Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనన్యాశ్చింతయంతో మాం

[శ్రీ పి. ఎ. యస్. సుధాకర రావు గారు రచించిన ‘అనన్యాశ్చింతయంతో మాం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“వ్యాసాయ విష్ణురూపాయ..”

పూజ గదిలోనుండి రామకృష్ణగారి స్వరం ఉచ్చస్వరంతో.. వినిపిస్తోంది. రోజూ ఉదయం పూజతో పాటు ‘విష్ణుసహస్ర నామ పారాయణం’ చెయ్యందే కాఫీ టిఫిన్లు కూడా తీసుకోరాయన.. అంతా పూర్తయ్యాక ఎప్పటిలాగే దేవుణ్ణి వేడికున్నారాయన.. “స్వామీ.. ఇన్నేళ్ళనుండి నీ స్మరణలో, సేవలో నిన్ను ప్రత్యేకంగా కోరుకున్నదేమీ లేదు.. నువ్వే అన్నీ చూసుకుంటున్నావు అడగకుండానే.. కానీ ఇప్పుడు మా మాధవుడికి మంచి ఉద్యోగం మాత్రం రావటం లేదు.. ఆ ఉద్యోగం త్వరగా వాడికి ఇప్పించు స్వామీ” అని మొక్కుకున్నారాయన. ఇంజనీరింగ్ పూర్తయ్యి సంవత్సరం గడిచినా కొడుక్కు మంచి ఉద్యోగం రాలేదని ఆయన బెంగ.. పెళ్ళయ్యాక పది సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకు.. తన దగ్గరే ఉండాలని, హైదరాబాద్ లోనే మంచి ఉద్యోగం రావాలని ఆయన పట్టుదల. ఆ విష్ణుమూర్తే ఇప్పిస్తాడని నమ్మకం.. స్వామికి దండం పెట్టుకొని బైటకు వచ్చి టిఫిన్ తిని కాఫీ తాగి తయారవుండగానే.. ఫోన్ రింగయ్యింది. అవతల మిత్రుడు ప్రకాశం ఫోన్.. “రామూ! ఇంకా బయలుదేరలేదా.. అవతల అక్కడ మన ట్రస్టు సభ్యులందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు..” కొంచం అసహనంగా.. చిరాకుగా అన్నాడు ప్రకాశం.

“ఇదిగో రెడీ ఐపొయ్యా! కాబ్ రాగానే బయలుదేరటమే” అన్నారు రామకృష్ణగారు.

“ఏంటో.. నీ చాదస్తం! ఈ ఒక్కరోజూ నీ పూజాసమయం తగ్గించుకోవచ్చు కదా!” కొంచెం చిరాకు ధ్వనించింది ప్రకాశం మాటల్లో.

ఆ రోజు ఉదయం పదిగంటలకల్లా.. వాళ్ళ ట్రస్టు ద్వారా కొంతమంది పేద విద్యార్థులకు కాలేజి ఫీజులు, పుస్తకాలు పంపిణి చేసే కార్యక్రమం ఉంది. జిల్లా కలెక్టరు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఒక అరగంట ముందు వెళ్ళి అన్నీ పర్యవేక్షించాలని ప్రకాశం తాపత్రయం.. కార్యక్రమ నిర్వహణ బాధ్యత మిగతా మిత్రులందరూ చూసుకున్నా, సభానిర్వహణ అంతా రామకృష్ణగారే చూసుకోవాలి కనక ఆయన్ని వెంటబెట్టుకొని వెళ్ళాల్సిందే.

రిటైరయ్యాక ప్రశాంతంగా, దైనధ్యానంలో, తీర్థయాత్రలతో గడపక, ఊపిరాడని ఈ సేవాకార్యక్రమాలేమిటని, రామకృష్ణగారికి కొంత అసంతృప్తిగా, ఇబ్బందిగా అనిపించినా.. బాల్యమిత్రులందరూ తలో చెయ్యి వేసుకొని, చందాలు వసూలుచేసి, వీలున్నప్పుడల్లా ఏదోక సేవాకార్యక్రమం చేద్దామని తలపెట్టినందువల్ల, ముఖ్యంగా ప్రకాశం మాట కాదనలేక, తను కూడా దీనిలో భాగమయ్యారు ఆయన.. ఇది తప్ప మిగిలిన రోజుల్లో.. ఆయన సమయమంతా పూజలు, ప్రవచనాలు, తీర్థయాత్రలు ఇదే ఆయన జీవితం.. భార్య కామేశ్వరి కూడా ఆయన అడుగుజాడల్లోనే..

