Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-34 – తు హిందు బనేగా న ముసల్మాన్ బనేగా

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘ధూల్ కా ఫూల్’ (Dhool Ka Phool, 1959) చిత్రం లోని ‘తు హిందు బనేగా న ముసల్మాన్ బనేగా’. గానం రఫీ. సంగీతం ఎన్. దత్తా.

~

మతోన్మాదం ఈ దేశాన్ని ముక్కలు చేసింది. రాజకీయాలలో మతం నాయకుల ఆయుధం అయింది. ప్రజలలో విద్వేషాన్ని ప్రోత్సహించింది. నిజానికి ఏ మతం కూడా ద్వేషాన్ని బోధించదు. కాని మనిషిని మనిషి నుండి విడదీయడానికి, మానవ జాతి ఒకటిగా జీవించకుండా తమను తాము విభజించుకోవడానికి మతం ఉపయోగపడింది. కొందరు దీన్ని తమ శక్తిగా మార్చుకుని ఆధిపత్యాన్ని సాధించే ప్రయత్నం చేసారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. అందుకే సమాజ హితం కోరుకునేవారు అసలు మతం అన్నదే లేకుండా ఉంటే బావుండును అని కోరుకుంటారు.

వీరికి మతం పట్ల ద్వేషం ఉండదు. మనిషికి మంచిని, జీవనగతిని బొధించడానికి నిర్మించబడ్డ మతం మనిషి వినాశనానికి, ద్వేషాన్ని పెంపొందించడానికి సమాజాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంటేనే ఆ మతానే రూపుమాపాలని మాట్లాడతారు వాళ్లు. ఎందుకంటే మత ఛాందసవాదం ఏ సంస్కరణలనూ ఒప్పుకోదు. ఇలాంటి వారిని మనం నాస్తికులుగానూ, మతంలోని ఔన్నత్యాన్ని గుర్తించని మూర్ఖులుగానూ అనుకుంటాం. కాని వీరి కన్నా ఆస్తికులు మరొకరు ఉండరు. ఎందుకుంటే భగవంతుని సృష్టిలోని ప్రతి వ్యక్తిని మతానికి, కులానికి అతీతంగా ప్రేమించగల గొప్పతనం వీరిది.

సాహిర్ అలాంటి ఆస్తికుడు. మతం పేరుతో విభజించి పాలించిన ఆంగ్లేయుల పాలనను ఆయన చూసారు. మతం పేరుతో ముక్కలయిన దేశంలో సరిహద్దు రేఖకు అటు ఇటు కూడా గాయపడిన హృదయాలను గమనిస్తూ జీవించారు. పుట్టిన నగరం వదిలి ముంబయిలో స్థిరపడినా ఆయన పోగొట్టుకున్న స్నేహాల వల్ల గుండెకయిన గాయలను మోసుకుంటూ జీవించారు. మతం పేరుతో నలిగిపోయిన జీవితాలు ముఖ్యంగా స్త్రీల జీవితాలను కూడా ఆయన చూసారు. అందుకే మతం ఆయన జీవితానికి అతీతం. మతాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న వారంటే ఆయనకు అసహ్యం. ఆయన వ్యక్తిత్వంలో సమానత్వం, సౌభ్రాతృత్వం కలగలసి ఉన్నాయి. అందుకే ఆయన మాత్రమే రాయగల పాట ఇది.

తు హిందు బనేగా న ముసల్మాన్ బనేగా
ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా
తు హిందు బనేగా న ముసల్మాన్ బనేగా
ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా
(నువ్వు హిందువువి కావు ముసల్మానువి కావు. మనిషి బిడ్డవు నీవు మనిషిగా పెరుగుతావు)

