టడమే కాదు నాకు అమృతం తాగించి పెంచారు., ఆ భగవంతుడికి ఎన్ని సార్లు క్రుతజ్ఞతలు చెప్పినా తక్కువే, ఎంత అపురూపంగా నన్ను పెంచారు? వాళ్ళని అపార్థం చేసుకున్నానా! ఎంత పని చేశాను” అని మథన పడుతున్న అమృత తల మీద నిమురుతూ “ఇదిగో ఇలాంటి రోజు ఒకటి వస్తుందేమో! అని నేను భయపడుతూనే ఉన్నాను. ఇలా బాధ పడతావనే నేను నీకు చెప్పలేదు.. లే అమృతా! లే.. లే.. ఇంటికి వెళ్ళు, అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాం, కానీ నా మిత్రుడిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావని చెప్పాల్సి వచ్చింది” అన్నాడు రవికాంత్.

మౌనంగా ఇంటికి వెళ్ళిన అమృత వాళ్ళ కాళ్ళమీద పడి.. “నాన్నా.. నేను.. నేను.. నీ కూతుర్నే కదా!.. నీ కూతుర్నే కదా!” అని వెక్కి వెక్కి ఏడుస్తున్న అమృతని చూసి చలించిపోయారు స్వప్న సుధీర్లు. “అమ్ము తల్లీ.. నువ్వు నా కూతురువే.. నా బంగారానివి రా.. నువ్వు మా బిడ్డవి కాదని నీకెవరు చెప్పారు? లే తల్లీ లే” అంటూ కూతుర్ని లేపి కళ్ళు తుడిచాడు సుదీర్. ఆ పక్కనే ఉన్న స్వప్న కల్లల్లో నీళ్ళు జల జలా రాలాయి. ఒక్క ఉదుటున తన కూతుర్ని గుండెలకు హత్తుకుంది స్వప్న.

‘దేవుడు ఇచ్చిన అమ్మా నాన్న మనసు కష్టపెట్టకూడదు.. వాళ్లకి నచ్చిన వాడిని తెచ్చి, ఈయనే నీ భర్త అంటే అతనితో బతికేస్తాను.. నన్ను ఇంత గొప్పగా తీర్చిదిద్దిన తల్లి తండ్రుల మనసు బాధపెట్టకూడదు’ అనుకుంది అమృత.

***

ఆరు నెలలు తర్వాత.. అమృత పుట్టిన రోజున ఒక అద్భుతమైన కానుక ఇచ్చారు.. ప్రేమించిన ప్రసాద్‌ని అమృత ముందు నిలబెట్టారు. కొత్తగా.. సరికొత్తగా.. అంగరంగ వైభవంగా వివాహం జరిగిపోయింది.

“నీ ఇష్టప్రకారమే, నీకు నచ్చినవాడితోనే పెళ్లి చేసాం.. సంతోషమే కదా తల్లీ” అని అడిగిన అమ్మా నాన్న వంక కృతజ్ఞతగా చూసింది అమృత.

‘నా వల్ల నాన్న అమ్మా వారి కుటుంబాలకి దూరమైపోయారు. వాళ్ళని తెచ్చి ఇవ్వలేను, కానీ, నేను ఎప్పుడూ వాళ్ళకి దూరం కాకూడదు. నేను అనాథ అయిన ప్రసాద్‌ని పెళ్లి చేసుకోవడం మంచి నిర్ణయమే.. నా జన్మ రహస్యం తెలిసన తరువాత అమ్మా నాన్నమీద ఇంకా గౌరవం పెరిగింది, నేను తీసుకునే నిర్ణయంలో తప్పు లేదు’ అని అనుకుంది మనసులో అమృత.

