Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పాటే మంత్రము: గుల్జార్ ప్రత్యేకం – మాయా మేమ్ సాబ్

[ప్రముఖ కవి శ్రీ గుల్జార్‍కి జ్ఞానపీఠ పురస్కారం లభించిన సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

గుల్జార్ సాబ్‌కి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిందని తెలిసి ఎంతో సంతోషం కలిగింది. ఎన్నో రకాల భావోద్వేగాలకి కవిత్వ రూపం ఇచ్చి సినీసంగీతాన్ని సుసంపన్నం చేశారాయన. ఆయన రాసిన పంక్తులు వింటుంటే ఈ భావాన్ని ఇంత కన్నా బాగా చెప్పటం సాధ్యం కాదనిపిస్తుంది. ఒక చిత్రం (ఫొటో) వెయ్యి మాటలతో సమానం అంటారు. అంటే మాటల్లో చెప్పలేని భావాలు చిత్రంలో కనపడతాయని. కానీ చిత్రం కూడా ఒక్కోసారి మనసు లోతుల్లోని భావాన్ని ప్రతిఫలించలేదు. అప్పుడు కవిత్వమే సమాధానం. ‘మాయా మేమ్ సాబ్’ చిత్రంలో ఆ కవిత్వమే కథకి పట్టుకొమ్మ అయింది. లతా మంగేష్కర్ గాత్రం, హృదయనాథ్ మంగేష్కర్ సంగీతం కూడా అత్యద్భుతంగా ఉంటాయి. ‘మదామ్ బోవరీ’ అనే ఫ్రెంచ్ నవల ఆధారంగా తీసిన చిత్రమిది. మ్యాజికల్ రియాలిజం ఉంటుంది. దర్శకుడు కేతన్ మెహతా. ముఖ్యపాత్రలు దీపా సాహీ, ఫారూఖ్ షేఖ్, షారుఖ్ ఖాన్, రాజ్ బబ్బర్ పోషించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

ఇది ఒక ప్రేమపిపాసి అయిన స్త్రీ కథ. తనవాడు తనని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాలని కోరుకుంటుంది. ఒక డాక్టరుని పెళ్ళి చేసుకుంటుంది. అతను ఆమెని ఎంతో ప్రేమిస్తాడు. కానీ కొన్నాళ్ళకి ఆమెకి విసుగు వస్తుంది. బిడ్డ ఉన్నా ఆమెకి ఇంకా ప్రేమ కావాలని అనిపిస్తుంది. లలిత్ అనే ఒక యువకుడు ఆమె వెంటపడతాడు. ఇద్దరి మధ్య ఆకర్షణ ఉంటుంది కానీ లలిత్ ఊరు విడిచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ దంపతులకి రుద్రప్రతాప్ సింగ్ అనే ఒక ధనవంతుడు పరిచయమవుతాడు. ఆమె భర్త ఆమెని అరాధించటం మానేశాడు. రుద్రప్రతాప్ ఆరాధన ఆమెకి కొత్తగా ఉంటుంది. తన విలువ అతనికే తెలుసు అనుకుంటుంది. అతను ఆమెని వశపరచుకుంటాడు. ఆమెకి థ్రిల్‌గా ఉంటుంది. కానీ తన ప్రతిష్ఠ కాపాడుకోవటానికి అతను ఆమెని వదిలించుకుంటాడు. లలిత్ మళ్ళీ ఆమె జీవితం లోకి వస్తాడు. ఆమె తన కంటే చిన్నవాడైన అతనితో కొత్త అనుభవాలు అందుకుంటుంది. అయితే అతనిది చంచలస్వభావం. వారి సంబంధం బెడిసికొడుతుంది. ఆమె అప్పులో కూరుకుపోతుంది. చివరికి మనోభీష్టాలను తీర్చే ఒక దివ్యౌషధం తాగి ఆమె మాయమైపోతుంది. ఆమె పేరు ‘మాయ’.

