[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘లైట్ హౌస్’ (Light House, 1958) చిత్రం లోని ‘తంగ్ ఆ చుకే హై’. గానం ఆశా భోస్లే. సంగీతం ఎన్. దత్త.
~
ఒక కవి రాసిన ఒకే కవితను రెండు సినిమాలలో రెండు భిన్నమైన సందర్భాలలో స్త్రీ, పురుష పాత్రలిద్దరి చేత పాడించి ఆ పాటను హిట్ చేసిన సందర్భాలు మరే సినీ కవి జీవితంలో ఉన్నాయో లేదో తెలీదు కాని సాహిర్ లుధియాన్వి సినీ జీవితంలో ఇది జరిగిన సందర్భాలు అనేకం. ఆయన పాటలలోని సాకిలను వివిధ సందర్భాలలో భిన్నమైన సందర్భాలలో భిన్నమైన సినిమాలలో వాడుకోవడం చాలా సార్లు జరిగింది. కాని ఆయన రాసిన ఒక గజల్‌ను రెండు భిన్నమైన సందర్భాలలో గురు దత్ ‘ప్యాసా’ సినిమాలోనూ నూతన్‌పై ‘లైట్ హౌస్’ అనే చిత్రంలోనూ ఉపయోగించుకున్నారు. సాహిర్ రాసిన పూర్తి గజల్‌లో కొన్ని చరణాలు ఒక సినిమాకి మరొకొన్ని చరణాలు మరో సినిమాకి వాడుకుని ఆ రెండు సందర్భాలలోనూ ఆ పాటను హిట్ చేసారు సంగీత దర్శకులు. ఇది సాహిర్ సాహిత్యానికి దక్కిన అరుదైన గౌరవం. తన కవిత్వ పదును తెలుసు కాబట్టే ఆయన తన స్వీయ విద్వత్తును తప్ప ఏ గాయకుడినీ, సంగీత దర్శకుడినీ నమ్ముకోలేదు. ఎవరికీ లొంగకుండా సినీ ప్రపంచంలో అందరినీ తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నారు తప్ప తానుగా ఎవరి ప్రాపకం కోసం ప్రయత్నించలేదు. అత్యంత ఆత్మవిశ్వాసంతో జీవించినందువల్ల ఆయనను వ్యక్తిగా చాలా మంది ఇష్టపడేవారు కాదు. అలాగే ఆయనను విస్మరించగలిగే వాళ్లు కూడా కాదు. సినీ ప్రపంచానికి నాతో అవసరం కాని నాకు మీతో కాదు అన్నట్లుగానే జీవిస్తూ ఆయన చివరి దాకా సినీ కవిగా కొనసాగగలిగారు.
ఇప్పుడు మనం చర్చించుకోబోయే పాట ‘తంగ్ ఆ చుకే హై కష్మకషే జిందగీ సే హమ్’ అనే వాక్యంతో మొదలయ్యే సాహిర్ గజల్. దీన్ని ‘ప్యాసా’ సినిమా కోసం ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో రఫీ పాడితే, లైట్ హౌస్ సినిమాకు ఎన్. దత్తా సంగీత దర్శకత్వంలో ఆశా భోస్లే పాడారు. ఈ కవిత గురు దత్‌కు ఎంతగా నచ్చిందంటే ప్యాసా సినిమాకు ముందుగా కష్మకష్ అనే పేరునే ఆయన ఖరారు చేసుకున్నారు. మనం లైట్ హౌస్ సినిమాలో ఆశా గానం చేసిన కవితను ఇక్కడ చర్చించుకుందాం.
లైట్ హౌస్ ప్యాసా వచ్చిన సంవత్సరానికి రిలీజ్ అయ్యింది. అంటే ప్రజలు రఫీ గొంతులో విన్న కవితను మర్చిపోకపోముందే మళ్ళీ ఆశా అదే కవితను మరో రకంగా, వేరే చరణాలతో గానం చేసింది. రెండు సందర్భాలలోనూ ఈ పాట శ్రోతలకు నచ్చింది. ఇది మరే కవి విషయంలోనూ జరిగి ఉండదు. హిందీ సినిమాలలో సాహిర్ ఒక్కరే ఇలాంటి ప్రయోగాలను చేసి తన సత్తా చాటుకున్నారు. ఒక సినిమాలో వాడుకున్న హిట్ పాటను వెంటనే మరో సినిమాలలో అంతే గంభీరమైన సందర్భంలో వాడుకోవడం, రెండు సందర్భాలలోను ఆ పాటను శ్రోతలు మెచ్చడం గమనిస్తే సాహిర్ కలం పదును అర్థం అవుతుంది.
