Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-18 – మిల్తీ హై జిందగీ మే ముహబ్బత్ కభీ కభీ

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘ఆంఖే’ (Ankhen, 1968) చిత్రం లోని ‘మిల్తీ హై జిందగీ మే ముహబ్బత్ కభీ కభీ’. గానం లతా మంగేష్కర్. సంగీతం రవి.

~

సాహిర్ పాటల్లో స్త్రీలకు పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది. చాలా మంది కవులు ప్రేమ జంటల మధ్య వచ్చే సన్నివేశాలకి పాటలు రాసేటప్పుడు పురుషుడే స్త్రీ వెంట పడి ఆమెకు తన ప్రేమను వ్యక్తీకరించడం,  ఆలోచించి, బెట్టు చేసి ఆ తరువాత స్త్రీ అతన్ని స్వీకరించడం, అనే పద్ధతిలో ప్రేమ గీతాలు రాస్తారు. ప్రేమలో పురుషుడే ముందడుగు వేయాలని, స్త్రీ అతన్ని అనుసరించాలి అనే భావం మన సమాజంలో వేళ్ళూనుకుని పోయి ఉంది. స్త్రీ పక్షాన రాసిన వారు, స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడినవారు కూడా శృంగారం లోనూ ప్రేమ లోను కోరికను వ్యక్తీకరించడం లోనూ స్త్రీ ముందడుగు వేయడానికి ఇష్టపడలేదు. అది ఆనాటి స్థితి.

ఇక ప్రస్తుతం కనిపించే ప్రేమల్లో తమలోని భావాలని పురుషుడి ముంధు ఏ మాత్రం సంకోచం లేకుండా ప్రదర్శించే అమ్మాయిల సంఖ్య అధికంగానే ఉంది. కాని వారిలో దూకుడు తప్ప ఆలోచన కాని ప్రేమ లోని గాఢత కాని అసలు కన్పించవు. స్వేచ్ఛ పేరుతో తమకు వచ్చిన భావవ్యక్తీకరణ అవకాశాన్ని వినియోగించుకునే స్వార్థం ఇప్పటి ఆడపిల్లల్లో ఎక్కువ. అంటే స్వేచ్ఛతో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు తప్ప మానవ సంబంధాలలోని గాఢతను, ఉండవల్సిన నిజాయితీని ముఖ్యంగా ప్రేమ అంటే బాధ్యత అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అంటే స్త్రీ స్వేచ్ఛ హక్కులను తీసుకొచ్చింది కాని బాధ్యతల పట్ల ఆలోచనలను కలిగించట్లేదు. అది స్త్రీ స్వేచ్ఛపై గౌరవాన్ని పోగొట్టే విధంగా ఉంది. అలాంటివి కూడా గమనిస్తున్నప్పుడు ఈ పాట నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. తనకు కావల్సినదాని పట్ల ఉన్న స్పష్టత ఓ అనుబంధంలో తాను ఇవ్వవల్సిన దాని పట్ల ప్రస్తుతం స్వేచ్చను అనుభవిస్తున్న స్త్రీలలో ఉండట్లేదు. అలాంటి సందర్భంలోనూ ఈ పాటలో ధ్వనించే స్త్రీ స్వేచ్ఛ ఆలోచింపజేస్తుంది.

ఇక్కడ ఓ స్త్రీ పురుషుడిని ప్రేమిస్తుంది. అతడు తన ప్రేమను అంగీకరించేలా చేసుకోవాలనుకుంటుంది. అతనికి తన మనసును వినిపిస్తుంది. అంటే ఆమెను పట్టించుకోని వ్యక్తికి అతని పై తనకున్న ప్రేమ గురించి చెబుతూ అతని జీవితంలో తానుండవలసిన అవసరాన్ని వివరిస్తూ, అతన్ని తనను అంగీకరించే స్థితికి తీసుకువస్తుంది. కాని ఇందులో ఆమె వాదనలో ఉండే బాధ్యతను గమనించండి. ఆమె ప్రదర్శించే ఆత్మవిశ్వాసంలో పొగరు కనిపించదు. తాను అతన్ని కోరుకుంటూనే అతని జీవితంలో తాను తీసుకురాగల మార్పును ఆమెను అతనికి వివరిస్తుంది.

