Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-24 – రాత్ భర్ కా హై మెహమాన్ అంధేరా

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘సోనే కీ చిడియా’ (Sone Ki Chidiya, 1958) చిత్రం లోని ‘రాత్ భర్ కా హై మెహమాన్ అంధేరా’. గానం మహమ్మద్ రఫీ. సంగీతం ఓ పి నయ్యర్.

~

జీవితంలోని ఆటుపోట్లకు భయపడి ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అపజయాలను స్వీకరించడం, జీవితంలోని సంఘర్షణను ఒప్పుకోవడం, జీవన పథంలోని సవాళ్లను అంగీకరించలేకపోవడం ఇవన్నీ మనిషి అర్ధాంతరంగా తనువు చాలించడానికి కారణాలు. ప్రస్తుత తరంలో జీవితం పట్ల అవగాహానలేమి, అంతులేని కోరికలను కట్టడి చేయలేని క్రమశిక్షణా రాహిత్యం, ఓటమిని అంగీకరించలేని అహం వారి జీవిత ప్రయాణాలను ప్రభావితం చేయడం కనిపిస్తుంది. ముఖ్యంగా మానవ సంబంధాల పట్ల అపరిపక్వత ఈ తరంలో చాలా ఎక్కువ. ఇలాంటి వారు ప్రతి తరంలోనూ కనిపిస్తారు. కాని వారి సంఖ్య మారుతున్న జీవన పరిస్థితుల కారణంగా ప్రతి తరంలో పెరుగుతూ కనిపిస్తుంది.

సాహిర్ తన గీతాలలో జీవితంలోని సంఘర్షణను ప్రతి సందర్భంలోనూ వ్యక్తీకరించేవారు. జీవితం పూల పానుపు కాదని, ప్రతి అనుభవమూ వచ్చి పోయే ఆనందమే అని, జీవితంలో మనిషికున్న ఏకైక నేస్తం ఒంటరితనం అని ఆయన ఎన్నోసార్లు సినీ గీతాల నేపథ్యంలో వినిపించారు. కాని అయినా మనిషి పోరాడాలని, ఒక సైనికుడిగా జీవన యుద్దంలో పాల్గొనాలని ప్రతి సవాలుని స్వీకరించి ఎదుర్కోవాలని, అదే జీవించడం అని తన శైలిలో చెబుతూ వెళ్లారు. అందుకే వారి కలం నుండి ఎన్నో స్ఫూర్తిదాయకమైన గీతాలు జన్మించాయి. మిగతా సినీ కవులతో పోలుస్తే జీవితపు సవాళ్ళను ఎదుర్కొమంటూ ప్రోత్సాహకర గీతాలు రచించిన కవులలో ముందు వరుసలో నిలుస్తారు సాహిర్. ‘సోనే కీ చిడియా’ సినిమా కోసం ఆయన రచించిన గీతం ఆ కోవలోకే వస్తుంది.

ఈ పాటకు ముందు వచ్చే సాకీ పాట సారాంశాన్ని పూర్తిగా వ్యక్తీకరిస్తుంది.

మౌత్ కభీ భీ మిల్ సక్తీ హై లేకిన్ జీవన్ కల్ న మిలేగా

మర్నే వాలే సోచ్ సమఝ్ లె ఫిర్ తుఝే యె పల్ న మిలేగా

(మరణం ఎప్పుడైనా దొరుకుతుంది కాని జీవితం రేపు దొరకదు. చచ్చిపోవాలని నిర్ణయించుకున్న వాళ్ళు కాస్త ఆలోచించి అర్థం చేసుకోండి. మళ్ళీ మీకు ఈ ప్రస్తుత క్షణాలు దొరకవు)

సాధారణంగా కవిత్వంలో విషయ వివరణ సందర్భంలో వర్ణన ఎక్కువగా ఉండి సూటిగా విషయాన్ని వ్యక్తీకరించడం జరగదు. కవిత్వం అంటేనే వర్ణన అనే వాదన కూడా ఉంది. కాని ప్రజా కవులుగా పేరు పొందిన వాళ్ళు, ప్రగతీశీల భావాలతో కవిత్వాన్ని రాసిన వాళ్లు వర్ణన కన్నా సూటిగా విషయాన్ని వ్యక్తీకరించడాన్నే నమ్మారు. ముఖ్యంగా సాహిర్ No Nonsense Poet అని చెప్పవచ్చు. చెప్పాలనుకున్నదాన్ని కుండ బద్దలుకొట్టినట్లు మొదటే చెప్పేయడం ఈయన శైలి. దానికి ఈ పాటను ఉదహరించుకోవచ్చు. పాటకు ముందు వచ్చే ఈ సాకీని గమనించండి. ఆ రెండు వాక్యాలను విన్న వెంటనే చావును కోరుకుని ఆ దిశగా వెళ్ళేవారిని సూటిగా తట్టి లేపి కవి తన మాటలను వినిపిస్తున్నాడని అర్థం అవుతుంది. ఆయన ఈ పాట ద్వారా ఆత్మహత్య ఆలోచనలో ఉన్నవారిని ఆపి వారి ఆలోచనను పసిగట్టి వారిని సంబోధిస్తున్నారు. అదీ సూటిగా ఏ అనవసర పదాలతో విషయాన్ని తేలిక చేయకుండా..

