[పద్య ప్రేమికుల కోసం, శ్లోకగతాభిమానుల కోసం శ్రీ పాణ్యం దత్తశర్మ నిర్వహిస్తున్న కాలమ్ ‘అనర్ఘరత్నాలు’.]
సీ.:
మృగనాభి యలదదు మృగరాజమధ్యమ
జలముల లాడదు జలజగంధి
ముకురంబు జూడదు ముకురసన్నిభముఖి
పువ్వులు దురుమదు పువ్వుబోడి
వనకేళి గోరదు వనజాతలోచన
హంసంబు బెంపదు హంసగమన
లతల బోషింపదు లతికాలలితదేహ
తొడవులు తొడవదు తొడవు తొడవు
ఆ.వె.:
తిలకమిడదు నుదుట దిలకినీ తిలకంబు
కమల గృహము జొరదు కమలహస్త
గారవించి తన్ను, కరుణగైకొన, వన
మాలి రాడు, తగవుమాలి యనుచు.
~
అత్యత లలిత సుందరమైన ఈ పద్యము, పోతన రచించిన ‘శ్రీమదాంధ్ర మహా భాగవతము’ లోని ‘రుక్మిణీ కల్యాణము’ లోనిది. ఇందులో ఆ సహజ పాండిత్యుడు చేసిన పదముల అల్లికను గమనిస్తే, తిలక్, తన ‘అమృతం కురిసిన రాత్రి’లో అన్న “నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు” అన్న మాట గుర్తుకు వస్తుంది.
సందర్భం:
రుక్మిణీ దేవి, అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణోత్తముని, శ్రీకృష్ణపరమాత్మ వద్దకు, తన ప్రేమను తెలుపుతూ రాయబారం పంపింది. ఆయన ఎంతకూ తిరిగి రాలేదు. ముహూర్తం సమీపిస్తున్నది. అమ్మవారిలో ఆందోళన! ‘స్వామి ఏమన్నాడో? తనది అతి చొరవ’ అని తప్పుగా తలచినాడేమో? ఇంకా రాడేమి? – అని మథనపడుతూ ఉంది. ఇక పెళ్లికూతురిని చేయాలి. ఆ అలంకారానికి ఆమె విముఖురాలై ఉంది. దేని మీదా (అలంకరణ) ఆసక్తి చూపడం లేదు.
ఈ పద్యములో, పోతన, ‘యమకము’ అన్న శబ్దాలంకారాన్ని అతి మనోహరంగా వాడినాడు. యమకము లక్షణమేమంటే, రెండు లేక అంతకంటే ఎక్కువ, అర్థ భేదములు గల పదబంధములను (అక్షర సమూహములను) మరల మరల పద్యములో ప్రయోగించుట. దీనికి ‘ఛేకానుప్రాసము’నకు దగ్గరితనం కనిపిస్తుంది. కానీ రెండూ వేరు. ఛేకానుప్రాసములో, ఆ పదముల మధ్య అంతరముండరాదు. పక్కపక్కన రావాలి. ఉదా:
“కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ”
యమకముతో, ఆ పదబంధముల మధ్య అంతరం (gap) ఉంటుంది.
అమ్మవారి నిరాసక్తతను ఈ పద్యంలో సహజకవి అద్భుతంగా వర్ణించినాడు.
అర్థం:
రుక్మిణీ దేవి, ‘మృగనాభి’ని పూసుకోదు. మృగనాభి అంటే కస్తూరి ఉన్న పరిమళద్రవ్యం. ఆమేమో మృగరాజమధ్యమ. అంటే సింగపు నడుము కలది. ఇక్కడ ‘మృగ’ శబ్దం వేర్వేరు అర్థాలు కలిగియుంది. ఆమె అద్దం (ముకురము) చూసుకోవడం లేదు. ఆడవారికి తమ సౌందర్యాన్ని దర్పణములో వీక్షించుకోవడం ఇష్టం కదా. ఇక ఆమె ముకుర సన్నిభముఖ. ఇక్కడ ముకురమంటే ‘పొగడపువ్వు’ అని అర్థం. అలాంటి వదనం రుక్మిణిది. పువ్వులు జడలో తురుముకోదు. ఆమె ‘పువ్వుబోడి’. పూవు వంటి శరీరం కలది. ‘బోడి’ అంటే మేను! ఇది అచ్చ తెనుగుపదం. ‘పూబోడి’ అన్న పదాన్ని స్త్రీవాచకంగా వాడతారు.
ఆమె ఉద్యానవనం (వనం)లో ఆడుకోవడానికి ఇష్టపడదు. ఇక్కడ ఆమె వనజాత (పద్మ) లోచన. ‘హంసంబు’ (హంస)ను పెంచదు. ఆమే హంసగమన. లతలను (తీవెలను) నీరు పోసి, పోషింపదు. ఆమె తీవె వంటి మనోహర దేహం కలది. ఈ పద్యంలో కెల్లా అత్యంత చమత్కారం ఈ పంక్తిలో ఉంది
‘తొడవులు తొడవదు తొడవు తొడవు’.