ఈ ఒక్క వాక్యాన్ని భారతీయులు అర్థం చేసుకుంటే మన దేశ పరిస్థితులే మరోలా ఉంటాయి. సినిమాలో ఓ వ్యక్తి ఓ పసి బిడ్డను పెంచుతున్నాడు. ఆ పసిగుడ్డును తల్లి తండ్రులు వీధి పాలు చేసారు. అలాంటి ఓ అనాథను చూసి ఇంకొకరైతే జాలిపడతారు. కాని ఇక్కడ కవి ఆ అనాథ ఏ మతం అంటని, అంటించుకోని నాగరికుడుగా పెరగబోతాడని సంతోషంగా చెప్తున్నాడు. అత్యంత విషాద స్థితిలో ఆత్మగౌరవాన్ని ప్రకటించడం అంటే ఇదే కదా. ఆ బిడ్డ ఓ హిందువుగానో ముస్లింగానో పెరగడు. ఎవరూ ఆ బిడ్డను తమవాడని అనుకోవట్లేదంటే, ఏ మతం ఆ బిడ్డను అంటదనే కదా. ఇప్పుడు ఆ బిడ్డ కేవలం ఓ మనిషిగా పెరుగుతాడు. ఆ అవకాశం ఈ బిడ్డకు మాత్రమే సొంతం. ఎలాంటి ఆశ్చర్యపరిచే దృష్టికోణం ఇది. ఈ పాట నాపై ఎంత ప్రభావం చూపిందంటే. వీధి పిల్లలు, అనాథలయిన వారిని చూసే ప్రతిసారి నాకు వాళ్లు మతానికి అతీతులయిన మనుషులుగా కేవలం మనుషులుగా బతికే జీవులుగా కనిపిస్తారు.

ఈ ప్రపంచంలో మతం అంటని గొప్ప జీవులు ఈ అనాథలే అంటాడు సాహిర్. పుట్టగానే తల్లితండ్రులు తమ కులం మతం, ఇంటిపేరుతో పిలల్లను బందీలను చేస్తుంటే అన్ని బంధనాలను వదిలించుకునే మనిషిగా పుట్టి కేవలం మనుషులుగా జీవించగల ఈ అనాథలు మనకన్నా ఉన్నతులు అనిపించక మానదు.

అచ్ఛా హై అభీ తక్ తెరా కుఛ్ నామ్ నహీ హై
తుఝ్ కో కిసీ మజ్హబ్ సె కోయీ కామ్ నహీ హై
అచ్ఛా హై అభీ తక్ తెరా కుఛ్ నామ్ నహీ హై
తుఝ్ కో కిసీ మజ్హబ్ సె కోయీ కామ్ నహీ హై
జిస్ ఇల్మ్ నె ఇన్సానో కొ తక్సీం కియా హై
ఉస్ ఇల్మ్ కా తుఝ్ పర్ కొయీ ఇల్జామ్ నహీ హై
తూ బద్లే హుయె వక్త్ కి పెహచాన్ బనేగా
ఇన్సాన్ కీ ఔలాద్ హై ఇన్సాన్ బనేగా
తు హిందు బనేగా న ముసల్మాన్ బనేగా
ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా

(ఇప్పటిదాకా నీకు పేరు లేకపోవడం ఎంత మంచిది. ఏ మతంతో నీకు పని లేకపోవడం ఎంత అదృష్టం. ఏ జ్ఞానం అయితే మనుషులను విభజించిందో, దాన్ని నిందించవలసిన అవసరం నీ విషయంలో లేదు. మారబోయే కాలానికి నువ్వు గుర్తుగా పెరుగుతావు. మనిషి బిడ్డవు నీవు మనిషిగా పెరుగుతావు. హిందువుగానో ముస్లింగానో కాదు ఓ వ్యక్తిగా ఎదుగుతావు)

ఈ వాక్యాలంటే నాకు వ్యక్తిగతంగా చాలా చాలా ఇష్టం. సాహిర్ ఈ పాటలో ఇచ్చే సమానత్వ సందేశం ఎందరో మనసున్న కవులు మనకు అందించిందే. కాని ఈ పాట సౌందర్యం, భావంతో పాటు ఆ భావం కోసం సాహిర్ వాడిన పదాలలో ఉంది. మతం అన్నది పసిగుడ్డుకు తన తల్లి తండ్రులు ఎవరో తెలిసినప్పుడు అంటుతుంది. కాని ఈ బిడ్డకు ఆ జ్ఞానం లేదు. తన తల్లి ఏ మతస్తురాలో, తన తండ్రి మతం ఏంటో ఆ విషయాలేవి ఆ బిడ్డకు తెలియదు.

ఎంత దురదృష్టకరమైన స్థితి అనిపించే సందర్భాన్ని సాహిర్ ఎలా చూస్తున్నాడో చూడండి. నీకు ఓ పేరు లేకపోవడం ఎంత మంచి విషయమో అంటున్నాడు. మరి పేరు మతాన్ని సూచిస్తుంది కదా. పేరు లేదంటే ఆ బిడ్డకు ఏ మతంతోనూ పని లేదనే కదా. ఇంత కన్నా మరో అదృష్టం ప్రస్తుతం మనిషికి ఏం ఉంటుంది? ఆ పేరు వెనుక ఉండే మతం, కులం, వర్గం ఇవేవి ఆ బిడ్డను అంటవు. ఆ జ్ఞానం అప్పటిదాకా మనుషులను విభజించింది తప్ప కలపలేకపోయింది. ఇప్పుడు ఆ జ్ఞానం తనకు లేదని ఆ బిడ్డ బాధపడవల్సిన అవసరం లేదు. తల్లి తండ్రుల ఉనికితో వచ్చే జ్ఞానం అతన్ని ఓ వర్గానికి కట్టి పడేస్తుంది. ఆ జ్ఞానాన్ని నిందించే అవసరం ఈ బిడ్డ విషయంలో జరగకపోవడం అతని అదృష్టం అంటున్నాడు కవి.