మిల్తీ హై జిందగీ మే ముహబ్బత్ కభీ కభీ (3)

హోతీ హై దిల్బరోం  కీ ఇనాయత్ కభీ కభీ (2)

(ప్రేమ జీవితంలో అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతుంది. మనసున్న వారికి ఇలాంటి దయ అప్పుడప్పుడు మాత్రమే కలుగుతుంది)

మొదటి వాక్యం పాటలో మూడు సార్లు వస్తుంది. మూడు సార్లు మూడు రకాలుగా ఆ వాక్యం ద్వనిస్తుంది. ఒకసారి అది ఆమె మాటగా మరో సారి ఆమె ఇస్తున్న నినాదంగా మూడో సారి అదో విశ్వవ్యాప్త సత్యంగా లత పలికించిన తీరు బావుంటుంది. అంటే ఈ పాట మొత్తంలో సారం ఈ మొదటి వాక్యమే. చెప్పవలసింది ఒక్క వాక్యంలో చెప్పి ఆ తరువాత దాన్ని విపులీకరించడం ఈ పాటలో సాహిర్ అవలంబించిన శైలి.  జర్నలిస్టులు హెడ్‌లైన్ ఇచ్చి ఆ తరువాత వివరణ ఇచ్చే శైలి ఉంటుంది కదా. ఆ శైలిని గేయ రచనలో ఇక్కడ ఉపయోగించుకున్నారు. సాహిర్ ఒకే వాక్యాన్ని మూడు సార్లు రాసి ఉండడు. అలా పాటలో ఆ కవిత రావాలన్నది సంగీత దర్శకుడి నిర్ణయం అయి ఉంటుంది.  ఆ తరువాత ఈ పాటలో వచ్చే వాక్యాలన్నీ ఆ ప్రకటనకు కొనసాగింపే.

ప్రేమ అనుభవానికి వచ్చేది జీవితంలో కొన్ని సార్లు మాత్రమే అట. అందుకే ఆ క్షణాలు ఎదురయినప్పుడు వాటిని సొంతం చేసుకోవాలి అని ఆమె మలి వాక్యంలో ప్రకటిస్తుంది.

ఈ పాటను సాహిర్ గజల్ పద్ధతిలో రాసారు. ప్రతి చరణం ఓ షేర్ అంటే ఉర్దూలో వచ్చే రెండు వాక్యాల కవిత. పాట తుది చివరలతో సంబంధం లేకుండా ఆ వాక్యాలను ఉపయోగించుకోవచ్చు. ఏ చరణాని కది విడి కవిత లాగే వినిపిస్తుంది. అది గజల్ ప్రత్యేకత.

షర్మాకే ముహ్ నా ఫేర్ నజర్ కే సవాల్ పర్ (2)

లాతీ హై ఐసె మోడ్ పే కిస్మత్ కభీ కభీ (2)

మిల్తీ హై జిందగీ మే ముహబ్బత్ కభీ కభీ

(సిగ్గు పడి  కళ్ళు వేసే ప్రశ్నలకు మొహం తిప్పుకోకు. ఇలాంటి మలుపు జీవితంలో వచ్చే అదృష్టం. అది ఎప్పుడో గాని కలుగదు, జీవితంలో ప్రేమ ఎపుడో తప్ప దొరకదు)

అతనికి తనపై ఇష్టం ఉందని ఆమెకు తెలుసు కాని అతను దాన్ని మనసులో వెనక్కు నెట్టేస్తున్నాడు. అందుకని ఆమె సిగ్గుతో  కళ్ళు వేసే ప్రశ్నలకు మొహం తిప్పుకుని తప్పించుకోవాలనుకోకు. ఇలాంటి భావం మనసులో ఎప్పుడో కాని కలగదు. అది ఓ అదృష్టం. అన్ని సమయాలలో ఇది అందరినీ వరించదు. ఇప్పుడు ఆ అదృష్టాన్ని సిగ్గు చాటున నువ్వు గుర్తించడానికి నిరాకరిస్తున్నావు.