ఆత్మహత్యల గురించి విశ్లేషిస్తున్నవారు, ఈ విషయంపై, మనిషి మానసిక రుగ్మతలపై అద్యయనం చేస్తున్న మానసిక విశ్లేషకులు ప్రస్తుతం శాస్త్రీయంగా ఓ విషయాన్ని ధ్రువీకరించి వినిపిస్తున్నారు. “ఆత్మహత్య గురించి నేరుగా మాట్లాడం చాలా అవసరం. ఎవరి ప్రవర్తనలోనన్నా అనుమానస్పద లక్షణాలు కనిపిస్తే వారిని నేరుగా ఆత్మహత్య దిశగా వారి ఆలోచనలు ఉన్నాయా అన్న విషయాన్ని అడిగి తెలుసుకోవడం అవసరం. దీన్ని అత్యవసర అవసరంగా ప్రస్తావిస్తూ ఇలా సూటిగా ప్రశ్నించడంతో కొన్ని ఆత్మహత్యలను నివారించవచ్చని, ఆత్మహత్యని పిరికివారి చర్యగా కాకుండా సహయం కోసం చేసే అర్థింపుగా చూడాలని ప్రపంచంలో పెద్ద మానసిక శాస్త్రవేత్తలు ఈ శతాబ్దంలో సాధారణ ప్రజానీకానికి వివరిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం జీవిస్తున్న మనం గమనించవలసింది ఈ పాటను యాభైవ దశకంలోనే సాహిర్ రాసారు. పాటను ఈ సాకీతో మొదలెడుతూ, “మీరు ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నారా, ఆ ఆలోచనలతో ఉన్న అందరూ మరచిపోకూడని విషయం ఇది. మరణం ఎప్పటికయినా మనల్ని చేరే నిజం. కాని గడిచిపోతున్న జీవితం మళ్ళీ రేపు రాదు. కాస్త ఆగి ఆలోచించండి నేను చెబుతున్నది అర్థం చేసుకోండి” అని సూటిగా అభ్యర్థించడం సాహిర్ ఈ పాటలో అవలంబించిన శైలి. ఈ శైలినే మానసిక విశ్లేషకులు ప్రతి ఒక్క బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నవారిని ప్రస్తుతం తమ సంభాషణలలో ఉపయోగించమని ఇలా జరిపే సంభాషణ కొన్ని ప్రాణాలను కాపాడుతుందని శాస్త్రీయంగా విడమరిచి మరీ చెప్తున్నారు. ఆ శైలిని సాహిర్ యాభవ దశకంలోనే పాటించారు. అంటే తన మాటలు చేరవలసిన వారిని చేరాలంటే తాను ఎలాంటి శైలి తన కవిత్వంలో ఉపయోగించాలో శాస్త్రీయ అవహాహన కలిగి ఉన్న కవి సాహిర్ అని మనకు అర్థం అవుతుంది.

రాత్ భర్ కా హై మెహమాన్ అంధేరా

కిస్కె రోకే రుకా హై సవేరా

(చీకటి రాత్రంతా ఉండే అతిధి మాత్రమే. ఉషోదయ వెలుగు ఎవరు ఆపితే ఆగుతుంది)

రాత్రి ఎంత అంధకారమయమయినా అది గడిచిపోయేదే. రాబోయే ఉషోదయాన్నిఏ శక్తీ కూడా ఆపలేదు. అంటే ఎన్ని అలవికాని కష్టాలు జీవితాన్ని చీకటిమయం చేసినా ఈ స్థితి ఎల్లకాలం ఉండడు. ఏదీ శాశ్వతంగా నిలిచి ఉండదు కాబట్టి ఎటువంటి కష్టం అయినా అశాశ్వతమే. రాబోయే వెలుగును ఆపే శక్తి ఎవరికీ ఉండదు. ఎందుకంటే రాత్రి తరువాత పగలు రావడం పకృతి నియమం. అది జరిగి తీరుతుంది.