దీనితో ఛేకానుప్రాసం కూడ గోచరిస్తుంది. ‘తొడవు’ అనేది అచ్చ తెనుగు. ‘తొడుక్కునేది’. అంటే అలంకారసాధనం.
ఆమె అలంకారాలు (నగలు) ధరించదు. సరే, బాగానే ఉంది. కాని, ‘తొడవు తొడవు’ అంటే? అక్కడి పోతన్నగారి విన్నాణం! ‘అలంకారాలకే ఆమె అలంకారం’ అని అన్నమాట. ‘ఆమె ధరించిన చీర వల్ల చీరకే అందం వచ్చింది’ అన్నట్లు.
తిలకం (బొట్టు) పెట్టుకోదు. ఆమె ‘తిలకనీ తిలకంబు’. ఇక్కడ అర్థం వేరు. ‘తిలకిని’ అంటే స్త్రీకి పర్యాయపదం. ‘స్త్రీలలో శ్రేష్ఠురాలు’ అని. ‘తిలక’ శబ్దం శ్రేష్ఠవాచకం కూడా! ‘కవికుల తిలకుడు, రఘుకుల తిలకుడు’ అన్న ప్రయోగాలున్నాయి కదా! కమలగృహము అంటే పద్మాల యిల్లు. అంటే సరస్సు. అందులో ప్రవేశించి రుక్మిణి స్నానము చేయదు. ఇక్కడ ఆమె ‘కమల హస్త’. కమలముల వంటి చేతులు గలది.
తన మనోగతాన్ని గౌరవించి, దయతో తనను స్వీకరించడానికి ‘వనమాలి’ శ్రీకృష్ణుడు ఎందుకు రాడు? ‘తగవుమాలి’ అని స్వామిని ఉదహరించింది. ఇక్కడ ‘తగవు’ అంటే ‘పోట్లాట’ అని అర్థం కాదు. ‘మాలి’ అంటే ‘తప్పి’. మొత్తం మీద ‘తగవుమాలి’ అంటే ‘మర్యాద, న్యాయం, ధర్మం తప్పి’ అని అమ్మవారి అభిప్రాయం. తాను స్వామిని వరించడం ఎంతో భక్తితో ప్రేమతో సంభవించింది. ‘మరి ఆయన మాత్రం దానిని గ్రహించడే’ అని ఆమె ఆవేదన.
ఈ సందర్భంలో పోతన్నగారి గురించి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన పద్యాన్ని గుర్తుకుతెచ్చుకోవాలి.
తే.గీ.:
గుడులు కట్టించె కంచర్ల గోపరాజు
రాగములు గూర్చె కాకర్ల త్యాగరాజు
పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు
రాజులే మువ్వురును భక్తిరాజ్యమునకును.
ముగ్గురు మహాకవుల పేర్లను వారి ఇంటి పేర్లతో సహా ఛందస్సులో అందంగా పొందుపరచిన కరుణశ్రీగారు ధన్యులు. మాన్యులు.
ఇక తిరుపతి వేంకట కవులు, తమ చాటు పద్య సంపుటములో చెప్పిన పద్యం హృద్యం. భాగవతాన్ని ఇంత రసబంధురంగా తెనిగించినాడంటే, పోతన, దానికి కారణం. ఆయన పొట్టకూటి కోసం, రాజాశ్రయం కోసం అర్రులు చాచకుండా, భగవంతునికే అంకితముగా వ్రాసినందుకని, జంటకవుల మాట. వారి పద్యం.
ఉ.:
భాగవతంబు సర్వరసబంధురమున్ తెనిగించినాడు, స
ర్వాగమసారవేది జఠరార్థముగా చెయిసాచకే, ‘మహా
భాగుడితం’ డటంచు నరపాలురు మెచ్చగ జీవితంబు, సొం
పౌ గతి నోమినాడు, ఇతరు లౌదురె పోతన వంటి సత్కవుల్!
‘జఠరార్థము’ అంటే ఆకలి తీర్చుకోడానికి. ‘నోమినాడు’ అన్న పదం కూడా భావగర్భితమైనది. ఒక వ్రతంలా రచన చేసినాడని, అటువంటి సర్వాగమ సారవేది పోతన. భాగవతం గొప్పదనాన్ని గురించి, సూతమహర్షి శౌనకాదులతో యిట్లా చెప్పినాడు.
కం.:
నిగమములు వేయి చదివిన
సుగమంబులు కావు, ముక్తి సుభగత్వంబుల్
సుగములు భాగవతమను
నిగమంబు పఠింప ముక్తినివసనము బుధా!
వేయి వేదాలు చదివినా అర్థం కావు. ముక్తి కలుగదు. కాని, భాగవతం అత్యంత సుబోధకము. దాన్ని చదివితే అది ముక్తికి కారణం, స్థానం అవుతుంది.
కాబట్టి మిత్రులారా! రోజూ కనీసం పోతన భాగవతం లోని ఒక్కపద్యాన్నైనా చదువుకొని రసస్ఫూర్తిని పొందండి! స్వస్తి!
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
