[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘హౌస్ నెం. 44’ (House No.44, 1955) చిత్రం లోని ‘ఫైలీ హుయీ హై సపనోం కీ బాహే’. గానం లతా మంగేష్కర్. సంగీతం ఎస్. డి. బర్మన్.
~
ప్రపంచంలోని కుళ్ళు కుతంత్రాలు, మానవ జీవితాలలోని స్వార్ధం, మానవ సంబంధాలలోని కుత్సితం, జీవితం పట్ల అవగాహన, తాత్వికత ఇవన్నీ సాహిర్ పాటలలోని కథా వస్తువులు. ఆయన జీవితంలోని కఠిన వాస్తవాలను అందమైన పాటల్లో బైట పెట్టడంలో దిట్ట. అంటే దుఃఖాన్ని, ద్రోహాన్ని, పీడిత ప్రపంచాన్ని గేయవస్తువుగా తీసుకుని రచనలు చేసిన కవి. అందుకని లలితమైన ఆనందమైన ప్రేమ గీతాలు, ఆయన రాయలేదనుకుంటే సాహిర్‌ని పూర్తిగా అర్థం చేసుకోలేనట్లే.
సాహిర్ అంటే ఉర్దూలో మాంత్రికుడు. ఎలాంటి ప్రపంచాన్ని అయినా సృష్టించి ఒప్పించే నైపుణ్యం ఉన్న వ్యక్తి. కన్నె పిల్లల కలల ప్రపంచాన్ని ప్రేమ కోసం ప్రేమికుని కోసం ఆ హృదయాల ఎదురు చూపులను ఆయన తన కవిత్వంలో ప్రదర్శించిన తీరు చూస్తే “జలాదో ఇసే ఫూంక్ డాలో ఏ దునియా” అంటూ గళమెత్తిన కవి ఇతనేనా అనిపించకమానదు. సాహిర్‌లో ఓ సున్నితమైన ప్రేమికుడూ ఉన్నాడు. ఆయన రాసిన ప్రేమ గీతాలలోకి మాధుర్యానికి ఆయనను ప్రేమించకుండా ఉండలేం. ఆ ప్రేమ ప్రపంచం ఎంత మనోహరంగా ఉంటుందంటే ఆ ప్రపంచాన్ని సాహిర్ లాంటి వాస్తవిక కవి ఎలా దర్శించాడు, ఎలా దాన్ని ఊహించాడు అన్నది అర్థం కాదు. మరి ఆ పాటలు ఏదో మొక్కుబడిగా రాసినట్లు రాయడు సాహిర్. పూర్తి మనసుతో ఆ ప్రపంచంలో లీనమై పదాలతో ఇంద్రజాలాన్ని సృష్టిస్తాడు. ఉదాహరణకు ‘హౌస్ నం. 44’ కోసం ఆయన రాసిన ‘ఫైలీ హుయీ హై’ అన్న పాటను చూడండి. ఇది విన్న ప్రతి వాళ్లు ఇంధ్రదనస్సుకు ఆవల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతికి గురి అవుతారు.
ఫైలీ హుయీ హై సపనోం కీ బాహే
ఆజా చల్ దే కహీ దూర్
వహీ మేరి మంజిల్ వహీ తేరీ రాహే
ఆజా చల్ దే కహీ దూర్ (2)
(కలల బాహువులు వ్యాపించి ఉన్నాయి. రా ఎటైనా దూరం వెళ్లిపోదాం. అదే నా గమ్యం అదే నీ దారి రా ఎటైనా వెళ్ళిపోదాం)
ఆమె కలల ప్రపంచం రెక్కలు తెరుచుకుని స్వాగతం పలుకుతుంది. ఆమె కలలు అనంత విశ్వంలోకి వ్యాపించి ఉన్నాయి. అందుకని ఆ వాస్తవిక ప్రపంచం నుండి కలిసి సుదూరానికి వెళ్లిపోదాం అని ఆమె అతన్ని పిలుస్తుంది. పైగా అదే నా గమ్యం, అదే నీ దారి కూడా అని అతన్ని ఆహ్వానిస్తుంది. అంటే తన గమ్యం వైపుకి సాగే ప్రయాణంలో అతని తోడు కోరుకుంటుంది. నీ దారి కూడా అటుకే సుమా అందుకే కలిసి ప్రయాణం చేద్దాం అని ఆమె అతని, అతని ద్వారా తనలోని ప్రేమకు స్వాగతాన్ని పలుకుతుంది.