జీవితం ఎంత వేగంగా గడిచిపోతోంది.. చేతుల్లో ఆడుకునే పిల్ల.. నిన్న మొన్నటి దాకా అంటిపెట్టుకుని తిరిగే పిల్ల సందడి, సందడి.. ఎక్కడ చూసినా అమృత పుస్తకాలు, బొమ్మలు.. బట్టలు.. కలియతిరుగుతూ.. అమ్మా అమ్మా అని పిలుస్తూ.. తనను వదిలేసి క్లినిక్‌కి నాన్న వెళ్ళిపోయారని అలుగుతూ.. సాయంత్రం వచ్హాక బతిమిలాడుతూ.. తిప్పుతూ.. అలా రోజులు గడిచిపోయాయి. ఈ రోజు ఎంత పెద్దదైపోయింది.. అనుకున్నప్పుడల్లా ఏడుపు తన్నుకొస్తుంది.. కడుపులో నరాలు మెలిపెట్టినట్టుగా ఉంటుంది.. అనుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరు.. తమ గదుల్లోకి వెళ్లి తనివితీరా ఏడ్చేసి.. ఇంటి నిండా చుట్టాలున్నారని గమనించి.. కూతురు కంట పడకుండా తమ కన్నీళ్ళను దాచేసుకుంటున్నారు స్వప్న సుదీర్‌లు.

“ఆ.. ఇదిగో ఓ అనాథని పెంచారు.. దాని దారి చూసుకొని అది పోతోంది.. ఇక మీకు దిక్కెవరు? అదే అన్నయ్య కూతురో, చెల్లి కొడుకునో పెంచుకుని ఉంటే బాధ్యతగా మిమ్మల్ని కనిపెట్టుకుని మీ దగ్గరే ఉండేవారు” అని సూటిపోటి మాటలు అంటున్న బంధువుల మాటలు కష్టంగా తోచాయి. “దాని అవసరం చూసుకొని అది పోతోంది, మీ అవసాన దశలో వస్తుందా పోతుందా!” అంటూ తలో రకంగా మాట్లాడుతుంటే, ప్రపంచంలో ఉన్న ఒంటరితనమంతా తన ముందే తిష్ఠ వేసుకుని కూర్చున్నంత బాధగా ఉంది. అది చూసి, “చూడు స్వప్న అమృత మన జీవితాల్లోకి వచ్చి అమృతమే పంచింది. ఏ కన్నబిడ్డో మన చేతుల్లోకి వచ్చి వాలింది. ఆ క్షణం ఈ బిడ్డ మనతో ఉంటుందా! వేరే చోటుకి పోతుందా! పెళ్లి చేసుకుని తన దారి తను చూసుకుంటే మన పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించలేదు. ఆ భగవంతుడు తనని తీర్చిదిద్దే బాద్యత మనకి ఇచ్చాడు.. మనం ఆ భాద్యత నేరవేర్చాం అంతవరకే ఆలోచించు. పుట్టిన పిల్లలు మాత్రం తల్లి తండ్రులను దగ్గరుండి చుసుకుంటున్నారా! వాళ్ళ అవసరాలు వేరు, మన అవసరాలు వేరు, కలసి ఉన్నన్నాళ్ళు మనం ఒకరికొకరంగా బతుకుదాం.. ఆ తరువాత సంగతి భగవంతుడికి ఎరుక” అని స్వప్నని ఓదార్చాడు సుదీర్.

‘నాకు భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన వరం.. ఈ అమ్మా, నాన్న. ఎక్కడో శిధిలాల్లో దొరికిన నన్ను తమ ఒడిలో చేర్చుకోవడం, నన్ను ప్రాణంగా పెంచడం, ఎంత చిత్రంగా ఉంది నా జీవితం’ అని మంచంపై మేను వాలుస్తూ గుర్తు చేసుకుంది అమృత. ‘ఈ రోజు సాయంత్రం హనీమూన్‌కి ప్రయాణం.. అదీ అమ్మా నాన్నని వదిలి.. మనసుకి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళని వదిలి ఒక్క రాత్రి కూడా నేను ఎక్కడా ఉండలేదు, వాళ్ళు కూడా నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఎంత విచిత్రమైంది జీవితం.. అనిపించింది. క్షణాలు దగ్గరపడుతుంటే ఎందుకో గాబరాగా అనిపించింది.. నా ప్రాణాలను వదిలిపెట్టి వెల్లిపోతున్నా.. నా కొత్త జీవితం కోసం.. నాది ఎంత స్వార్థం కదా!’ అనుకుంటూ వారి కాళ్ళకు దండం పెట్టి మెల్లిగా ముందుకు కదిలింది అమృత .