తల్లి తండ్రులు ఉన్న పిల్లలు వారి ఉనికితో సమాజంలో తమ వర్గాన్ని నిర్ణయించుకుంటారు. ఆ ఎరుక వారిని మరికొందరికి దూరం చేస్తుంది. అలా వాళ్ళు దూరం అవడానికి ఓ ప్రత్యేక వర్గానికి కట్టుపడి ఉండిపోవడానికి కారణం వారి తల్లి తండ్రులెవరో వారికి తెలియడం. అంటే ఈ ఎరుక వారి పరిమితిని కుదించింది. ఆ ఎరుకే వారిని విశ్వమానవులుగా ఎదగనీయకుండా ఆపేసింది. కాని ఈ బిడ్డ విషయంలో ఎవరినీ నిందించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బిడ్డకు ఎవరూ లేరు. మతం కులం అసలే లేదు. ఎవరూ అతన్ని సామ్యవాదిగా ఎదగడాన్ని ఆపలేరు.

మాలిక్ నె హర్ ఇన్సాన్ కొ ఇన్సాన్ బనాయా
హమ్ నే ఉసె హిందూ యా ముసల్మాన్ బనాయా
కుద్రత్ నే తొ బక్షీ థీ హమే ఏక్ హీ ధర్తీ
హమ్ నే కహీ భారత్ కహీ ఈరాన్ బనాయా
జో తోడ్ దె హర్ బంధ్ వొ తూఫాన్ బనేగా
ఇన్సాన్ కీ ఔలాద్ హై ఇన్సాన్ బనేగా
తు హిందు బనేగా న ముసల్మాన్ బనేగా
ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా

(భగవంతుడు ప్రతి మనిషిని కేవలం మనిషిగా తయారు చేసాడు. మనమే వాళ్లని హిందువులుగానూ ముసల్మానులుగానూ తయారు చేసుకున్నాం. ప్రకృతి మనందరికి ఒకే భూమిని ఇచ్చింది. మనం దాన్ని భారతదేశంగానో ఇరానుగానో మార్చుకున్నాం. అన్ని ఆనకట్టలను కూల్చేసే తుఫానుగా నువ్వు పెరుగుతావు. మనిషికి పుట్టినవాడవు మనిషిగా పెరుగుతావు. కేవలం హిందువుగానో ముస్లింగానో ఉండిపోవు, పరిపూర్ణమైన మానవుడిగా ఎదుగుతావు)

దేశం అన్న విభజననే నమ్మని ప్రజలు కొందరు ఉన్నారు. ఈ దేశం, దేశభక్తి అన్నది మనిషిని విశ్వంతో ఏకమవకుండా చేస్తుందని రవీంద్రనాధ ఠాగుర్ కూడా ప్రస్తావించారు. గాంధీతో ఆయన విభేదించడం వెనుక ఇదే ఉద్దేశం ఉంది. అదే ఆలోచనను సాహిర్ ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఆ దేవుడు మనుషులనే సృష్టించాడు. మతం ఆయన సృష్టికాదు. కాని మనం ఆ మనుషులను హిందువులుగానో, ముస్లింలుగానో ఇక్కడ విభజించుకున్నాం. అలాగే ఈ భూమిని మాత్రమే ప్రకృతి సృష్టించింది. దీనిలో కొన్ని భాగాలను తమవిగా చేసుకుని మనుషులు దేశాలను నిర్మించుకున్నారు. వాటికి భారత్ అని ఇరాన్ అని పెర్లు పెట్టుకున్నారు.