తంగ్ ఆ చుకే హై కష్మకష్ – ఎ – జిందగీ సే హమ్
ఠుకరా న దే జహాన్ కొ కహీన్ బేదిలీ సే హమ్
తంగ్ ఆ చుకే
(ఈ జీవిత సందిగ్ధతతో విసిగిపోయాను. ఈ ప్రపంచాన్ని గాయపడ్డ హృదయంతో తిరస్కరిస్తానేమో నేను)
కష్మకష్ – ప్రస్తుత సమాజంలో మనిషి జీవన విధానాన్ని వివరించే గొప్ప పదం. సందిగ్ధ స్థితిలోనే జీవితాన్ని పూర్తిగా గడపవలసి రావడం మనసున్న, ఆలోచించగల వ్యక్తికి నరకప్రాయం. ఆ స్థితికి చేరాక ఈ ప్రపంచం అవసరమా అన్న ఆలోచన మనిషికి వచ్చి చేరుతుంది. అందుకే ఇక్కడ కవి నేను గాయపడ్డ హృదయంతో ఈ ప్రపంచాన్నితిరస్కరించవచ్చు అని తనకు ఈ ప్రపంచానికి నడుమ ఏర్పడుతున్న దూరాన్ని తెలియజేస్తున్నాడు.
లో ఆజ్ హమ్నే తోడ్ దియా రిష్తా – ఎ – ఉమ్మీద్
లో అబ్ కభీ గిలా నా కరేంగే కిసీ సే హమ్
ఠుకరా న దే జహా కొ కహీ బేదిలీ సే హమ్
తంగ్ ఆ చుకే
(నేను అన్ని బంధాలపై నమ్మకాన్ని విరిచేసాను. ఇక ఇప్పుడు ఎవరిపైనా నేను ఫిర్యాదులు చేయను. ఈ ప్రపంచాన్ని గాయపడ్డ హృదయంతో తిరస్కరిస్తానేమో నేను. విసిగిపోయాను మరి)
మనకు చుట్టూ ఉన్న బంధాలపై కొన్ని ఆశలు, కోరికలు, అంచనాలు ఉన్నప్పుడే, అవి విఫలమయినప్పుడు మనసుకు బాధ కలుగుతుంది. అందుకే నేను అన్ని రకాల బంధనాల నుండి విముక్తుడవడానికి, వాటిని మనసులోనే విరిచేసాను. ఇక ఎవరిపై ఫిర్యాదు చేసే అవసరం నాకు రాకపోవచ్చు. ఏ ఫిర్యాదు అయినా సంబంధం ఉన్న మనుషులతోనే చేస్తాం. ఏ బంధమూ లేకపోతే అందరూ పరాయివారే కదా. పరాయివారి నడుమ ఫిర్యాదులవసరం ఏం ఉంది.
ఈ వాక్యాలు నాకు చాలా ఇష్టం. ఇందులో వైరాగ్యం ఉంది అలాగే ఒక తాత్వికత కూడా ఉంది. ఈ ప్రపంచం నుండి మనల్ని మనం కొంచెం కొంచెంగా విడదీసుకుంటే తప్ప మనసుకు ప్రశాంతత చిక్కదు. ఎన్ని బంధాలలో మునిగి ఉంటామో అన్ని గాయాలను మనసు మోయవలసిందే. అందుకే రమణ మహర్షి నుండి అరబిందో దాకా నిన్ను నువ్వు అర్థం చేసుకుని నీకు నువ్వుగా ఈ ప్రాపంచిక బంధాల నుండి విముక్తి వైపుకు ప్రయాణించాలని చెప్తారు. సాహిర్ కలం కూడా దీన్నే ఎన్నో సార్లు ఎన్నో సందర్భాలలో చాలా పదునుగా ప్రస్తావించింది.
గర్ జిందగీ మె మిల్ గయే ఫిర్ ఇత్తఫాక్ సే
పూఛేంగే అప్నా హాల్ తేరీ బేబసీ సే హమ్
ఠుకరా న దే జహా కొ కహీ బేదిలీ సే హమ్
తంగ్ ఆ చుకే
(జీవితంలో ఎప్పుడన్నా మళ్ళీ యాదృచ్ఛికంగా కలిస్తే, నీ నిస్సహాయతను నా పరిస్థితి గురించి అడుగుతాను. ఈ ప్రపంచాన్ని గాయపడ్డ హృదయంతో తిరస్కరిస్తానేమో నేను విసిగిపోయి ఉన్నాను.)