ప్రేమ అంటే గమ్యం వైపుకు సాగే ప్రయాణం. దీన్ని ఎంత అందంగా చెప్తున్నాడో సాహిర్. వహీ మేరీ మంజిల్ వహీ తేరి రాహే అన్న వాక్యం ఈ చరణంలో ఎంత నిజాయితీతో ధ్వనిస్తుందంటే ఆమెలోని ఆ ప్రేమ భావనకు మైమర్చకుండా ఉండలేరు శ్రోతలు.
ఊదీ ఘటా కే సాయే తలె ఛిప్ జాయే
ధుంధలీ ఫిజా మె కుఛ్ ఖోయె కుఛ్ పాయే
ఊదీ ఘటా కే
ఊదీ ఘటా కే సాయే తలె ఛిప్ జాయే
ధుంధలీ ఫిజా మె కుఛ్ ఖోయె కుఛ్ పాయే
సాంసోం కీ లయ్ పర్ కోయీ ఐసీ ధున్ గాయే
దేదే జొ దిల్ కో దిల్ కీ పనాహే
ఆజా చల్ దే కహీ దూర్
ఫైలీ హుయీ హై సపనోం కీ బాహే
ఆజా చల్ దే కహీ దూర్
(ఊదా రంగు మేఘాల నీడలో దాగుదాం. ఆ మంచు కప్పిన వాతావరణంలో ఏదో పోగొట్టుకుందాం. ఏదో తిరిగి పొందుదాం. మన ఊపిరులే లయగా ఏదైనా ఒక రాగాన్ని ఆలాపిద్దాం. మనసుకు మనసు ఆశ్రయం ఇచ్చే సుదూర తీరాలకు వెళ్దాం. కలల బాహువులు వ్యాపించి ఉన్నాయి. రా ఎటైనా దూరం వెళ్లిపోదాం. అదే నా గమ్యం అదే నీ దారి రా ఎటైనా వెళ్ళిపోదాం)
ఇక్కడ సాహిర్ గొప్పతనం భాషా ప్రావీణ్యాన్ని గమనించాలి. సాహిర్ ఉర్దూ కవి. ఉర్దూలో కవిత్వాన్ని రాసే కవి. కాని ఆయనకు హిందీ భాషలోని ప్రావీణ్యం ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు. చాలా మంది హిందీ భాషలో ప్రవీణులు కూడా ఆ ప్రాంతంలోని నానుడులను అర్థం చేసుకోలేరు. కాని సాహిర్ వాటిని సందర్భోచితంగా తన కవిత్వంలో చొప్పించగల దిట్ట. ఊదీ ఘటా అన్న పదాన్ని సాహిర్ సందర్భోచితంగా అత్యద్భుతంగా వాడతాడు.
జాల్ సినిమాలో యే రాత్ యే చాంద్నీ ఫిర్ కహాన్ అన్న లతా పాటలో ‘భీగీ హవా, ఊదీ ఘటా/ కహెతీ హై తేరి కహానీ’ అంటాడు సాహిర్. ఆ సందర్భంలో నాయిక నాయకుడి కోసం వేదనతో పాడుతూంటుంది. కాబట్టి ఊదీ ఘటా అంటే, ఊదారంగు మేఘాలు, విషాదాన్ని సూచిస్తాయి. గాలులు, మేఘాలు, అతని కథను చెప్తూ ఆమె వేదనను మరింత పెంచుతున్నాయి. ఘర్ నంబర్ 44 సినిమాలో నాయిక ఆనందంగా కలకంటూంటుంది. ఈ సందర్భంలో ఊదారంగు మేఘాలు ఆనందాన్ని సంతోషాన్ని సూచిస్తాయి. ఊదా రంగు అధ్యాత్మికానందానికి ప్రతీక. ఇక్కడ సాహిర్, ఊదా రంగు మేఘాల నీడలో వొదుగుదామని ఆమె అనటాన్ని, అత్యంత ఆనందంగా జీవితం గడుపుదాం అని అంటున్నట్టు భావించవచ్చు. వారిద్దరూ, పేదవారు. కాబట్టి, ఆనందపు మేఘం నీడలో దాగుదామని ఆమె అంటున్నది.
