[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.]
శా.:
చంద్రప్రస్తర సౌధ ఖేలనపర శ్యామా కుచ ద్వంద్వ ని
స్తంద్ర ప్రత్యహ లిప్త గంధ కలనా సంతోషిత ద్యోధునీ
సాంద్ర ప్రస్ఫుట హాటకాంబురుహ చంచచ్చంచరీ కోత్కరం
బింద్రప్రస్థ పురంబు భాసిలు రమాహేలా కళావాసమై.
ఈ పద్యం చూడండి. గుర్రము ఒక లయాన్వితంగా, సుందర మందగమనంతో సాగిపోతున్నట్లుగా ఉంది కదా! ఇది చేమకూర వెంకటకవీంద్రుడు వ్రాసిన ‘విజయ విలాసము’ అన్నకావ్యము లోనిది. ఈ పద్యములో కవి ఇంద్రపస్థ నగరాన్ని అభివర్ణిస్తున్నాడు. కావ్య ప్రబంధాలలో పురవర్ణన తప్పక ఉంటుంది.
చేమకూరవారి శైలి కదళీపాకమైనా, ఎడనెడ నారికేళపాకమును కూడ ఆయన కలం వెలయించుట కద్దు. ‘రమావేలా కళావాసమై’ అంటే వేదము వేంకట రాయశాస్త్రిగారు ‘లక్ష్మీదేవి విలాసమైన విద్యకు నిలయమై’ అని అర్థం చెప్పారు. ప్రతి పద్యం చమత్కార పూరితమై ఉండడం చేమకూర వారి ప్రత్యేకత. ఇంకో అర్థం ‘సంపదకు, విలాసమునకు, లక్ష్మీదేవికి, హేలా అంటే పార్యతీ దేవికి, కళా అంటే సరస్వతీ దేవికి, నివాసస్థానమై’ అని.
ఇక, ఇంద్రప్రస్థములో, చంద్రకాంత శిలానిర్మితములైన భవనములపై, యువతులు వివరిస్తూ ఉన్నారట. వారు తమ వక్షోజములందు అలదుకొన్న కస్తూరి, సుగంధాన్ని వ్యాపింపచేస్తున్నదట. దాని వలన, ‘ద్యోధునీ’ అంటే ఆకాశగంగ లోని బంగారు పద్మములలోని తుమ్మెదలు సంతోషిస్తున్నాయట. ‘చేమకూర మంచి పాకానపడినది’ అని ఎవరన్నారో గాని, అది నిజం.
చేమకూర వారు ‘తమంత తాము విడు శ్లేషలను’ వాడడంలో అందె వేసిన చేయి. కపటయతి అర్జునుడే అని తెలిసి, సుభద్ర మనసు ఎంతో కుదుట బడిందట. అప్పుడాయన ఇలా వ్రాశాడు – “మనసు భద్రమయ్యె మన సుభద్రకు”. ఉలూచి (నాగకన్య) అర్జునుని వెతుకుతూ ఉంది. ప్రతి చెట్టును, పుట్టను అడుగుతూ ఉంది – “మీరందరునరుగనరుగనరుగా నరుగా?” అంటుంది. మీరందరును+అరుగన్, అరుగన్ (పోవుచుండగా), నరున్ = అర్జునుని, కానరుగా (చూశారా).
“చక్కెరమడిలో అమృతం పారించి పండించిన చేమకుర” అని విమర్శకులు వేంకటకవిని పొగిడారు. ఆయన అచ్యుతరాయల కుమారుడైన తంజావూరు నేలిన రఘునాథరాయల వారి ఆస్థానకవి. రఘునాథరాయలు కూడా కవే. “క్షితిలో నీమార్గమెవరికిన్ రాదు సుమీ” అని ఆ రాజకవి చేమకూర వారిని ప్రశంసించాడు.