రామకృష్ణ, ప్రకాశం లతోపాటు. మరోఇద్దరు బాల్యమిత్రులు రమణమూర్తి, రామారావులు కూడా దీన్లో భాగమయ్యారు. అందర్నీ ముందుండి నడిపించేది మాత్రం ప్రకాశంగారే.. రామకృష్ణగారు తనవంతు ధనసహాయం చెయ్యటంలో ముందుంటారు.. మిగతా ఇద్దరిలో రమణమూర్తి కాస్త ఆర్థిక ఇబ్బందుల వల్ల అంతగా డబ్బు సమకూర్చలేకపోయినా, అన్ని పనుల్లో చేయూతగా ఉంటాడు.. ఇక రామారావు పనులెన్నున్నా చేసిపెడతాడు కానీ, డబ్బుదగ్గర మాత్రం జాగ్రత్తపరుడు.. ఇక వీళ్ళందరినీ కలుపుకొని, తన పాత సహోద్యోగులతో, ఇతర మిత్రులతో ఈ సేవాకార్యక్రమాల్ని, నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు ప్రకాశం.. అందుకే ప్రకాశం మాటకి ఎవ్వరూ ఎదురుచెప్పరు.

అనుకున్న ప్రకారం మిత్రులందరూ కలిసి పేద విద్యార్థుల సహాయ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. రిటైరైన మిత్రులు ఇలా సమాజసేవలో పాల్గొనడం చాలా అభినందనీయం అని కలెక్టరు గారు, విచ్చేసిన ఇతర అతిథులు మిత్రులందరినీ అభినందించి వెళ్ళారు. ముందు నాలుగు రోజులు హడావుడి పడ్డా, ఆ పేద విద్యార్థుల్లో వెలుగుతున్న ఆనందాన్ని చూశాక ఆ శ్రమనంతా మర్చిపొయ్యారు మిత్రులందరూ.

ఈసారి వచ్చే నెలలో అనాథ శరణాలయంలో ఉండే వృద్ధులకు చేయబొయ్యే సహాయ కార్యక్రమం గురించి కాసేపు మాట్లాడుకొని అందరూ ఇళ్ళకు బయలుదేరారు. రామకృష్ణగారు ఉండేది ప్రకాశం ఇంటిదగ్గరే కాబట్టి, ప్రకాశం ఆయన్ని ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాననడంతో.. తనతో బయలుదేరారు రామకృష్ణగారు. దారిలో ప్రకాశం అడిగాడు.. “ఏం రామూ మీ ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది? మీ మాధవ్ ఏమంటున్నాడు? అంతా బాగానే ఉంది కదా” అని.

“అంతా బాగానే ఉంది ప్రకాశం.. నీకు తెలుసుకదా! నాకున్న దిగులొక్కటే.. మా మాధవ్‌కి మంచి ఉద్యోగం రావటం లేదు. లేక లేక లేటు వయసులో కొడుకు పుట్టాడని సంతోషపడ్డాం కాని, వీడు ఇంజనీరింగ్ పాసయ్యి కూడా ఉద్యోగం రాకుండా తిరుగుతుంటే.. చాలా బాధగా ఉంది. వీడికి ఆ విష్ణుమూర్తి దయ ఎప్పుడు లభిస్తుందో..” అంటూ నిట్టూర్చారాయన..

“వస్తుందిలే.. కంగారుపడకు. ఈ రోజుల్లో ఉద్యోగాలంటే.. దేశాలు దాటి వెళ్ళి చేసుకుంటున్నారు.. నువ్వేమో ఈ ఊళ్ళోనే నీ దగ్గరే ఉండే ఉద్యోగం కావాలంటావ్.. అందుకే కాస్త ఆలస్యమవుతోంది..” ఇలా మాట్లాడుకుంటుండగానే రామకృష్ణ గారిల్లు వచ్చేసింది. ఆయన్ని దింపేసి బై చెప్పి వెళ్ళిపొయ్యాడు ప్రకాశం.