రాత్ జిత్నీ భీ సంగీన్ హోగీ

సుబహ్ ఉత్నీ హీ రంగీన్ హోగీ

గమ్ న కర్ గర్ హై బాదల్ ఘనేరా

కిస్కే రోకే రుకా హై సవేరా

(రాత్రి ఎంత చిక్కగా ఉన్నా ఉషోదయం అంతే రంగుల మయంగా ఉంటుంది. మబ్బులు గాఢంగా కమ్ముకుని ఉన్నాయని దుఃఖించకు. ఎవరు ఆపినా ఉషస్సు ఆగదు)

పగలు వచ్చి తీరుతుందని తెలిసినా మనుషుల తమను చుట్టుముట్టిన చిక్కని చీకటికి భయపడతారు. దాంతో రాబోయే పగలు ఎంతో అందంగా రంగులతో నిండిపోగలదన్న నిజాన్ని మరచిపోతారు. దట్టంగా అలుముకున్న మబ్బులను చూసి భయపడవద్దని, ఇవి కూడా రాబోయే ఉషస్సును ఆపలేవని అందుకే కష్టాలకు బెదరవద్దనే సందేశాన్ని కవి ఇక్కడ అందిస్తున్నారు.

లబ్ పె షికవా న లా, అష్క్ పీ లే

జిస్ తర్హే   భీ హో కుఛ్ దేర్ జీ లే

అబ్ ఉఖడనే కో హై గమ్ కా డేరా

కిస్కె రోకే రుకా హై సవేరా

(పెదవి పై ఫిర్యాదులు తీసుకురాకు, కన్నీళ్లను తాగేసేయి, ఎలాగన్నా కాని కొంత కాలం బతికేసేయి. ఇప్పుడు దుఃఖపు డేరా పెకిలివేయబడబోతుంది. ఎవరు ఆపినా ఉదయం రాకుండా పోదు)

కష్టాలతో కృంగిపోతున్న మనిషితో సంభాషించేటప్పుడు ఇదో పెద్ద కష్టం కాదు ఇంత కన్నా పెద్ద కష్టాలు ఉన్నాయి ఇతరులకు అని సాధారణంగా అందరూ నీతి వాక్యాలు బోధింపచూస్తారు. కాని అటువంటి సంభాషణ వారిని అగౌరవపరిచినట్లు ధ్వనిస్తుంది. వారి పోరాటాన్ని, వాళ్లు అలసిపోతున్నారన్న నిజాన్ని మనం విస్మరించాం అన్న సందేశం ఇస్తుంది. సాహిర్ ఇక్కడ ఆ తప్పు చేయట్లేదు. వారి కష్టాలను అంగీకరిస్తూ, వారి పోరాటాన్ని గౌరవిస్తూ వారికి తనతో పాటు సమాన స్థాయినిస్తూ ఎక్కడా వాళ్లను లోకువగా చూడకుండా, నీ కష్టం నాకు అర్థం అవుతుంది. ఇంత వరకు లాక్కువచ్చావు. ఇంక కొంత కాలం ఓపిక పట్టు. ఫిర్యాదులతో బలహీనపడకు, నీ కన్నీళ్ళను తాగుతూ కొంత కాలం ఈ కష్టాన్ని భరించు. ఎలాగైనా కానీ బతికేయి. దుఃఖపు డేరా ఇక పెకిలించబడబోతుంది. ఉషోదయం ఆగదు అప్పటిదాకా ఓపిక పట్టు అని చెప్తున్నాడు. ఈ సంభాషణలో ఇతరుల కష్టం పట్ల గౌరవం, ప్రదర్శిస్తూనే వారికి బాసటగా నిలుస్తూ వాళ్లు చూడలేకపోతున్న భవిష్యత్తుని చూపించే ఓ స్నేహ హస్తం కనిపిస్తుంది. నిజమైన మానవీయ ఓదార్పు ఇలాగే ఉంటుంది. బరువు మోస్తున్నవాడి బాధను అర్థం చేసుకుంటూ ఇంకొన్ని అడుగులు వేయమనడంలో సానుభూతి కాదు సౌభ్రాతృత్వం కనిపిస్తుంది. సానుభూతితో కూడిన మాటలు మనుషులను బలహీనపరుస్తాయి. సంభాషణ జరిపే వ్యక్తుల మధ్య స్థాయి భేదాన్ని సూచిస్తాయి. కాని సౌభ్రాతృత్వం కనపరిచే సంభాషణ మనుషులను దగ్గర చేస్తుంది. ప్రపంచం పట్ల ఆశ చిగురించి జీవితాన్ని అందుకోవాలనే కోరిక కలిగిస్తుంది. ఇదీ మానసిక విశ్లేషకులు తమ కౌన్సిలింగ్‌లో అవలంబించే శైలి. దాన్ని తన కవితలో సాహిర్ అతి నైపుణ్యంతో ప్రదర్శించారు.