ఇక్కడ ఒక మగవాడిని స్త్రీ నీ మనసులోని కోరికకు సిగ్గుపడకు, సిగ్గుతో నానుండి దూరంకాకు అని చెప్పడం ఆ రోజుల్లో ఓ ఆశ్చర్యమే. సాహిర్ ఈ గజల్‌ను ఈ సన్నివేశానికే రాసారా అన్నది తెలీదు. ఎందుకంటే సాహిర్ ఇంతకు ముందు రాసుకున్న కవిత్వాన్ని ఎన్నో సందర్భాలలో సినిమాలకు తీసుకున్నారు. సన్నివేశాలను ఆ పాటల కోసం సృష్టించుకున్నారు సినీ దర్శకులు. ఈ సందర్భంలో అదే జరిగి ఉండే అవకాశాలెక్కువ కాని, ఒక స్త్రీ పాత్రకు ఈ భావాలను సాహిర్ అనుమతితోనే ఆపాదించి ఉంటారు కదా. అంటే స్త్రీ ముందు పురుషుడు కొన్ని సందర్భాలలో సిగ్గు పడడం బలహీనత కాదని అదో సాధారణ లక్షణం అని ప్రకటించి అప్పటి దాకా స్త్రీ పురుషుల మధ్య ఉన్న మూసలను బద్దలు చేసిన గీతంగా నాకు ఇది కనిపిస్తుంది. పైగా దాన్ని ఎంత సహజమైన విషయంగా ఇక్కడ ప్రస్తావించారంటే ఇది మరే సినీ కవి సాహసించని విషయం. మగవాడు సిగ్గుపడడం ఏంటి, స్త్రీ దాన్ని ఎత్తి చూపడం ఏంటి అనే సమాజంలో ఎంత సహజంగా ఈ పాట చిత్రీకరించబడిందో గమనించండి. పైగా ఆమె సిగ్గు పడతావెందుకు అని ఎద్దేవా చేయకుండా అదో సహజమైన విషయంగానే ప్రస్తావిస్తూ అనవసరమైన సిగ్గుతో జీవితం ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే కలిగించే అదృష్టాన్ని కోల్పోవద్దు అని చెబుతుంది. ఎంత ఆత్మవిశ్వాసం ఆమెలో. ఈ ప్రేమ అనే భావం అందరిలోనూ ఇప్పటి తరం అనుకున్నట్లు ఠంచనుగా ఓ వయసులో, ఓ సందర్భంలో జనించదు. అది ఏ అదృష్టవంతులకో దక్కే వరం. ఈ నిజం ప్రేమ ప్రేమ అంటూ నిరంతరం  గందరగోళంలో పెరిగే ఈ తరానికి అర్థం కాదు. ప్రతి ఆకర్షణను ప్రేమ అనుకోవడం, ఓ బాయ్ ఫ్రెండ్‌ని, గర్ల్ ఫ్రెండ్‌ని మెయిన్‌టెయిన్ చేయడం స్టేటస్‌గా మార్చుకున్న తరానికి ప్రేమ అందరిలో అన్ని సందర్భాలలో కలిగే భావం కాదన్నదాన్ని ఒప్పుకోలేరు.

ఈపాటలో ఇంత ధైర్యంగా మనసులోని మాటను వ్యక్త పరచిన యువతి పాటను రచించిన సాహిర్, హమ్రాజ్ సినిమాలో నాయకుడి ప్రయత్నాలను తిరస్కరిస్తున్న యువతి గురించి నాయకుడు పాడే పాటలో సాంప్రదాయికమైన భావాన్ని మానసికశాస్త్ర పరంగా అద్భుతంగా సార్వజనీన సత్యంగా ప్రదర్శిస్తాడు.