మరో వారం తర్వాత మిత్రులందరూ మళ్ళీ సమావేశమయ్యారు అనాథశరణాలయ కార్యక్రమం గురించి చర్చించడానికి.. “అక్కడి వృధ్ధులందరికీ ఒక జత బట్టలు తీసుకుందాం, అలాగే దుప్పట్లు కూడా” అంటూ ప్రతిపాదించాడు ప్రకాశం. తనవంతుగా ముందుగానే పాతికవేల విరాళం ప్రకటించాడు. ప్రకాశానికి డబ్బుతో పాటు దాన్ని సద్వినియోగం చెయ్యాలన్న తపన ఎక్కువ. పొయ్యేటప్పుడు ఏం పట్టుకుపోతాం అనే ఆలోచన. రామకృష్ణ గారు, రమణమూర్తి తమవంతుగా తలోఐదువేలు ప్రకటించారు. ఇక రామారావు షరా మామూలుగా.. “ఈ నెల్లో మా అమ్మాయి అమెరికా నుండి వస్తోంది. నాకు బోలెడు ఖర్చులున్నాయి. ఒక వెయ్యో, రెండు వేలో ఆ టైముకి ఇచ్చేస్తాలే..” అనేశాడు.

మిగతా కావలసిన డబ్బులు ఎలా వసూలు చెయ్యాలో ప్రకాశమే తన భుజాల మీద వేసుకున్నాడు. కార్యక్రమం ఎలా జరపాలో చర్చించుకొని, మళ్ళీ ఎప్పుడు కలవాలో నిర్ణయించుకొని, ఆ రోజుకి ఇంటికి తిరుగుముఖం పట్టారు మిత్రులు.

ఒక వారం తర్వాత అందరూ కలుసుకున్నపుడు ప్రకాశం మాట్లాడాడు. “మనందరికీ ఒక గుడ్ న్యూస్.. మన కార్యక్రమానికి ఊహించని విధంగా మంచి స్పందన వచ్చింది. మా బాంకు మిత్రుల నుండి కావలసిన డబ్బు సమకూరింది. ఈసారి కొంచెం భారీగా తలపెట్టాం కాబట్టి, మన మిత్రుడి ద్వారా మన MLA గారు, కలెక్టరు గారు కూడ వస్తామన్నారు. అలాగే అక్కడ ఉండే వృద్ధులకు ఏదైనా వినోద కార్యక్రమం, మన రామకృష్ణ చేత ఏదైనా ఆధ్యాత్మిక ప్రవచన ప్రసంగం లాంటిది ఏర్పాటు చేద్దామనే సూచన కూడ వచ్చింది.. దాంతోపాటు ముఖ్య అతిథులకు ఒక చిన్న సత్కారం లాంటిది ఏర్పాటుచేస్తే రాబోయే రోజుల్లో మనకు కొంత సహాయకారిగా ఉంటుంది. ఏమంటారు?” అన్నాడు ప్రకాశం.

రామకృష్ణ గారి ఆధ్యాత్మిక ప్రసంగం అంటే.. అందరికీ ఇష్టమే కాబట్టి అందరూ ఏకగ్రీవంగా.. “అలాగే చేద్దాం” అన్నారు. రామకృష్ణగారు మాత్రం.. “నేనెందుకు? ఎవరైనా మంచి పండితుడిని పిలిపిద్దాం” అంటూండగానే.. అందరూ.. “ఈ విషయంలో.. నీకన్నా పండితుడెవరు రామూ! నువ్వే కానిచ్చెయ్యి.. మళ్ళీ ఎవరినైనా పిలిపిస్తే.. వాళ్ళకు ఖర్చులు చాలా అవుతాయి.” అని ముక్తకంఠంతో అనేశారు. ఇక సరే అనక తప్పలేదు రామకృష్ణగారికి ..

తీరా ఆ కార్యక్రమం ఒక వారం రోజులుందనంగా.. ఒక రోజు రామకృష్ణ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఒక లెటర్ వచ్చింది. ‘విష్ణుసహస్రనామం మీద మీ ప్రసంగం, ప్రవచనం, తిరుమలలో జరిగే నాదనీరాజనం కార్యక్రమంలోని సభలో ప్రత్యక్ష ప్రసారానికి ఎంపికైంది. మీప్రయాణ వసతి సౌకర్యాలన్నీ దేవస్థానం అధికారులు ఏర్పాటు చేస్తారు. మీ అంగీకారం వెంటనే తెలియచెయ్యమ’ని సారాంశం.

ఒక్క క్షణం రామకృష్ణగారికి సంభ్రమంతో నోట మాట రాలేదు. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నాడు ఇలాంటి అవకాశం కోసం. తను నిత్యం ఆరాధించే వెంకటేశ్వరుడే తన సన్నిధికి పిలిపించుకుంటున్నాడని పరవశించి పొయ్యారాయన.