ఈ పాట మొత్తం కూడా పూర్తి హిందీ భాషలో ఉంది. పైగా లోతైన అర్థంతో జన జీవినంలో ఉపయోగించే నానుడితో జతపరిచి అందించిన కవిత్వం ఇది. అందుకే సాహిర్ పాటలను వినే వారికి ఇది ఒక అపురూపమైన గీతం.
పర్వత శిఖరాల మధ్య అందమైన ప్రకృతి నడుమ ఆమె ఆనంత ఆకాశం వైపుకు చూస్తూ ఆ అనంతమైన ప్రకృతిలో మైమరిచిపోతూ ఈ పాట ఆలాపిస్తుంది. దూరంగా కనిపించే ఎత్తైన హిమ పర్వతాల వెనుక ఈ ప్రపంచాన్ని వీడి తనకు ప్రేమను అందించే వ్యక్తితో కలిసి దాక్కుండి పోవాలని, తనదైన ప్రపంచాన్ని అనుభవించాలని ఆమె కోరుకుంటుంది. ప్రేమ అంటే మనల్ని కొంచేం కొంచెంగా పోగొట్టుకుంటూ కొంచెం కొంచెంగా అవతలివారిని పొందడం, మనలను ఇచ్చుకుంటూ అవతలి వారిని స్వీకరించడం. ప్రేమలో పొందటం, పోగొట్టుకోవటం, ఉర్దూ షాయరీలో అత్యధికంగా వాడతారు. ‘ఖుద్ కో ఖో కర్ తుఝ్ కో పాయా, క్యా మేరీ తఖ్దీర్ హై’ అంటాడొక కవి. తనని తాను కోల్పోయాడు. కానీ, ఆమెను పొందాడు. ఇక్కడ ప్రేమలో వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా తమని కోల్పోతారు. కానీ, ఇద్దరూ కలసి నూతన సంయుక్త వ్యక్తిత్వాన్ని పొందుతారు.
ఆ సందర్భాన్ని ఇక్కడ సాహిర్ పొగమంచుతోనూ మబ్బులతోనూ నిండిన ఆకాశంలోకి ప్రయాణిస్తూ కొద్ది కొద్దిగా తనని తాను పోగొట్టుకుంటూ మళ్లీ ఆ అనంతమైన ప్రేమను ప్రేమికుడిని కొంచెం కొంచెంగా పొందడం గురించి ఎంత అందంగా ప్రస్తావిస్తున్నాడో చూడండి. అద్భుతమైన భావపరంపర ఇది. పైగా తమ ఊపిరులనే లయగా చేసుకుని అందమైన పాటను రాగయుక్తంగా పాడుకోవాలన్నది ఆమె కోరిక. ఎంత అద్భుతమైన భావావేశమో కదా ఇది. తాము నడిచే దారిలో ఒకరికి మరొకరు ఆసరాగా మారాలని, ఒక మనసు మరొక మనసుకు ఆశ్రయం కావాలన్నది ఆమె కోరిక. ఒకరి మనసులో ఒకరం ఉండిపోవాలి. అంతకు మించిన ఆసరా జీవితంలో ఇంకేం ఉంటుంది. అలాంటి సంగమం దిశగా మనం ప్రయాణిద్దాం అంటూ ఆమె అతనికి ఆహ్వానం పలుకుతుంది.