కదిలాడుతున్న కన్నీటి పొరను కనపడకుండా దాచేసి.. కూతుర్ని ప్రసాద్‌కి అప్పగించారు స్వప్న సుధీర్‌లు. వెనుదిరిగి వచ్చి, స్వప్న, సుధీర్లు మౌనంగా వారి వారి గదుల్లోకి వెళ్ళిపోయారు.. ఎవరికి వారే ఏడుస్తూ ఒంటరిగా గడిపారు.. ఆ రాత్రి గడిచింది.. నిశబ్దంగా అమృతం లేని రాత్రిలా.. భారంగా తెల్లారింది.. సూరీడు బద్దకంగా ఒల్లు విరుచుకున్నాడు. బడలికగా ఉంది.. కాని తెల్లారిందిగా లేవాల్సిందే, అని లేచిన సుధీర్‌కి ఎదురుగా రవికాంత్. “ఏంట్రా! నువ్వు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నావా! ఇంటికి పోలేదా!” అన్నాడు సుదీర్. “లేదురా! మిమ్మల్ని కనిపెట్టుకుని ఇక్కడే ఉండమని అమృత ఆర్డర్ వేసింది.”

“అదెందుకు అలా! తను గానీ , నువ్వు గాని ఎన్నాళ్ళు మాతో ఉండిపోగలరు.. మద్యలో వచ్చిన వాళ్ళు మద్యలో వెళ్ళిపోవాల్సిందే కదా!” అన్నాడు నర్మగర్భితంగా సుధీర్.

“ప్రసాద్‌తో పెళ్లి విషయంలో, నిన్ను, మా చెల్లాయిని అమృత అపార్థం చేసుకుందని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, నిజానికి తనని మనం అపార్థం చేసుకున్నాం, తన దూరదృష్టి ముందు మనం ఓడిపోయాం.” అన్నాడు మెల్లగా రవికాంత్. “అదెలా అన్నయ్యా! ఓ కుటుంబం, గౌరవం లేకుండా ఓ అనాథని వివాహం చేసుకోవడం ఎంతవరకు కరక్ట్ అన్నయ్యా!” అంది స్వప్న.

“తన నిర్ణయం కరెక్ట్ గానే ఉందమ్మా! మీరిద్దరూ అమృత గురుంచి, తన జీవితం గురుంచి ఎంత ఎక్కువ ఆలోచించారో, అంతకంటే ఎక్కువ మీ గురుంచి తను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. తను మీ కన్నబిడ్డ కాదని నేను చెప్పకముందే, తన జన్మ రహస్యం తెలియకముందే.. మీకు ప్రసాద్‌ని అల్లుడిగా ఎంపిక చేసుకుంది. ఒక అనాథ అనే కారణం తోనే తను ఎంపిక చేసుకుంది. ప్రసాద్‌ని తనకోసం ఎంపిక చేసుకుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ ప్రసాద్‌ని మీకోసమే తను ఎంపిక చేసుకుంది. ఎంత గొప్పవాళ్ళు తనకి ప్రపోజ్ చేసినా వద్దని ప్రసాద్‌ని ఎంపిక చేసుకుంది.. ఎందుకంటే.. మిమ్మల్ని వదిలి తను ఉండలేదు.. సుదీర్.. మీ ముగ్గురిదీ ఒక అపురూపమైన బంధం. అది దేవుడి బంధం” అన్నాడు రవికాంత్.

“కాస్తా వివరంగా చెప్పరా! అసలు తనకి ఓ అనాథని వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంది?” అన్నాడు సుదీర్. “నేనూ నీ లాగే అడిగాను, మంచి ఆస్తిపరుడు, గుణవంతుడు, మంచి కుటుంబం నుంచి వచ్హినవాడు, ఒడ్డు, పొడుగు ఉన్నవాడు బాగా చదువుకున్నవాడు.. సొసైటీలో ఒక స్టేటస్ ఉన్నవాడు అని.. ఇంత పెద్ద లిస్ట్ చెప్పే అమ్మాయిలున్న ఈ రోజుల్లో ఓ అనాథని కావాలని పెళ్లి చేసుకోవడమేంటి? అసలు అనాథనే ఎందుకు కావాలనుకుంటున్నావు అమృత.. నీది విచిత్రమైన కోరిక అని అన్నాను. తను ఏమి చెప్పిందో తెలుసా!”