యూ హీ దునియా మే ఆకర్ నా జానా

సిర్ఫ్ ఆంసూ బహాకర్ న జానా

ముస్కురాహట్ మె భీ హక్ హై తేరా

కిస్కే రోకే రుకా హై సవేరా

(ఈ ప్రపంచంలో ఇలా వచ్చి అలాగే వెళ్లిపోకు. కేవలం కన్నీళ్ళు చిందించి వెళ్లకు. నవ్వులపై కూడా నీకు హక్కు ఉంది. ఎవరు ఆపినా ఉషోదయం ఆగదు)

సాహిర్ ఎప్పుడు కూడా ఎంత కష్టకాలంలో కూడా తన హక్కులను పోరాడి మనిషి సాధించుకోవాలనే చెప్తారు. ఇక్కడా అదే విషయాన్ని ఎలా వివరిస్తున్నాడో చూడండి. ప్రపంచంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాదు కదా మనం చేయవలసింది. కేవలం కన్నీళ్లనే చిందించి అసహాయంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాలా. నవ్వులపై ఆనందాలపై మనకు హక్కు లేదా? ఇక్కడ హక్కు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ సాహిర్ చేసే మాయ ఏంటంటే, ఎంత నిస్సహాయతతో కొట్టుకుంటున్న వ్యక్తి కూడా పై వివరణతో నాకు కేవలం కన్నీళ్ళేనా, ఆనందంగా బతికే హక్కు లేదా అని ఆలోచిస్తాడు. చనిపోవాలనుకునే వ్యక్తి ఆ నిర్ణయానికి రావడానికి కారణం అతను బలహీనపడడం, తనలోని శక్తిని మరచిపోవడం. అలాంటి వ్యక్తికి కూడా తనకూ ఈ ప్రపంచంలో ఆనందంగా జీవించే హక్కు ఉందని దాన్ని మరచిపోవద్దని సాహిర్ చెబుతూ ఆ బలహీన వ్యక్తిని శక్తిమంతుడిగా మారుస్తున్నాడు. మన హక్కులు మనం గుర్తించగలిగినప్పుడే పోరాడే శక్తి, దాని పట్ల ఆలోచన మనలో కలుగుతాయి. సాహిర్ ఇక్కడ చేస్తున్న పని అదే బలహీనుడు తాను బలహీనుడినని ఒప్పుకోవడమే అతని వినాశనానికి కారణం. నాకూ కొన్ని హక్కులున్నాయి అని అతను నమ్మినప్పుడే పోరాడడానికి సిద్ధపడతాడు. అన్నీ వదిలి చనిపోవాలనుకునే వ్యక్తికి అతని హక్కులు తెలియపరిచి పోరాటం వైపుకు అతని దృష్టిని సారింపజేయడం ఇక్కడ సాహిర్ అనే మానసిక విశ్లేషకుడు చేస్తున్న పని. బలహీనులను బలవంతులుగా మార్చే పద్ధతి ముమ్మాటికి ఇదే కదా..