ఈ మొత్తం కవితలో ఈ చరణంలోని పై రెండు వాక్యాలు ప్రత్యేకంగా సాహిర్ వ్యక్తిత్వాన్ని ప్రస్తావిస్తాయి. సాహిర్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే అతి నిస్సహాయ స్థితిలో కూడా మానవత్వాన్ని, మనిషితనాన్ని కోల్పోకపోవడం. అదే ఆయన కవిత్వంలోని బలం. అన్ని బంధాలపై నమ్మకాన్ని వదులుకుంటున్నానని అంటూనే తన మనసులోని ప్రేమతత్వాన్ని ఏ సందర్భంలోనూ దూరం చేసుకోడు సాహిర్. ఏ బంధం నుండి ఆశించిన ప్రేమ దొరకకపోయినా, దానివల్ల మనసుకెంత గాయం అయి ఒంటరితనం తప్పకపోయినా, తనను అన్ని విధాలుగానూ నిరాశపరిచిన వారు నిస్సహాయిలయి ఉంటారని, వారికి సంబంధించిన సమస్యలు, వారి ప్రాధాన్యతల విషయంలో వాళ్లలోని అలజడి ఉండి ఉంటుదని ప్రకటిస్తాడు. మనకు దూరం అయిన వారిపై కోపం కన్నా జాలి కలిగి ఉండడం, వాళ్లను దాటి ఎదగడమే కదా. వారిని నిస్సహాయులుగా చూడగలగడం సాహిర్ లోని అనంతమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. మోసం చేస్తున్నవాళ్లు, దూరం అవుతున్న వాళ్లు నిస్సహాయులని ఒప్పుకోవడంలో తనను వారి కన్నా మానసికంగా ఉన్నత స్థాయిలో నిలుపుకోవడం సాహిర్‌కు తనపై ఉన్న విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. ఈ విశ్వాసాన్ని ఎంతటి విషాదంలో కూడా వదులుకోక దాన్ని తన పాత్రలకు ఆపాదించడంతో ఆ పాత్రల నైతిక స్థాయిలో ఎంతో మార్పు వస్తుంది. సాహిర్ పాటలని వినే వాళ్ల ఆ వ్యక్తిత్వానికి విశ్వాసానికి దాసోహం అవుతారు.
ఆ పై చరణంలో ఎప్పుడో యాదృచ్ఛికంగా మళ్ళీ మనం కలిస్తే నీ నిస్సహాయతనే నా క్షేమాన్నిగురించి, నేలాగున్నానో అడుగుతాను అంటూ సాహిర్ తన జీవితపు విషాదానికి అవతలి వారే కారణం అని ప్రకటిస్తూనే, వారి నిస్సహాయతను తాను గుర్తించానని, తన ప్రశ్న వ్యక్తులకు కాదు వారి స్థితిగతులు, ఆలోచనా విధానంపై అంటూ తనలోని ఆ మానసిక పరిపక్వతను చూపుతారు. ఏ దుఖాన్ని అయినా సామాజికంగా చూడడం సాహిర్ నైజం. అదే ఆతన్ని ఓ విశిష్ట కవిగా నిలబెట్టింది.
ఓ ఆస్మాన్ వాలే కభీ తో నిగాహ్ కర్
అబ్ తక్ యె జుల్మ్ సహతే రహే ఖామేషీ సే హమ్
ఠుకరా న దే జహా కొ కహీ బేదిలీ సే హమ్
తంగ్ ఆ చుకే
(ఓ ఆకాశంలో ఉన్నవాడా ఎప్పుడో ఒకసారన్నా ఇటువైపు దృష్టి సారించు. ఇప్పటిదాకా ఈ అన్యాయాలను మౌనంగా నేను భరిస్తూ వచ్చాను. ఈ ప్రపంచాన్ని గాయపడ్డ హృదయంతో తిరస్కరిస్తానేమో నేను, విసిగిపోయాను)
చాలా సందర్భాలలో దేవుడిని ప్రస్తావించేటప్పుడు రకరకాల పదాలను వాడతారు. భగవాన్, దాతా, ఈశ్వర్ అలాగే ఉర్దూ పదాలను ఉపయోగించేటప్పుడు ఖుదా, పర్వర్దిగార్ లాంటి పదాలను కవులు ఉపయోగిస్తారు. ఈ పర్యాయపదాలన్నిటిలోనూ ఓ లోతు ఉంటుంది. అందుకే కవిత్వంలో ఒకే వస్తువును సంభోధించడానికి రకరకాల పదాలను ఉపయోగిస్తారు కవులు. ఇక్కడ ఆ దేవుడు తనని పట్టించుకోవట్లేదన్న కోపం, నిస్సహాయతను కవి పలికించాలి. దానికి ‘ఆస్మాన్ వాలే’ అన్న పదం చాలా గొప్పగా సరిపోయింది. అంటే అంత దూరాన ఉన్న దేవుడు అని అర్థం, దేవునికి తనపై కృప లేదని, ఆయనని తనకు మధ్య చాలా దూరం ఉందని ఓ నిష్ఠూరం కూడా ధ్వనింపచేయడానికి ఇక్కడ ఆస్మాన్ వాలే అన్న పదాన్ని సాహిర్ ఉపయోగిస్తారు. చాలా సందర్భాలలో ఆయన దేవుడికి ఆస్మాన్ వాలే అన్న పదాన్ని ఉపయోగించడం గమనించవచ్చు.
