[అనూరాధ బండి గారు రచించిన ‘అముద్రితం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చీలిన దారుల కప్పెట్టిన రహస్యాలు.
మౌనమయిన సమాధులు.
పూలు పరచే ఎవరూ లేరు.
పిచ్చిమొక్కలు తలలూపుతున్న చప్పుడు.
ఎవరు మాటాడేదో గాలికేమి తెలుసూ?
ఎక్కడో దూరాన ఎవరో గులాబీలతో
దండనుచేసి నవ్వుతున్నారు.
ముళ్ళకంపని శ్వాసిస్తున్న మరెవరో ఉలిక్కిపడుతున్నారు.
మధువులో మత్తులో మల్లెపాదులచుట్టూ తిరిగి
నృత్యంచేస్తున్న గుంపుకి వినోదమే పరమావధి.
ఎక్కడో చిన్న ఆశ మిణుగురుల్ని పుట్టిస్తే
దారంతా కాంతిపుంజాలు.
ఊహేదో మెదిలి కథని అల్లేస్తే
చీలినదారుల ఏక నినాదపు మాయ.
గాలిపటాలు ఎగురవెయ్యాలని చిన్నారులు.
కాగితాలు కావాలి.
ఎవరో తాము వ్రాసుకున్న జీవితాన్ని
పడవలు చేస్తున్నారు.
నీరు కావాలి.
ఇక వెలగలేకో ఏమో వృద్ధులు వేచిచూస్తున్నారు.
నిప్పు కావాలి.
రహస్యాలు గాలినంటాకా, నీటినంటాకా, నిప్పునంటాకా
దారులన్నీ ఏకమయ్యాకా
నువ్వు ఎవరూ? నేను ఎవరూ?