ఈ సరిహద్దులను పగలగొట్టకపోతే, వసుదైవ కుటుంబకం అన్నది కేవలం మాటగా మిగిలిపోతుంది. మనుషుల మధ్య గొడవలన్నీ కూడా ఈ మతం, కులం, వర్గం, దేశం అనే హద్దుల కోసమే. అసలు వీటిని నిర్మించున్నది మనమే కదా. వాటిని నిర్మించుకుని వాటి కోసం ఒకరికొకరం శతృవులమై ఈ ప్రపంచాన్ని మనం ఏ దిశగా తీసుకు వెళుతున్నాం? అందుకే ఇలాంటి ఆనకట్టలను బద్దలు చేసే తుఫానుల అవసరం మనకు ఉంది. ఆ తుఫానులను సృష్టించగలిగేది ఏ మతం, కులం అంటని వాళ్ళే, మరి వాళ్ళు సాధారణ మనుషుల మధ్య నుండి రాలేకపోతున్నారు. అలాంటప్పుడు ఈ తల్లి తండ్రులు లేని అనాథలే అలాంటి తుఫానులుగా ఎందుకు మారకూడదు? ఈ పసిబిడ్డకు ఆ ఆవకాశం ఉంది. విశ్వమానవుడిగా ఎదగగల అదృష్టం ఈ అనాథకే ఉంది.

నఫరత్ జొ సిఖాయె వొ ధరమ్ తేరా నహీ హై
ఇన్సాన్ కొ జొ రౌందే వొ కదం తేరా నహీ హై
నఫరత్ జొ సిఖాయె వొ ధరమ్ తేరా నహీ హై
ఇన్సాన్ కొ జొ రౌందే వొ కదం తేరా నహీ హై
కురాన్ న హో జిస్ మే వొ మందిర్ నహీ తేరా
గీతా న హో జిస్ మె వొ హరమ్ తేరా నహీ హై
తూ అమ్న్ కా ఔర్ సులహ్ కా అర్మాన్ బనేగా
ఇన్సాన్ కీ ఔలాద్ హై ఇన్సాన్ బనేగా
తు హిందు బనేగా న ముసల్మాన్ బనేగా
ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా

(ద్వేషాన్ని నేర్పించే ధర్మం నీది కాదు, మనిషిని తొక్కేసే అడుగు నీది కాదు, కురాన్ లేని గుడి నీది కాదు. గీత లేని హరం (పవిత్రమైన చాటు స్థలం) నీది అవబోదు. నువు శాంతి సయోధ్యలకు ప్రతిరూపంగా పెరుగుతావు. మనిషికి పుట్టిన వాడవు మనిషిగా పెరుగుతావు. హిందువుగానో ముస్లింగానో ఆగిపోవు. మనిషిగా ఎదుగుతావు)

మతం తప్పు అన్నది సాహిర్ అభిప్రాయం ఎంత మాత్రమూ కాదు. మతం పేరుతో రగులుతున్న ద్వేషాన్ని సమాజం నుండి దూరం చేయాలంటే మతాన్నే కాదనవలసిన పరిస్థితిలో సమాజం ఉంది. ధర్మం మనిషికి అవసరం కాని అది ఉన్మాదం కాకూడదు. మతదర్మం మనుషులను ఉన్మాదులుగా మారుస్తుంది. అందుకే సాహిర్ ఇక్కడ ధర్మం పట్ల తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ద్వేషాన్ని నేర్పించే ధర్మం ఆ బిడ్డది కాకూడదు. మనిషిని తొక్కేసే నీతి అతనిది కాకూడదు. కురాన్ లేకుండా అతను ప్రార్థించే గుడి ఉండడానికి వీలు లేదు. గీత లేకుండా అతని నమాజ్ చేసుకునే స్థలం ఉండకూడదు. శాంతి సయోధ్యల సందేశాన్ని ఇచ్చే ధర్మాన్ని నిర్మించుకున్న వ్యక్తిగా ఆ బిడ్డ ఎదగాలి. హిందువుగానో ముస్లింగానో అతను ఆగిపోకూడదు. పరిపూర్ణమైన మనిషిగా ఆ బిడ్డ ఎదగాలి. అది ఏ బంధనాలు లేని స్థితి తోనే సాధ్యం. అనాథ అయినందువల్లే బంధనాలను అంటించుకుని వాటిని వదిలించుకోలేని అవస్థ అతనిది కాదు. స్వేచ్చగా మనవతావాదిగా ఎదగగలిగే అవకాశం ఆ బిడ్డకు ప్రకృతి ఈ అనాథ స్థితిలో ప్రసాదించింది.