ఆమె బాగా చదువుకున్నది. తండ్రి బాగా బతికినవాడు. ఒక పాత బంగళాలో ఉంటుంది. తల్లి లేదు. బాగా పాడుతుంది. డాక్టర్ పరిచయమైన కొత్తలో ఆమె మనఃస్థితిని తెలిపే గీతం మొదటిది.

~

ఖుద్ సే బాతేఁ కర్తే రెహనా, బాతేఁ కర్తే రెహనా

ఆంఖేఁ మూందే దిన్ మేఁ మీఠీ రాతేఁ భర్తే రెహనా

అనువాదం:

నీతో నీవే చెప్పుకో ఊసులు, చెప్పుకో కమ్మని ఊసులు

కనులు మూసుకుని పగటిలో నింపుకో తీయని మాపులు

ఆమె తన సాంగత్యంలో తానే ఆనందంగా ఉంటుంది. అతను ఆమెని “మీకు కాలక్షేపం ఏమిటి?” అని అడుగుతాడు. ఆమె “నా కలలతో ఆడుకుంటాను” అంటుంది. ఏమిటి ఆ కలలు? సామాన్య స్త్రీల కలలు కాదు. తనలో తానే ఆనందం ఉండే ఆమెకి కలలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. పగలే కలలు కంటుంది. ఆ మాటని “కళ్ళు మూసుకుంటే పగలే అందమైన రేయి” అని చెప్పారు గుల్జార్. ఆమెకి పెళ్ళి మీద అంత ఆసక్తి లేదు. బాగా పాడుతుంది. పియానో వాయిస్తుంది. కానీ తండ్రికి ఆమె పెళ్ళి గురించి బెంగ.

ఖుద్ సే కెహనా జాతీ హూఁ మైఁ

ఖుద్ సే కెహనా ఆయీ మైఁ

ఐసా భీ తో హోతా హై నా

హల్కీ సీ తన్హాయీ మేఁ

తన్హాయీ మేఁ తస్వీరోఁ కే చెహరే భర్తే రెహనా

అనువాదం:

నీతో నువ్వే చెప్పుకో వెళ్ళొస్తానని

నీతో నువ్వే చెప్పుకో వచ్చానని

ఇదేం పెద్ద వింత కాదుగా

కాస్తంత ఒంటరితనం ముసిరినపుడు

ఒంటరితనంలో నింపుకో చిత్తరువుల మోములు

ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలతి అలతి పదాలతో చెప్పారు ఈ చరణంలో. పల్లవిని విస్తృతం చేశారు. తనతో తానే “వెళ్ళొస్తాను” అని, “వచ్చాను” అని చెప్పుకుంటూ ఉంటుంది ఆమె. చిత్తరువుల్లోని ముఖాలతో మాట్లాడుతుంటే ఒంటరితనం ఉండదు. ఇక్కడ చిత్తరువుల ముఖాల్లో రంగులు అద్దటం అనే అర్థం కూడా స్ఫురిస్తుంది కానీ అది కథకి అతకదు.

భీగే భీగే మౌసమ్ మేఁ క్యూఁ

బర్ఖా ప్యాసీ లగ్తీ హై

జీ తో ఖుష్ హోతా హై లేకిన్

ఏక్ ఉదాసీ లగ్తీ హై

ఐఁ వే హీ బస్ రూఠీ ఖుద్ సే, ఐఁ వే మన్తీ రెహనా

అనువాదం:

తడితడి ఋతువులో ఎందుకో

వాన దప్పికగొన్నట్టున్నది

మదిలో ముదముంది కానీ

గుబులేదో గూడుకట్టుకున్నది

నామీద నాకే ఉత్తుత్తి అలుకలు, ఉత్తుత్తి బుజ్జగింపులు

ఈ చరణం సినిమాలో ఉండదు. కానీ సినిమాలో తర్వాత ఆమెలో వచ్చే పరివర్తనకి సూచనగా రాశారు. వర్షానికి దప్పిక వేస్తే ఎలా ఉంటుంది? వర్షానికి దప్పిక అనేది ఉండదు. ఆమెకి అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలనే కోరిక వర్షానికి దప్పిక వేయటంతో సమానం. మనసు ఆనందంగానే ఉంది కానీ ఏదో గుబులు. ఇంకో ఏదో ఉంది, అది పొందాలి అనే తపన. ‘ఐఁ వే’ అంటే పంజాబీ భాషలో ‘ఉత్తుత్తినే’ అని అర్థం. ఉత్తుత్తినే తన మీద తానే అలిగి, మళ్ళీ బుజ్జగించుకుంటూ ఉంటుంది.

***

ఆమె పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే ఆనందంగా ఉండేది. సంగీతం సాధన చేస్తూ ఉండేది. కానీ తండ్రి కోరిక తీర్చటం కోసం పెళ్లి చేసుకుంది. అలాగని వరుడు నచ్చలేదని కాదు, నచ్చాడు. కానీ కొన్నాళ్ళకి భర్త ఆమెని ప్రత్యేకంగా చూడటం మానేశాడు. రుద్రప్రతాప్ సింగ్ ఆమెని ప్రత్యేకంగా చూస్తాడు. అతనితో సంబంధం మొదలయ్యాక ఆమె మనసులో భావాలని ఈ గీతంలో చెప్పారు.

ఓ దిల్ బంజారే జారే

ఖోల్ డోరియాఁ సబ్ ఖోల్ దే

అనువాదం:

ఓ దిమ్మరి మనసా ఎగిరిపో

పాశాలు తెంచుకుని వెళ్ళిపో

బంజారాలంటే దేశదిమ్మరులు. మనసుని బంజారాలతో పోల్చారు. బంధాలలో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా ఉండాలని ఆమె కోరిక. ఆమెకి తనని ఆరాధించేవాడు కావాలి. ఇంకేం వద్దు.

రాత్ కా బీతా సప్నా దిన్ మేఁ దిల్ దొహరాయే

జానే కౌన్ హై ఆకర్ సాఁసోఁకో ఛూజాయే

యే దిల్ అంజానా

బోలే ఏక్ బార్ తో లబ్ ఖోల్ దే

అనువాదం:

రేయి కరిగిన కలని పగటిలో నెమరేస్తుంది మది

ఎవరో వచ్చి నా నిట్టూర్పులని తాకినట్టున్నది

లోకం తెలియని మనసు

ఒక్కసారైనా పెదవి విప్పమంటున్నది

ఈ చరణంలో చివరి రెండు పంక్తులు ముఖ్యం. మనసుకి లోకం కట్టుబాట్లు తెలియవు. మనసులో ఉన్నది చెప్పెయ్ అంటుంది. కానీ అలా చెబితే ప్రమాదమని మస్తిష్కం అంటుంది.

ధూప్ సే ఛన్తీ ఛాఁవ్ ఓక్ మేఁ భర్నా చాహూఁ

ఆఁఖ్ సే ఛన్తే సప్నే హోఁఠ్ చఖ్నా చాహూఁ

యే మన్ సంసారీ

బోలే ఏక్ బార్ తో అబ్ డోల్ దే

అనువాదం:

ఎండని జల్లెడ పట్టి నీడని దోసిట్లో పట్టాలని ఆశ

కళ్ళతో జల్లెడ పట్టి కలలని రుచి చూడాలని ఆశ

ఈ భ్రమల మనసు

ఒకసారి ఊయలలూగమంటున్నది

ఎండని జల్లెడ పట్టి నీడని తీయటం, కళ్ళతో జల్లెడ పట్టి కలలని తీయటం – ఈ ప్రయోగాలు గుల్జార్ సాబ్‌కే సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడ ‘ఓక్’ అనే పదం కూడా చాలా అరుదు వాడే పదం. దోసిలి అని అర్థం. భాష మీద పట్టు ఉంటేనే ఇలాంటి పదాలు పడతాయి. కలలని రుచి చూడాలనటం మరో మంచి ప్రయోగం. ఒక పక్క అసాధ్యమని తెలుసు, కానీ దాని కోసం అర్రులు చాచటం.