ఝూలా ధనక్ కా ధీరే ధీరే హమ్ ఝూలే
అంబర్ తో క్యా హై తారోం కె భీ లబ్ ఛూలే
ఝూలా ధనక్ కా
ఝూలా ధనక్ కా ధీరే ధీరే హమ్ ఝూలే
అంబర్ తో క్యా హై తారోం కె భీ లబ్ ఛూలే
మస్తీ మే ఝూమె ఔర్ సారె గమ్ భూలే
పీఛే నా దేఖే ముడ్కే నిగాహే
ఆజా చల్ దే కహీ దూర్
(ఇంద్రధనుస్సే ఊయలగా చేసుకుని మనం మెల్లి మిల్లిగా ఊగుదాం. ఆకాశం ఏంటీ, తారల పెదవులనే ముద్దాడుదాం. ఆనందంగా నాట్యం చేస్తూ అన్ని బాధలను మర్చిపోదాం. మనం మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాకుండా పద ఎటైనా దూరంగా వెళ్లిపోదాం)
ఆకాశంలోకి ఆ ఏడు రంగుల ఇంధ్రధనస్సునే ఊయలగా చేసుకుని ఊగుదాం అంటుంది ఆమె. ఎంత అందమైన కల. ఇది వాస్తవ ప్రపంచానికి ఎంత దూరంగా తీసుకెళ్ళే భావపరంపర. సాహిర్ ఇలాంటీ ఊహాత్మక ప్రపంచాన్ని ఇంత అందంగా ఎలా సృష్టించగలిగాడు అన్నది నాకు అర్థం కాదు. అతని కఠినమైన జీవన సత్యాలను పాటలలో విని అతనిపై ఓ అభిప్రాయం ఏర్పరుచుకున్న వారి ఆలోచనలలు పటాపంచలు చేసే అద్భుతమైన గీతం ఇది. కవి ఓ కలల ప్రపంచాన్ని సృష్టించగలడు. కాని అది సాహిర్ కూడా చేయగలిగాడా అదీ ఇంత కన్విన్సింగ్‌గా అన్నది నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే. “ఆస్మాన్ పే హై ఖుదా ఔర్ జమీన్ పే హం, ఆజ్ కల్ వో ఇస్ తరఫ్ దేఖ్తా హై కం” అంటూ ఆకాశం వైపుకు చూసే సాహిర్, ఆ ఆకాశంలోని ఇంధ్రదనుస్సును చూస్తూ దానిపై ఊగాలనే ఓ అమాయకపు అందమైన ఆలోచనను, వ్యక్తీకరించగలడని సాహిర్ గంభీరమైన పాటలను విన్నవాళ్ళెవరూ ఊహించని కోణం. పైగా ఏదో సినిమా కోసం మొక్కుబడిగా రాసినట్లు కాకుండా అలాంటి ఓ ప్రపంచంలోకి మనల్ని కాసేపు విహరింప చేసాడు ఈ పాటతో.
అలాగే ఇక్కడ ఇంధ్రధనస్సుకి ధనక్ అనే పదాన్ని వాడాడు. ఇది కూడా పూర్తిగా దేశీయ పదం. ఒక ఉర్దూ కవి శుద్ధమైన హిందీలో ఎంత అందంగా ప్రేమగీతాన్ని రాసాడో గమనించండీ. అప్పుడు ఈ పూర్తి గీతంలోని మాధుర్యం వెనుక ఓ కవి గొప్పతనం అర్థం అవుతుంది.
ఈ పాటలో ఆమె ఆకాశాన్నే కాదు అది దాటి తారలను ముద్దాడదాం అంటుంది. సోషలిస్టు భావజాలం ఉన్న వాళ్ళు ప్రకృతిని ఆరాధించరని, వారిలోని భావావేశం, రోమాంటిజం రూపు వేరని అనుకుంటారు చాలా మంది.