యె దీన్ కే తాజర్ యె వతన్ బేచనే వాలే
వతన్ బేచనే వాలే
యె దీన్ కే తాజర్ యె వతన్ బేచనే వాలే
ఇన్సానో కె లాషో కె కఫన్ బేచనే వాలే
కఫన్ బేచనే వాలే
ఇన్సానో కె లాషో కె కఫన్ బేచనే వాలే
యె మెహలో మె భైఠే హుయె ఖాతిల్  యె లుటేరే
కాంటో కె ఎవజ్ రూహ్-ఎ- చమన్ బేచనే వాలే
కాంటో కె ఎవజ్ రూహ్-ఎ- చమన్ బేచనే వాలే
తూ ఇన్కె లియె మౌత్ కా ఏలాన్ బనేగా
ఇన్సాన్ కీ ఔలాద్ హై ఇన్సాన్ బనేగా
తు హిందు బనేగా న ముసల్మాన్ బనేగా
ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా

(మతాన్ని కిరీటంగా ధరించే వాళ్ళూ, ఈ దేశాన్ని అమ్మేసేవాళ్లు, మనుషుల శవాల పై గుడ్డలను అమ్ముకునే వాళ్ళు, ఈ భవనాలలో కూర్చున్న హంతకులు , దొంగలు, ముళ్ళకు బదులుగా అత్మ అనే పూలతోటలను అమ్ముకునేవాళ్ళు.. వీళ్ళందరికి నువ్వు మృత్యుసూచకంగా పెరుగుతావు. మనిషికి పుట్టిన బిడ్డవు మనిషిగా మాత్రమే ఎదుగుతావు. నువ్వు హిందువువి కావు ముస్లింవి కావు మనిషివి.. మనిషిగానే జీవిస్తావు)

ఈ చరణంలో సాహిర్ అసహనం కనిపిస్తుంది. మతాన్ని తలపై కిరీటంగా మోసే మతపెద్దలు, ఈ దేశాన్ని అమ్మేసే ద్రోహులు, మానవ కళేబరాలపై గుడ్డలను అమ్ముకునే హీనులు, పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకుని అందులో కూర్చున్న హంతకులు, దోచుకునే  దొంగలు, వీళ్ళంతా ఆత్మలను అమ్ముకున్న నీచులు. మతాన్ని ఆధారం చేసుకుని మనుషులను మూర్ఖులుగా మార్చి విద్వేషాలను పెంచే మతపెద్దల తీరుపై సాహిర్ ఎప్పుడూ అసహనాన్నే ప్రకటించారు. వీళ్ళు శవాలపై గుడ్డలను, చిల్లర పైసలను  ఏరుకోవడానికి కూడా వెనుకాడరు. మతం ముసుగులో ఎంతో డబ్బు వెనకెసుకున్న వీళ్లు దొంగలు, హంతకులు.   ఇలాంటి నీచుల చివరి రోజులకు గుర్తుగా వారిని సంహరించే శక్తిగా ఆ బిడ్డ ఎదగాలని కోరుకుంటున్నాడు కవి.

ఏ మతానికి లొంగని వాళ్ళే ఇలాంటి విద్రోహ శక్తులను హతమార్చగలరు. వారిని నిర్మూలిస్తే తప్ప సమాజంలో నిజమైన సౌభాతృత్వం రాదు. అలాంటి ఆయుధంగా ఏ మతం అంటని ఈ బిడ్డ ఎందుకు తయారు కాకూడదు. ఇలాంటి బిడ్డలే మనవత్వానికి గుర్తులుగా సమసమాజానికి ప్రతీకలుగా జీవించాలన్నది సాహిర్ కోరిక. వాళ్లు హిందువులు లేదా ముస్లింలు కాదు కేవలం మనుషులు. అదే వారి శక్తి. అదే వారి స్థైర్యం అవాలి తప్ప ఈ అనాథ అన్న పిలుపు వారిని న్యూనతాభావంలోకి నెట్టకూడదు. మానవత్వాన్ని నశింపజేసే అన్ని బంధనాలను వీరి పుట్టుక తెంచేసింది. వారికి విశ్వమానవులుగా ఎదిగే స్వేచ్ఛ లభించింది అంటున్నాడు సాహిర్.

హిందూ ముస్లింల ఐక్యత దిశగా ఎందరో ఎంతో రాసారు. కాని ఈ గీతం వాటన్నిటి మధ్య కూడా ప్రథమ స్థానంలో నిలుస్తుంది. అది సాహిర్ కలం పదును..

జిస్ ఇల్మ్ నె ఇన్సానో కొ తక్సీం కియా హై
ఉస్ ఇల్మ్ కా తుఝ్ పర్ కొయీ ఇల్జామ్ నహీ హై

ఈ రెండు వాక్యాలు చాలవు ఆ కలం పదును తెలుసుకోవడానికి..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version