Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనగనగా నేను

నగనగా నేను.

రూపం ఎరుగని నేను.

ఎవరినో, ఏమిటో తెలియని నేను.

చిమ్మ చీకటి రాజ్యంలో, వెన్నెల వెలుగుల రాజు/రాణిని నేను.

నా ఉనికిని నేనెరిగిన కొద్ది కాలానికే నన్నెవరో వేరే లోకంలో గుర్తించి, నాకన్నా ఎక్కువగా సంతోషించారని నేనరుగని స్థితి నాది. “నేనెవరిని?” అని మూగ స్వరంతో బిగ్గరగా ప్రశ్నించినా, సమాధానం దొరకని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా నా గురించి ఎన్ని ప్రశ్నలు సంధించినా, బదులే లేదు.

కొన్నాళ్ళకి నాకు తెలియని ఎన్నో మార్పులు, నాలో మొదలయ్యాయి. చాలా కాలం తర్వాతగాని, వాటి పేర్లు నాకు తెలియలేదు. నన్నెవరో నియమిత కాలంలో కనిపెడుతున్నారు. ఎవరో తెలియదు. నా గుండె చప్పుడుని వేరేలోకం నుండి విని ఆనందిస్తున్నారు. కళ్ళు, చెవులు, నోరు, ఎముకలు ఇలా మెల్లగా వాటి రూపం మొదలైందట. చిన్నగా వేళ్ళు కనిపిస్తున్నాయట. ముఖ్యమైన మెదడుకు రూపం మొదలయిందని చెప్తున్నట్లు నాకు సంకేతాలు వస్తున్నాయి.

నా కాళ్ళూ, చేతుల కదలికలను గుర్తించారు. కండరాలు ఇప్పుడే పుడుతున్నాయట.

నల్లని, చిరాకైన పదార్థం పూర్తిగా ఏర్పడని నా శరీరం చుట్టూ కప్పేసింది.

దాన్ని జుట్టు అంటారు కాబోలు. వేళ్ళకి పదునుగా ఏవో పెరుగుతున్నాయి. అంత పదునుగా ఉండేవి నా శరీరానికి గాయం చేస్తాయేమో అని భయమేస్తుంది. కానీ, వాటిని ఆపలేని స్థితిలో ఉన్నాను. వాటిని గోర్లు అంటారట.

నేను చూసే కళ్ళకి అడ్డంగా కనురెప్పలు, కనుబొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు నా బొటన వేలిని నేను నోట్లో పెట్టుకోగల్గుతున్నాను. నిరంతరం అదే పనిలో ఉంటున్నాను. పాడు అలవాటు. పొమ్మన్నా పోవడంలేదు. కొంతకాలంగా సంకేతాలుగా మాత్రమే నేను అనుభవించేవి శబ్దాల రూపంలో వినగలుగుతున్నాను. అంటే నాకు వినికిడి శక్తి పెరిగిందన్నమాట. ఇదో అద్భుతమైన అనుభూతి. మాటల్లో చెప్పలేను. వేరే లోకం నుండి నేను నీ అమ్మను, నాన్నను అంటూ ఏవో ఊసులు వినిపిస్తున్నాయి. అవి వినడానికి ఎంత తియ్యగా ఉన్నాయో. అప్పుడప్పుడు నా నోట్లో వేలుని చీకడం మానేసి,ఆ కబుర్లు వింటూ.. నన్ను నేను మర్చిపోతున్నాను.

ఇంతకీ మీకు ఇంకో విషయం చెప్పలేదు. నాకు అప్పుడప్పుడు పొట్టలో వింత అనుభూతి. అది బాలేదు. దాన్ని ఆకలి అంటారని అమ్మ చెప్తూ ఉంటుంది. ఆకలేస్తుందా కన్నా నీకు అని చెప్పి, ఏవో ఒకటి నా బొజ్జలో పడే ఏర్పాట్లు వాటంతట అవే జరుగుతుంటే భలే ఉంటుంది తెలుసా. ఆ ఉత్సాహంలో నేను గుండ్రంగా తిరిగేస్తూ ఉంటాను. తిరిగినప్పుడల్లా, బయటి లోకం నుండి మళ్ళీ తియ్యటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అవి నాకు ఎంత ఇష్టం అంటే నా చెవులు రిక్కించి వింటూ ఉంటాను. ఎవరో తెలుసుకోవాలనే ఆత్రంతో, బయటకి వచ్చేయాలని కాళ్ళతో తంతూ ఉంటాను. అప్పుడు తియ్యని స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని నవ్వు అంటారట. అమ్మ చెప్పింది. మధ్య మధ్యలో ఇంకో వ్యక్తి నేను, నాన్నని అని పలకరిస్తుంటారు కానీ, నాకంత తియ్యగా ఉండవు అవి వినడానికి. కాబట్టి నేను స్పందించను. స్పందించనప్పుడు అమ్మ పక పకా నవ్వుతుంది. అమ్మ గట్టిగా నవ్వినప్పుడు, నేను నవ్వి కేరింతలు కొడుతుంటాను. అది నాకో వినోదం. నాకు రూపం లేనప్పుడు ఈ స్థలం ఎంత విశాలంగా ఉండేదో, రాను రాను నాకు ఇరుకుగా ఉంటుంది. ఖాళీగా లేదు ఆడుకోడానికి. నేను విసర్జించిన వాటిల్లోనే పడుకుంటున్నాను. నాకు ఇక్కడ నచ్చడం లేదు. విశాలంగా ఉండే స్థలంలోకి తీసుకెళ్ళు అని అమ్మని అడుగుతునే ఉన్నాను. కానీ, తనకే నేనేం చెప్తున్నానో అస్సలు అర్ధం కావడం లేదు. కానీ, తన చేతుల్తో నా లోకపు అంచుల్ని తాకుతుంది. ఎంత హాయి అంటే.. మాటల్లో చెప్పలేను. నేను బరువు పెరుగుతున్నట్లున్నాను. మునుపటిలా వేగంగా తిరగలేకపోతున్నాను. అమ్మకి నడుమునొప్పి అట. పాపం. ఎందుకో నాకు తెలియదు. నాకు నిన్ను చూడాలని ఉంది అమ్మా… కొంతకాలం గడిచాక, ఇక లాభం లేదని.. నేను బయటకి వెళ్ళి.. ఈ మూసిన గదిలో నా వల్ల కాదు అని బిగ్గరగా అరిచి కొట్టడం మొదలు పెట్టాను. నా లోకం కంపించసాగింది.

కొన్ని గంటల శ్రమ, ఆవేదన, ఆరాటం ఇంకా ఎన్నో భావల మధ్య నేను నరకం చూశాను. చిన్న రంధ్రం ద్వారా నా పెద్ద శరీరాన్ని వేరేం లోకంలోకి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడ్డానో, పెట్టానో! అలసిపోయాను. మొత్తానికి బయటపడ్డాను. కోటి సూర్యకాంతి నన్ను తాకగానే నేనెవర్ని అనే ప్రశ్నని మర్చిపోయాను. ప్రశ్నే కాదు మొత్తంగా ఏం జరిగిందో శాశ్వతంగా మర్చిపోయాను.

Exit mobile version