***

లలిత్ తో మళ్ళీ పరిచయమయ్యాక ఆమెలో మళ్ళీ ఆశలు చిగురిస్తాయి. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది.

ఇస్ దిల్ మేఁ బస్ కర్ దేఖో తో

యే షహర్ బడా పురానా హై

హర్ సాఁస్ మేఁ కహానీ హై

హర్ సాఁస్ మేఁ అఫ్సానా హై

అనువాదం:

ఈ గుండెలో మకాం ఉండి చూడు

ఈ పురం చాలా పురాతనం

ప్రతి శ్వాసలో ఒక కథ ఉంది

ప్రతి శ్వాసలో కల్పన ఉంది

ఈ పాటలో వేదాంతం ధ్వనిస్తుంది. గాలి పరిమళాన్ని తీసుకుని వెళ్ళినట్టు మనసు కోరికల్ని తీసుకుని జన్మజన్మలకీ ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకే ఇది పురాతనమైనది. ఎన్నో కథలు, ఎన్నో కలలు. ఇక్కడ డాక్టరు, రుద్రప్రతాప్, లలిత్ అందరూ ఒక్కో కథలో నాయకులు.

యే బస్తీ దిల్ కీ బస్తీ హై

కుఛ్ దర్ద్ హై, కుఛ్ రుస్వాయూ హై

యే కిత్నీ బార్ ఉజాడీ హై

యే కిత్నీ బార్ బసాయీ హై

అనువాదం:

ఈ వాడ మనసనే వాడ

కొంత వేదన ఉంది, కొంత హేళన ఉంది

ఎన్నిసార్లు నేలమట్టమైందో

అన్నిసార్లు మళ్ళీ కట్టుకుంది

బస్తీ అంటే తెలుగులో చెప్పుకున్నట్టు పట్టణం కాదు. ఉర్దూలో అర్థం మురికివాడ. మనసుని ఒక మురికివాడతో పోల్చారు. ఎన్నో బాధలు, అవమానాలు. నేలమట్టమైనా మళ్ళీ లేస్తుంది. దానికి ఉనికి కావాలి. ఉన్నాను, అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉండాలి. ఆ అనుభవాలు ఎలాంటివైనా! శరీరం కూడా నశిస్తుంది, మళ్ళీ పుడుతుంది.

యే జిస్మ్ హై కచ్చీ మిట్టీ కా

భర్ జాయే తో రిస్నే లగ్తా హై

బాహోఁ మేఁ కోయీ థామే తో

ఆగోష్ మే గిర్నే లగ్తా హై

అనువాదం:

పచ్చి మట్టితో చేసిన దేహమిది

నిండిపోతే తడిబారిపోతుంది

ఎవరైనా హత్తుకుంటే

కౌగిట్లో రాలిపోతుంది

మట్టితో చేసిన శరీరం. ఏదీ భరించలేదు. గుండె భావోద్వేగంతో నిండితే కన్నీరు పైకి ఉబికి వస్తుంది. ఎవరైనా హత్తుకుంటే కౌగిట్లోనే నుసిగా మారి రాలిపోతుంది.

***

చివరి పాట సినిమాలో లేదు. కానీ ఎండమావుల వెంట పరుగెత్తి అలిసిపోయిన నాయిక మనఃస్థితికి అద్దం పడుతుంది.

