Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనర్ఘరత్నాలు-5

[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.]

ఉ.:
పూని ముకుందు నాజ్ఞగను బొమ్మనె కాంచి, యజాండ భాండముల్
వానను మీద బ్రోవ నడువన్ గొనెదన్నన నగ్ర నిశ్చల
త్వానచలత్వ నిష్ఠలె సమస్త జగంబుల జాత్యచేతనల్
గా నుతికెక్కు సైన్యపతి కాంచన వేత్రము నాశ్రయించెదన్.

ఈ పద్యము సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయ ప్రణీతమైన ‘ఆముక్తమాల్యద’ కావ్యం లోనిది. ఇది పంచకావ్యాలలో ఒకటిగా వినుతికెక్కిన ప్రౌఢకావ్యం. సింహభాగం నారికేళపాకంలో ఉన్నా, చాలా పద్యాలు కదళీపాకంలో ఉంటాయి.

పంచ కావ్యాలు:

ఆముక్తమాల్యదను రాయలవారు రాయలేదనీ, పెద్దన వ్రాశారనీ, రాయల కావ్యంపై ఒక అపవాదు! ఆ కాలంలోనే ఘోస్ట్ రైటర్లు, గ్రంథ చౌర్యాలను కల్పించిన మత్సరగ్రస్థులకు దండం! శైలి, భాష, అభివ్యక్తి పరంగా చూస్తే, పెద్దనకు, రాయలకు హస్తిమశకాంతరం ఉంది. రాయలు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో గొప్ప పండితుడు. ఆయనది ‘శృత’ పాండిత్యమనీ, సభలో కవుల కవిత్యాలు వినీ వినీ పట్టుబడినదనీ, కొందరంటుంటారు! వారికీ దండం! అది కూడా అభూత కల్పనే!

‘ఆముక్తమాల్యద’కు ‘విష్ణుచిత్తీయము’ అని మరో పేరు కూడా ఉంది. దీనిలో ప్రధాన వస్తువు, శ్రీరంగనాథ, గోదాదేవిల కల్యాణం.

కావ్యంలో రాయలవారు శ్రీవేంకటేశ్వరస్వామిని ఎడనెడ ప్రస్తుతిస్తూ ఉంటారు. తిరుమల వైభవాన్ని చదివి ఆనందించాలంటే, ‘ఆముక్తమాల్యద’ను మించింది లేదు.

తిరుమల బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలలో విష్వక్సేన పూజ తప్పనిసరి. ఆయన వేంకటపతికి సైన్యాధిపతి. ఆయన కాంచన వేత్రము (బంగారు దండము) కదలనిదే, ప్రపంచంలో ఏదీ జరగదని కవి ఈ పద్యంలో చెబుతున్నాడు. విష్ణువు ఆజ్ఞను ‘కనుబొమ్మని కాంచి’ అంటే ఆయన కనుబొమల కదలికలను చూసి, సమస్త అండపిండబ్రహ్మండములను నడిపించేవాడు విష్వక్సేనుడు. అన్నిజగముల జడత్వము, చైతన్యము, నిశ్చలత్యము, అనుచలత్వము, ఆయనీ నిర్దేశిస్తాడు, తన బంగారు దండముతో పరమాత్ముడైన వెంకటేశ్వరుని వరకు అవసరం లేదు. “అటువంటి ‘కాంచన వేత్రము’ను నేను భక్తితో ఆశ్రయిస్తున్నాను” అంటున్నాడు కవి.

విష్ణుస్వరూపుడైన వేంకటేశ్వరుడు పంచాయుధములను ధరించి సమస్త లోకాలనూ రక్షిస్తూ ఉంటాడు. అవి సుదర్శనము (చక్రం), పాంచజన్యం (శంఖం) కౌమోదకి (గద), నందకము (ఖడ్గం), శార్ఙ్గం (ధనుస్సు). కాని విష్వక్యేనుడు తన యజమాని కనుసైగ కూడా కాదు, కనుబొమల కదలికలను బట్టి ఆయన ఆదేశాలను గ్రహించి, సమస్త సృష్టిని నడుపుతాడు. శివునికి గణపతి ఎట్లో, విష్ణువుకు విష్వక్సేనుడట్లు. ఈయన ద్విదంతుడు. గణపతి ఏకదంతుడు. ఈయన విధులు: వైకుంఠంలో వ్యవహారాలనన్నింటినీ చక్కబెడతాడు. నైవేద్యాల క్రమబద్ధీకరణ ఈయన బాధ్యతే. దుష్టశక్తుల సంహారం, దేవతల రక్షణ చేస్తాడు. విష్ణు నియమానుసారం ఇవన్నీ జరిపిస్తాడు విష్వక్సేనుడు.

