Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనాహతం

[శ్రీ వీరేశ్వర రావు మూల రచించిన ‘అనాహతం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

జాతకాలు మారి
జ్ఞాపకాలు జారి
గుండె ఊసర క్షేత్రంలో
అనుభూతులు ఇంకి,
శిఖరమో
లోయో
తెలియని సందిగ్ధ శూన్యంలో
గిరికీలు కొట్టే మనో విహంగం!

జీవితం గతాన్ని పూడ్చి
వర్తమానాన్ని ఈడ్చి కొడితే
భవిష్యత్తు స్కలించిన స్వప్నమే!

ఏది దిశ?
ఏది దశ?
కాన్వాసుపై మిగిలీ మిగలని వర్ణాలు!
సందిగ్ధ సంధ్యా సదృశం!

సిద్దాంతాలు ఏవి స్థిరం కావు
ఇజాలు నిజాల బాటలో నడవవు
‘ఆకలే’ అనాహత శబ్దం అని అంగీకరించక తప్పదు!
ప్రణవం కన్నా ప్రాణమే మిన్న అని
మిన్ను తాకేలా ఎలుగెత్తాలి!

కనబడనది ఏదో
నిన్నూ, నన్నూ కలుపుతూ ఉంటుంది
అవ్యక్తమే ఇంద్రియాలను కలుపుతుంది!
అద్భుతాలు ఏవి జరగవు కాని
మానవత్వమే మనుగడకి అవసరమని
జీవితం ముందుకు వెడుతుంది!

Exit mobile version