“కామేశ్వరీ..” భార్యను గట్టిగా పిలిచారాయన. ఎక్కడో వంటింట్లో వంట చేసుకుంటున్న కామేశ్వరి ఆ అరుపుకి ఉలిక్కిపడి.. “ఆ.. వస్తున్నా.. ఏమిటండీ .. అలా అరిచారు? ఏమయింది?” అంటూ హడావిడిగా హాల్లోకి పరుగెత్తుతున్నట్టే వచ్చింది. “మరి విషయం అలాంటిదే..” అంటూ భార్యకు విషయం అంతా చెప్పారు రామకృష్ణగారు. అంతా విన్నాక ఆమె మొహం కూడ సంతోషంతో వెలిగిపొయ్యింది.. “పోనీలెండి.. భగవంతుడి ఆశీర్వాదం ఈవిధంగా లభించింది.. మనకు” అంటూ భర్తను అభినందించింది ఆవిడ.

మర్నాడు ఉదయం పేపరు చదువుకుంటూండగా.. ప్రకాశం నుండి ఫోన్ వచ్చింది రామకృష్ణ గారికి. “రామూ! ఆ ప్రవచనం, ప్రసంగం, అభినందన వగైరాలన్నీ తయారు చేసుకొని సిధ్ధంగా ఉన్నావు కదా! వచ్చే శనివారమే మన కార్యక్రమం.. గుర్తు చేద్దామని ఫోన్ చేశా” అన్నాడు.

ఆ మాట వినగానే.. ఠక్కున గుర్తొచ్చింది రామకృష్ణగారికి.. తిరుమలలో తన ప్రవచన కార్యక్రమం, సత్కారం, దైవదర్శనం అన్నీకూడా.. వచ్చే శనివారమే కదా.. అని.

గబుక్కున ఏదో చెప్పబొయ్యారు ప్రకాశానికి.. “ప్రకాశం.. మరీ.. వచ్చే శనివారం..” అని.

ఇంతలో.. ప్రకాశమే.. “రామూ! MLA గారి ఫోన్ వస్తోంది.. నేను మళ్ళీ చేస్తాను.. నువ్వు అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉండు. నేనే వచ్చి పికప్ చేస్తాను” అని ఫోన్ పెట్టేశాడు.

తను చెప్పదలుచుకున్న తిరుమల ప్రోగ్రాం సంగతి గొంతులోనే ఉండిపొయ్యింది రామకృష్ణకి. భార్య కామేశ్వరివైపు చూశాడు దీనంగా. ఆవిడకు తెలుసు.. భర్త ఈ ప్రోగ్రాం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నాడో.. ప్రకాశంతో ఉండే అనుబంధం కూడ తెలుసు.

ఈ మానవసేవా.. ఆ మాధవసేవా.. అని దంపతులిద్దరూ సందిగ్ధంలో పడిపొయ్యారు.