సునా హై, హర్ జవాన్ పథ్థర్ కె దిల్ మె ఆగ్ హోతీ హై

మగర్ జబ్ తక్ నా ఛేడో శర్మ్ కె పర్దే మే సోతీ హై..

పైకి రాతిలా తోచే ప్రతి యువతి హృదయంలో అగ్ని వుంటుందని విన్నాను. కానీ, ఎప్పటివరకూ రెచ్చగోట్టలేదో అప్పటివరకూ, సిగ్గు అనే పరదాలో ఆ అగ్ని నిద్రాణ స్థితిలో వుంటుంది……. పుస్తకాలు రాయవచ్చు ఈ రెండు పంక్తుల ఆధారంగా…..

ఆంఖే పాటలో నాయిక హమ్రాజ్ సినిమా నాయికకు భిన్నమైనది. జీవితంలో ఆనందించే అవకాశాలు అతి అరుదుగా లభిస్తాయి. అలాంటి అవకాశాలను కోల్పోకూడదని అనటమే కాదు, ఆచరించి చూపుతోంది. ముందడుగు వేయాల్సిన మగవాడే , వెనక్కుపోతూంటే, నాయికే పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుంటోందన్నమాట…సందర్భాన్ని పట్టి తన సిధ్ధాంతాలను, విశ్వాసాలను సినిమాలో పాత్రలద్వారా పలికిస్తూ జీవిత సత్యాలను సామాన్యులకు చేరువచేస్తాడన్నమాట సాహిర్ తన గీతాల ద్వారా!!

ఖుల్తే నహీ హై రోజ్ దరీచే బహార్ కే

ఆతీ హై జానేమన్ యె కయామత్ కభీకభీ

మిల్తీ హై జిందగీ మే ముహబ్బత్ కభీ కభీ

( విరబూసిన పూలతోట కిటికీలు  రోజూ తెరుచుకోవు. అంటే, ఆ పూలతోట అందాన్ని దర్శించే అవకాశాలు అతి అరుదుగా వస్తాయన్నమాట.  ప్రియతమా  ఇలాంటి జీవితంలో అరుదుగా లభించే అవకాశం  ఎప్పుడో కాని లభించదు . జీవితంలో ప్రేమ ఎప్పుడో కాని దొరకదు)

సాహిర్ పదాల కూర్పు కు ఈ ముందు వాక్యం మరో గొప్ప ఉదాహరణ. ‘దరీచే బహార్ కే’ ఎంత అందమైన పదం. దరీచే అంటే గవాక్షం. కిటికీ. మరొక అర్ధం అతి సుందరమైనది. ఇంకో అర్ధం, ఒక గదిలోకి వెలుతురు ప్రసరింపచేసే సన్నటి రంధ్రం.  అంటే ప్రేమ అనే భావం మనసులో జనియించినప్పుడు వసంత కాలం కిటికీ తెరిచి  స్వాగతిస్తున్న అనుభూతి కలుగుతుందట.  యవ్వనంలో వున్న యువతిని విరబూసిన పూవుతో పోలుస్తారు. ఆమె యవ్వనపు ఉచ్చ దశలో వున్నదని చెప్పేందుకు, ఉస్ పర్ బహార్ ఆగయీ అంటారు. అంటే, ఆమె తన హృదయంలోకి అతడికి ఆహ్వానం పలుకుతోంది, హృదయపు కవాటాలు తెరిచిందన్నమాట. అతనికి ఈ ఆహ్వానం అంత సులభంగా లభించదు అని నర్మగర్భితంగా చెప్తోందన్నమాట.  ఒక యువతి హృదయంలోకి ఆహ్వానం లభించే అతి అందమైన సందర్భాన్ని  ఎంత అందంగా హృద్యంగా పదాల్లో పొందుపరిచాడు సాహిర్ ! అంత గాఢమైన అనుభూతి మాత్రమే ప్రేమ.  రంగు నచ్చిందనో కన్ను నచ్చిందనో , ఒంట్లో వేడి పుట్టిందనో వెంటపడటం, అదే ప్రేమ అని అపోహ పడడం ఎంత మూర్ఖత్వం?