“ఇందులో ఆశ్చర్యమేముంది.. ఒక అనాథకి ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వాలి.. నా కుటుంబం తన కుటుంబమైపోవాలి.. అప్పుడు నా పేరెంట్స్ తన పేరంట్స్ అవుతారు.. అంతకంటే నాకు పెద్ద కోరికలు లేవు. మా అమ్మా నాన్న దగ్గర బోలెడు ప్రేమ ఉంది. అది నా భర్తకి కూడా సరిపోతుంది. నేను ఓ స్టేటస్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తనతో పాటు వెళ్లిపోవాలి, నా ప్రేమని బాగాలుగా విడదీసి పంచాలి.. అదే ఓ అనాథ నాకు భర్తగా వస్తే మంచి భార్యతో పాటు అమ్మా నాన్న లాంటి ఓ అందమైన కుటుంబం తనకి దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది, పైగా వచ్చిన అల్లుడు నాతో పాటు మా అమ్మా నాన్నని కూడా ప్రేమిస్తాడు. ఈ అమ్ముని అపురూపంగా తమ గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నారు, ఒక ఉన్నతమైన చదువుని, భవిష్యత్తునిచ్చి ఒక మనిషిగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమించారు.. అందమైన జీవితాన్ని ఇచ్చారు.. అడుగడుగున అమృతాన్ని కురిపించారు.. వాళ్ళు ఇచ్చిన ప్రతీది తిరిగి ఈ కూతురు ఇవ్వలేకపోవచ్చు.. వాళ్ళు ఇచ్చింది వాళ్ళకే ఇచ్చేసి రుణ విముక్తుల్ని చెయ్యాలని కోరుకోవటం లేదు.. మళ్ళీ.. మళ్ళీ వారి కడుపులోనే పుట్టాలని ఉంది అంకుల్ అని ఏడ్చేసింది, వాళ్ళ దగ్గరే ఉండాలి, వాళ్ళ సేవలో నేను తరించాలి.. అప్పుడే ఈ అమృతకి ఆనందం, సంతోషం దక్కుతుంది. ఓ అనాథకి ఒక మంచి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడని కూడా సంతోషిస్తా. నాతో పాటు నా భర్తకి కూడా కాస్తా అమృతాన్ని పంచుతారనే స్వార్థం నాది.. అని ఎంతో గొప్పగా, చక్కగా చెప్పిందిరా అమృత. చిత్రమేమిటంటే, తన జన్మ రహస్యం తెలియకముందే ఓ అనాథను వెతుక్కోవడం మొదలు పెట్టింది. అది తనకి మీ పట్ల ఉన్న బాధ్యత. తెలిసిన తరువాత నిర్ణయం తీసుకుంది అంటే అదో తీరు. ఎక్కడో శిధిలాల్లో పుట్టిన బిడ్డని పెంచినందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు.. కాని ఈ విషయం నేను చెప్పకముందు.. ఓ అనాథని ఎందుకు పెళ్ళాడాలనుకున్నావు అని అడిగితే ఇదంతా చెప్పింది. ఇది యాదృచ్ఛికమో, మీ అదృష్టమో నాకే అర్ధం కావటం లేదు” అన్నాడు రవికాంత్.

“అవునా! ఇది నిజమా! మన కోసం ఎంత బాగా ఆలోచించింది. నిజంగా మన కడుపున పుట్టినా ఇలా అలోచించరేమో బావా! మనం.. నిజంగా చాలా అదృష్టవంతులం” అంటూ ఆనంద భాష్పాలు రాల్చింది స్వప్న. “ఇది నిజమా.. మనతోపాటు.. అమృత, బావా.. మనకంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరుంటారు బావా.. ఎవరూ ఉండరు”.. అని ఆనందంతో తబ్బిబైపోయి.. బావని పట్టుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది స్వప్న.

“అవును స్వప్నా! మీరు చాలా అదృష్టవంతులు.. ఈ రోజుల్లో రెక్కలు రాగానే పారిపోయే ఎంతోమంది పిల్లలని చూస్తున్నాం, ఎక్కడో శిధిలల్లో దొరికిన అమృత మీ జీవితాల్లో నిజంగా ‘అమృతం’ కురిపించింది, వృద్ధాప్యం దగ్గరయ్యే కొద్దీ ఏర్పడ్డ నైరాశ్యం మీ జీవితాల్లో రాదు, రానివ్వదు ఈ అమృత. మీరు.. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు” అంటూ అక్కడ నుంచి నిష్క్రమించాడు రవికాంత్.

Exit mobile version