శ్రీశ్రీ, ఆత్రేయ కాలేడని, ఆత్రేయలో శ్రీశ్రీ ఉండరని తెలుగు శ్రోతలు అనుకుంటే శ్రీశ్రీ ‘మనసున మనసై’ రాసి; ఆత్రేయ ‘కారులో షికారు కెళ్ళే’ అన్న పాట రాసి కవి భావనా శక్తిని, నిరూపించుకున్నట్లే ఇలాంటి పాటల ద్వారా సాహిర్ తనలోని కల్పనా భావ పరంపరను, భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నారు. భాష పట్ల పట్టూ ఉంటే ఆ కవిత్వంలో ఎంతటి భావావేశం, ప్రాంతీయతను, జనజీవనాన్ని చొప్పించవచ్చో సాహిర్ తన పాటలతో నిరూపించారు.
ఆనందంగా ఊయలలూగుతూ అన్ని బాధలను మర్చిపోదాం, మళ్ళీ వెనక్కు చూసే అవసరం రాకుండా పద ఎటైనా దూరంగా వెళ్లిపోదాం అంటుంది ఆమె. దీని ఇక్కడ ఈ సందర్భంలో పలాయనవాదం అనలేం. అన్ని బాధలను మర్చిపోదాం అన్నది ఆమె కోరిక పైగా వెనక్కు చూసే అవసరం రాకూడదని ఆమె కోరుకోవడంలో తమ గతం కన్నా భవిష్యత్తు ఎంతో ఆనందంగా ఉండాలనే కోరిక కనిపిస్తుంది. అనంతమైన ఆనందం నడుమ గడిచిన దుఃఖపు ఛాయలను ఎవరు గుర్తు చేసుకోవాలనుకుంటారు. అంటే ఎప్పటికీ గతం గుర్తుకు రానివ్వని ఆనంద ప్రపంచాన్ని ఆమె కోరుకుంటుంది. దాన్ని సృష్టించుకోవడానికి అతన్ని ఆహ్వానిస్తుంది.
ఫైలీ హుయీ హై సపనోం కీ బాహే
ఆజా చల్ దే కహీ దూర్
వహీ మేరి మంజిల్ వహీ తేరీ రాహే
ఆజా చల్ దే కహీ దూర్
(కలల బాహువులు వ్యాపించి ఉన్నాయి. రా ఎటైనా దూరం వెళ్లిపోదాం. అదే నా గమ్యం అదే నీ దారి రా ఎటైనా వెళ్ళిపోదాం)
ఈ పాట లతా మంగేష్కర్ చాలా గొప్పగా గానం చేసారు. దీనికి సంగీతం అందించింది ఎస్.డి. బర్మన్. అయితే ఈ పాట తరువాతే ఇది నా వల్లే హిట్ అంటూ ఈ ముగ్గురూ ఒకరితో ఒకరు తలపడి దూరం అయ్యారు. లత లేకుండా తన పాటలను తాను హిట్ చేసుకోగలనని సాహిర్ ప్రతీన బూనారు. ఎస్.డి. బర్మన్ కూడా ఇది వాళ్ళిద్దరి గొప్పా కాదు. కళ్యాణీ రాగంలో తాను చెసిన అద్బుతమైన కంపోజిషనే ఈ పాటకు జీవం అని వాదానికి వచ్చారు. ఆ తరువాత వీరు ముగ్గురు కలిసి పని చేసే పాటలు క్రమంగా కనుమరుగయిపోయినా, ముగ్గురు గొప్ప కళాకారులు కలిసి సృష్టించిన గొప్ప గీతంగా ఇది హిందీ సినీ శ్రోతల మనసుల్లో నిలిచిపోయింది. ఎప్పుడు విన్నా ఎంతో ఆనందాన్ని ఉత్తేజాన్ని నింపే ఈ గీతం సాహిర్ అద్భుత సృష్టి.
ఊదీ ఘటా కే సాయే తలె ఛిప్ జాయే
ధుంధలీ ఫిజా మె కుఛ్ ఖోయె కుఛ్ పాయే
ముఖ్యంగా ఆ పై వాక్యాలు నాకు ఎప్పటికీ విస్మయాన్ని కలుగ జేస్తూ ఉంటాయి..
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)