విజయవిలాసమునకు ‘పిల్ల వసుచరిత్ర’ అని నామాంతరమున్నది. వసుచరిత్రలో – సంస్కృతపదములతో, శేష, యమకాలను రామరాజభూషణుడు పండిస్తే, వేంకటకవి వాటిని తెలుగు పదాలతో పరిపుష్టం చేశారు. అదేమిటో గాని, ఎంత గొప్ప కవైనా, సమకాలికులకు నచ్చడు. ఇది చేమకూర వారికీ తప్పలేదు. “ఏ గతి రచియించినేని సమకాలము వారలు మోచ్చరే కదా!” అని ఆయన బాధపడినాడు. కవిసమ్రాట్ విశ్వనాథ ఆయనను ‘యమక చక్రవర్తి ‘ అని కొనియడారు.
ఈ పద్యంలో కఠిన ప్రాసను అవలీలగా పండించారు కవి. చివరిపాదంలో ‘ఇంద్రప్రస్థపురంబు’ తో అనుసంధానించడం అద్భుతం. పాలరాతి భవనాలేమో తెల్లనివి. వాటిపై విహరించే జవ్వనుల కుచములు శ్యామలములు అంటే నల్లనివి. ముదురాకు పచ్చరంగును కూడ శ్యామలవర్ణం అంటారు. ఆకాశగంగ మళ్ళీ తెల్లనిది. దానిలోని తామరలు బంగరురంగు గలవి. అందులోని తుమ్మెదలు నల్లనివి. ఇన్ని రకాల రంగులను ఒకే ఒక సమాసంలో పొందుపరచాడు చేమకూరకవి. ఈయన యమక సౌందర్యం మాత్రం చివరలో.. ‘రమాహేలాకళావాసమై’ లో ఉంది. దాన్ని ముందే వివరించుకున్నాము.
‘అమ్మక చెల్ల! నా హృదయమమ్మక చెల్లదు’ అనుకుంటుంది ఉలూచి అర్జునుని చూచి .
‘విజయవిలాసము’నకు తాపీ ధర్మారావు గారు ‘హృదయోల్లాస వ్యాఖ్య’ వ్రాశారు. దీనికి 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇంకా శ్రీమాన్ బులుసు వేంకటరమణయ్య గారు, మహమహోపాధ్యాయ వేదము వేంకట రాయశాస్త్రిగారు కూడ ఈ కావ్యానికి వ్యాఖ్యానాలు వ్రాశారు. ఈ వ్యాఖ్యానాలే లేకపోతే, చేమకూరవారి కవిసమయాలు, వక్రోక్తులు, శ్లేషలు, యమకాలు మనవంటి వారికి కరతలామలకములు అయ్యేవి కావు.
దీనికి మూలం మహాభారతమే. ఆదిపర్యంలోని సుభద్రార్జునుల పెండ్లి. దీనిలో ముగ్గురు కథానాయికలు, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర. నాయకుడు ధీరలలితుడైన అర్జునుడు.
ఈ కావ్యాన్ని ‘ఎమెస్కో’ వారు పేపర్ బ్యాక్‌లో ముద్రించి ప్రచురించారు. చేమకూర వారు తన గురించి ఆశ్వాసాంత గద్యములో ఇలా చెప్పుకోన్నారు –
“ఇది శ్రీ సూర్యనారాయణ వరప్రసాద లబ్ధ ప్రసిద్ధ సారస్వత సుధాసార జనిత యశోలతాంకూర చేమకూర లక్ష్మణామాత్యతనయ వినయ ధురీణ సకల కళాప్రవీణాచ్యుతేంద్ర రఘునాథ భూపాలదత్త హస్తముక్తాకటక విరాజమాన వేంకట కవిరాజ ప్రణీతంబయిన విజయవిలాసంబను మహాప్రబంధంబు”.
పద్యకావ్యాలని చదవడంలో అనురక్తి గలవారు తప్పక పఠించవలసిన గ్రంథం ‘విజయవిలాసము’.
స్వస్తి!
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