 ఉర్దూ లో కయామత్ అనే పదాన్నిఎన్నో సందర్భాలలో వాడతారు. ఈ భూమి మీద చిట్ట చివరిగా ఓ ప్రళయం వస్తుందనే నమ్మకం ఇస్లాంలో ఉంది. అదే ఖయామత్. అయితే ఇక్కడ ఆ పదం ఉపయోగిస్తూ, ఈ ప్రేమ తమ జీవితంలోని అన్వేషణలోని చివరి మజిలీ అని చెప్తూ తాము వెతికే పరిపూర్ణమైన అనురాగానికి ఒకరికొకరం చివరి మజిలీలం అని ఆమె చెబుతూ ఈ ప్రేమలోని గాఢతను, బాధ్యతను కూడా వ్యక్తీకరిస్తుంది. ఇది అందరూ ఎదురు చూసే ప్రళయం, చివరి మజిలీ.   అది అందరి జీవితంలోనూ రాదు. మనం దాన్ని అనుభవిస్తున్నాం. దాన్ని గుర్తించు, అనుభవించు, స్వీకరించు అని చెప్పడం ఆమె ఆశయం.

తన్హా న కట్ సకేంగే జవానీ కె రాస్తే (2)

పేష్ ఆయెగీ కిసీ కి జురూరత్ కభీ కభీ (2)

మిల్తీ హై జిందగీ మే ముహబ్బత్ కభీ కభీ

(ఒంటరితనంతో యవ్వనపు దారులను దాటలేము. ఎవరో ఒకరి అవసరం అప్పుడు అప్పుడు పడి  తీరుతుంది, ఈ జీవితంలో ప్రేమ అప్పుడప్పుడే దొరుకుతుంది)

సాహిర్ ప్రేమను జీవిత కాలపు తోడు అని, ఒకరితో ఒకరం ఎప్పటికీ ఉంటాం అనే మాటలు రాయడు. ఆయన ప్రేమను జీవితంలో వచ్చి పోయే వసంతంగానే చాలా సందర్భాలలో ప్రస్తావించారు. అలాగే ఆ గాఢత శాశ్వతం అనే మాటనూ ఆయన చెప్పలేదు. ప్రేమ రూపం మారుతుందని చాలా సందర్భాలలో ఆయన చెప్పారు. అందుకే ఇక్కడ యవ్వనపు ప్రస్తావనను ఆయన సహజంగా తీసుకొచ్చారు. ఒంటరిగా యవ్వనాన్ని గడపడం కష్టం. ఎవరో ఒకరు అవసరం అవుతారు. అది సత్యం. అలాంటప్పుడు ఎప్పుడో అప్పుడు మాత్రమే పలకరించే ప్రేమని ఎవరికీ సులువుగా లభించని అదృష్టాన్ని స్వీకరించడం తెలివైన పని కదా అన్నది ఆమె ప్రశ్న. అతనికి యవ్వనపు రోజుల్లో తోడు కావాలి. ఆమెకు అతనిపై మనసు ఉంది. అలాంటప్పుడు ఆ తోడు కోసం అయినా వచ్చిన అదృష్టాన్ని స్వీకరించవచ్చు కదా. ఇది ఆమె వాదన. ఎంత ప్రాక్టికల్ అప్రోచ్ ఉందో గమనించండి. సాహిర్ ప్రేమ గీతాలలో ఎక్కడా ఈ వాస్తవికతకు దూరం కాని భావుకతే కనిపిస్తుంది.