దీంతోనే.. మరో రెండు రోజులు గడిచిపొయ్యాయి. రామకృష్ణగారే చివరకు సేవాకార్యక్రమానికే వెళ్దామని నిశ్చయించుకున్నారు. దేవస్థానం అధికారులకు ఫోన్ చేసి ఈసారి మన్నించమని కొన్ని అనివార్య కారణాలవల్ల రాలేకపోతున్నానని, మరోసారి అవకాశం ఇవ్వాలని పరిపరివిధాలుగావారిని వేడుకున్నారు. అనుకున్నట్టుగానే శనివారం అనాథశరణాలయంలో సేవాకార్యక్రమం జరిగింది. అక్కడి వృధ్ధులందరూ.. ఆ ప్రత్యేక విందు భోజనం, కొత్త బట్టలు, దుప్పట్లు స్వీకరించి చాలా సంతోషపడ్డారు. సభాకార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. ముఖ్యంగా రామకృష్ణగారి ప్రసంగం, ప్రవచనం, విష్ణుసహసహస్రనామపారాయణం, దాని విశిష్ఠత, ఫలశ్రుతి, అన్నీ చాలావివరంగా ప్రసంగించారాయన. “విష్ణుసహస్రనామం మహాభారతంలోని అనుశాసనపర్వంలోని అత్యంత పవిత్రస్తోత్రం. దీని పారాయణ భక్తిని, మనశ్శాంతిని, ప్రశాంతతను, స్థిరత్వాన్ని అందిస్తుంది. ధర్మ మార్గంలో నడిపిస్తూ ..ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది. వయోభేదం లేకుండా ఎవరైనా పారాయణ చేసుకోవచ్చు. ఆదిశంకరులవారు ఈ స్తోత్రానికి అద్భుతమైన భాష్యాన్ని రచించారు.. ఈ స్తోత్రం నుండి మనకు లభించే సందేశం.. ప్రతి జీవిలో దైవాన్ని చూడాలి. భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉన్నాడని గుర్తెరిగి నడుచుకోవాలి.. ఎందుకంటే ఆయన సర్వ వ్యాపకుడు.. ధర్మం, సత్యం వంటివిలువలు మనలో స్థిరంగా ఉండాలి.. ఇతరులను రక్షించడం, సేవచెయ్యడం కూడా దైవసేవే” ఇలా చెప్పుకుంటూ పొయ్యారాయన. నేటి సమాజానికి ఆ సందేశాన్ని అన్వయిస్తూ.. చివరగా ఫలశ్రుతి గురించి చెప్తూ.. “ఈ స్తోత్రాన్ని శ్రధ్ధాభక్తులతో పారాయణం చేసేవారికి ధనం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక పురోగతి, మనశ్శాంతి అపారంగా లభిస్తాయి..” అంటూ ముగించారాయన.. అక్కడి ఆశ్రమంలో ఉన్న ఆ వృధ్ధులు, వేదిక మీద ఆశీనులయిన పెద్దలు వక్తలు ఇతర మిత్రులు సభాసదులు ముగ్ధులయిపోయి చప్పట్లతో రామకృష్ణ గారిని అభినందించారు. ప్రకాశాన్ని, ఇతర మిత్రులందర్నీ విచ్చేసిన విశిష్ట అతిథులు, కలెక్టరుగారు, MLA గారు అందరూ అభినందించారు ఇలాంటి చక్కని సేవా కార్యక్రమంచేపట్టినందుకు.. ఆ వృధ్ధుల ముఖాల్లో వెలుగుతున్న ఆనందాన్ని, ఉత్సాహాన్ని చూసి ప్రకాశం, ఇతర మిత్రులందరూ కూడా వాళ్ళు ఇన్నాళ్ళూ పడిన శ్రమని మర్చిపొయ్యి, పులకించిపొయ్యారు. ఒకవారం రోజులు ఆ మధుర జ్ఞాపకాలతోనే మురిసిపొయ్యారు ..

ఆ రోజు శనివారం.. ఎప్పట్లాగే.. రామకృష్ణగారు పూజ, పారాయణ ముగించి, కాఫీ టిఫిన్లు ముగించుకుని పేపరు చదువుకుంటూ కూర్చున్నారు.. ఇంతలో కొడుకు మాధవ్ వచ్చి.. “నాన్నా.. ఒక శుభవార్త.. నాకు పొయిన నెలలో ఇంటర్వ్యూ కెళ్ళిన కంపెనీ నుండి మెయిల్ వచ్చింది. నేను సెలెక్ట్ అయినట్టు.. హైదరాబాద్ లోనే వెంటనే జాయిన్ కమ్మని చెప్పారు..” ఇంకా ఏదో చెప్తున్నాడు మాధవ్..

రామకృష్ణ గారికి ఉద్వేగంతో మాటలు రాలేదు. కళ్ళనిండా నీళ్ళు.. ఉత్తరీయంతో.. కళ్ళుతుడుచుకుంటూ.. అనుకున్నారాయన.. ‘స్వామీ.. నీ సేవకు, దర్శనానికి రాకపొయ్యినా.. ఇక్కడ అనాథల సేవలో పాల్గొని.. నిన్ను తలుచుకున్నందుకు నన్ను కరుణించావా! ఇందుకే కదా నిన్ను ఆపద్భాందవుడనేది..’ అలా దేవుడి పటాన్ని చూస్తూ.. చేతులు జోడించారాయన.. ఆ రోజు కార్యక్రమంలో.. ప్రకాశం పరిచయం చేసిన నారాయణరావుగారే.. మాధవ్‌కి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ అధిపతి అని ఆయనకు తెలీదు.. ప్రకాశం ఆయనకు చెప్పి ఆ ఉద్యోగం మాధవ్‌కి వచ్చేట్లు చేశాడని కూడ తెలియదు ఆయనకు.. ఆ కంపెనీ అధిపతి పేరు నారాయణరావు అవ్వటం.. యాదృచ్ఛికమేనా..

Exit mobile version