మొదట ఈయన విష్ణువు ద్వారపాలకులలో ఒకడుగా ఉండేవాడు. ఒకసారి ఆయన రాక్షస సంహారం చేసి, దేవతలను రక్షించి విష్ణువు మెప్పు పొందాడని, స్వామి ఆయనకు పదోన్నతినిచ్చి సర్వసైన్యాధిపతిని చేశాడని ఒక పురాణోక్తి.

రాజుల వద్ద కూడ ‘వేత్రహస్తులు’ అని ఉంటారు. వారు చేతిలో బెత్తములను ధరించి, వ్యవహారాలను అదుపు చేస్తూ ఉంటారు. తెలుగులో కర్రపెత్తనం అనీ మాట కూడా ఇలాంటిదే.

వైష్ణవ గురుపరంపరలో విశ్వక్వేనుడి స్థానం లక్ష్మీదేవి తర్వాత ఉంటుంది. తిరుమల బ్రహ్మోత్సవాలలో, స్వామివారు వాహనంపై వేంచేపు చేయడానికి ముందే విష్వక్సేనుల ఉత్సవం జరుగుతుంది.

విష్ణు సహస్ర నామస్తోత్రం మొదట్లో ఈయనకు ప్రార్థనా శ్లోకం ఉంది.

“యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం।
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే॥”

ఈయన నాయకత్వంలో పనిచేసేవారిని ‘పారిషదులు’ అంటారు. ఈయన భార్య పేరు సూత్రవతి. పాంచభౌతికమైన ఈ భూలోకానికి, వైకుంఠానికి వారధి వంటివాడు విష్వక్సేనుడు. జీవులను పరమాత్మ వద్దకు చేర్చేది ఈయనే. పాంచరాత్ర విధానంలో ఈయనది కీలక పాత్ర. లోకాలకు ఉపద్రవం వచ్చి, లోకకంటకులు ఉద్భవించినపుడు, విష్ణువు ఏ అవతారం ఎత్తాలో, ఆ అవతారంలో ఎంత కాలం ఉండాలో, నిర్ణయించేది కూడా విష్యక్సేనుడే.

పెద్ద బాస్ దగ్గరికి లేదా మంత్రుల దగ్గరికి పోయేముందు వారి వ్యక్తిగత కార్యదర్శులను కలుస్తాం కదా! అదే విధంగా శ్రీకృష్ణదేవరాయలు విష్ణువును కాకుండా, విష్వక్సేనుడిని కూడా కాకుండా, ఆయన బంగారు దండాన్ని శరణుజొచ్చాడు.

రాయల శైలి, గుర్రము కదను తొక్కుతున్నట్లు ఉంటుంది. ‘కనుబొమ్మనెగాంచి’ అన్నది చక్కని ప్రయోగం. స్వామి వాచ్యంగా ఏమి చెప్పనక్కరలేకుండానీ విష్వక్సేనుడు గ్రహిస్తాడనడంలో ఆయన సామర్థ్యం మనకు తెలుస్తూంది. ‘చలత్వ’, ‘అనుచలత్వ’, ‘జాడ్య’ ‘చేతనల్’ అన్న పదాలలో క్రమాలంకారముతో బాటు విరోధాభాసము కూడా తొంగి చూస్తున్నది.

శ్రీకృష్ణదేవరాయలది ఏ కులం? అన్న చర్చ ఉండనే ఉంది. దానికి ఒకటే జవాబు! కవి కులం!

Exit mobile version