మేరే సర్హానే జలావో సప్నే

ముఝే జరాసీ తో నీంద్ ఆయే

అనువాదం:

నా కలలకి చితి పేర్చండి

అపుడైనా కాస్త నిద్ర పడుతుందేమో

‘మేరే సర్హానే జలావో సప్నే’ అంటే ‘నా తల దగ్గర కలలని వెలిగించండి’ లేదా ‘నా తల దగ్గర కలలని దహనం చేయండి’ అని అర్థం వస్తుంది. చాలా వినూత్నమైన ప్రయోగం. కలలకి చితి పేర్చండి అనే అర్థం సబబుగా ఉంటుంది. కలలు లేకుండా ఉంటే నిద్ర పడుతుందని ఆమె ఆశ. కోరికలు లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉండగలనని అంతరార్థం.

ఖయాల్ చల్తే హైఁ ఆగే ఆగే

మైఁ ఉన్కీ ఛాఁవ్ మేఁ చల్ రహీ హూఁ

న జానే కిస్ మోమ్ సే బనీ హూఁ

జో కత్రా కత్రా పిఘల్ రహీ హూఁ

మైఁ సెహమీ రహతీ హూఁ నీంద్ మేఁ భీ

కహీఁ కోయీ ఖాబ్ డస్ న జాయే

అనువాదం:

తలపులు వడివడిగా పోతున్నాయి

వాటి నీడలో నే నడుస్తున్నా

ఏ మైనంతో మలచారో నన్ను

కొంచెం కొంచెం కరుగుతున్నా

నిద్దట్లో కూడా జంకుతూ ఉంటాను

కల ఏదైనా కాటు వేస్తుందేమో

మనసు ఎటు వెళితే అటు పరుగెత్తింది ఇన్నాళ్ళూ. కొంచెం కొంచెం తనని తానే అర్పించుకుంది. ఇప్పుడు కోరికలే పాముల్లా కాటు వేస్తాయనని భయపడుతూ ఉంది.

కభీ బులాతా హై కోయీ సాయా

కభీ ఉడాతీ హై ధూల్ కోయీ

మై ఏక్ భట్కీ హుయీ సీ ఖుష్బూ

తలాష్ కర్తీ హూఁ ఫూల్ కోయీ

జరా కిసీ శాఖ్ పర్ తో బైఠూఁ

జరా తో ముఝ్ కో హవా ఝులాయే

అనువాదం:

ఏదో నీడ రమ్మంటుంది

ఏదో ధూళి కమ్ముకుంటుంది

దారి తప్పిన పరిమళం నేను

నాకు నచ్చిన పూవు ఎక్కడుంది?

ఏ కొమ్మ మీదైనా సేద తీరితే

గాలి నన్ను డోల ఊపుతుందేమో

తుమ్మెద పువ్వుని వెతకటం అనే ప్రయోగం చాలా రకాలుగా చూశాం. అది మగవాడు ఆడదాని కోసం చేసే అన్వేషణ. కానీ ఇక్కడ స్త్రీ ఆనందం కోసం వెతుకుతోంది. ఆమె ఒక పరిమళం. పూవు కోసం చూస్తోంది. అందులో ఒదిగిపోదామని. తుమ్మెద పువ్వుని దోచుకుంటుంది. తావి పువ్వులో ఒదిగిపోతుంది. పురుషుడికి, స్త్రీకి ఇదే తేడా. ఆ తేడాని ఇంత గొప్పగా చెప్పటం గుల్జార్ సాబ్‌కే చెల్లింది.

సాధారణంగా స్త్రీలు మాతృత్వంలో సాఫల్యాన్ని వెతుక్కుంటారు. కానీ ఇక్కడ నాయికకి మాతృత్వం తృప్తినివ్వలేదు. ఆమె సంగీతంలో కృషి చేయవచ్చుగా. ఆమె సంగీతం వంకతో లలిత్‌ని కలుసుకోవటానికి వెళుతుంది. ఆత్మానందం కంటే ఐహిక సుఖం కోరుకుంటుంది. అదే విషాదం.

Exit mobile version