ఆ కోయీ మిల్కే తద్బీర్ సోచే

సుఖ్ కే సపనోం కీ తాబీర్ సోచే

జో తేరా హై వహీ గమ్ హై మేరా

కిస్కే రోకే రుకా హై సవేరా

ఈ వాక్యాలంటే నాకు చాలా ఇష్టం. ఇంత కన్నా మానవీయ తోడు మరొకటి కనిపించదు. ఎవరి సమస్యనూ ఎవరూ తీర్చలేరు. అది నిజం. ఎవరి కష్టాలను వారే అనుభవించాలి. మరి అలాంటప్పుడు మరో వ్యక్తి ఆ వ్యక్తికి కష్టకాలంలో ఎలా తోడ్పాటుని ఇవ్వగలడు? ఉచిత సలహాలిస్తూ తన ఆధిక్యతను చాటుకుంటూ మాత్రం కాదు. అతని చేయి పట్టుకుని పద మనం కూర్చుని కలిసి ఆలోచించుకుందాం. ఆనందంగా ఉండడానికి ఏం కావాలో చర్చించుకుందాం. ఇలాంటి పరిస్థితుల నుండి బైటపడే ప్రత్యాయమానాలను వెతుకుదాం. ఈ వెతుకులాటలో నీవు ఒంటరివి కాదు. నేనూ నీతో పాటు కూర్చుని ఆలోచిస్తాను. నీ బాధ నా బాధ కూడా, ఎవరు ఆపినా ఉదయం రాకపోదు. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం. కలిసి ఈ కష్టాలను ఎదుర్కొందాం. ఎంత శక్తిని ఇచ్చే మాటలు ఇవి.

కష్టాలలో కూరుకుపోయిన వ్యక్తి చేయి పట్టుకుని కలిసి ఆలోచిద్దాం అని చెప్పగల మైత్రి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇక మరణం గురించి ఆలోచిస్తాడా. ఆ చేయి ఇచ్చిన ఆసరాతో ఆలోచించడం మొదలెడతాడు. ఆ ఆలోచనా క్రమంలో తోచిన ప్రత్యామ్నాయాలను చర్చిస్తాడు. మరణం వైపు నుండి సమస్యను ఎదుర్కునే మార్గాన్వేషణ వైపుకు వస్తాడు. అంటే చావు ఆలోచన నుండి బతుకు వైపుకు అతను మరలుతున్నాడు. పైగా ఈ ప్రయాణంలో తనతో ఓ తోడు ఉన్నదన్న ఆలోచన ఇచ్చే బలంతో అతను జీవితాన్ని ఎదుర్కోవడానికి సిద్దపడుతున్నాడు.

మన జీవితంలో ఎన్నో సార్లు మనమూ జీవితాని ముగిద్దాం అని అనుకుని ఉండవచ్చు. కాని ఆ పరిస్థితులలో ఆ ప్రయాణంలో మనల్ని చూసి నవ్వక, మనలోని లోపాలను ఎంచక, దెప్పక, అవమానించక, మన సంఘర్షణను గౌరవిస్తూ మనం పోగొట్టుకున్న శక్తిని మనకు అందిస్తూ తోడుగా నిలిచే నేస్తం కోసం చేసే ఆక్రందన కదా ఆత్మహత్యా ఆలోచన. ఆ ఆలోచనను అర్థం చేసుకుని తోడుగా నిలిచే గీతం ఇది. ఎంతో శక్తినీ ఉత్సాహాన్ని జీవితం పట్ల అవగాహనను కలిగించే ఈ గీతం సాహిర్ ఒక మానసిక విశ్లేషకునిగా చిత్రించాడు. దీని పట్ల ఏ మాత్రం సందేహం ఉన్నా దీన్ని ఓ మానసిక వైద్యునికి వినిపించండి. కౌన్సలింగ్ ప్రక్రియలో నిష్ణాతులు ఉపయోగించే శైలిని ఓ కవి ఎలా కవితగా మలచగలిగాడో విని ఆశ్చర్యపోతారు. సాహిర్ లోని ఆ మానసిక పరిపక్వత, సంభాషణను ప్రభావంతంగా అర్ధవంతంగా నెరవేర్చగల నైపుణ్యాన్ని గమనిస్తే కవి తన శైలిలో పరిపక్వత సాధిస్తే ఎంతమందికి మార్గదర్శకత్వం నెరవేర్చగలడో అర్థం అవుతుంది. అందుకే సినీ కవిత్వంలో సాహిర్‌ని అనుభవించినవారి జీవితం అపారమైన శక్తితో నిండిపోతుంది.

రాత్ భర్ కా హై మెహమాన్ అంధేరా

కిస్కె రోకే రుకా హై సవేరా

ఈ వాక్యాలు అందుకే ఎంతో శక్తిమంతమైనవి. ఈ పాటను పాడిన రఫీ గానంలో నుంచి మనకు చేరే ఆ దగ్గరితనం, ఎంత బావుంటుందో.. ఈ పాటను జీవితపు చీకటి దారుల్లో విని తీరాలి. ఇది అందించే స్ఫూర్తిని అనుభవించాలి. అప్పుడు అర్థమవుతాడు సాహిర్. సామాజిక స్పృహ నిండిన ఒక కవిగా, పరిపక్వత కలిగిన ఓ మనిషిగా.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version