“అరే ఓ ఆస్మాన్ వాలే బతా ఇస్మే బురా క్యా హై
ఖుషీ కే చార్ ఝోంకే గర్ ఇధర్ సే భీ గుజర్ జాయే” అంటూ ఓ పాటలో దేవుడిని ప్రశ్నించగలగడం సాహిర్‌కే చెల్లింది.
“ఆస్మాన్ పే హై ఖుదా ఔర్ జమీన్ పే హమ్
ఆజ్ కల్ వో ఇస్ తరఫ్ దేఖతా హై కమ్” అంటూ మరో సందర్భంలో ఆ పైవాడిపై చలోక్తులు విసరడం సాహిర్ శైలి..
“బతా ఐ ఆస్మాన్ వాలే తేరే బందే కిధర్ జాయే” అంటూ మరో పాటలో ఆ దేవుడిని ప్రశ్నించారు సాహిర్.. అన్ని సందర్భాలలోనూ ఆ పైవాడికి తనకూ మధ్య పెరుగుతున్న దూరాన్ని ఎత్తు చూపడం ఆయన ఉద్దేశం,
అదే బాటలో ఇక్కడ ఓ పైనున్న వాడా ఎప్పుడో ఒక్క సారన్నా ఇటువైపు దృష్టి సారించవచ్చు కదా. నేను ఇంత కాలం మౌనంగా అన్ని అన్యాయాలను భరిస్తూనే వచ్చాను. ఇక నాకు ఓపిక నశించింది. ఈ భారం నా వల్ల కాదు అని స్పష్టంగా తన కోపాన్ని అసహాయతను కవి ఇక్కడ ప్రకటిస్తున్నారు.
తంగ్ ఆ చుకే హై కష్మకష్ – ఎ – జిందగీ సే హమ్
ఠుకరా న దే జహా కొ కహీ బేదిలీ సే హమ్
తంగ్ ఆ చుకే
(ఈ జీవిత సందిగ్దతతో విసిగిపోయాను.ఈ ప్రపంచాన్ని గాయపడ్డ హృదయంతో తిరస్కరిస్తానేమో నేను. విసిగిపోయాను మరి)..
ఈ పాటను ఇక్కడ స్త్రీ సందర్భంలో ఉపయోగించుకున్నారు దర్శకులు. సాహిర్ ఎక్కువగా మనుషుల భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే పాటలను రాసారు. అందుకే వాటికి లింగ భేదం ఉండదు. మనసుకు లింగ బేధం ఉండదని నమ్మిన కవి అతను. ఆయన పాటలన్నీ ఓ మనసు వ్యక్తీకరించే భావాలు మాత్రమే. అందుకే ఈయన గీతాలను యధాతథంగా స్త్రీ పాత్రలకు పురుష పాత్రలకూ కూడా ఉపయోగించుకునేవారు సినీ దర్శకులు. సాహిర్ గీతాలు మానవ భావోద్వేగాలకు ప్రతీకలు. ఆఖరికి శృంగార గీతాలలో కూడా లింగ భేదాన్ని తన పదాలకు అంటించని కవి సాహిర్.
గర్ జిందగీ మె మిల్ గయే ఫిర్ ఇత్తఫాక్ సే
పూఛేంగే అప్నా హాల్ తేరీ బేబసీ సే హమ్..
మనమూ ఇంత విశ్వాసంతో మన చుట్టూ ఉన్నవారితో సంభాషించగలిగితే, జీవితంలో అన్ని విషాదాలకు అతీతంగా ఎదిగినట్లే కదా..
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)