జవానీ కే రాస్తే….యవ్వనపు దారులు….ఈ జీవితం ఒక ప్రయాణం. అందులో యవ్వనం ఒక దాటవలసిన మైలురాయి. ఈ ప్రయాణం ఒంటరిగా చేస్తే యవ్వనం వృధా అవుతుంది. కాబట్టి ఈ ప్రయాణంలో ఒక తోడు అవసరం. ఈ భావనను హమ్రాజ్ సినిమాలో తుమ్ అగర్ సాథ్ దేనేకా పాటలోనూ వ్యక్త పరుస్తాడు సాహిర్.

మై అకేలా బహుత్ దేర్ చల్తా రహా

అబ్ సఫర్ జిందగానీక కట్ తా నహీ

జబ్ తలక్ కోయి రంగీన్ సహారా  నా హో

వక్త్ కాఫిర్ జవానీ క కట్ తా నహీ….

యవ్వనపు కాలం ఒంటరిగా చాలా కాలం గడిపాను. కానీ, అందమయిన తోడు లేకపోతే యవ్వనపు కాలం గడవదు…తన్హా న కట్ సకేంగె జవానీ కె రాస్తే…..ఒంటరిగా యవ్వన కాలం గడపటం కుదరదు….అవసరమైతే, అదే భావాన్ని ఒక్క వాక్యంలో చెప్తాడు. అదే భావాన్ని సందర్భాన్ని బట్టి అందమైన పూలమాలలాంటి పదాలతో అల్లి అతి సుందరంగానూ చెప్తాడు. అందుకే హిందీ సినీ గేయ రచనా ప్రపంచాన్ని మకుటంలేని మహా నియంతలా ఏలాడు సాహిర్.

ఫిర్ ఖో న జాయె హమ్ కహీ దునియా కె భీడ్ మే (2)

మిల్తీ హై పాస్ ఆనేకి ముహలత్ కభీ కభీ

హోతీ హై దిలబరో కి ఇనాయత్ కభీ కభీ

మిల్తీ హై జిందగీ మే ముహబ్బత్ కభీ కభీ (2)

(మనం ప్రపంచపు గుంపులో ఎక్కడో మళ్ళీ తప్పిపోవచ్చు. ఇలా దగ్గరగా వచ్చే అవకాశం ఎప్పుడో కాని రాదు. మనసున్న స్నేహితుల దయ అప్పుడప్పుడు మాత్రమే కలుగుతుంది, ఇలాంటి ప్రేమ ఎప్పుడో గాని దొరకదు)

జీవితంలో మనకు ఎదురు పడిన మనుషులు ఎప్పటికీ మనతో ఉండరు. అలా ఉండాలంటే వారితో ఓ బంధం ఏర్పడాలి. లేదా అది కొన్నాళ్ల తోడు మాత్రమే అవుతుంది. జీవితంలో ఏవరి దారి వారిదయినప్పుడు వ్యక్తులు ప్రపచంలోని ఇతర సమూహాలలో తప్పిపోతారు. మళ్ళి ఒకరికొకరు దొరకడం కష్టం. అందుకని దొరికిన ప్రేమను, ప్రేమించిన వ్యక్తులను దగ్గరగా నిలుపుకోవాలి. ఎందుకంటే ఒకరికొకరం శాశ్వతంగా దగ్గరవుదాం అనే భావం కూడా అందరి మనసుల్లో కలగదు. అలాంటి ప్రేమ ఎప్పుడో కాని దొరకదు. దొరికినప్పుడు దాన్ని అంది పుచ్చుకోవడం మనం చేయవలసిన పని. ఈ క్షణం మన దారులు వేరయితే మళ్ళీ ఇంత దగ్గరగా కలుస్తాం అన్న నమ్మకం లేదు. జీవితం మన చేతుల్లో ఉండదు. అందుకే మన మనసులోని ఈ అనుభూతిని కలిసి ఆస్వాదిద్దాం, ఒకరినొకరం స్వీకరిద్దాం అంటుంది ఆమె. సాధారణంగా సాహిర్ పాటలలో కనిపించే జీవితంలోని అశాశ్వతత్వం, అనూహ్య లక్షణం, ఈ క్షణం ఇలా ఉన్నాం, మరుక్షణం ఏమవుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణంలోనే జీవితాన్ని అనుభవించాలి అన్న ఆలోచన ఈ పాటలో కూడా కనిపిస్తుంది. ఒకే భావాన్ని ఎన్ని విభిన్నమైన రీతులలో వ్యక్త పరచవచ్చో అన్ని విభిన్నమైన కోణాలలో, అన్ని విభిన్నమైన రీతులలో , అంత వైవిధ్యభరితంగా, విశిష్టంగా వ్యక్త పరచాడు సాహిర్.

దునియా కె భీడ్ అన్న పదం ఎన్నో అర్ధాలను పొదుగుకుని ఉన్న పదం. భీడ్ అంటే గుంపు. దునియా అంటే ప్రపంచం. దునియా కె భీడ్ అంటే ప్రపంచపు గుంపు. ఖో జానా అంటే, పోగొట్టుకోవటం. అంటే, ఈ ప్రపంచపు గుంపులో కలసి తమ స్తిత్వాన్ని కోల్పోవటం. వాళ్ళకి ఎవరికీ దొరకని అతి అరుదైన అవకాశం ప్రేమ లభించింది. దాన్ని వదలుకుంటే, ప్రేమ అంటే తెలియకుండా గుడ్డిగా బ్రతికేస్తున్న సామాన్య ప్రజల గుంపులో తామూ కలసిపోతారు. ప్రేమను అనుభవించి గుంపుకు భిన్నంగా ప్రత్యేకంగా నిలచే అవకాశాన్ని కోల్పోయి తామూ గుంపులో ఒకరై పోతారు. కానీ, తమని తాము కోల్పోతారు… అందుకే ఫిర్ అన్న పదం వస్తుంది…వారు ప్రేమ పొందకముందు గుంపులో ఒకరు. ప్రేమించే అవకాశం లభించటంతో ప్రత్యేకం అయ్యారు. ఆ అవకాశం వదలుకుంటే మళ్ళీ గుంపులో ఒకరైపోతారు… సాహిర్ పాటలలోలోతు అర్ధాలను గ్రహించటం అంత సులభం కాదు. ఆ గీతాల సముద్రాన్ని మధిస్తే కానీ, అమృతానందానుభవం రాదు.

సాహిర్ గీతాలలో ఒక స్త్రీ ప్రేమ వ్యక్తీకరణకు, పురుషుని ప్రేమ వ్యక్తీకరణకు మధ్య ఎటువంటి తేడా ఉండదు. అందుకే ఆయన నాకు నిజమైన స్త్రీవాదిగా కనిపిస్తారు. ఏ సమానత్వం సమాజంలో స్త్రీ పురుషుల మధ్య రావాలని కోరుకుంటామో దాన్నిఆయన సంపూర్ణంగా సహజంగా వ్యక్తీకరించడం ప్రతి పాటలోనూ మనకెదురయే అనుభవం. ఇదే గీతం పురుషుడు పాడినా ఆ గాఢత అదే స్థాయిలో ఉంటుంది. ప్రేమ మనసుకు సంబంధించింది కాని లింగ భేదం దానికి అంటదు. మనసు విషయంలోనూ లింగపరమైన తేడా ఉండాలనే సమాజ నిబంధనలను బద్దలు కొట్టిన సాహిర్ రచనకు చక్కని ఉదాహరణ ఈ పాట.

తన్హా న కట్ సకేంగే జవానీ కే రాస్తే (2)

పేష్ ఆయెగీ కిసీ కీ జురూరత్ కభీ కభీ (2)

ఇలా కూడా స్త్రీ ప్రేమను వ్యక్తీకరించవచ్చని అది సహజమైన భావన అని నమ్మిన సాహిర్ లోని స్త్రీవాది నాకు ఎంతో నచ్చుతాడు.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version